Monday, March 31, 2025

 *సేకరణ:పసుపులేటి రమేష్*
9441767340

*ఛందస్సులోని పేర్లతో తంటాలు పడిన ట్రాఫిక్ ఎస్సై*

"ఇదుగో భట్టూ, ఆ బండాపు" అన్నాడు ట్రాఫిక్ ఎస్సై, హోమ్ గార్డ్ భట్టుని ఉద్దేశించి ....

భట్టు గబగబా రోడ్డు మధ్యలోకి వచ్చి బండి ఆపేశాడు.

"బండి పక్కనపెట్టి సారు దగ్గరకెళ్ళి బండి కాయితాలు చూపించు" అన్నాడు భట్టు.

అతను "అర్జంటుగా ఇంటికి వెళ్ళాల్సార్"  అన్నాడు.

"వెళ్దువుగాన్లే, పద" అంటూ అతడిని ఎస్సై దగ్గరకు తీసుకెళ్ళాడు భట్టు.

ఎస్సై బండివంక, అతడివంక చూసి, "బండికి నంబర్ ప్లేటేది ?" అనడిగాడు.

"ఊడిపోయింది సార్, అర్జంటుగా  ఇంటికెళ్ళాల్సార్"

"ఊడిపోతే మళ్ళీ పెట్టుకోవాలి"

"పెట్టించుకుంటా సార్, అర్జంటుగా  ఇంటికెళ్ళాల్సార్"

"ఎల్దువుగాన్లే, డ్రైవింగ్ లైసెన్సు సూపించు"

"ఇంటి దగ్గరుంది సార్, అర్జంటుగా  ఇంటికెళ్ళాల్సార్"

"ఎల్దువుగాన్లే, 'సీ' బుక్కు సూపించు"

"ఇంటిదగ్గరుంది సార్, అర్జంటుగా ఇంటికెళ్ళాల్సార్". 

"ఎల్దువుగాన్లే, ఇన్సూరెన్సుందా?"

"ఇంటిదగ్గరుంది సార్, అర్జంటుగా ఇంటికెళ్ళాల్సార్".

"ఎల్దువుగాన్లే, పొల్యూషనుందా?"

"బండి స్టార్ట్ చేస్తే చాలా ఉంది సార్ అర్జంటుగా ఇంటికెళ్ళాల్సార్"

"నేనడిగింది పొల్యూషన్ సర్టిఫికెట్టు"

"ఇంటిదగ్గరుంది సార్, అర్జంటుగా ఇంటికెళ్ళాల్సార్" 

"ఉరేయ్...నంబరు ప్లేటు లేదు, లైసెన్సు లేదు, పొల్యూషన్ లేదు .... "

"పొల్యూషను ఉంది సార్...." 

"నోరెత్తితే పీక పిసుకుతా... పొల్యూషన్ సర్టిఫికెట్టు లేదు. ఏదడిగినా ఇంటి కాడ ఉందంటావు. అసలు నీకు పెనాల్టీ కనీసం ఒక లక్షైనా ఎయ్యాల్రా .... " అన్నాడు ఎస్సై చలాను బుక్కు తీస్తూ.

"సార్ సార్, అర్జంటుగా ఇంటికెళ్ళాల్సార్..."

"ఎల్దువుగాన్లే, నీ పేరు చెప్పు" 

*"సభరనమయవ* సార్"

చలాను రాయబోయిన ఎస్సై ఒక్క క్షణం అతడివైపు చూసాడు.

"నువ్వు తెలుగోడివేనా?" అని అడిగాడు.

"తెలుగువాణ్ణే సార్, అర్జంటుగా ఇంటికెళ్ళాల్సార్"

"ఎల్దువుగాన్లే..." అంటూ అతడి పేరు చలాన్ బుక్ లో రాస్తున్నాడు. ఇంతలో ....

"సార్...నా పేరులో మొదటక్షరం కుంటి 'స' రాయాల్సార్. మీరు మెలిక 'శ' రాసారు, 'బ'కింద వత్తివ్వాల్సార్...అర్జంటుగా ఇంటికెళ్ళాల్సార్"

"ఎల్దువుగాన్లే, మీ నాయన పేరు?"

*"మసజసతతగ*...కుంటి 'స' సార్. అర్జంటుగా ఇంటికెళ్ళాల్సార్"

"ఎల్దువుగాన్లే కానీ ఈ పేర్లేందిరా, ఏ రాముడో, కృష్ణుడో పెట్టుకోక ?"

"మా తాత తెలుగు పండితుడు సార్, అర్జంటుగా ఇంటికెళ్ళాల్సార్"

"ఆయన పేరేంది?"

*"భరనభభరవ*...'బ'కు కింద వత్తుండాల్సార్, అర్జంటుగా ఇంటికెళ్ళాల్సార్ .... "

"మీ ఇంట్లో అందరి పేర్లు ఇలాగే ఉంటాయేంట్రా?" ఆశ్చర్యంగా అడిగాడు ఎస్సై, చలాను బుక్కు పక్కన పెడుతూ ....

"ఔనండి, మా అన్నయ్య పేరు *నజభజజజర*...'బ' కింద వత్తు సార్ అర్జంటుగా ఇంటికెళ్ళాల్సార్".

"నజ .... ? ఏందదీ?"

*"నజభజజజర* ...'బ' కింద వత్తు సార్...అర్జంటుగా..."

"ఎహే ఆపు...ఏంది వత్తేదీ? అసలయన్నీ పేర్లేనా? ఏదో చెప్పి తప్పించుకుందామనుకుంటున్నావా?"

"అవన్నీ తెలుగు ఛందస్సులోవి సార్, అర్జంటుగా ఇంటికెళ్ళాల్సార్".

"ఏందిరా నీగోలా? ఏఁవడిగినా అర్జంటుగా ఇంటికెళ్ళాలంటావ్? ఇంటికాడ అంట్లు తోఁవాల్నా, ఏందీ?"

"కాదు సార్..." అంటూ రెండు వేళ్ళు చూపించాడు *సభరనమయవ.*

*"ఓరి నీ పాసుగూలా...పో"* అన్నాడు ఎస్సై.

వెనక్కి తిరిగి చూడకుండా బండేసుకెళ్ళిపోయాడు *సభరనమయవ.*

అతడు అటెళ్ళగానే ఎస్సై భట్టు వైపు చూసి "ఇట్టాంటి పేర్లు ఎవడైనా పెట్టుకుంటాడా?" అనడిగాడు.

"పెట్టుకుంటారు సార్"

"ఎవరయా పెట్టుకునేది? ఇంకోణ్ణి సూపించు"

"నేనే సార్ .... "

"నీ పేరు భట్టు కదూ?"

"అసలు పేరు *తస్కస్కంభొట్లు* సార్"

"తస్కం...ఏ భొట్లు?"

*'తస్కంభొట్లు సార్"*

"మరి భట్టు అని ఎందుకు పెట్టుకున్నావ్?"

"స్కూల్లో వేసేటప్పుడు మా సారుకి రాయడం రాక,'భట్టు' అని రాసాడు సార్"

"అట్టాంటి పేర్లు పెడితే నోరెట్టా తిరుగుద్దీ? ఇంతకు మీ నాయన పేరేంది? అది కూడా ఇట్నే ఉంటదా?"

*"విష్వక్సేనుడు* సార్...'క'కు ఏత్వమిచ్చి కింద కుంటి 'స' రాయాల్సార్".

"ఉరేయ్...నాకేడ దొరుకుతార్రా మీరు? ....సర్లేకానీ, అదుగో, ఆ పిలగాడు హెల్మెట్ లేకుండా పోతన్నాడు. బండాపి  పేరు కనుక్కుని, ఆ తర్వాతే తీసుకురా"

"అట్టాగే సార్......

"కనుక్కున్నాను, సార్...
ఆడి పేరు, *'యమాతారాజభానసలగం'* ట, సార్..."

"అయితే, ఆణ్ణి ఒదిలేయ్..."
*(మనకి రాయడం రాదుగా !)*
😂😂😂👏👏👏

No comments:

Post a Comment