Thursday, July 25, 2024

 రామాయణానుభవం.....381

అహంకారంతో ముందుకు ఉరుకుతున్న రావణాసురుని చూచి ఆగ్రహావేశాలతో సుగ్రీవుడు ఒక కొండ శిఖరాన్ని పెకిలించి రాక్షస రాజుపై ప్రయోగించాడు.

ధనుర్ధారి అయిన రాక్షస రాజు ఆ పర్వతాన్ని అవలీలగా తునాతునుకలుగా పగులగొట్టాడు. అంతే కాదు వందలాది క్రూర బాణాలతో సుగ్రీవుని వక్షస్థలాన్ని చీల్చివేశాడు. సుగ్రీవుడు బాధతో నేలగూలాడు.

సుగ్రీవ పతనానికి వానరులు హాహా కారాలు చేయగా, రాక్షసులు రావణుని ప్రశంసిస్తూ జయజయ ధ్వానాలు చేశాడు.

సుగ్రీవుని పరాభవించిన రావణ ప్రభువును ఎదుర్కోవడానికి జ్యోతిర్ముఖ, గవయ, గవాక్ష, ఋషభులనే వానర వీరులు ఒక్కుమ్మడిగా రావణునిపై పడ్డారు. రావణుడు వారిని లక్ష్యపెట్టక వారి ఆయుధాలను మధ్యలోనే ఖండించి వారిని తన పదునైన బాణాలతో పడగొట్టాడు. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రుడు మధ్యాహ్న మార్తాండునివలె భయంకరుడైన రావణాసురుని ప్రతాపాన్ని అణచివేయడానికే తానే విల్లమ్ములతో బయలుదేరాడు.

రామచంద్ర స్వామి తొందరను చూచి ఆయన అనుజుడు లక్ష్మణుడు "అన్నా! మా వదినను అపహరించిన అతినీచుడైన రావణుని అవమానించే అవకాశము నాకివ్వుమని" ప్రార్ధించాడు.

శ్రీరాముడు సోదరునికి జాగ్రత్తలన్ని చెప్పి పంపాడు. అయితే లక్ష్మణుడు బయలు దేరడం చూచిన హనుమ ఆ అవకాశాన్ని తానే వాడుకోవాలనుకొని రావణుని తానే ముందుగా ఎదుర్కొన్నాడు. రావణుని రధము పైకి ఎగిరి ఓరీ రావణా! నీవు దేవదానవ, గంధర్వాదుల నుండి మరణం లేకుండా వరం కోరుకున్నావు. కాని వానరులమైన మా నుండి కాదు ఇదిగో
నా పిడికిలి దెబ్బతో నీవు యమలోకానికి వెళ్లుతావు" అని హనుమ హుంకరించాడు.

 రావణుడు మహాగ్రహంతో "ఓరీ వానరా! ఏదీ నీ ప్రతాపాన్ని చూపు. ముందు నా చేతి దెబ్బను రుచి చూడ"మని తన బలాన్నంతటిని ఉపయోగించి హనుమను తన పిడికిలితో దెబ్బకొట్టాడు.

హనుమ ఆ దెబ్బతో ఊగి పోయాడు. తన శక్తినంతా కూడదీసికొని పడిపోకుండా ఎలాగో నిలదొక్కుకొన్నాడు. తేరుకొన్న తరువాత హనుమ బలంగా తన పిడికిలితో రావణుని కొట్టాడు.

రావణునికి కళ్లు బైర్లు కమ్మాయి. ఆ దెబ్బను తట్టుకోలేక విలవిలలాడాడు. కొంత సేపు స్పృహను కోల్పోయాడు. హనుమంతుని దేవతలు, వానరులు ప్రశంసలతో ముంచెత్తారు. కొంతసేపటికి రావణుడు తేరుకొని “హనుమా నేనింత వరకు ఇంత బలమైన పిడికిలి దెబ్బను చూడలేదు". అని ప్రశంసించాడు.

వాడి ప్రశంసలకు హనుమ సిగ్గుపడి "ఛీ చీ నా దెబ్బతిని కూడ నీవు బ్రతికి ఉన్నావంటే ఇంత బలహీనంగా ఉంటుంది. నా పిడికిలి పోటు" అని నేను ఎన్నడు. అనుకోలేదు. మరొక సారి మన బలాలను చూచుకొందాము". అని రావణునికి సవాలు విసిరాడు.

రావణుడు ఆ అవమానాన్ని భరింపజాలక మరింత బలంగా పిడికిలితో హనుమ వక్షాన్ని కొట్టాడు. హనుమ ఆ దెబ్బకు తల్లడిల్ల సాగాడు. వానర సేనాని అయిన నీలుడు హనుమ ప్రమాదాన్ని పసిగట్టి తాను ముందుకొచ్చి రావణుని ఎదురించాడు.....

    ..........సశేషం.......

చక్కర.తులసి కృష్ణ.

No comments:

Post a Comment