Sunday, March 2, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


121. భద్రం మనః కృణుష్య

(పరమాత్మా!) మా మనస్సును కల్యాణమయం చేయుము(సామవేదం)

మనస్సు శుభంగా ఉంటే అన్నీ శుభకరాలే. అందుకే మంచి సంకల్పాలు, మంచి భావాలు, మంచి ఆలోచనలు కల అంతఃకరణ ప్రధానం.

అయితే - చిత్తం శుద్ధమయ్యేవరకు అప్రయత్నంగా దుర్గుణాలు మనస్సులో చెలరేగుతాయి.

అందుకే మనం సన్మనస్సును ప్రసాదించమని భగవంతుని ప్రార్థించాలి. ఈ ప్రార్థన వలనే మనస్సుకి 'సత్' లక్షణం సమకూరుతుంది. మన ప్రయత్నానికి దైవసహకారం లభిస్తుంది.

( ఆ భద్రభావనలే దేవతలు. ఆ దేవతలకే విజయం కలగాలి. అప్పుడే మన జీవితానికి క్షేమం. 'యుక్తేన మనసా...' యోగ్యమైన మనస్సుతో మనం భగవంతుని ఆరాధించాలి... అని యజుర్వేదం పేర్కొంది. భద్రమైన మనస్సే యోగ్యమైనది. చెడు
ఆలోచన, చెడు ఆచరణ... ఇవే దురితాలు. వాటిని తొలగించమని ఋగ్వేద మంత్రం.
'సత్కర్మలని స్మరించు. ఇతరుల సత్కర్మలనే చర్చించు. చెడు తలంచకు - చర్చించకు' అని
యజుర్వేదం హెచ్చరించింది.)

'దురాచారం నుండి, దురాలోచనల నుండి దూరం చేయమ'ని కూడా
ఋగ్వేదమంత్రంలో వేడికోలు కనబడుతుంది.

'యద్ భద్రం తన్న ఆసువ'

- మంగళకరమైన గుణాలతో మనలను నింపివేయమని అభ్యర్థించాలి.

సంశయం, అశ్రద్ధ (శాస్త్రవాక్యాలపై అవిశ్వాసం), లంపటత్వం, క్రోధం, మోహం,మదం, లోభం, కామం, మాత్సర్యం - వంటివి మనోదోషాలు.

వాటిని పరిహరించే ప్రయత్నం ఆధ్యాత్మిక సాధనల ద్వారా సాగాలి.

'దురితాని పరాసువ...’

మనం మంగళకరమైన సంఘటనలు జరగాలని ఆశిస్తాం. భగవంతుని అడుగుతాం.మంగళం బైట ఉండాలని కోరుతాం కానీ, మనలోనే మంగళం ఉత్పన్నం కావాలని ఆశించం.

మన జీవిత వృక్షానికి మూలం మన మనస్సులోనే ఉంది. మనోదోషాలు లేనప్పుడు మనచుట్టూ శుభాలే.

అథర్వవేదంలో వివిధ రకాల దుష్టవృత్తుల గురించి వర్ణించారు. వాటి బారిన పడకుండా కాపాడమని అంతర్యామిని అర్థించడం కనిపిస్తుంది.

సంశయీవృత్తి, ఆక్రామిక వృత్తి (ఆక్రమించే బుద్ధి), చాటు కరవృత్తి (వంచన, వెనక నిందలు), అసామాజిక వృత్తి (నలుగురిలో కలువలేనితనం, సమాజవిరోధం),
అభిమానీవృత్తి (ఇది అహంభావం యొక్క స్వరూపం), లోలుపవృత్తి (ఇతరుల సంపదల పట్ల కోరిక) - వీటిని రాక్షస భావనలుగా పేర్కొన్నారు. వీటిని నశింపజేసుకోవడమే
రాక్షససంహారం.

మనలో భద్రభావనలు వృద్ధి చెందితే రాక్షసనాశనం జరిగినట్లే.

ఆ భద్రభావనలే దేవతలు. ఆ దేవతలకే విజయం కలగాలి. అప్పుడే మన జీవితానికి క్షేమం.

'యుక్తేన మనసా...' యోగ్యమైన మనస్సుతో మనం భగవంతుని ఆరాధించాలి...అని యజుర్వేదం పేర్కొంది.

భద్రమైన మనస్సే యోగ్యమైనది. చెడు ఆలోచన, చెడు ఆచరణ... ఇవే దురితాలు.వాటిని తొలగించమని ఋగ్వేద మంత్రం.

సత్కర్మలని స్మరించు. ఇతరులు సత్కర్మలనే చర్చించు. చెడు తలంచకు, - చర్చించకు'
అని యజుర్వేదం హెచ్చరించింది.

మంచిని స్మరించి, చర్చించితే మనస్సు శుభమయమౌతుంది.             

No comments:

Post a Comment