Thursday, April 24, 2025

 *గొడుగులు, పావుకోళ్ళు*
                 

*ఈ లోకంలోకి గొడుగులు, పావుకోళ్ళు (చెప్పులు) వాడకంలోకి ఎలా వచ్చాయో   తెలుసా?  చిన్న కధ...*


*వేసవికాలం కావడంతో  ఎండ భగభగా మండిపోతోంది. తన ఆశ్రమం నుండి  ఓ పనిమీద బయలుదేరిన జమదగ్ని మహామునిని ఎండ చుర్రున తాకింది. అయినప్పటికీ పట్టించుకోకుండా తన పనిమీద తాను వెళ్తుంటాడాయన.*

*అలా నడుస్తుండగా... ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. జమదగ్ని మహామునిని ఎండ తీవ్రంగా నిలువనీయడం లేదు. దీంతో ఆగ్రహించిన ఆయన "సూర్యుడా...! దూరంగా వెళ్ళు" అంటూ ఆజ్ఞాపించాడు.*

*అంతా విన్న సూర్యుడు జమదగ్ని మాటలు పట్టించుకోలేదు సరికదా, మరింత ఉగ్రరూపం దాల్చాడు.* 

*ఎండ వేడి ఇంకా ఎక్కువ కావడంతో భరించలేకపోయిన జమదగ్ని.... వెంటనే తన విల్లూ, బాణం ఎక్కుపెట్టి సూర్యుడిపై బాణాలు వదలటం ప్రారంభించాడు.*

*అయితే అవి సూర్యుణ్ణి తాకకుండానే నేలమీద పడిపోతుంటాయి.*

*అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా... జమదగ్ని మహాముని పట్టువిడవకుండా ఒక బాణానికి మరో బాణం గుచ్చుతూ ఇంకా పైపైకి సంధించటం మొదలుపెట్టాడు.*

*దీంతో సూర్యుడికి కూడా కోపం పెరిగిపోయి మరింత మొండిగా వేడి ఇంకా ఇంకా పెంచుతున్నాడు.*

*అప్పుడే ఆశ్రమం నుంచి బయటకు వచ్చి   ఈ తతంగాన్నంతా  చూసిన జమదగ్ని శిష్యురాలు ఎండ వేడిని తట్టుకోలేక స్పృహతప్పి పడిపోతుంది.*

*దీంతో ఆమెను తీసుకెళ్లి ఆశ్రమంలో పడుకోబెట్టిన జమదగ్ని మరింత కోపంతో.... తన అస్త్రాలన్నింటినీ తీసుకుని సూర్యుడిపై సంధించసాగాడు.*

*ఇక సూర్యుడికి వాటిని తట్టుకోవడం కష్టమై, బాణాలు వచ్చి గుచ్చుకుంటుంటే విలవిలలాడిపోతూ.... ఇక లాభం లేదనుకుంటూ ఒక మనిషిరూపం దాల్చి జమదగ్ని ముందు ప్రత్యక్షమయ్యాడు.*

*"ఓ మహామునీ..! ఏంటి తమరు చేస్తున్న పని. సూర్యుడు అంత దూరంలో ఉన్నాడు. అతడిని నువ్వు గాయపరచడం సాధ్యం కాద”ని హెచ్చరించాడు.*

*అప్పుడు జమదగ్ని మాట్లాడుతూ... "ఇప్పుడు సూర్యుడు నాకు దూరంగా ఉండవచ్చు కానీ... మధ్యాహ్నం సమయాన నా నడినెత్తికి చేరువవుతాడు కదా...! అప్పుడైనా                         నా బాణాలకు చిక్కకపోడు" అన్నాడు కసిగా...*

*జమదగ్ని అన్నంతపనీ చేసేలాగా ఉన్నాడని గ్రహించిన సూర్యుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. "ఓ మహామునీ...! శాంతించు. నేను సూర్యుణ్ణి. నా ప్రకృతి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. నా తీక్షణతతో భూమిని వేడెక్కించటం నా వృత్తి ధర్మం!" అని చెప్పుకొచ్చాడు.*

*అంతేగాకుండా... జమదగ్నికి వేడినుండి ఉపశమనం పొందేందుకు కొన్ని కానుకలను ప్రసాదించాడు సూర్య భగవానుడు. అవేంటంటే... పావుకోళ్ళు, ఒక పెద్ద గొడుగు.* 

*అలా... అలా ఈ లోకంలోకి గొడుగులు, పావుకోళ్ళు (చెప్పులు) వాడకంలోకి వచ్చాయని పెద్దలు చెబుతుంటారు.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment