*సండే స్టోరీ*
*స్కూల్ ఆఫ్ థాట్*
రచన: భరాగో
జగన్నాథరావు గారొకసారి అన్నట్టు విశాఖపట్నం దూరాభారాల నగరం అయి కూర్చుంది. చివరికి, ఆ కారణంగా శివ కామయ్యా, నేనూ ఈ ఊళ్లో కుటుంబాల తో సహా పదిహేనేళ్లనించి ఉంటున్నా ఎప్పుడో గాని కలుసుకోడం పడదు.
వాళ్ల మరదలికి పెళ్లి చేస్తున్నారు. అందుకని స్వయంగా పిలవడానికి వచ్చారు ఉదయం ఎనిమిది అవుతూ వుండగా, భార్యాభర్తలిద్దరూనూ. అతనేమో కార్డ్ నా చేతుల్లో పెట్టి నాకో షేక్ హ్యాండ్ ఇచ్చి క్లుప్తంగా సంగతి చెప్పి చాలించుకున్నాడు గాని రవణమ్మకి అలా కుదరదు కదా (కుదిరినా, మా ఆవిడ కుదరనివ్వదు కదా). అంచేత వాళ్లిద్దరూ వంటింట్లో కెళ్లి అయిదు నిమిషాలు పైగానే అయినా శివకామయ్య అలా కూర్చుని ఉండిపోయాడు.
ఇంకా పిలవ్వలసిన వాళ్లు టౌనుకి ఇటు వైపున చాలామందే ఉన్నా సరే, వాళ్లావిడ మా ఆవిడతో హస్కేసుకుంటూ కూర్చున్నా సరే, శివకామయ్య వెళ్లిపోవాలని తొందర పడకపోడానికి కారణం మా చిన్ననాటి స్నేహమే కదా అనుకొని నేను ముచ్చట పడుతూ ఉన్న సమయంలో, హఠాత్తుగా నాకు స్ఫురించింది, అసలు కారణం.
శివకామయ్య భార్య రవణమ్మ వంటింట్లోకి వెళ్లిన తర్వాత కొంతసేపటికి మాపెద్దవాడు వీధి గుమ్మం దాటి హాల్లోకొచ్చేడు. సరిగ్గా అప్పటికే మా రెండోవాడు చెయ్యవలసిన టన్నున్నర హోంవర్కు పూర్తయినట్టుంది, "ఇప్పటికైందా, నీ మార్నింగ్ వాక్?" అని పలకరించాడు.
"మార్నింగు వాక్కూ కాదు, నీ మొహమూ కాదు. ఉదయం పూట సముద్రపొడ్డు కెళ్లి నీరెండలో వ్యాయామం చేస్తే వొంటికి మంచిది. నిన్ను రమ్మంటే నీకా హోంవర్కే సముద్రం అనుకొని కూచుంటావు."
"అవున్లే. దాన్నే సన్ బేదింగ్ అంటారు. అల్ట్రా వయలెట్ రేస్ బాడీ మీదపడి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సీ షోర్ మార్నింగ్ టైమ్ లో ఓజోన్ ఉంటుంది. అది ఇన్ హేల్ చేస్తే కూడా బాడీకి బెటరు." అని వ్యాఖ్యానించాడు మా రెండోవాడు.
ఈ వ్యాఖ్యానం అవుతూవుండగా మహిళ లిద్దరూ వంటింట్లోంచి ఇవతలికొచ్చారు. “మా పెద్దాడు. ఇంట్రమెట్ చదూతున్నాడు. అడుగోవాడు మా రెండోవాడు. వాడు ఎనిమిదో క్లాసుగావును, నాకు సమంగా తెలీదు... అదుగో ఆ పిల్లాడు మా రెండో వాడి నేస్తం" అంది మా ఆవిడ రవణమ్మతో.
"నమస్తే అంటీ. అయాం మన్యం. అంటే అసలు పేరు సుబ్రమణ్యం అనుకోండి, మై కలిగ్స్ సే. మన్యం".
"ఇంతకీ ఏక్లాసు?" అంది రవణమ్మ, నవ్వుతూ.
'యెయిత్. మా మమ్మీ నా మీద అలా జోక్స్ కట్ చేస్తుంది అంతే.” అని, మా రెండోవాడు, (అదే 'మన్యం':) "మీల్స్ సర్వ్ చేయి మమ్మీ, నాకు టైమవుతోంది. మళ్లీ ప్రేయరు మిస్సయిపోతాను." అన్నాడు వాళ్లమ్మతో.
