Sunday, March 2, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


124. అవిషన్నః పితుం కృణు

(ఓ అగ్నీ!) మా అన్నమును విషరహితముగా చేయుము (వేదవాక్యం)

అన్నాన్ని అమృతంగా సంస్కరించి భుజించడం మన సంప్రదాయం.

'అన్నాద్భవన్తి భూతాని' - అని గీతావాక్కు. ప్రాణికోట్ల పుట్టుకకు, వారి దేహ నిర్మాణానికి అన్నమే ఆధారం. మనం తిన్న అన్నంలో స్థూలభాగం మలంగా మారుతుంది. సూక్ష్మభాగం ప్రాణశక్తిగా పరిణమిస్తుంది. సూక్ష్మతమభాగం మనస్సుగా
మారుతుంది.

స్థూలదేహ పోషణే కాక, మన సంస్కారాలు కూడా అన్నం చేతనే
ప్రభావితాలౌతున్నాయన్నది వైదిక విజ్ఞానం. అందుకే అటువంటి అన్నాన్ని సంస్కరించి ఆరగించడం మన సంస్కృతిలో ప్రధానాంశం. అన్నం తినడంలో అనేక నియమాలను ఏర్పరచారు మన పూర్వీకులు. వాటిని అవగతం చేసుకోలేక, ఆచారాన్ని ఆవలపెట్టి
పశుప్రాయులుగా అన్న నియమాలను విడిచిపెడుతున్నారు. తద్వారా దుర్బలదేహాలు,దుర్భుద్ధులు ప్రబలుతున్నాయి.

పైమంత్రంలో అన్నం విషరహితం కావాలి - అనే భావనతో పరమేశ్వరుని
ప్రార్థిస్తున్నారు.

'విషం' అంటే శరీరాదులకు హాని కలిగించే అంశం అని తెలిసినదే. ఇది
భౌతికదేహానికి హాని కలిగించే విషయంగా మాత్రమే కాక, అన్నాన్ని అంటి పెట్టుకొనే విష లక్షణాలు చాలా ఉన్నాయి.

అన్నానికి మూడు రకాలుగా దుష్టత్వం సంక్రమిస్తుంది, ఆ దుష్టత్వాన్నే 'విషం'
అంటారు.

1. సంస్కార దుష్టం, 2. క్రియా దుష్టం, 3. స్వభావ దుష్టం. 

భగవంతునికి నివేదించకుండా, అతిథులు వంటివా(మరియొకరు) రికి పెట్టకుండా తినేది 'సంస్కారదుష్టం'. అశుచిగా వండడం 'క్రియాదృష్టం'. పంక్తి భోజనంలో ఇతరులు
తింటూ ఉండగా మధ్యలో ముందుగానే ఎవరైనా లేచిపోతే, ఇతరులకు అది'క్రియాదృష్టం'.

 మాంసం, లశునం (వెల్లుల్లి), ఉల్లి, ముందుపూట వండినవి, ఎంగిలి...వంటివి 'స్వభావ దుష్టం'. ఈ దుష్టత్వం సోకకుండా మనం జాగ్రత్త పడాలి. ఆ విధమైన జాగ్రత్తపడే బుద్ధిని పరమేశ్వరుడు ప్రసాదించాలి. అదే ఈ మంత్రప్రార్థనలో ఒక భావం.

ఇంతేకాక, ప్రకృతిలోని ఎన్నో సూక్ష్మశక్తులు అన్నంవైపు ఆకర్షితమవుతాయి. అందులో
శ్రేష్ఠ శక్తులు, దుష్ట శక్తులు కూడా ఉంటాయి. వాయువు, దృష్టి... ఈ రెండూ కూడా అన్నంపై ప్రభావం చూపుతాయి. వాటి దుష్ప్రభావం తొలగించడానికై అన్నాన్ని నివేదించడం, తినేముందు భగవన్మంత్రంతో నీళ్ళు చల్లి శుద్ధి పరచుకోవడం,‘బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం। బ్రహ్మైవ తేన గంతవ్యం
బ్రహ్మకర్మ సమాధినా' అనే శ్లోకాన్ని పఠించి తినడం ముఖ్య విధులు.

వీటి వలన అన్నంలోని విషలక్షణం తొలుగుతుంది.

ఇంకొక భావంలో - ‘అన్నం' అంటే మనం అనుభవించే ఐశ్వర్యాలు. ఇవి కూడా అక్రమంగా, అధర్మంగా ఆర్జించడం, అనుభవించడం విషతుల్యమే. అన్యాయమార్గంలో
సంపాదించి, ఇతరులకు దానాదులు చేయక అనుభవించే ఐశ్వర్యాలు విషమవుతాయి.వాటిని మనం సక్రమమార్గంలో సంపాదించి, ధర్మకార్యాలకి వినియోగించి శేషాన్ని
అనుభవించినప్పుడు అవి అమృతాలవుతాయి. అంతేకాక, మనకి తెలియకుండా ఏవైనా సూక్ష్మశక్తుల ప్రభావాలు కూడా ఉండవచ్చు. అందుకే పరమేశ్వర ప్రార్థనతో ప్రతిదీ అనుభవించడం అలవాటు చేసుకోవాలి. భగవత్ప్రర్థన వలన ప్రత్యంశమూ పరిశుద్ధమవుతుంది. ఇంత విస్తారదృష్టి వైదిక భావనల్లో ఉంది.  

No comments:

Post a Comment