*విక్రమార్కుని విడ్డూరం -1*
⚔️
(1960ల్లో రచించిన ఒక చక్కని ఫాంటసీ కధ)
రచన : రాచమల్లు రామచంద్రారెడ్డి
పూర్వం విక్రమార్కుడనే రాజు ఉండేవాడు. ఆ రాజు ఇప్పుడు చచ్చి స్వర్గలోకంలో ఉన్నాడు. స్వర్గలోకంలో ఉండే సుఖాలన్నీ అనుభవిస్తూ ఎన్నో సంవత్సరాలు, శతాబ్దా లు, అక్కడే గడిపిన తర్వాత, ఆయనకు విసుగుపుట్టింది. "ఛీ, ఎన్నాళ్ళున్నా ఇక్కడ ఒకటే సుఖం. ఇంత సుఖమైతే మనిషికి ఏం బాగుంటుంది? మళ్ళీ భూలోకానికి పోతే బాగుండు” అనుకున్నాడు ఆయన.
పూర్వం భూలోకంలో ఆయన చాలా ఏండ్లు రాజ్యం చేసినాడు. రాజ్యం చేయడమే గాక ఎన్నెన్నో సాహస కార్యాలు చేసినాడు. రాజులను జయించినాడు, రాక్షసులను చంపినాడు, వీరులను పారద్రో లినాడు, చోరులను చిందర వందరగా చేసినాడు-అబ్బో! ఆయన చేయని ఘన కార్యమే లేదు. ఆనాడు ఆయన పేరంటే భూలోకమంతా హడలయ్యేది. ఆయన్ను చూస్తూనే అందమైన ఆడవాళ్ళందరూ ప్రేమించి పెండ్లి చేసుకునేవాళ్ళు. అందుకనే మంచి మంచి రాజకన్యలందరినీ ఆయనే పెండ్లి చేసుకొని చాలా దర్జాగా, వైభవంగా, రాజ్యం చేస్తూ వీరాధివీర విక్రమార్క మహారాజు అనిపించుకున్నాడు. ఆ దర్జా, ఆ వైభవమూ, అన్నీ జ్ఞాపకంవచ్చి,ఆయన కు ఒకసారి భూలోకం చూడాలనే కోర్కె బలంగా కలిగింది.
వెంటనే విక్రమార్కుడు దేవేంద్రుని వద్దకు పోయి "అయ్యా నేనొకసారి భూలోకం వెళ్ళొస్తాను” అన్నాడు.
విక్రమార్కుడంటే దేవేంద్రునికి చాలా గౌరవం. అంతటి వీరాధివీరుడు తన లోకం లో ఉండడమే చాలు అనుకునేవాడు. ఆయనకి కావలసిన సుఖాలన్నీస్వయంగా దేవేంద్రుడుశ్రద్ధగా ఏర్పాటుచేయించేవాడు. అందుకని భూలోకానికి పోవాలని విక్రమార్కుడు అడిగేటప్పటికి దేవేంద్రునికి చాలా ఆశ్చర్యం కలిగి "ఎందుకోయ్, నీ కిక్కడ సుఖంగా లేదా?" అని అడిగినాడు.
"చాలా సుఖంగా ఉంది” అన్నాడు విక్రమార్కుడు.
“మరి భూలోకానికి పోవడం ఎందుకు?” అన్నాడు దేవేంద్రుడు.
"ఇక్కడ చాలా సుఖంగా ఉంది దేవరాజా! అందుకే నాకు భూలోకానికి పోవాలని బుద్ధి పుట్టింది” అన్నాడు విక్రమార్కుడు.
పాపం. దేవేంద్రునికి, అర్థం కాలేదు, అర్థం కాక "చాలా సుఖంగా ఉంటే ఇక్కడే ఉండు. నీకేమైనా కష్టంగా ఉంటే చెప్పు, నేను తీరుస్తానుగా” అన్నాడు.
విక్రమార్కుడు విసుక్కుంటూ అన్నాడు: “నాకేమీ కష్టం లేదయ్యా! ఇక్కడ అంతా సుఖంగానే ఉంది. ఇంత సుఖమైతే మనిషికి ఏం బాగుంటుంది?”
అప్పుడు అర్థమైంది దేవేంద్రునికి. ఎంతైనా ఇతను మనిషే కదా, అందుకని 'స్వర్గ సుఖాల మీద విసుగు పుట్టి ఉంటుందిలే' అనుకున్నాడు దేవేంద్రుడు. కానీ ఇప్పుడు భూలోకానికి పోతే ఇతను చాలా చాలా కష్టపడతాడే అని జాలికలిగి, “నీవు పోతే పోదువుగానీ, నేనొక మాట చెప్తాను, విను" అన్నాడు.