"అబ్బా, ఆగు చిట్టీ! ఎవరైనా ఇంటికొచ్చిన పుడైనా ఉట్టినీ ఉగ్గాన్నీ ఉండవు నువ్వు. నీ సొదే నీది"
"ఏంటి మమ్మీ, చిట్టీ పొట్టీ అంటూను!? కాల్ మి మన్యం ఐ సే-"
"మమ్మీ లేదు కమ్మీలేదు. కాసేపుండు, అన్నం ఉడికింది. ఉమ్మగిల్లగానే వడ్డిస్తాను" అంది మా ఆవిడ. మళ్లీ ఇటు తిరిగి "ఏం కాన్వెంటు చదువులో ఏమిటో! అమ్మా అన్నం పెట్టవే అని అడగడం వచ్చింది కాదు పిల్లాడికి." అని కంట నీరు పెట్టుకున్నంత పని చేసింది.
"డాడీ, సన్డే మా స్కూల్ పిక్నిక్కి సెవెనో క్లాక్ కి వేన్ స్టార్ట్లవుతుంది. మీ ఆఫీసు కార్ లో లిఫ్ట్ ఇస్తానంటే నా ఫ్రెండ్స్ ని మన రెసిడెన్స్ కి ఇన్వైట్ చేస్తాను. అఫ్కోర్స్, వాళ్లని ఆన్ ద వే పికప్ చెయ్యొచ్చు కూడా ననుకోండి." అన్నాడు మా మన్యం, నాతో. "ఏడిశాన్ గాని, లోపలికి తగులడు" అంది మా ఆవిడ.
మా వాడి ఫ్రెండు కిసుక్కుని నవ్వాడు.
"మా మమ్మీ డైలాగ్ బార్బరస్ గా ఉంటుంది. డోన్ట్ తింక్ అదర్ వైజ్, రిచర్డ్! షీఈజ్ అదర్ వైజ్ వెరీ నైస్," అని మా వాడు వాడి ఫ్రెండుకి సంజాయిషీ ఇచ్చుకున్నాడు.
"ఆల్ మమ్మీస్ ఆర్ లైక్ దట్, యార్!" అని లేచాడు ఆ అబ్బాయి.
"ఓకే! గెట్ రెడీ-ఇన్, సే, ఎగ్జాక్ట్ లీ సిక్స్ మినిట్స్! ఐ బ్రింగ్ ద బైక్; అండ్ ఆఫ్ వుయ్ గో!" అని వెళ్లాడు.
"మమ్మీ, మమ్మీ! మన ఫామ్ లీ చాలా ఫార్వర్డ్ అనీ కల్చర్డ్ అని రిచర్డ్ కి చెప్పాను. వాళ్లముందు నన్ను లె డౌన్ చెయ్యొద్దంటే కూడా యు ఆల్ వేస్ ఫర్గెట్!" అనేసి వంటింట్లోకి వెళ్లిపోయాడు మా 'మన్యం'.
'హెస్స్' అని పెద్ద చప్పుడైతే అటు వైపు తిరిగాను. శివకామయ్య మావాడి డైలాగులు విని కేజీన్నర నిట్టూర్పు విడిస్తే అయిన చప్పుడేనని తెలుసుకొని కంగారు పడ్డం మానేశాను.
"ఇక్కడ కాన్వెంట్లలో చదువు బాగా చెప్తారనుకుంటాను, కదు?" అన్నాడు శివకామయ్య.
అదేదో మెచ్చుకుంటున్నాడనుకొని గోతిలో పడ్డాను. "ఆ! మరి అందుకే గదా, వాళ్లు ఫీజుల కిందా, పుస్తకాల కిందా, యూనిఫారాల కిందా, అఖరికి బూట్సు కిందా బోలెడు ఖర్చుపెట్టించేస్తున్నాసరే కిక్కురుమనకుండా భరిస్తున్నాం!" అన్నాను.
"చివరిదాకా ఇలా ఇంగ్లీషు చదువుకుంటూ పోతే ఏమో గాని, ఇప్పుడు మాత్రం మీవాడు తెలుగు సుబ్బరంగా మర్చిపోయాడు. ఇహ ఇంగ్లీషంటావా, వాడాడిన మాటలన్నీ ఇంగ్లీషు మాటలే, భాష మాత్రం ఇంగ్లీషు కాదు!"
