*పల్లె బడి*
రచన - శ్రీరమణ గారు
ఆధునిక కాలంలో పిల్లల్ని అతి చిన్నవయసులోనే బడిలో వేసేస్తే, ఒక పని అయిపోతుందనే ఉత్సాహంలో ఉంటున్నారు తల్లిదండ్రులు. రెండేళ్ళకే ఆటబడిలో, మూడేళ్ళకి పాటబడిలో వేసేసి, ఆ పిల్లలని గమనిస్తూ, ఎప్పుడెప్పుడు కెజిల్లోకి ఎదుగుతాడా అని క్షణాలను లెక్కపెడుతూ గడుపుతున్నారు. చదువంతా పుస్తకాలలోనే వుంటుందనీ, యిప్పుడైతే కంప్యూటర్లలో మాత్రమే వుంటుందనీ అనుకోవడం పరిపాటి. నాలుగు సంవత్సరాల నగర పిల్లలకన్నా నాలుగేళ్ళ పల్లెపిల్లడు ఎక్కువ మాటలు నేరుస్తాడని పరిశోధనలో రుజువైంది. నేటి నగర జీవితంలో సూర్యోదయాన్ని, వెన్నెలని, హరివిల్లుని చూసే అదృష్టం కరువైంది.
గ్రామసీమల్లో, పల్లె పట్టులలో... అలనాటి చిన్నతనపు రోజులలోకి వెళితే, ఎన్ని మధురస్మృతులు!
పంటకాలవలో ఈతలు కొడుతూ ఎన్ని మధ్యాన్నాలు అలలై సాగిపోయాయో.
వేసవి కాలం వస్తే, తాటితోపులో, నల్లటి తాటిమానుని అవలీలగా పాకేసి, మొవ్వులో కూచుని, వెనుక దోపిన లిక్కికొడవలితో కాయల్ని అక్కడే కోసుకోవడం వొక శిల్పం. ముంజలను జుర్రేసి, ఖాళీ బుర్రల్ని విసిరేయడం ఒక గొప్ప! ఒక్కోసారి తాటాకుని అంటిపట్టుకున్న తేనెపట్టు కదులుతుంది. అదొక వింత సాహసం అవుతుంది. ఆకును వొక్క దెబ్బలో చీరేసి, తేనెపట్టుని ఆకుతో సహా పట్టుకుని చెట్టు దిగి రావడం వొక వీరకృత్యం. వాళ్లు బాల్యంలో ఎన్ని విద్యలు నేరుస్తారో లెక్కలేదు. పశువుల గురించి వారికి క్షుణ్ణంగా తెలుస్తుంది. పిట్టలున్న మాచితోపులో పక్షులతో సమానంగా వాళ్లు సందడి చేస్తారు. కోయిల కూత వేస్తే, ఎదిరించి మళ్లీ మళ్లీ కూయించి ఆడుకుంటారు. పావురాల నైజం వాళ్లకు తెలుసు. పాలపిట్టని అరిపించడమూ తెలుసు.
చిలకలూ, గోరువంకలూ, పిచ్చికలూ వాళ్లు తలమీదనే ఎగురుతూ వుంటాయి. ఏ తరుణంలో ఏ చెట్టు కాస్తుందో, ఏ చెట్టు పూస్తుందో వాళ్లకు కొట్టిన పిండి.
చిరుపొట్ట మీద వున్నప్పుడు, వరి దుబ్బు తీసి లోపలి కంకిని తింటే వెన్నముద్దని తిన్నట్టు వుంటుంది. లేత కందికాయలు ఎంత బావుంటాయో వారికే తెలుస్తుంది. వేరుశెనగ మొక్కని పీకితే, కావల్సినన్ని పచ్చికాయలు. మామిడి పిందెల్ని, పెసర కాయల్ని చేనుకాపు కన్నుకప్పి కోసుకు తినడంలో అధిక రుచి వాళ్లకి. ఎప్పుడైనా దొరికిపోయి దెబ్బలు తిన్నప్పుడు అవి మరింత రుచి. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎందరు ఉపాధ్యాయులు చెప్పినా మనసుకెక్కని బోలెడు విజ్ఞానం ప్రకృతి నేర్పుతుంది. పల్లెలో, డొంకలో, చెరువులో, పిల్లకాలవలో, మావితోపులో వినిపించే ఎన్నో మాటలు యిప్పటికీ ఏ నిఘంటువులోనూ కనిపించవు.
గంగరావి చెట్టు పొట్టిగా లావుగా వుండి పసుపుపచ్చ పూలు పూస్తుంది. అవి చిరుగంటలులాగా వుంటాయి. దాని తొర్రదగ్గర వొకరోజు పెద్ద పోట్లాట జరుగుతోంది. ఒక కాకి, రెండు పిల్లకాకులు అరుచుకుంటున్నాయి. నేను వింతగా చూస్తున్నాను. అయిదేళ్ల పిల్లాడు గేదెమీద స్వారీ చేస్తూ వెళుతున్నాడు. “పాపం, పిల్లల్ని వాళ్లమ్మ కొడుతోంది” అన్నాను ఆ దృశ్యాన్ని చూపిస్తూ,
గేదె మీద కుర్రాడు నన్ను చూసి చిత్రంగా నవ్వి-
"అవి కాకి పిల్లలు కావు. కోయిల పిల్లలు. కోయిలకి పొదగడం రాదు కదా, గుడ్లు దీని గూట్లో పెట్టేసి వెళ్తుంది. ఇప్పుడు కాకి గుర్తు పట్టేసింది.." అంటూ వెళ్లిపోయాడు. నేను కంప్యూటర్ యింజనీరుననే సంగతి ఆ క్షణంలో మర్చిపోవాల్సి వచ్చింది…….
No comments:
Post a Comment