"నీవు భూలోకం నుండి వచ్చి ఇప్పటికి సుమారు రెండు వేల ఏండ్లు అయింది. ఈ రెండువేల ఏండ్ల లోనూ భూలోకం ఎంతగా మారిపోయిందనుకున్నావో! నీవసలు గుర్తే పట్టలేవు. ” అన్నాడు.
విక్రమార్కునికి దేవేంద్రుని మీద కూడా విసుగుపుట్టి, "భలే చెప్పినావు లేవయ్యా! నేను భూలోకంలో పుట్టి పెరిగినవాణ్ని. ఆ లోకం సంగతి నాకు తెలియక నీకు తెలుసునా?” అన్నాడు.
దేవేంద్రుడు ఇంకా జాలిపడి, “అక్కడకి పోతే నీవు చాలా కష్టపడతావు” అన్నాడు.
విక్రమార్కునికి కోపం వచ్చి, గర్వంగా అన్నాడు "నేనంటే ఎవరనుకున్నావ్? నేను వీరాధివీర విక్రమార్క మహారాజును. నా ధైర్యమూ, నా శౌర్యమూ, నా సాహసమూ, నా పరాక్రమమూ, నీకు తెలిసినట్లే లేదే! నేను భయపడతాననుకున్నావేమో- కష్టా లంటే నాకు మంచినీళ్ళ ప్రాయం. అసలు నేను ఆ లోకానికి పోవాలని ఎందుకు అనుకుంటున్నాను ? కష్టాల కోసమే. మీ లోకంలో అన్నీ సుఖాలే, వెధవ సుఖాలు.”
అతని మాటల తీరు చూచి దేవేంద్రుడు మౌనంగా ఉండిపోయినాడు. దేవేంద్రుని మానం చూచి విక్రమార్కుడు కోపంగా అడిగినాడు "ఇంతకూ నన్ను భూలోకానికి పంపిస్తావా, లేదా? ఏదో ఒక మాట త్వరగా చెప్పు”
దేవేంద్రుడు నవ్వుతూ జవాబు చెప్పినాడు: “అంత తొందరెందుకోయ్? పంపిస్తాన్లే. రేపు తెల్లవారేటప్పటికి నీవు భూలోకం విూద ఉంటావు, నీకు కావలసినవన్నీ చూసుకొని ప్రయాణానికి సిద్ధంగా ఉండు. సరేనా?”
"సరే, దేవేంద్రా!” అంటూ విక్రమార్కుడు
పోబోయినాడు.
"ఆగు విక్రమార్కా!” అని దేవేంద్రుడు అన్నాడు.
"పోవాలని తొందరపడుతున్నావేగాని, తిరిగి స్వర్గలోకానికి రావడం ఎట్లాగో నీవు ఆలోచించనేలేదు. నేనే చెప్తాను విను. ఈ లోకానికి నీవు తిరిగి రావాలనుకున్నప్పు డు, స్వర్గం స్వర్గం స్వర్గం అనిమూడుసార్లు అన్నావంటే, వెంటనే నిన్ను ఈ లోకంలోకి చేరుస్తాను. మరచిపోవద్దు. ఇక పో.”
అన్నాడు.
📖
క్రీస్తుశకం 1959 వ సంవత్సరంలో ఒక రోజు తెల్లవారేటప్పటికి విక్రమార్కుడు గుర్రం మీద ఎక్కి ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాడు. పూర్వం తాను భూలోకంలో రాజ్యం చేసేటప్పుడు ఎట్లా బట్టలు వేసుకునేవాడో అట్లాంటి బట్టలే ఇప్పుడూ వేసుకున్నాడు. తల మీద పెద్ద కిరీటం పెట్టుకున్నాడు. మెడలో ముత్యాలహారాలు వేసుకున్నాడు. నడుముకు ఒక ఖడ్గం తగిలించుకున్నాడు. ఈ విధంగా పూర్వ కాలపు రాజు వేషంలో పోతూ పోతూ రోడ్డు వైపు నిదానంగా చూసి, "అరే, ఇట్లాంటి దారి మా కాలంలో లేదే!" అని రోడ్డు వంక తదేకంగా చూసి ఆశ్చర్యపడినాడు.
“మా కాలంలో వర్షం వస్తే దారి అంతా బురద బురద అయ్యేది. ఇదేదో చాలా గట్టిగా ఉంది. రాళ్ళూ మన్నూ వేసి గట్టిగా దట్టించినట్లు ఉంది. ఎంత వర్షం వచ్చినా గుర్రాలే కాదు, రథాలు కూడా సులభంగా ప్రయాణం చేయవచ్చు” అనుకుంటూ ఆయన ఆ రోడ్డు మీద పోతున్నాడు.
🔪
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅
No comments:
Post a Comment