Monday, March 31, 2025

 సహాయం

     " రాజమ్మా... ఉన్నవా?..." పక్కింటి సుందరమ్మ మాట విని, " కనపడట్లేనానే..." కుమ్మరి సారె మీద కుండ తిప్పుతూ అన్నది రాజమ్మ.

     " ఎండాకాలం అయినా ఏమన్న బేరాలు రానట్టుంది కదా..." సుందరమ్మ కూర్చుంటూ అంది.

     " అందరూ ఫ్రిజ్జులు కొంటుండిరి... కుండలెవరు కొంటారే...పెళ్లిళ్లకు, సావులకు తప్ప...మా కాడ పెళ్లిళ్లకు కూడా కొనట్లె...మొగుడు సచ్చింది ఒకతాయే, మొగుడు వదిలేసింది ఒకతాయె...మా రాతలు ఆళ్ళ పిల్లలకు తగుల్తాయేమోనని భయం మరి..." విరక్తిగా అన్నది రాజమ్మ.

      " బాధ పడకే...రాజమ్మ. దేవుడు సుస్తానే ఉంటాడు...ఏదో ఒకటి చేస్తాడు లే..." సుందరమ్మ ఓదార్చింది.

      " నా గురించి నాకే బాధ లేదే...కోడలు, ముగ్గురు పిల్లల గురించే...అన్యాయంగా దాన్ని నా కొడుక్కి చేసుకొని దాని గొంతు కోస్తిని...కడుపు నిండా తిండి కూడా పెట్టలేక పోతున్న...వంట్ల పటుత్వం కూడా పోతుంది. దేవుడు  కూడా కండ్లు ముసుకుండే... కోట్లడిగిన్న... తిండి మందం ఎల్లినా సాలనే కదా..." కళ్ళు తుడుచుకుంది రాజమ్మ.

        " అమ్మా...కుండలు అమ్మే రాజమ్మ ఇల్లు ఇదేనా? " ఇంటి బయట మోటార్ సైకిల్ ఆపి అడిగాడు ఈశ్వర్.

     "అవునయ్య...ఏం గావాలి? " రాజమ్మ లేచి వచ్చి అడిగింది.

     " రెండు కుండలు కావాలమ్మా..." ఈశ్వర్ అంటుండగానే, " నానా...నాకు చిన్న కుండ కొనిస్తా అన్నావు..." ఈశ్వర్ కొడుకు, పదేళ్ళ సమీర్ అడిగాడు.

    " సరేలే...కొందాం..." దిగి కుండలు కొనుక్కొని వెళ్ళారు.

    " చిన్నోడిని ఏమన్న అన్నవా నాన...కుండల దగ్గర నుండి వచ్చిన దగ్గరి నుండి మాట, పలుకు లేకుండా కూర్చున్నాడు." తల్లి మాటలకి, " లేదమ్మా...నేనేం అనలేదే...ఏంటి కన్నమ్మ...ఏమైంది?" కొడుకు తలపై నిమురుతూ అనునయంగా అడిగాడు ఈశ్వర్. 

     " నాన...మనం వాళ్ళకు ఏమైనా హెల్ప్ చేద్దాం...పాపం ఆ నానమ్మ ఎంత పెద్దావిడ...కూర్చుని కుండలు చేస్తుంది...ఆ అక్కలు చిన్న పిల్లలు కదా నాన...పాపం మట్టి ఎలా తొక్కుతున్నారు చూసావా... అంత కష్టపడుతున్న...ఎంత వీక్ గా ఉన్నారో... ఏదైనా చేద్దాం నానా... ప్లీజ్ " తండ్రి గడ్డం పట్టుకొని బ్రతిమాలుతూ అన్నాడు సమీర్.

       " వాళ్ళు మనం ఊరికే డబ్బులు ఇస్తే తీసుకోరు నానా...మనం కుండలు కొన్నాంగా...అది హెల్ప్ చేసినట్టే..." నానమ్మ మాటలకు ఆమె వేపు నిరసనగా చూసి, మళ్లీ తండ్రితో " ప్లీజ్ నానా...నువ్వే కదా అంటావు...పక్కవాళ్ళకు హెల్ప్ చేయడం కూడా దేవుడికి పూజ చేయడమే అని..." అన్నాడు.

       ఈశ్వర్ కు అర్థమయింది...సమీర్  చిన్నప్పటి నుండి ఎవరైనా బాధ పడుతుంటే చూడలేడు...అచ్చం తన తాత గారి లాగానే...

       " నీ దగ్గర ఏమన్న ఐడియా ఉందా? చిట్టి సార్..." చిరునవ్వుతో అడిగాడు ఈశ్వర్. 

      " హా... నానా...మన కొత్త ఇంట్లో పూల కుండీలు కొనాలి అనుకుంటున్నాం కదా...ప్లాస్టిక్, సిరామిక్, సిమెంట్...అవన్నీ వద్దు నానా...ఆ నానమ్మ దగ్గర కుండీలు చేయించుకుందాం...అవయితే చేయడం కూడా ఈజీ కదా...అంతే కాదు నానా మనం ఎన్విరాన్మెంట్ కు కూడా మంచి చేసినట్టు కదా..." హుషారుగా చెబుతున్న కొడుకు ను దగ్గరికి తీసుకొని తలపై ముద్దు  ఈశ్వర్. 

     "వారసత్వం అంటే ఆస్తులు ఇవ్వడమే కాదమ్మా...ఇలాంటి మంచి బుద్దులు కూడా ఇవ్వడం...కదా అమ్మా..." అప్పటికే చనిపోయిన భర్త మాటలు మనవడి మాటల్లో వింటూ కళ్ళు తుడుచుకుంటూ ఉన్న తల్లి తో అన్నాడు ఈశ్వర్.

      " రాజమ్మ... ఏందీ కుండలు చేసుడు బంజేసి ఈ కుండీలు చేస్తున్నావు... చిన్నయి, పెద్దయి ఇన్ని చేసినవెందే...?!..." సుందరమ్మ ఊరినుండి వచ్చి చూసి  ఆశ్చర్యంగా అడిగింది.

       " దేవుడు కండ్లు తెరిచిండే...ఆ రోజు కుండలు కొన్న సారు 100 పూల కుండీలు చెయ్యమని డబ్బులు ఇచ్చిన్రు...ఇంకా వాళ్ళ దోస్తులకు కూడా చెప్తడంటా..." రాజమ్మ  పైకి చూసి దండం పెడుతూ అన్నది. 

       *  సాధ్యమైనంత వరకు పర్యావరణానికి మేలు చేసే వస్తువులు వాడదాం...అమ్మ ధరణి కి ఆయువు పెంచుదాం. *

No comments:

Post a Comment