*శ్రీ పొత్తూరు రాజేంద్రప్రసాద్ వర్మ 94405 27387 భీమునిపట్నం..గారి కథ
*_భీమిలి అమరప్రేమికులు_*
ఆకాశంలో చంద్రుడు పండు వెన్నెలని వెదజల్లుచున్నాడు.
భీమిలి సముద్రంపై పరుచుకున్న వెన్నెల కెరటాల కదలికలకు తెల్లని జలతారులా కనిపిస్తోంది. తన వెన్నెల కిరణాలకు అడ్డుతగులుతున్నాముని చందమామ ఎక్కడ కోపగించుకుంటావో అన్నట్లు ఆకాశంలో మేఘాలు వెన్నెలకు అడ్డుతగలకుండా తొందర తొందరగా కదలిపోతున్నాయి. భీమిలి సముద్రతీరానికి సమీపంలో ఉన్న రిప్లయి కంపెనీలో దాదాపు అందరూ వెలిపోయారు.
వాచ్ మెన్ గేట్లు వేసి కాపలాగా చిన్న కుర్చీ మీద కూర్చున్నాడు. అందులో పనిచేస్తున్న డచ్చి అధికారులు తమ బంగళాలకు వెళ్లిపోయారు. కార్మికులు, కిందస్థాయి ఉద్యోగులు ఎప్పుడో తమ దుకాణాలను సద్దుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. ఎలక్సుకు ఆఫీసు పని పూర్తి అయిపోయి రెండు గంటలు దాటిపోయింది. అయినా ఇంటికి వెళ్లాలని అనిపించలేదు. మధ్యాహ్నం భార్య సెలీనా లండన్ నుంచి వస్తానని రాసిన ఉత్తరం కోటు జేబులో భద్రంగా ఉంది. పదిహేనేళ్ల క్రితం తనను వదిలి పెట్టి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ వస్తానని రాసిన ఉత్తరము అందుకే దానిని పదిపదిహేను సార్లు చదువుకున్నాడు. తర్వాత కోటు జేబులో ఉంచుకున్నాడు. ఆఫీసు వదిలిన తర్వాత ప్రతిరోజూ ఇంటికి వెళ్లిపోవడం రొట్టెల్ని కాల్చుకుని వాటికి జామ్ రాసుకుని తినడం తర్వాత పుస్తకాలు చదువుకుని పడుకోవడం అంతే.
సెలీనా ఆలోచనలు మనసులో మెదులుతుండగా కాళ్లు అప్రయత్నంగా సముద్ర కెరటాల వైపు అడుగులు వేసాయి. రిప్లయి కంపెనీలో పనిచేసే సిబ్బందితో కలిసి అనేకసార్లు భీమిలి సముద్రంలో తిరిగాడు.
కానీ చీకటిపడిన తర్వాత రావడం ఇదే మొదటి సారి. నురుగలు కక్కుతూ విరిగి పడుతున్న కెరటాలను తాకుతూ నడుస్తున్నాడు. ఎప్పుడూ తన బూట్లు తడిచిపోతాయని కెరటాలకు దూరంగా నడిచేవాడు. ఇప్పుడు సెలీనా నుంచి ఉత్తరం రావడం ఇంగ్లండు నుంచి వస్తానని వర్తమానం పంపడం ఎలక్సుకు ఎంతో ఆనందాన్ని ఉద్వేగాన్ని నింపింది. అందుకే కెరటాలు బలంగా కాళ్లకు తగులుతున్నా తీరం వెంబడి నడక సాగించాడు.
మీద పడిన వయసులో ఎలెక్సుకు ఇసుకలో నడవడం కష్టంగా అనిపిస్తోంది. అయినా సెలీనా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ముందుకుసాగుతున్నాడు. తీరం వెంబడి నడుస్తూ ఉప్పుటేరు వద్దకు చేరుకున్నాడు.
అవలతీరంలో పడుకున్న కొండబిలువ మాదిరిగా దూరంగా గుడివాడ, చిప్పాడ కొండ కనిపిస్తోంది. విశాలంగా వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న గోస్తనీ నది... సాగర సంగమం కనువిందు చేస్తోంది. రెండూ కలిసిన పాయ వద్దకు ఎలెక్సు చేరుకున్నాడు.
"ఉప్పుటేరును డచ్చివారంతా సాల్టులేక్ అని పిలిచేవారు. అందులో నిలిపే చిన్న పడవలు, అవి చేపల కోసం ఉప్పుటేరు నుంచి సముద్రంలో కలిసే గోస్తనీ నది పాయ ద్వారా సముద్రంలోకి వెళ్లే దృశ్యాన్ని చూడటం ఎంతో ఆనందంగా ఉండేది.
వివాహం అయిన తర్వాత తన ఉద్యోగం భీమిలిలో అని తెలుసుకుని సెలీనా లండన్ నుంచి వచ్చింది. ఉప్పుటేరు, సముద్రతీరం, తీరం వెంబడి ఎర్ర మట్టిదిబ్బలు వంటివి అన్నీ చూపించాడు. అవే తన కొంప ముంచాయి. సెలీనా తనతో విడిపోవడానికి అవే కారణమయ్యాయి.
మెలీనాతో పరిచయం ప్రేమ తలచుకున్నప్పుడు ఎలెక్సు కళ్లు తడి అయ్యాయి. సెలీనా తనని ప్రేమించింది. తాను భీమిలి అందాలను ప్రేమించాడు. తనని కూడా భీమిలిని ప్రేమించమని కోరాడు. కుదరదని అంది. లండన్ మహానగరంలో మహారాణిలా బతుకుతున్న తాను భీమిలిలో ఉండటం జైలులో ఉండటం వంటి శిక్ష అంటూ తనను అనరాని మాటలు అంది తర్వాత తన నుంచి శాశ్వతంగా దూరం అయిపోయింది
భీమిలిలో రిప్లయి కంపెనీలో ఉద్యోగం చేస్తూ తాను వంటరిగా మిగిలిపోయాడు. సెలీనా జ్ఞాపకాలు మనసంతా కమ్ముకున్న సమయంలో చేయవలసిన పనుల మీద దృష్టి కేంద్రీకరించి గుండెల్ని దిటవు చేసుకునే వాడు. తర్వాత వంటరి తనానికి అలవాటు పడిపోయాడు.
"రాత్రయిపోయింది. వెళ్లిపోండి దొరా.." పక్కనుంచి నడుచుకుని వెళుతున్న మత్స్యకారుడు ఎలెక్సుతో చెప్పాడు. అతను మాట్లాడిన తెలుగు ఎలెక్సుకు అర్ధం కాలేదు. కానీ తన గురించే మాట్లాడాడని అనుకున్నాడు. ఆలోచిస్తూ ఇంటి వైపు దారి తీసాడు. అతని ఆలోచనలు సెలీనా వైపే తిరుగుతున్నాయి.
నిరుద్యోగిగా ఉన్న ఎలెక్సు బంధువు డచ్చి గవర్నరు పరిచయస్తుడు కావడంతో డచ్చివారి పరిపాలనలో ఉన్న భీమిలిలో ఉన్న రిప్లయి కంపెనీలో అతనికి ఉద్యోగం వచ్చింది. పుట్టి పెరిగిన ఊరుని వదిలి భారతదేశంలో భీమిలి రావడానికి మొదట మనసు అంగీకరించలేదు. తల్లిదండ్రులు లేకపోవడం వల్ల బంధువులంతా ఒప్పించి భీమిలి వెళ్లడానికి ధైర్యం చెప్పారు.
ఆ విధంగా 1802లో ఎలెక్సు భీమిలి వచ్చి అక్కడ సముద్రంలో ఎగుమతి దిగుమతుల వ్యాపారం చేస్తున్న రిప్లయి కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. భీమిలి చాలా చిన్నపట్నం. మూడు వేల జనాభా ఉండేది. కానీ అతనికి ఎంతో అందంగా కనిపించింది. ఒక పక్క నర్సింహస్వామి కొండ, మరో పక్క గోస్తనీ నది, నీటితో నిండి నిండు కుండలా ఉన్న ఉప్పుటేరు, విశాలమైన సముద్రతీరం. తీరం వెంబడి ఎర్రమట్టిదిబ్బలు ఎలెక్సుకు ఎంతో సచ్చాయి.
పుట్టి పెరిగిన డెన్మార్కులో ఇటువంటి అందమైన వాతావరణం అతనికి ఎక్కడా కనిపించలేదు. అందువల్ల తాము ఉద్యోగం కోసం భీమిలి రావడం మంచి పనిచేసానని మనసుకు పదేపదే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అప్పటికే ఇంగ్లండుకు చెందిన సెలీనాతో పరిచయం తరుచూ ఆమెకు ఉత్తరాలు రాసేవారు. మన జీవితం అందంగా ఆనందంగా ఉండటానికి భీమిలి సరైన ప్రదేశమని ఆ ఉత్తరాల్లో రాసే వర్ణించేవాడు. ఉత్తరాల వల్ల వారిద్దరి మధ్య ప్రేమ మరింత చిగురించింది. క్రిస్టమస్ సెలవులకు వెళ్లినప్పుడు చర్చిలో ఆమెను వివాహం చేసుకున్నాడు. తర్వాత తనతో భీమిలి తీసుకుని వచ్చాడు.
సెలీనా పదిహేను రోజులు సముద్రంలో ప్రయాణం చేసి అలసిపోయిన తర్వాత ఎలిక్సు ఉంటున్న ఇంటికి వచ్చింది. లండన్ మహానగరంలో నివశించిన సెలీనాకు భీమిలి కుగ్రామంగా అనిపించింది.
వారం పది రోజులు ఆనందంగా ఉన్న తర్వాత తాను ఉంటున్న ప్రాంతంపై అసంతృప్తి వెల్లువెత్తింది. ఎలెక్సు రిప్లయి కంపెనీలో ఉద్యోగానికి వెళ్ళిపోతే తాను వంటరిగా ఉండేది. రోజంతా సమయం భారంగా గడిచేది. ఎలెక్సు సెలీనాను ఉప్పులేదు వద్దకు తీసుకుని వెళ్లి చిన్నపడవలో ఎక్కించి అంతా తిప్పాడు. ఎర్రమట్టి దిబ్బల్ని చూపించాడు. "ఏముంది ఇక్కడ.. నాకు జైల్లో ఉన్నట్లుగా ఉంది.."
ఓరోజు సెలీనా ఎలెక్సుతో చెప్పింది. "నేను ఆఫీసుకు వెళ్లినప్పుడు నీకు నచ్చిన పుస్తకాలు చదువుకో, సముద్రతీరంలో హాయిగా తిరుగు నీకు ఇష్టమని చెబుతావు కదా స్విమ్మింగ్ నేర్చుకో. ఇంకా కొత్త విషయాలు తెలుసుకో., నీవుండే లండన్ లో రణగొణధ్వనులు ఉండవు. మురికి వీధులుండవు. వాహనాల రద్దీ ఉండదు" అన్నాడు.
అతని మాటలకు సెలీనా బాధపడింది.
"ఎలెక్స్... నా మనసుతో భీమిలిని చూడండి. కొన్నాళ్ల నుంచి ఉద్యోగం చేస్తుండటం వల్ల ఈ వూరు నచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏముంది. మీ రిప్లయి కంపెనీ తప్పా మరొకటి. ఏమీ లేదు. ఉండటానికి సరైన ఇళ్లు కూడా కనిపించడం లేదు.. మీ డచ్చి వారు వారి సమావేశాలు వారి అలవాట్లు తప్ప ఇక్కడ ఏమున్నాయి?" అంది కాస్త కోపంగా,
"కడలి ఒడ్డున భీమిలి.. కళలు తరగని జాబిలి.." ఈ అర్ధం వచ్చే విధంగా ఎలెక్సు ఇంగ్లీషులో సామెతను చెప్పాడు. సెలీనాకు చిర్రెత్తుకుపోయింది. "భీమిలి అంటే నాకు బోర్ కొట్టింది. ఎలెక్సు అన్నా బోర్ కొట్టే పరిస్థితి తీసుకుని రావద్దు.. అంది సెలీనా.
సెలీనా చెప్పినట్టే ఆమెకు ఎలెక్స్ అంటే బోర్ కొట్టింది. అతను పొగిడే భీమిలి ఆమెకు నచ్చలేదు. "ఇక్కడ నేను ఉండలేను. ఉంటే నా మీద నాకు బోరు కొట్టి పిచ్చి ఎక్కుతుంది. అందుకు లండన్ వెళ్ళిపోతాను..." సెలీనా. కూల్ గా చెప్పింది.
ఎలెక్సు ఎంతో నచ్చజెప్పాడు. వద్దని బతిమిలాడాడు. కానీ సెలీనా వినలేదు. ఓడ ఎక్కి లండన్ వెళ్ళిపోయింది. ఇది జరిగి పదిహేను సంవత్సరాలు అయిపోయింది.
ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకున్నారు. ఆ తర్వాత కాలంలో అవి కూడా ఆగిపోయాయి.
జ్ఞాపకాల అట్టడుగు పొరల్లో నిక్షిప్తం అయిపోయిన సెలీనా తాను భీమిలి వస్తున్నానని ఉత్తరం రాసింది. సెలీనా తనను వదిలిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు ఒంటరిగా జీవించిన ఎలెక్సుకు ఆ ఉత్తరం ఎంతో ఆనందాన్ని కలిగించింది. మరో రెండు మూడేళ్లలో తాను పదవీ విరమణ చేసి డెన్మార్క్ వెళ్ళిపోవలసిన సమయంలో సెలీనా క్షమాపణలతో రాసిన ఉత్తరం అతడిని కదిలించింది.
