క్రమ సంఖ్య 42
ది 25/03/2025
*వదిన–వేలం పాట*
రచన... జి.ఎస్. లక్ష్మి
సంఘ సేవంటే చెవికోసుకుంటుందామె. చాలా యాక్టివ్. తమ ఫ్లాట్స్‌లో సేవా సంఘానికి ఆమే అద్యక్షురాలు. అలా ఒకానొకరోజు వరద బాధితుల సహాయకార్యక్రమం చేపట్టింది ఆమె. అందరూ సేకరించి తెచ్చిన రకరకాల వస్తువులన్నింటినీ తమ ఫ్లాట్‌లోనే సెల్లార్‌లో డయాస్‌మీద వేలం వేసిందామె. అందరికంటే ఎక్కువ విలువైంది తన వంతుగా సహాయం చెయ్యడం ఆమెకు ఇష్టం. అందుకే ఆమె తన మెడలో మంగళసూత్రాలు తీసి వేలంపాటకు పెట్టింది?!! అప్పుడు.....
************************
‘‘ఎలక కన్నమంత ఇల్లు కట్టి అందులో ఏనుగుల్ని తెచ్చి కట్టెయ్యమంటే ఎలా?’’అన్నయ్య ఇంటిముందు డోర్ దగ్గర నిలబడి మర్యాదగా డోర్‌బెల్ కొట్టబోతున్న నాకు వదిన మాటలు కొంచెం గట్టిగానే వినిపించాయి.‘అమ్మో...! వాతావరణం వేడిగా ఉన్నట్లుందే!’ అనుకుంటూ ‘బెల్ కొట్టడమా, మానడమా’ అని ఆలోచిస్తున్న నాకు అన్నయ్య కంఠం అంతకన్నా గట్టిగా వినిపించింది.‘‘నువ్వేమైనా అనుకో, అది మటుకు నువ్వు ముట్టుకోడానికి వీల్లేదంతే...’’‘వదినని ఏది ముట్టుకోవద్దంటున్నాడు అన్నయ్య...?’ నాలో కుతూహలం పెరిగిపోయి బెల్ కొట్టాను. లోపల మాటలు ఆగిపోయాయి. వదిన వచ్చి తలుపు తీసింది. కళ్ళు తడితో, ముక్కు ఎర్రబడి ఉంటుందనుకున్న వదిన మొహం మామూలుగానే కనిపించింది. ‘అంటే, సమస్య అంత తీవ్రమైంది కాదా?’’ అనుకుంటూ ‘‘ఆలస్యమైందా వదినా నేను రావడం?’’ అంటూ లోపలికి అడుగుపెట్టాను.
నా చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ చూస్తూ, ‘‘ఏం తెచ్చావు?’’ అంది వదిన ఆసక్తిగా. ‘‘నా దగ్గర ఏముంటాయి వదినా! చిన్నవైపోయిన పిల్లలబట్టలు నాలుగుజతలూ, నావి రెండూ పోలియెస్టర్ చీరలునూ..’’ అన్నాను కాస్త సిగ్గుపడుతూ.వాళ్ళ ఫ్లాట్స్‌లోవాళ్లందరూ కలిసి పెట్టుకున్న సేవాసంఘానికి వదినే ప్రెసిడెంటు. ఫ్లాట్స్‌లోనూ, బయటా కూడా ఏ పనైనాసరే అందరినీ కలుపుకుని, చాలా బాగా ఆర్గనైజ్ చేస్తుంది వదిన. స్వార్థంలేకుండా, నిష్పక్షపాతంగా తన ఖాళీ సమయాన్నంతా ఈ సంఘం పనులకే వినియోగిస్తున్న వదిన ప్రయోజకత్వానికి అందరూకూడా చాలా మెచ్చుకుంటారు. అన్నయ్య ఈ అఖ్ఖర్లేని పనులు వదిన చేస్తున్నందుకు మధ్యమధ్యలో విసుక్కున్నా అందరూ వదినని మెచ్చుకోవడం చూశాక, తను కూడా ఏమీ అనడం మానేశాడు.
ఇప్పుడు కూడా వదిన వరదబాధితుల సహాయార్థం విరాళాలు వసూలు చేస్తోంది. అందుకోసం ఎవరికి ఏవి వీలుంటే అవి ఇమ్మని అడిగింది. కొంతమంది డబ్బూ, ఇంకొంతమంది బట్టలూ, మరికొంతమంది వండుకోడానికి సామానులూ.....ఇలా ఎవరికి తోచినవి వాళ్ళు ఇస్తున్నారు. నా వంతుగా నేను కూడా పిల్లలకి చిన్నవైపోయిన బట్టలూ, ఎంతకీ చిరగని రెండు పాలిస్టయర్ చీరలూ తీసుకు వచ్చాను. అందరూ ఇచ్చినవన్నీ చూసి వాళ్లందరికన్నా కాస్త ఎక్కువ ఉండేట్టే ఇస్తూ ఉంటుంది వదిన. అందుకే వదిన ఇలాంటివాటికి ఏమిస్తుందో, ఎంత ఇస్తుందో చివరిదాకా తెలీదు.
నేను తెచ్చిన బట్టలు చూస్తూ, ‘‘ఈసారి పద్ధతి మారుస్తున్నాం స్వర్ణా, ఎప్పుడూ అందరూ పాతబట్టలూ, సామాన్లు ఇస్తుంటే అవి వాళ్ళకి పనికిరాక, వాటిని ఏంచెయ్యాలో తెలియడంలేదు. అందుకే ఈసారి అందరూ తెచ్చిన వస్తువులనీ ఓపెన్‌గా వేలం వేసి, ఆ డబ్బు నిర్వాహకులకి అందజేస్తే వాళ్ళే బాధితుల అవసరాలకి ఏం కావాలో అవి కొనిస్తారన్న నిర్ణయానికి వచ్చాం సభ్యులందరం. కింద సెల్లార్‌లో ఆ ఏర్పాట్లు చేస్తున్నాం. నువ్వు తెచ్చినవి కూడా వేలంవేసి ఆ డబ్బు జమకడదాం’’ అంది వదిన.ఈ పాతబట్టలు వేలం వెయ్యడం చూసి అందరూ ఏమనుకుంటారోనని నాకు సిగ్గుగా అనిపించింది. ‘‘బాగుండదేమో వదినా’’ అన్నాను. మొహమాటంగా నేను తెచ్చిన బ్యాగ్‌కేసి చూస్తూ.
‘‘ఏమీ ఫరవాలేదు. పైకి గొప్పగా మాట్లాడేవాళ్లందరూ, కేవలం చిన్నవైపోయిన బట్టలేకాదు, ఏకంగా చిరిగినవే ఇస్తుంటారు. అలాంటివాళ్ళని బయట పెట్టడానికే మేం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. నువ్వింకా మంచివే తెచ్చావు. పద...పద వెడదాం టైమౌతోంది’’ అంది వదిన.‘‘అదిప్పుడేకదా వచ్చింది.. కాస్త మంచినీళ్ళు తాగి వస్తుందిలే, నువ్వెళ్ళు...’’ అన్నాడు అన్నయ్య వెనకనుంచి.‘‘సరే, త్వరగా వచ్చెయ్. ఇప్పటికే లేటైంది. నే వెడుతున్నా’’ అంటూ వదిన హడావిడిగా వెళ్ళిపోయింది. అవడానికి పెదనాన్న కొడుకైనా రాకపోకలు బాగా ఉండడంవల్ల మా ఇద్దరికీ చనువు ఎక్కువే. అందుకే అన్నయ్య నాతో ఏదో చెప్పడానికే నన్ను ఉండమన్నాడన్న విషయం నాకు అర్థమైపోయింది.
‘‘ఏంటన్నయ్యా?’’ అనడిగాను.‘‘ఎంతచెప్పినా అర్థం చేసుకోదేంటి చెల్లాయ్, మీ వదిన. మనింట్లో పెట్టుకుందుకు ఎలాగూ చోటులేదు కదా. అందుకని ఆ నరసరావుపేట పడక్కుర్చీ వేలం వేస్తానంటుందే! యాంటిక్ పీస్ కనక బోల్డు డబ్బుపెట్టి కొంటారూ, అని నన్ను తినేస్తోంది. చెల్లాయ్, నీకు తెలుసుకదా, తాతయ్య తీపి గుర్తుగా దానిని అట్టిపెట్టుకున్నాను. హాలంతా ఆక్రమించేసిందంటోందని, కాళ్ళు, చేతులూ జాపుకునే కర్రల్ని మడిచిపెట్టేశాను. అయినా మీ వదిన కళ్ళన్నీ దానిమీదే. కొత్తగా కొన్న ఈ ఇంట్లో అది పాతకాలం దానిలా కనిపిస్తోందిట. ఏమైనా బాగుందాచెప్పు...’’ ‘శ్రద్ధగా వింటున్నానుకదా అని తన గోడంతా వెళ్ళబోసుకున్నాడు పాపం అన్నయ్య’.
‘ఈ సంగతి నాకు తెలీనిదా? అసలు ఈ టూ బెడ్‌రూమ్ ఫ్లాట్ కొనుక్కుని, ఇందులోకి మారుతున్నప్పుడే ఈ విషయంమీద చాలా గొడవైంది మా అన్నయ్యకీ, వదినకీ. కొత్తింటిలోకి వెడుతున్నామని, చాలా పాతవస్తువులు మార్చేసి కొత్తవికొన్నది వదిన. వాటితోపాటు ఈ నరసరావుపేట పడక్కుర్చీ కూడా అయినకాడికి అమ్మేస్తానంది. కానీ అన్నయ్యకి మా తాతగారంటే చాలా యిష్టం. ఆయన తీపిగుర్తుగా దానిని వదలడానికి ససేమిరా ఇష్టపడలేదు. మొత్తానికి ఎలాగైతేనేం ఆ పాత పడక్కుర్చీ కొత్తింట్లోకి వచ్చింది. ఒక్క హాల్లో తప్పితే అదింక బెడ్‌రూముల్లో పట్టదు. అందుకే హాల్లోనే ఓవైపు ఒబ్బిడిగా దానిని పెట్టుకున్నాడు అన్నయ్య. దానివల్ల హాలు అందమంతా చెడిపోయిందని వదిన రోజూ దెప్పుతూనే ఉంటుంది. అన్నయ్య, నేనూ కూడా వాటికి అలవాటు పడిపోయాం. అంటే ఇప్పుడు ఆ వరద బాధితుల సహాయార్థం వదిన ఆ పడకుర్చీని వేలం వేస్తానంటోందన్న మాట’.
‘‘నువ్వొస్తూ వినేవుంటావు మీ వదిన మాటలు. తన తెలుగు ప్రావీణ్యాన్నంతా నా మీద ప్రయోగిస్తోంది. ఎలక్కన్నవంత ఇల్లుకొన్నానుట. ఏనుగులాంటి ఈ పడక్కుర్చీని ఆ ఇంట్లో కట్టైమన్నానుట. అలా మాటలనడంతోనే ఊరుకోకుండా ఇప్పుడు ఈ కుర్చీని వేలం వేస్తానంటోంది. వద్దని గట్టిగా చెప్పేశాననుకో. కానీ మీ వదిన్ని నమ్మలేం. కాస్త పక్కనే ఉండి ఏది వేలం వేస్తుందో ముందుగానే తెలుసుకుని నాకు చెప్తావు కదూ!’’అన్నయ్య ఆరాటం నా మనసుకు అర్థమైంది. ‘పాపం అన్నయ్యకీ, ఆ నరసరావుపేట పడక్కుర్చీకీ ఉన్న అనుబంధం ఏమిటో నాకు తెలియనిదా!’ అందుకే.... ‘‘నువ్వేం కంగారుపడకన్నయ్యా, వదినని నేను జాగ్రత్తగా కనిపెడుతూనే ఉంటాను. ఈ పడకుర్చీని కనక వదిన ఏమాత్రం వేలంవేసే ఉద్దేశ్యం కనబరచినా నీకు ముందుగానే ఉప్పందించేస్తాను. వెంటనే సెల్లార్‌కి వచ్చెయ్’’ అని అన్నయ్యకి హామీ ఇచ్చేశాను.
నేను కిందకి వెళ్ళేసరికి వదిన అందరి దగ్గరి వస్తువులూ ఆర్డర్‌లోపెట్టేసి, ఒక్కొక్కటీ వేలం వెయ్యడానికి సిద్ధం చేస్తోంది. ఆ సెల్లార్‌లోనే ఆ అపార్ట్‌మెంట్‌లో వాళ్లందరూ చిన్నచిన్న ఫంక్షన్స్ చేసుకుందుకు వీలుగా ఒక మూల చిన్న స్టేజ్‌లా కట్టుకున్నారు. ఆ స్టేజ్‌మీద వదిన వేలంవేసే వస్తువులన్నీ ఒక ఆర్డర్‌లో పెట్టింది. వదిన ఎంత పనిమంతురాలో. వదిన్ని చూస్తుంటే నిజంగా నాకు ఎంతో ముచ్చటేసింది. వేలం మొదలైంది. వస్తువునుబట్టి, దాని వాడకాన్నిబట్టి రేటు కడుతోంది వదిన. కట్టిన రేటుకన్న ఎక్కువగానే ఆ వస్తువుకి డబ్బు వస్తోంది. నేను వదినని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాను. అన్నయ్య అనుకున్నట్టు ఆ నరసరావుపేట పడక్కుర్చీని కనక వదిన వేలంవెయ్యిదల్చుకుంటే దానిని మూడో అంతస్తునుంచి దింపాలి. అందుకుగాను కనీసం ముగ్గురు మనుషులు కావాలి. వదిన ఎవరితో మాట్లాడుతోందో దగ్గరుండి చూస్తున్నాను. ఒక్కొక్కరూ వచ్చి, వాళ్ళు తెచ్చిన వస్తువులు చూపెడుతుంటే వదిన, ఇంకో ఇద్దరూ కలిసి వాటికి ధర కట్టి వేలం మొదలుపెడుతున్నారు. కొన్ని బాగా పాట అందుకుంటున్నాయి. మరికొన్ని మందంగా సాగుతున్నాయి. మొత్తమ్మీద వదిన ఆ వేలం వేసి వస్తువుల్ని అందరూ ఎక్కువ డబ్బిచ్చి పాడేలా చక్కగా వర్ణించి వర్ణించి మరీచెప్పి బాగా డబ్బు కూడేలా చేస్తోంది.
అన్నయ్యకి మాటిచ్చిన ప్రకారం నేను వదినకి దగ్గరగా చేరి చాలా జాగ్రత్తగా అన్నీ గమనిస్తున్నాను. పక్కనే ఉన్న నన్ను చూసి వదిన ‘‘మీ అన్నయ్యేరీ?’’ అంది. ‘‘పైనున్నాడు. పిలవనా?’’ అన్నాను. ‘‘ఊహు వద్దులే...’’ అంటూ మళ్ళీ తనపనిలో పడిపోయింది. నా మనసేదో కీడు శంకించింది. ‘చడీచప్పుడూ లేకుండా వదినగానీ అ పడక్కుర్చీనిగానీ తెప్పించేస్తోందా? పైన ఫ్లాట్‌లో అన్నయ్యకీ, ఆ కుర్చీతెచ్చే పనివాళ్లకీ ఘోరమైన యుద్ధం జరుగుతోందా? మనసులో ఆ ఆలోచన రాగానే అయ్యో...! నేనిప్పుడు ఏం చెయ్యను!’ అనుకుంటూ లిఫ్ట్‌వైపు పరుగెత్తాను.
అక్కడో పెద్దగుంపు. ఏమైందని అడిగితే మూడో అంతస్థులో లిఫ్ట్ స్ట్రక్ అప్ ఐపోయిందనీ, మెకానిక్ కోసం ఫోన్ చేశారనీ తెలిసింది. అయ్యో దేవుడా...!: అనుకున్నంతా అయింది. అన్నయ్యని పక్కకి తోసేసి బలవంతంగా ఆ పడక్కుర్చీని లిఫ్ట్‌లో పెడదామనుకున్నారో! ఏమో! ఆ పనివాళ్ళు. గబగబా మెట్లెక్కి ఆయాసపడుతూ మూడో అంతస్తు దగ్గరికి వెళ్ళేసరికి లిఫ్ట్ దగ్గర ఇద్దరు మెకానిక్‌లు తంటాలు పడుతూకనపడ్డారు. ఎదురుగా ఉన్న అన్నయ్య ఫ్లాట్ తాళం వేసుంది.ఏం జరుగుతోందో అర్థంకాక మెట్లమీంచి గెంతు తున్నట్టే దిగి మళ్ళీ సెల్లార్‌వైపు వచ్చాను. అక్కడ వదిన స్టేజ్‌మధ్యలో నిలబడుంది. అప్పటికే తెచ్చిన వస్తువులు వేలంవెయ్యడం ఐపోయినట్టుంది, స్టేజ్ ఖాళీగా ఉంది. మధ్యలో నిలబడిన వదిన చెయ్యొత్తి, తన చేతిలోవున్న వస్తువును అక్కడ కూర్చున్న అందరికీ కనిపించేలాగ ఒక మూలనుంచి, ఇంకోమూలకి చేతిని తిప్పి చూపిస్తోంది. ఆ చేతిలో తళతళా మెరుస్తున్న బంగారుగొలుసూ, దానికిమధ్యలో మిలమిలమాడుతున్న రెండు మంగళసూత్రాలూ కనపడ్డాయి. నాగుండె ఝల్లుమంది.
‘వదిన తన మంగళసూత్రాన్నిగానీ వేలం వేస్తోందా?’ అనుకుంటుండగానే ఖంగున వదిన గొంతు వినిపించింది.‘‘సభ్యులారా, మన తోటివాళ్ళు వరదల్లో సర్వం కోల్పోయి, ఉండడానికి గూడులేక, తినడానికి తిండికూడా లేకుండా బాధపడుతుంటే మనకెందుకీ అలంకారాలు! వారికోసం నా హృదయం ద్రవించిపోయింది. నేనేం చేయగలను వారికోసం? అంటూ నా మనసు ఉద్విగ్నతకు లోనైంది. అందుకే ఆడదానికి అతిపవిత్రమైన ఈ మంగళసూత్రాన్ని వేలంవేసి వచ్చినడబ్బు ఆ శరణార్థులకు అందించాలని నిర్ణయించుకున్నాను. ఈ గొలుసు నాలుగు కాసులుంటుంది. సూత్రాలు రెండుకాసులు, మొత్తం ఆరుకాసులు. దీనిని వేలంవేస్తూ దేవునిపాటగా దీని విలువ ముప్ఫైవేలు పెడుతున్నాను. అందరూ ఉత్సాహంగా ఈ పాటలో పాల్గొని, ఎక్కువ డబ్బు ఆ శరణార్థులకు అందేలా చేస్తారనీ ఆశిస్తున్నాను...’’ అంది.
నాకు గుండె జారిపోయింది. ఈ రోజుల్లో ఇంచుమించు రెండులక్షలు ఖరీదుచేసే సూత్రాలూ, గొలుసూ ముప్ఫైవేలకా...! అసలు ముత్తైదువులు పొరపాటున కూడా సూత్రాలు మెళ్ళోంచి తీయరే! అలాంటిది అలా మెళ్ళోంచి మంగళసూత్రాలు తీసి ఇచ్చేయాలనే ఆలోచన వదినకి ఎందుకు వచ్చిందీ? ఎలా వచ్చిందీ? ఈ సంగతి అన్నయ్యకి వెంటనే చెప్పాలి. యేడీ? అన్నయ్యేడీ? పైన కూడా లేడే...! అనుకుంటూ కాస్త పక్కకెళ్ళి నా మొబైల్ నుంచి అన్నయ్యకి కాల్ చేశాను. రింగ్ అవుతోందిగానీ అన్నయ్య ఫోన్ తియ్యటం లేదు. మళ్ళీ గబగబా వేలం జరుగుతున్నవైపు వచ్చాను.అక్కడ వదిన గొంతు ఆవేశంగా వినపడుతోంది. ‘‘ముప్ఫైరెండువేలు... ఒకటోసారి. ముప్ఫై రెండు వేలు... రెండోసారి’’.నాకు గాభరా వచ్చేసింది. ‘రెండులక్షలు ఖరీదు చేసే సూత్రాలూ, గొలుసు... ముప్ఫైరెండు వేలా! ఆ కాలంలో కనక పెట్టారుగానీ ఈ కాలంలో కొనగలమా? నాకు వదినమీద కోపంలాంటిది వచ్చేస్తోంది... ఈ అన్నయ్య యేడీ...? పలకడేం...?’వదిన గొంతు మళ్ళీ ఖంగుమంది.
‘‘సభ్యులారా, రెండు లక్షలు ఖరీదు చేసే గొలుసు. అసలు సిసలైన మేలిమి బంగారాం. అలా మాట్లాడకుండా ఉన్నారేం.... మళ్ళీమళ్ళీ మీకిలాంటి అవకాశం రాదు. కనీసం లక్షా యాభైవేలైనా వస్తుందనుకున్నాను. స్పందించండి.... మంచి అవకాశం పోగొట్టుకోకండి’’.సభ్యులంతా స్థాణువుల్లా నిలబడి ఉన్నారు. ఒక్కరి నోటివెంటా మాటలేదు. ‘ఓహోఁ మంగళసూత్రం వేలం వెయ్యడాన్ని పాపంవాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారేమో’ అనుకుంటుంటే ఓ ఇరవై ఏళ్ళకుర్రాడు ముందుకొచ్చి, ‘‘త్వరగా పాట చెప్పండి మేడమ్. ఆలస్యమైపోతోంది’’ అన్నాడు.మా వదిన ఇంక తప్పదన్నట్టు,
‘‘ముప్ఫై రెండువేలు మూడోసారి... ఈ పాట పాడినవారు కౌంటర్ దగ్గరకొచ్చి డబ్బుకట్టి ఈ గొలుసు తీసుకువెళ్ళొచ్చు...’’ అని వేలంపాట ముగించింది. ఆ కుర్రాడు కౌంటర్‌వైపు నడుస్తున్నాడు డబ్బు కట్టడానికి. వదిన తోటిసభ్యులతో కలిసి ఎంత డబ్బు వచ్చిందో లెక్కలు చూసుకుంటోంది.ఆ కుర్రాడెవరో తెలుసుకోవాలని వెనకాలే వెళ్ళాను. అతను ఓ మూలనున్న కౌంటర్ దగ్గరికి రాగానే ఆ పక్కనున్న గోడపక్కనుంచి అన్నయ్యవచ్చి ఆ కుర్రాడిచేతిలో డబ్బు పెడుతూ ఉండడంచూసి అవాక్కయ్యాను. ‘‘ఇదేంటి అన్నయ్యా! నువ్వు పురమాయించావా ఈ కుర్రాణ్ణి...!’’ అన్నాను.
‘‘మరేం చెయ్యమంటావే..! మీ వదిన వేలానికి ఏం పెడుతుందో తెలీదు. కానీ ఏదిపెట్టినా అందరికన్నా గొప్పగా ఉండాలని చాలావిలువైంది పెడుతుందని మటుకు తెలుసు. అందుకే ఈ మధ్యనే ఈ ప్లాట్స్‌లో అద్దెకొచ్చిన ఈ అబ్బాయిని పట్టుకుని ‘బాబ్బాబూ, మా ఆవిడ ఏది వేలంవేసినా నువ్వేపాడు. చెప్పినధరకన్నా ఒకట్రెండువేలకన్న ఎక్కువపెట్టకు, ఆ డబ్బులు నేనిచ్చి ఆ వస్తువు నేనే తీసుకుంటాను, అని బతిమాలాను. నయం ముప్ఫై రెండువేలతో వదిలింది’’ అన్నాడు ఆయాసపడుతూ.‘‘నయం. మంచిపని చేశావ్. లేకపోతే మిగిలిన ప్లాట్స్‌లోవాళ్ళు ఇంకా యెక్కువ డబ్బిచ్చి పాడేసుకుందురు’’ అన్నాను హమ్మయ్య అనుకుంటూ.‘‘అంత చవగ్గా వస్తుంటే ఎందుకు పాడరూ! నేనే ముందుగా వాళ్లందరినీ మా ఆవిడ ఏది వేలంవేసినా నేనే కొనుక్కుంటాననీ, దయవుంచి వాళ్లని పాటలో కల్పించుకోవద్దనీ బతిమాలుకున్నాను. ఏదో నా పుణ్యం బాగుండి అందరూ విన్నారు’’ అన్నాడు అక్కడే ఉన్న కుర్చీలో చతికిలపడుతూ.ఇంతలో వదిన అక్కడికి రానే వచ్చింది.
ఇంత మొహం చేసుకుని ‘‘చాలా కలక్టైందండీ. రేపు ప్రెస్‌ని పిలిచి, వాళ్ళెదురుకుండా గవర్నమెంటుకి చెక్కు ఇచ్చేస్తాను’’ అంది. నాకేం చెప్పాలో తెలీలేదు. ‘సంఘసేవంటే వదిన మొహం ఎంత కళకళలాడిపోతుందో!’ అనుకున్నాను.అన్నయ్య నెమ్మదిగా తన గుప్పెటలోంచి మంగళసూత్రాలుతీసి వదిన కళ్ళముందుంచాడు. తెల్లబోయింది వదిన. తెలివైంది. వెంటనే కనిపెట్టేసింది. ‘‘అంటే ఆ అబ్బాయిని మీరు పంపించారా?’’ అనడిగింది. నవ్వాడు అన్నయ్య. పెద్దతుఫాను వస్తుందనుకున్న నాకు సమస్య అలా దూదిపింజెలా విడిపోయి అలా వాళ్ళిద్దరూ నవ్వుతుంటే హమ్మయ్య అనిపించింది. ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారూ అనుకుంటూ, ‘‘ఇంక నే ఇంటికెడతాను వదినా. పిల్లలు వచ్చే టైమైంది’’ అన్నాను.‘‘ఆగాగు. పైకొచ్చి నేను మీ వదిన మెళ్ళో ఈ మంగళసూత్రం వేసే ఆ శుభక్షణాలు చూసి వెళ్ళు’’ అన్నాడు అన్నయ్య చిన్నగా నవ్వుతూ.‘‘మీరలా పిలిస్తే ఆడబడుచు లాంఛనాలూ అడుగుతుందేమో మీ గడుసు చెల్లెలు...’’ అంది వదిన.‘‘ఎంతైనా నీలాగ మంగళసూత్రం వేలంవేసేంత గడుసుదనం లేదులా వదినా!’’ అన్నాను నేను కూడా నవ్వుతూ......
.**********************
😎😎😎😎😎😎
No comments:
Post a Comment