Monday, March 31, 2025

 *మెక్కూమెక్కూ... ముక్కామెక్కూ...* (బాలల సరదా జానపద కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
    ఒకూరిలో ఒకడున్నాడు. వాడేమో రోజూ కూర (మాంసం) తీస్కోనొచ్చి వంట బాగా అదిరిపోయేలా చేయమని పెండ్లానికిచ్చి పొలానికి పోయేటోడు. ఆమె చానా టక్కరిది. మొగుడట్లా బైటికి పోవడం ఆలస్యం గబగబా రొట్టె చేసుకోని
మెత్త మెత్తని ముక్కలన్నీ ఏరి బాగా కూర చేసుకోని నున్నగా తినేసేది. మొగుడు వచ్చే సమయానికి మిగిలిన ఒట్టి ఎముకలు వేసి చారు చేసి వానికి పెట్టేది.
వాడు చారూ, ఎముకలు చూసి “ఇదేందే... దీంట్లో ఒక్క ముక్క కూడా లేదు" అనడిగితే "ఏమో నాకేం తెల్సు... నువ్వెట్లాంటిది తెస్తే అట్లాంటిది చేసి పెడతా వున్నా. ముక్కల్లేకపోతే పోయి... నీకు కూరమ్మేటోన్ని అడుగుపో" అని గట్టిగా కొట్లాడేది. పాపం వాడు ఆమె నోటికి బెదపడి గమ్మున నోరు మూసుకోని మట్టసంగా పెట్టినేది తినేటోడు. అట్లా ఆమె ముక్కలన్నీ తినుకుంటా తినుకుంటా రోజు రోజుకీ దుబ్బగయిపోతా వుంటే పాపం వాడేమో రోజు రోజుకీ సన్నగా బక్కచిక్కి పోతా వున్నాడు.
ఒకరోజు వాడు చెల్లెలిని చూసొద్దామని వాళ్ళూరికి పోయినాడు. ఆమె అన్నను చూసి "ఏందన్నా... ఇంతకుముందు పోట్లగిత్తలా ఎట్లా వుండేటోనివి. ఇప్పుడేమి ఇట్లా ఎండుపుల్లలెక్క బాగా చిక్కిపోయినావు" అనడిగింది. దాంతో వాడు జరిగిందంతా చెప్పినాడు.
ఆమె “అట్లనా" అని మూడు లక్కబొమ్మలు తెచ్చిచ్చి “అనా... అనా... ఇవి అలాంటిలాంటి మామూలు  లక్కబొమ్మలు కాదు. మంత్రించిన లక్కబొమ్మలు. వీటిని తీస్కోనిపోయి నీ పెండ్లానికి తెలీకుండా ఒకటి నీ గుమ్మం కింద తవ్వి పెట్టు. మరొకటి గూట్లో దాచిపెట్టు. ఇంకొకటి గవాక్షిపైన పెట్టు" అని చెప్పింది.
సరేనని వాడు ఆ మూడు లక్కబొమ్మలూ తీస్కోనిపోయి పెండ్లాం నీళ్ళకు పోయినప్పుడు ఒకటి గుమ్మంకింద, మరొకటి గూట్లో, ఇంకొకటి గవాక్షిలో కనబడకుండా పెట్టేసి ఏమీ తెలీనోనిలెక్క మట్టసంగా వున్నాడు.
తరువాత రోజు పొద్దున్నే వాడు ఎప్పటిలాగానే కూర తీస్కోనొచ్చి పెండ్లానికిచ్చి పొలానికి పోయినాడు. మొగుడట్లా పోయినాడో లేదో... వెంటనే ఆమె మెత్త మెత్తని ముక్కలన్నీ ఏరి పొయ్యి మీదికి కూరగిన్నె ఎక్కిచ్చింది. కూర చేసినాక రొట్టెలు కాల్చుకుందామని పిండి తీసి వేన్నీళ్ళు కలిపి కొడతా వుంటే గుమ్మం కిందున్న బొమ్మ
"కొట్టూ... కొట్టూ... రొట్టే కొట్టూ 
ఒక్కదానికే బాగా కొట్టు" అనరిచింది. "ఎవరబ్బా అట్లా అంటా వున్నారని" ఆమె అదిరిపడి చుట్టూ చూస్తే ఎవరూ కనబడలేదు. దాంతో "ఏందోలే" అనుకోని రొట్టెలు చేసుకోని, పళ్ళెంలో కూరేసుకోని తిందామని నోట్లో పెట్టుకోబోయింది.
వెంటనే గూట్లో వున్న బొమ్మ “పెట్టూ  పెట్టూ నోట్లో పెట్టు....
ఒక్కడానివే దంచీ కొట్టు..." అనరిచింది.
అంతే ఆమె “ఎవరబ్బా అట్లా అంటావున్నారని" బిరబిరా బైటికి పోయి అంతా వెదికింది. కానీ ఎక్కడా ఎవరూ కనబళ్ళేదు.
దాంతో “ఏందోలే" అనుకోని రొట్టెలోకి కూరద్దుకోని తినసాగింది. వెంటనే గవాక్షిలోని బొమ్మ 
“మెక్కూ మెక్కూ ముక్కా మెక్కూ ....
మొగునికి పెట్టక బాగా మెక్కూ..." అని ఆగకుండా అరవసాగింది.
దాంతో ఆమె "నేను కూర తింటావున్నది ఎవరో చూస్తా వున్నట్టున్నారు” అని భయపడి ఆరోజు నుండీ ఏమీ తినకుండా చేసినవి చేసినట్టు మట్టసంగా మొగునికి కూడా సమానంగా పెట్టడం మొదలు పెట్టింది.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.

No comments:

Post a Comment