🌹🌹బంధం 🌹🌹
భార్యాభర్తల బంధం విచిత్రంగా ఉంటుంది...కొన్నిసార్లు విమర్శించుకుంటారు, కొన్నిసార్లు త్యాగాలు చేస్తారు, కొన్నిసార్లు పట్టించుకోనట్టు ఉంటారు, కొన్నిసార్లు ఒకరు లేనిదే ఇంకొకరు బతకలేమన్నట్టుగా ఉంటారు..
ప్రేమ,కోపం, సాధింపు, సహనం, చిరాకు, నిందించటం, స్నేహం, పగప్రతీకారం..అన్నీ కలగలిపిన విచిత్రబంధం అనే మాటకి ప్రాణం పోస్తే కనబడే రూపం ఒక జంట...
స్మిత, సుధీర్ లు మూడేళ్ళు ప్రేమలో ఉండి..పెళ్ళి చేసుకున్నారు..పెళ్ళికి ముందు సుధీర్ కుదురైన స్వభావం అంటే స్మితకు ఇష్టం..సుధీర్ భుజాలపైన తల వాల్చితే స్మితకు స్థిమితంగా, భద్రతగా అనిపించేది..ఇప్పుడు వారి పెళ్ళి అయ్యి రెండేళ్ళు...
ఇప్పుడు స్మితకు అసహనంగా అనిపిస్తోంది..కారణం..సుధీర్ లో ఇదివరకు లా తనకు నచ్చే లా ఉండటం అనేది తగ్గిపోయింది..ఎంతసేపు అతని పనులు అతను చూసుకోవటమే తప్ప..స్మిత గురించి ఆలోచించట్లేదు అని స్మిత కోపానికి కారణం..సరదాగా ఉండట్లేదు, ప్రేమగా దగ్గరకు తియ్యట్లేదు..ఒక చిన్నపిల్ల చాక్లేట్ కోసం ఆశపడి ఎదుచూసినట్లుగా..సుధీర్ నుంచీ కొన్ని మధురక్షణాల కోసం ఆశపడి ఎదురుచూసే స్మితకు ఆశాభంగం అవుతోంది ...
ఇక లాభం లేదు, నా వల్ల కాదు అనుకుని..ఆ రోజు అన్నాలు తినేవేళ సుధీర్ కి చెప్పేసింది స్మిత..నాకు విడాకులు కావాలి అని..వెంటనే సుధీర్ ఆశ్చర్యంగా, ఊహించని దెబ్బ తాకినట్టుగా బాధగా చూస్తూ అడిగాడు..ఎందుకు, ఏమయ్యిందీ..అని..అన్నిటికీ కారణాలు చెప్పలేము సుధీర్ అంది స్మిత..
ఆ రాత్రి అంతా సుధీర్ ఆలోచిస్తూ ఉన్నాడు..నిద్రపోలేదు, అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు...స్మితకు ఇంకా ఆశ చచ్చిపోయింది...
తను ఇంతలా ఇబ్బంది పడేబదులు నన్ను సముదాయించి అడగచ్చుగా స్మితా ఏమిటీ విషయం అని...ఒక్క మాట కూడా నన్ను అడగడు ఎందుకు.. అని ఇంకా బాధవేసింది స్మితకి..
తెల్లవారేవేళ స్మితను అడిగాడు సుధీర్..నీ మనసు, విడాకుల నిర్ణయం.. మారాలంటే నేను ఎలా మారాలి చెప్పు అని...స్మిత మనసులో అనుకుంది...ఏ మనిషి అయినా తన పద్ధతి, తన మనస్థత్వం ఒకరికోసం ఎంతవరకు మార్చుకోగలడు...అని...
ఇంకా తన వైపే ప్రశ్నార్ధకంగా చూస్తున్న సుధీర్ కళ్ళల్లోకి దీక్షగా, సూటిగా చూస్తూ చెప్పింది...బహుశా ఒక కొండ అంచుల్లో ఉన్న ఒక చెట్టు కి అందమైన నాకు ఎంతో నచ్చే పువ్వు ఒకటి ఉంది..అది కొయ్యబోతే ప్రాణాలకు ప్రమాదమే..అది మనకు తెలుసు..అయినా సరే ఆ పువ్వు నాకు ఇష్టం అని తెలిసి నా కోసం నువ్వు ఆ పువ్వుని తేగలవా ..అని అడిగింది...సుధీర్ చెప్పాడు...నేను నీ ప్రశ్నకు సమాధానం రేపు చెబుతాను, సరేనా అన్నాడు...స్మితకు ఆ మాటలు విని దుఃఖం, కోపం ఒకేసారి ముంచుకొచ్చాయి...ఇంక ఈ మనిషి మారడు, ఇంతే అని ఏడుస్తూ పడుకుంది..