"ఎలెక్స్ నీకు భీమిలి అంటే ఇంత ప్రేమ ఎందుకు?" లండన్ నుంచి భీమిలి వచ్చిన సెలీనా అలెక్సును అడిగిన మొదటి ప్రశ్నకు అతను ఏమీ సమాదానం చెప్పలేదు. చిన్నగా నవ్వాడు తర్వాత... "నువ్వు ఎంతో అందగత్తెవు. నీ అందాన్ని చూసి నేను ప్రేమించాను అందాన్ని చూసినప్పుడు ఆనందపడతాం. ఇష్టపడతాం. ఆ అందం మనతోనే ఉండాలని అనుకుంటాం. ముందు నీతో అలా అనుకున్నాను. తర్వాత ఈ భీమిలి వచ్చిన తర్వాత ఈ చిన్నపట్టణం నాకెంతో నచ్చింది. ఈ వాతావరణం.. ఈ గాలి. ఈ నీరు. వీటన్నింటిని అనుకోకుండా ప్రేమించాను. బహుశా నిన్ను ప్రేమించిన కన్నా కాస్త ఎక్కువ ప్రేమించానేమో, అందుకు నువ్వు వెళ్ళిపోయినా పదిహేనేళ్లగా ఇక్కడే ఉండిపోయాను." ఎలెక్సు నెమ్మదిగా చెప్పాడు. అతను అలా చెబుతున్నప్పుడు మాటలు తడబడ్డాయి.
సెలీనా అతని వద్దకు వచ్చి అతడిని దగ్గరకు తీసుకుంది. తర్వాత అంది.. "ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్న వ్యక్తి మరొకర్ని ఎవరయినా ఇష్టపడి వారితో కలిసి జీవిస్తారు.
కానీ నువ్వు అలా చేయలేదు. ఈ భీమిలి ప్రేమికుడిగా ఒంటరిగా ఉండిపోయావు, నీ వ్యక్తిత్వం నాకు ఎంతో నచ్చింది. ఇటువంటి మంచి వ్యక్తినా నేను వదిలిపెట్టి లండన్ వెళ్ళిపోయాను.. అని కొద్దికాలంగా బాధపడుతున్నాను. నేను దూరంగా ఉంటున్నా నీ విషయాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నాను. అందుకే లండన్ లో ఉండలేకపోయాను. మన జీవితంలో విలువైన పదిహేను సంవత్సరాలను వృథా చేసుకున్నాం. నా శేష జీవితమంతా నీతో ఇక్కడే ఉండిపోతాను." ఆమె ఒకొక్కమాట నెమ్మది నెమ్మదిగా చెప్పింది.
సెలీనా మాటల్ని విన్న ఎలెక్స్ కన్నీళ్లు కార్చాడు. "ఈ భీమిలిలో నా ఉద్యోగం మరో మూడు నాలుగేళ్లలో అయిపోతుంది. నేను ఎంతగానో ప్రేమించిన నువ్వు నాకు దూరమయ్యావు.
అందుకే నేను భీమిలికి కూడా దూరమైపోయి డెన్మార్కు వెళ్ళిపోదామని అనుకున్నాను....
కానీ అక్కడ నాకెవరూ లేరు. నా అన్నవాళ్లు అంతా చనిపోయారు. అక్కడికి వెళ్లినా ఒంటరిగానే ఉండాలి.. నాకు ఎవరూ లేరని ఎన్నో ఒంటరి రాత్రులు నాలో నేనే కుమిలిపోయాను..” ఎలక్స్ కారుస్తున్న కన్నీళ్లు ధారగా సెలీనా గౌనును తడిపేశాయి. ఆప్రయత్నంగా ఆమె కళ్లల్లో కూడా తడి చేరింది.
"ఎలెక్సు నువ్వు ప్రేమించిన ఈ భీమిలిని నేను కూడా ప్రేమిస్తాను. జీవితాంతం ఇక్కడే ఉందాం. ఈ ఉప్పులేదు... చిన్నచిన్న కెరటాలతో ప్రశాంతమైన ఈ సముద్రం.. దూరంగా నర్సింహస్వామి గుడి ఉన్న కొండ., ఎర్రమట్టి దిబ్బల్ని ప్రేమిస్తూ ఈ భీమిలిలోనే ఉండిపోదాం.. నీది డెన్మార్కు కాదు.. నాది లండనూ కాదు.. మనది భీమిలి.. అంతే..." సెలీనా చెప్పుకుని పోతోంది..
ఎలెక్సు ఆనందంగా వింటూ ఉండిపోయాడు.
No comments:
Post a Comment