Monday, March 31, 2025

 రామాశ్రయం


"అబ్బా, రేపు మళ్ళీ టూరు వెళ్ళాలా, నిన్ననేగా వచ్చారు మూడు రోజుల తర్వాత. మన అబ్బాయికి  పరీక్షలయి పోయాయి. రేపొస్తున్నాడు. అందరం కలసి భోంచేసి ఎన్నాళ్ళయిందో. ఈసారికి కొన్సిల్ చేసుకోండీ ."

"కుదరదోయ్! ఒక ఇంపార్టెంట్  పని  వుంది. వెళ్ళి తీరాలి. పాతికేళ్ళు గా యీ కంపెనీలో పనిచేస్తున్న నాపై నమ్మకంతో నాకు యీ పని అప్పగించారు. సరిగా చెయ్యకపోతే  నా పరువు పోతుంది!"

"మీ పరువు మాటేమో గాని మీ ఆరోగ్యం పాడవుతోంది. అయినా  యాభయ్యోపడిలో పడిన తర్వాత కూడా ఆ డొక్కు కారు లో  ఒక్కళ్ళూ అలా మైళ్ళ కొద్దీ రాత్రనక, పగలనక ఎలా తిరగ గలుగు తున్నారు?"

"నేనా? ఒంటరిగానా? లేదు. నాతో నా రాముడు  ఎప్పుడూ వుంటాడుగా."

"మీ రామభక్తి బాగానే వుంది కానీ మీ కేదైనా ఐతే ఆ రాముడు వచ్చి రక్షిస్తాడా ?"

"పిచ్చిదానా, నాకేం  కాకుండా చూడడానికే నా రాముడు  నాతో వుంటాడు - చెప్తావిను:

నేను ఇంటినుండి బయలు దేరగానే  ఆ రాముడే అయోధ్య నించి బయలు దేరినట్లు అనుకుంటా. తారు రోడ్లన్నీ అయోధ్య ప్రజలు నాకోసం పరిచిన వస్త్రాలు. గతుకుల రోడ్లన్నీ నా వనవాసపు దారులే. నా వెనక హారన్ కొట్టుకుంటూ వచ్చే వాళ్ళందరూ నన్ను ముందుకు వెళ్లొద్దని రోదనలు చేస్తున్న అయోధ్య పౌరులు. రోడ్డు కి ఇరువైపులా ఉన్న చెట్లు అయోధ్య వాసులు దుఃఖంతో తలలూపుతూ  నన్ను ఆగిపొమ్మని చేస్తున్న విన్నపాలు. రోడ్డు మధ్యలోని వీధి దీపాలు నా సైనికులు. వందనాలతో నాకు వీడ్కోలు చెప్తున్నారు. 

వూరి పొలిమేరలు దాటగానే వచ్చే రోడ్డు సైన్ బోర్డులన్నీ పై నించి దేవతలు నాకు  దారి చూపుతూ ఇస్తున్న సందేశాలు - ఏ వూరు ,ఎంత దూరం,ఏ వైపుకి మళ్లాలి,ఎంత వేగంతో వెళ్ళవచ్చు,దగ్గరలో తినడానికి ఏమైనా వున్నాయా  వగైరా వగైరా సమాచారం తో  ఎప్పుడూ  సిద్ధం గా వుంటారు. మధ్యలో టోల్ గేట్లు గుహుడి టైపు. నా కోసం చక్కటి రోడ్డు వేసి నన్ను క్షేమం గా పంపిస్తారు. నేను కూడా వారికి ఎంతో కొంత డబ్బిచ్చి వీడ్కోలు చెబుతాను. 

దారిలో నాకు ఆకలవుతుందేమోనని ఎన్ని హోటళ్ళు, ఎన్ని టీ-కాఫీ దుకాణాలు... నాకు అవన్నీ  రామునికి  వనవాసంలో ఆతిధ్యం ఇచ్చిన ఋషుల ఆశ్రమాలు గా కనిపిస్తాయి. వాళ్ళ అభిమానం ఆ రాముడు కూడా తట్టుకోలేడనుకో. ఆ రాముడికి ఒక్కతే  శబరి. పాపం కొన్ని పళ్ళు పెట్టుకుని ఎదురు చూసింది. నాకు ఎంతమంది శబరిలో. రోడ్డు పక్కనే రేగి పళ్ళు, వేరుశెనగ కాయలు, జామ పళ్ళు  మొదలైనవి పెట్టుకుని, కళ్ళలో వత్తులేసుకుని నా కోసం ఎదురు చూస్తుంటారు. ఎంతమందినని ఆదరించగలను ? 

మధ్య మధ్యలో యమధర్మరాజు కూడా నాకు హెల్ప్ చేస్తుంటాడు. స్పీడు లిమిట్ అని, ఎమర్జన్సీ నంబర్ అనీ చూపిస్తూ వుంటాడు. ఒక్కో సారి  దారిలో నా వానర మిత్రులు కూడా కనబడతారు. నన్ను చూసి ఆనందం తో కేరింతలు కొడతారు. నేను రాత్రికి కి బస చేసే చోటే పర్ణశాల. ఎంత బాగుంటుందో.

తెల్లవారితే అనేక మంది రాక్షసులతో యుద్ధం చేసిన లెవెల్లో నే ఆఫీసు పనులు చేయించాలి. కానీ ఇదంతా రాముడు యుద్ధ సమయం లో ఎంత సంయమనంతో వున్నాడో అలాగే చేస్తా. చివరికి జయం నాకేనని తెలుసు. మరి తిరుగు ప్రయాణం లో పుష్పక విమానం లో  లాగా ఆనందంగా వచ్చేస్తా. వెళ్ళేటప్పుడు భారంగా వీడ్కోలు చెప్పిన పూలమొక్కలు, చెట్లు  ఇప్పుడు తలలు ఊపుతూ   ఆనందం గా స్వాగతం చెప్తున్నట్లుగా ఉంటుంది." 
        
"మీ ఊహలు బానేవున్నాయి కానీ వాస్తవం వేరే కదా.ఎంత అందంగా ఊహించుకున్నా ఈ ఎండల్లో, ఒంటరిగా సరైన తిండీ తిప్పలు లేకుండా వెళ్ళాల్సిందే కదా"

"నేను చెప్పేదీ అదే. పని చేయక తప్పదు. ఏడ్చుకుంటూ చేస్తామా, హ్యాపీగా  చేస్తామా అన్నది మన చాయిస్. హ్యాపీ గా చేయాలంటే మన ఊహలకి రెక్కలు తొడగాలి. మనం రోజూ చూసే వస్తువులనీ , మనుషులనీ కొత్త గా చూడడం అలవాటు చేసుకోవాలి. అలా చేస్తే అలసట, విసుగు వుండవు. ఆనందం మనను విడిచి పోదు." 

"సర్లెండి. ఇక నుంచీ  నేను కూడా  మీ గురించి ఆలోచిస్తూ వర్రీ కాను. నన్ను  ఊర్మిళ లా ఊహించుకుని హాయిగా పడుకుని నిద్ర పోతా. మళ్ళీ మీరు తిరిగి వచ్చిన తర్వాతే లేస్తా." 



(నండూరి బాల సుబ్రహ్మణ్యం)

No comments:

Post a Comment