“ఏమో!నా కంత ఇంగ్లీషు ఒచ్చా! చచ్చా?" అన్నాను తేలిగ్గా నవ్వేస్తూ.
"ఖర్చెక్కువ అవడమే కాదు; ఈ కాన్వెంటు కుర్రాళ్లకి గాభరా ఎక్కువ అవడమూ చూస్తున్నాను! తనకంటే ముందు ఎవడైనా శిఖరం ఎక్కిపోతాడో ఏమోనని ఒకటే పరుగు! కల్చర్ అంటూనే వుంటారు గాని వీళ్లు తెలుగు మీడియంలో చదివిన వాళ్లని చిన్నచూపు చూడ్డం ఒకటి నేర్చారంతే. నిన్న మా ఆఫీసులో ఒకడు 'నువ్వు కూడా మాట్లాడ్డమేనా, తెలుగు మీడియం వెధవ్వి! అని ఇంకోణ్ణి ఈసడించాడు”
"ఏదో-అలా-కొందరు-ఏంజెయ్యను- అక్కడికీ - సర్లే-" ఇలా కొంతసేపు కాలక్షేపం చేసి చివరికి, "ఐతే ఏర్పాట్లలో నేనేమీ సాయంచెయ్యక్కర్లేదంటావా?" అన్నాను.
"మీ రెండోవాడు కనిపించడేం?" అన్నాడు శివకామయ్య కొన్నాళ్ల తర్వాత బజార్లో కనిపించి. మా ఆవిడా పెద్దవాడూ పక్కకి ఒదిగి నించున్నారు.
"ఏమిటో వాడూ వాడి చదువూనూ! నాకేంటో కొరివితో తల గోక్కున్నట్టుంది. మొన్నటికి మొన్న పిక్నిక్ అన్నాడా యాభై రూపాయలు పట్టుకుపోయాడు. నిన్నట్నించీ ఈ నెల పద్దెనిమిదో తేదీ వరకూ అదేదో గ్రూపు క్యాంపుట. పోలో మని అందరూ పోతున్నారని నా దుంప తెంపి రెండు వందలు పట్టుకుపోయాడు. పైగా ఇవాళ పేపర్లో వార్త చూస్తే గుండెల్లో రాయి పడ్డట్టయింది. వీడు చదువుతున్న స్కూలు కమిటీకి నేను పెద్దంటే నేనే పెద్ద అని ఇద్దరు సీనియర్ మేస్టర్లు గుద్దులాడు కుంటున్నారుట. ఇద్దరికీ ముఠాలున్నాయ ట. ఇద్దరూ స్కూలు సొమ్ము లక్షలమీద స్వాహా చేసినవాళ్లేట" అని మొరపెట్టుకొని, శివకామయ్య నన్ను విమర్శించకుండా ముందరి కాళ్లకి బంధం వేసాను.
సరిగ్గా ఆ సమయానికి అక్కడ ఆగిన "స్కూల్ బస్" లోంచి అయిదేళ్ల పాప కిందికి గెంతి శివకామయ్య దగ్గరికి పరిగెత్తుకొచ్చి "హాయ్, డాడీ!" అంది.
"అంకుల్ కి నమస్తే చెప్పు.” అన్నాడు. శివకామయ్య పుత్రికోత్సాహం పెల్లుబికి.
“గుడీవ్నింగ్ అంకుల్" అంది, మరో రకంగా అంటే గొప్పగా ముద్దోచ్చే ఆ పాప.
"ఏమిటీ!?" అన్నాను ఆశ్చర్యమో, అభిశంసనో తెలియనియ్యక.
"నువ్వేం అలా అయిపోనక్కర్లేదు. ఇంగ్లీషు స్కూళ్లు మన్ని పాడుచేస్తున్నాయి. నిజమే. కాని తెలుగు స్కూళ్లు క్రమశిక్షణ లేక, సదుపాయాల్లేక, శ్రద్ధగా, కరెక్టుగా పాఠం చెప్పగలిగే డొక్కశుద్ధి గల టీచర్లు తక్కువై, మరింత ఘోరంగా ఉన్నట్టున్నాయి. ఆ "దుంపలబడి"లో నేను చదవను మొర్రో అని గోలపెట్టింది మా అమ్మాయి. అందుకని..." అన్నాడు.
😄
*సమాప్తం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment