Monday, March 31, 2025

 #గురుజాడవారి_గిరీశం_పాత్ర!

*కన్యాశుల్కమూ, కన్యాశుల్కం గురించీ ఇష్టంగా చదివాను!

**దగుల్బాజీ, మోసగాడు, మాటల మరాఠీ, కోతల రాయుడు, వట్టి వెధవాయి - ఇలాంటి పదాలతో శ్రీమాన్ గిరీశం వారిని సన్మానించడం ఏహ్వీ తప్పు కాదు. 
సానుల్ని ఉంచుకుంటాడు, ఆ వేశ్యతో ఫోటో దిగి అందుకు ఫోటోగ్రాఫ్‌ పంతులుకు డబ్బివ్వకుండా టోపీ వేస్తాడు,
 పూటకూళ్ళమ్మకు కూరలు తెచ్చిపెడతానని డబ్బుచ్చుకుని ఆ డబ్బు డాన్సింగరల్ మీద ఖర్చుపెడతాడు, వెంకు పంతులుగారి కోడలికి లవ్ లెటర్ రాస్తాడు, వెంకటేశమనే కుర్రవాడిని తనతో తిప్పుకుంటూ చదువు చెప్తానని కోతలు కోసి చుట్టలు అలవాటుచేస్తాడు. 
ఆడిన అబద్ధాలకు, కోసిన కోతలకూ హద్దూ అదుపూ ఉండదు. కన్యాశుల్కం నాటకం మొదట్లో విజయనగరం నుంచి జారుకునే ముందు గిరీశం చేసిన ఘన కార్యాలు. అతను చేసే ప్రతీ పనీ నచ్చదు, కానీ మొత్తంగా కన్యాశుల్కం పాఠకులకు గిరీశం పాత్ర నచ్చుతుంది? ఎందుకు?

గిరీశం పాత్ర లోతుల్లోకి పోయేముందు, ఇప్పటిదాకా కన్యాశుల్కం చదవనివారి కోసం క్లుప్తంగా కన్యాశుల్కంలో గిరీశం కథను చెప్పుకుందాం.

కన్యాశుల్కం మొదట్లో మధురవాణి అనే వేశ్యను ఉంచుకుని, పూటకూళ్ళమ్మతో సావాసం చేస్తూ రోజుకో మోసం చేస్తూ గడుపుకుంటాడు. చేసిన మోసాలకూ, వేసిన టోకరాలకూ తనకు మూడిందని తెలిసి ఏదోలా విజయనగరం నుంచి జారుకోవాలని చూస్తూంటాడు. చదువు పేరుతో వచ్చి చుట్టలు నేర్చుకున్న శిష్యుడు వెంకటేశానికి పాఠాలు చెప్పే మిషతో అతని ఊరైన కృష్ణరాయపురాగ్రహారానికి బిచాణా ఎత్తుతాడు. పాఠాలు దేవుడెరుగు, బాల్య వితంతువైన అతని అక్క బుచ్చెమ్మకు ప్రేమ పాఠాలు మొదలుపెడతాడు. ఆమెను చేసుకుంటే ఆస్తికి ఆస్తీ, పేరుకు పేరూ అని లెక్కలు వేస్తాడు. బుచ్చెమ్మ చెల్లెలు సుబ్బిని ముసలాడైన లుబ్దావధాన్లుకు ఇచ్చి పెళ్ళిచేయబోతే బుచ్చెమ్మ తల్లి నూతిలో దూకుతుంది, ఆమెని కాపాడి క్రెడిట్ కొట్టేస్తాడు. తుదకు ఆ వివాహానికి అందరూ తరలి వెళ్తూండగా తామిద్దరం లేచిపోతే పెళ్ళి ఆగిపోతుందని నమ్మించి బుచ్చెమ్మను లేపుకుపోతాడు. విజయనగరంలో సంస్కర్త సౌజన్యారావు పంతులును ఆశ్రయిస్తాడు. తనకు వేశ్యలంటే అసహ్యమని బొంకుతాడు. మధురవాణి వేరే పనిమీద వచ్చినప్పుడు గిరీశం రంగు బయట పడుతుంది. బుచ్చెమ్మలాటి అమాయకురాలిని ఇచ్చి పెళ్ళి చేయననీ, చదువుకుంటానంటే ఆర్థికంగా సాయం చేస్తానని తెగేసి చెప్తాడు సౌజన్యరావు. దీనితో గిరీశం "డామిట్! కథ అడ్డంగా తిరిగింద"నుకుంటూ నిష్క్రమిస్తాడు.

ఈ పాత్ర మనకు నచ్చడానికి మొదటి కారణం
 హాస్యం. మానవ స్వభావంలోనే హాస్యానికి ఆకర్షితులయ్యే లక్షణం ఉంది. సాధారణంగా హాస్యాన్ని కొందరు తమ జీవితంలోని కన్నీటిని దాచుకుందుకు వాడితే ఇంకొందరు తాము చేసే మోసాలను, తమ వ్యక్తిత్వాన్ని దాచుకుందుకు వాడతారు. గిరీశం పాత్ర రెండవ రకమని వేరే చెప్పనక్కరలేదు. మీరు నాకు చుట్ట తప్పించి నేర్పిందేమీ లేదని శిష్యుడు వేష్ట పడితే - ఖగపతి అమృతము తేగా, భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్, పొగచెట్టై జన్మించెను పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్ అని చమత్కరించి నవ్వించి, విషయం నుంచి తప్పించుకోగల దిట్ట. మాటమార్చినప్పుడు ఒపీనియన్సు అప్పుడప్పుడు ఛేంజి చేస్తూంటేనేగాని పొలిటీషియను కానేరడు. మనవాళ్ళు వుట్టి వెధవాయలోయ్. నాతో మాట్లాడ్డవే ఒక ఎడ్యుకేషన్. - అదీ ఇదీ అని లేదు. ఇలా ఈనాటికీ మరిచిపోలేని గిరీశం మాటల గారడీ నాటకంలో తనకు సమస్య ఎదురైనప్పుడల్లా నుంచి ఠస్సావేసి తప్పించుకు పనికొచ్చింది. ఇటుపక్క పాఠకులను కూడా రంజింపజేసింది. పాఠకులు మోసపోలేదు కానీ ఇష్టపడ్డారని చెప్పాలి.

ఇక రెండో కీలకం అతని స్వభావానికి వెనుక ఉన్న పరిస్థితిలో ఉంది. చాలామంది విమర్శకులు గిరీశం పాత్రని, సంస్కృత నాటకమైన మృచ్ఛకటికంలో శకారునితో పోలుస్తారు. ఇద్దరూ మోసగాళ్ళే, ఇద్దరూ మాయగాళ్ళే. ముఖ్యమైన తేడా- శకారుడు రాజుగారి బావమరిది, గిరీశం బుక్కా ఫకీరు. శకారుడికి రోజు గడవడం సమస్య కాదు. రోజు గడవడం గిరీశానికి పెద్ద సమస్య. ఆ గడుపుకోవడానికి నిజాయితీగా కష్టపడకుండా ఏదోక కొండకు వెంట్రుకేద్దామని నెత్తిమీదున్న ఒక్కటీ పీక్కోవడమో, వేరేవారి తలగొరగడమో చేస్తాడు. నాటక విమర్శకుడు శ్రీనివాస చక్రవర్తి అయితే ఏకంగా ఎదుటివాళ్ళ కొంపలు ఆర్పి, మేడలు మిద్దెలు కట్టడం అతని ప్రయత్నం కాదనీ, జానెడు పొట్టకోసం బాధలుపడే హానిలేని మనిషి అని భావించారు. వీలూ, అవకాశం - జీవితాదర్శాలు, అబద్ధాలూ, మోసాలూ బ్రతుకుతెరువుగా కలిగిన ఈ మనిషిలో ముఖ్యమైన ఆకర్షణ అంతుతరగని ఉత్సాహం.

కథ అడ్డం తిరిగినా, అక్కడి నుంచి జాగ్రత్తగా తప్పుకుని వేరే ప్రయత్నం మొదలుపెడతాడు. జీవితాన్ని ఆటలా చూస్తాడు, ఓడిపోయినా తలపట్టుకుని కూచోడు, కించుత్తు కూడా లెక్కపెట్టడు. కానీ ఆ ఆటలో అవతలివారు నష్టపోతున్నా పెద్దగా పట్టించుకోకపోవడమే అతనిలోని దుర్మార్గం.

అయితే, గిరీశంలాంటి మోసగాడిలో ఇలా ఓ తెలియని ఆకర్షణ సృష్టించి అతన్ని చూసి నవ్వాల్సిన సమయంలో, అతని పక్కన కూచోబెట్టి లోకాన్ని చూసి నవ్వేలా చేశాడని గురజాడని విమర్శించిన విమర్శకులూ ఉన్నారు. సంఘ సంస్కరణ ఆదర్శాలను గిరీశంలాంటి పాత్ర భుజాన వేసుకునేట్టు చేసి వాటికీ దెబ్బకొట్టాడని ఇంకొందరు అన్నారు. సంఘ సంస్కారం ఉద్దేశం మంచిదే అయినా సాగిన తీరును విమర్శించడానికే గిరీశాన్ని ఇలా తయారుచేశాడని కొందరు సమర్థించారు.ఏతావతా, ఒకటి నిజం - అతని హాస్యమూ, పొట్టకూటి కోసం తిప్పలూ, జీవితాన్ని ఆటలా తీసుకునే లక్షణమూ, తరగని ఉత్సాహమూ కలిసి గిరీశం పాత్ర తరగని ఆకర్షణ ఏర్పడింది.

కన్యాశుల్కంలో లెక్చర్లిచ్చానని గప్పాల కొట్టిన గిరీశాన్ని సినిమాల్లో తిరిగే మాయలోడిగా పెట్టి 1950ల్లో ముళ్ళపూడి వెంకటరమణ గిరీశం లెక్చర్లు రాశారు. జె.వి.రమణమూర్తి, గోవిందరాజుల సుబ్బారావు, మొదలుకొని ఎందరో రంగస్థలంపై గిరీశాలుగా నటించారు, నటిస్తూనే ఉన్నారు. కన్యాశుల్కం సినిమాలో రామారావు చివర్లో మారిపోయే గిరీశంగా వేశారు. బాపురమణలే తిరిగి 1990ల్లో రాంబంటు సినిమాలో గిరీశం పేరునూ, తీరునూ వాడి కోటతో విలనీ పండించారు. సాహిత్య విమర్శలో ఇప్పటికీ గిరీశం లక్షణాలపై గొలసుకట్టు వ్యాసాలు, ఖండన మండనలతో అంతులేని చర్చ సాగింది, అయినప్పటికీ దుర్భేద్యంగానే అతని ఆకర్షణ నిలిచింది. అయినా, మన సమాజంలో ఇప్పటికీ ఎందరో గిరీశాలు గిరగిరా తిరుగుతూనే ఉండగా ఆ పాత్రకు ఇంకో వందేళ్ళయినా లోటేమిటి?

       🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment