Monday, March 31, 2025

 *చరణదాసి*
*దేశరాజు*

కోటానుకోట్లు వెనకేసిన పెద్దాయనకు చివరి క్షణాలు దగ్గరపడ్డాయి. అప్పుడే ఆయనలో దుర్లక్షణాలు కూడా ప్రవేశించాయి. వెంటనే వైఫ్‌కి నైస్‌గా సైగ చేశాడు. ఆమె దగ్గరకు వచ్చింది.

‘‘నేను ఎంతో కష్టపడి ఇదంతా సంపాదించా. కాబట్టి ఇదంతా నాకే కావాలి. నాతో తీసుకుపోతా. ఆ ఏర్పాట్లు చూస్తానని మాటివ్వు’’ అని ఆదేశించాడు.

 ఆమె అతడి చేతిలో చేయి వేస్తూ ‘‘ఎలాగండీ?’’ అనబోయింది. ఇంతలో ఆయన వెళ్లిపోయాడు.

పెద్దాయన కోరిక గురించి బంధువులందరిలో పాకిపోయింది. ఎలాగైనా ఆ సొమ్ము కొట్టేయాలని వారిలో కొందరు ఎత్తులు వేయడం ప్రారంభించారు.

పెద్దాయన భౌతికకాయాన్ని బాక్సులో పెట్టాక, అందరినీ గదిలోంచి బయటకు వెళ్లమని ఆ బాక్సులో ఆమె ఏదో పెట్టింది. తరువాత ఆ బాక్కుకి తాళం వేసి, తీసుకుపొమ్మని చెప్పింది.

ఆ పెట్టెను స్మశానంలో పాటిపెట్టి, చేయాల్సిన కార్యక్రమాలు చేసి అందరూ ఇంటికి వచ్చేశారు.

చీకటి పడింది. అర్థరాత్రి అయ్యాక అందరూ నిద్రపోతుండగా కొందరు బంధువులు నెమ్మదిగా లేచి, స్మశానం వైపు ప్రయాణం సాగించారు. మట్టి ఇంకా పచ్చిగానే వుండటంతో, సులువుగానే సమాధిని తవ్వి మృతదేహం వున్న బాక్సును బయటకు తీశారు. ఆతృతగా తాళం బద్ధలు కొట్టి, తెరిచి చూస్తే ఎక్కడా ఒక్క రూపాయి కూడా కనిపించలేదు. అసహనంగా వెతుకుతుంటే ఓ పుస్తకం కనిపించింది. వణుకుతున్న చేతులతో దాన్ని తెరిచి చూశారు.

అదొక చెక్ బుక్. దానితోపాటు ఉత్తరం కూడా వుంది.

అందులో ఇలా రాసి వుంది.

‘‘మీరు సంపాదించినదేమైనా లక్షో, రెండు లక్షలోనా? కోట్లాది రూపాయలాయె. అంత డబ్బు ఈ పెట్టెలో పట్టదనే ఇంగితం మీకు లేకపోయింది. కాస్తోకూస్తో పట్టినా, మట్టీ మశానం పడి నోట్లన్నీ పాడైపోతాయనే తెలివి కూడా మీకు ఏడ్చింది కాదు. నేను చెప్పేలోపే.. పుటుక్కుమన్నారు. మీకు అన్నిటికీ హడావిడే. అయినా, నేనెప్పుడు మీ మాట కాదన్నాను కనుక. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నా. ఈ చెక్ బుక్‌లోని చెక్కులన్నిటిపైనా మీ పేరు రాసి, సంతకాలు చేశా. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంతకావాలంటే అంత డ్రా చేసుకుని దర్జాగా ఖర్చు చేసుకోండి. మీకెప్పుడూ, ఏ లోటూ రాకూడదన్నదే నా కోరిక. ఇట్లు మీ చరణదాసి’’ అని వుంది. 

దాంతో ఆ బంధువులు అవాక్కయ్యారు.
*
(హాస్యానందం నిర్వహించిన ఉగాది కథలపోటీలో బహుమతి పొందిన కథ)

No comments:

Post a Comment