Monday, March 31, 2025

 *విశిష్ట చారిత్రక తెలుగు మహిళలు - 28-2*

*స్త్రీవాద సంచలనం - ఓల్గా*

దళిత స్త్రీ సమస్యను చిత్రించిన *ఆకాశంలో సగం* దళిత మహిళ పై
ప్రపంచీకరణ, నగరీకరణ ప్రభావం, సారా వ్యతిరేక పోరాటం చిత్రించినా ఇంకా *మానవి, కన్నీటి కెరటాల వెన్నెల*, నవలలు రాసారు. 

ఓల్గా కథల్లోనూ స్త్రీ సమస్యలే ఇతి వృత్తాలు, స్త్రీల దేహం చుట్టూ అల్లుకున్న పురుషాధిపత్య స్వభావాన్ని చిత్రించిన కథా సంపుటికి ఈమె *రాజకీయ కథలు*' అని పేరు పెట్టారు. *స్త్రీల విషయాలు* సాంఘిక దురాచారాలుగా మాత్రమే గుర్తించాల్సినంత చిన్న విషయాలు కావనీ, ఈ దోపిడీ సమాజపు మూలాలు స్త్రీల అణచివేతలో పాతుకుని ఉన్నాయని అంటారామె. 

మత సామరస్యం, మానవ విలువల గురించి చెప్పిన కథా సంపుటి *మృణ్మయనాదం. సీత, శూర్పణఖ, అహల్య, రేణుక, ఊర్మిళ* అనే ఐదు పౌరాణిక స్త్రీ పాత్రలను విశ్లేషించిన కథలు *విముక్తి కథలు*' పేరుతో వెలువడ్డాయి. 

చలం సాహిత్యంలోని ఆరు స్త్రీ పాత్రలలో *వాళ్లు ఆరుగురు*' అనే నాటకం, *చరిత్ర స్వరాలు*' పేరుతో వివిధ ఉద్యమాల్లోని ఆరుగురు మహిళా నాయకుల పాత్రలతో నాటకం రాసారు.

ఈమె *ప్రయోగం*' కథలు స్త్రీల ఆకాంక్షల్ని ప్రతి ఫలించేలా లేవనే విమర్శ ఉంది. స్త్రీ, పురుష స్నేహ బంధం పెళ్లితో అంతమవుతుందని, పెళ్లి చేసుకోకుండానే సహ జీవనం సాగిస్తూ ప్రేమ తేలిపోగానే వీడిపోవాలని సూత్రీకరించే *ప్రయోగం*' కథలు వివాహ వ్యవస్థను తిరస్కరించాయని ప్రగతి మార్గాన పయనిస్తున్న మహిళలకు చేదోడు వాదోడుగా నిలిచి శాస్త్రీయంగా ముందుకు నడిపించే దృక్కోణం ఈ కథల్లో లేదని మార్క్సిస్టు విమర్శకురాలు డా॥ నళిని విమర్శించారు. 

ఈమె రాజకీయ కథల్లో కూడా పురుషాధి పత్యాన్ని విమర్శించడమే తప్ప స్త్రీ విముక్తికి సందేశాన్ని వినిపించలేదనే విమర్శ కూడా ఉంది.

ఓల్గా సంపాదకత్వంలో ' *నీలి మేఘాలు*' *స్త్రీవాద కవితా సంపుటి*, *మాకు గోడల్లేవు*, *నూరేళ్ల చలం, నవలా మాలతీయం* పుస్తకాలు వెలువడ్డాయి. ఈమె రచనలు ఇంగ్లీషు, హిందీ, మరాటీ, కన్నడ భాషల్లోకి అనువదింపబడ్డాయి.

ఓల్గా కొన్ని చిత్రాలకు సంభాషణలు రాసారు. గాంధీ చిత్రం తెలుగు అనువాదం తోబాటు తోడు, పాత నగరంలో పసివాడు, గులాబీలు, అమూల్యం చిత్రాలకు, ఆడ పిల్లలం, సారీ, నసీమా మొదలైన లఘు చిత్రాలకు, వెలుగు-నీడలు, జంగు-జతిన్ మొదలైన టి.వి ధారా వాహికలకు రచన చేసారు. 

తన స్త్రీవాద భావ జాలం ప్రతిబింబించే *యుద్ధం-శాంతి, లక్ష్మణ రేఖ, ద్రౌపది కూచిపూడి నృత్య రూపకాలకు* రచన చేసారు.

ఈమె స్వేచ్ఛ, ఆకాశంలో సగం నవలలు పురస్కారాలు పొందాయి. ఉత్తమ కథా రచయితగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం అవార్డు, వాసిరెడ్డి సీతాదేవి పురస్కారం, సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం, అభ్యుదయ రచయితల సంఘం వారి పురస్కారం మొదలయినవి ఈమెను వరించాయి.

ఓల్గా 1995లో బీజింగ్ జరిగిన ప్రపంచ మహిళా సదస్సులో పాల్గొన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని న్యూజెర్సీ లో మానవ హక్కుల సదస్సుకు హాజరయ్యారు. ఇంకా ధాయ్లాండ్, బంగ్లాదేశ్, చైనాల్లోనూ రచయిత్రిగా పర్యటించారు. 

వివాహ వ్యవస్థపై నమ్మకం లేని ఈమె వివాహాన్ని ఛేదించుకుని, లఘు చిత్రాల నిర్మాత దర్శకుడు అక్కినేని కుటుంబరావుతో సహజీవనం సాగిస్తున్నారు. వీరు *అస్మిత*' అనే సంస్థలో సభ్యులు.

*ఓం నమో శ్రీవేంకటేశాయ!!*
(సమాప్తం)

No comments:

Post a Comment