పొద్దున్న స్మిత లేచి చూస్తే సుధీర్ ఇంట్లో లేడు...పక్కనే బల్ల మీద గ్లాసు కింద రెపరెపలాడుతూ కాగితం ఒకటి ఉంది...సుధీర్ అందులో రాసాడు...స్మితా...నేను ఆ పువ్వుని తేలేను...అది చదివిన స్మితకు కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి...విడాకులు ఇవ్వాలనుకున్న నా నిర్ణయం తప్పే కాదు అని అనుకుంది...ఇంకా రాసాడు సుధీర్...స్మిత చదువుతోంది... ' స్మితా.. నువ్వు కంప్యూటర్లో సాఫ్ట్ వేర్ ప్రోగ్రాములు చేసేటప్పుడు చాలాసార్లు సరిగ్గా ఎలా చెయ్యాలో తెలీక ఇబ్బంది పడుతుంటావు, కోపంతో అరుస్తుంటావు...అబ్బా, ఎందుకు సరిగ్గా చెయ్యలేకపోతున్నా అంటూ చిరాకు పడుతుంటావు.. అలాంటప్పుడు నేను నీకు అనువుగా ..కంప్యూటర్ని తయారుచేసి ఇవ్వటానికి నా చేతివేళ్ళను నీకోసం కాపాడుకోవాలి
నువ్వు ఎక్కడికైనా వెళ్ళివచ్చేటప్పుడు.. ఇంటితాళాలు పారేసుకునో, మరిచిపోయో వస్తావు..అలాంటప్పుడు నీకోసం ఆఫీస్ నుంచీ పరిగెత్తుకొచ్చి తలుపు తీసిపెట్టటానికి నా కాళ్ళను కాపాడుకోవాలి..
కొత్త కొత్త ఊరులు చూడాలి అంటావు, అక్కడ దారితప్పిపోయి వెతుక్కుంటూ ఉంటావు..అలాంటప్పుడు నిన్ను జాగ్రత్తగా సరైన చోటుకి చేర్చేందుకు నా కళ్ళను కాపాడుకోవాలి...
ప్రతీనెల తప్పకుండా నీ స్నేహితురాలు నిన్ను పలకరించినప్పుడు..వచ్చే నీ కడుపునొప్పికి నీకు ఉపశమనం ఇవ్వటానికి నా అరచేతులు కాపాడుకుంటాను...అలాంటప్పుడు నువ్వు బయటకు వెళ్ళటానికి కూడా ఇష్టపడవు..అప్పుడు నువ్వు ఒంటరిగా బాధపడకుండా నీకు జోకులు, కబుర్లు చెప్పేందుకు నా నోటిని కాపాడుకోవాలి..
నువ్వెప్పుడూ కంప్యూటర్, ఫోన్ చూసి చూసి నీ కళ్ళు బలహీనపడతాయి...మరి అలాంటప్పుడు మన పెద్ద వయసులో నీకు సూదిలో దారం ఎక్కించటానికి, నీ తలలో అక్కడక్కడా వచ్చే తెల్ల వెంట్రుకలు వెతికి పట్టుకుని పీకెయ్యాలంటే...నా కళ్ళు బావుండాలి...నువ్వు సముద్రపు ఒడ్డున జారి పడిపోకుండా నీ చెయ్యిని గట్టిగా పట్టుకునేందుకు నా చేతులను కాపాడుకోవాలి...సముద్రపు ఎండలో తళుక్కుమని మెరిసే నీ మోములోని అందాన్ని చూసుకునేందుకు నా కళ్ళను కాపాడుకోవాలి...ఇలా ఎన్నో సందర్భాలలో నీకోసమే నేనుండేందుకు, నీకు సహకారం అందించేందుకు, నిన్ను ఆరాధించేందుకు..నన్ను నేను కాపాడుకోవాలి....కాబట్టి మనం జంటగా ఉండేందుకు ఆ పువ్వుని అలా ఒంటరిగా ఉండనిచ్చేద్దాము, సరేనా..అని వివరంగా రాసాడు..ఇంకో నాలుగు వాక్యాలు కూడా రాసాడు...
ఇంక నువ్వు నా మూగ ప్రేమను అర్ధం చేసుకున్నట్టయితే...కాస్త వచ్చి తలుపు తెరవరాదు...నీకు ఎంతో ఇష్టమయిన మీగడ పాలు కూరగాయలు రెండుచేతుల నిండా పట్టుకుని నించుని ఉన్నా....అని...అది పూర్తిగా కూడా చదవకుండానే తలుపు వైపు పరుగు పెట్టింది స్మిత...తలుపు తీసి చూస్తే భార్య కళ్ళల్లో ఆశగా వెతుకుతున్నాడు సుధీర్..విడాకుల పట్ల నిర్ణయం మారిందా లేదా అన్నట్టు...స్మిత చిన్నపిల్లలా నవ్వింది...మొండితనం వీడిన అల్లరిపిల్లలా...
స్వతహాగా స్మిత భావోద్వేగాలు ఎక్కువ ఉన్న మనిషి...ఒక భావానికి ప్రత్యేకంగా విలువను ఇచ్చే మనిషి...సుధీర్ నిండుకుండలా ఎక్కువ తొణకడు...స్మితకు పూర్తిగా వ్యతిరేకం...మౌనంగా, నిదానంగా తన పని తాను చేసుకునే మనిషి...
పెళ్ళి తర్వాత కొన్ని ఆశలు స్మితకి ఉన్నా...ప్రేమను భర్త ప్రత్యేక తరహాలో వ్యక్తపరిస్తే చూసి ఆనందించాలి అనుకున్నా....అవేవీ తెలియని, తెలుసుకోలేని సుధీర్ తన బాధ్యతలు తాను చేసుకుపోతున్నాడే కానీ...భార్యలో రోజురోజుకీ పేరుకుంటున్న, పెరుగుతున్న అసహనాన్ని గుర్తించలేకపోయాడు...ఎప్పుడైతే స్మిత తన బాధ బయటపెట్టిందో...సుధీర్ కూడా తన ప్రేమను లేఖ ద్వారా బయటపెట్టాడు...
కొన్ని చర్యలతో ప్రేమకు రూపం ఇచ్చి అర్ధమయ్యేలా చెయ్యటం ఎంత అవసరమో...కనపడని పునాదిలా బంధాన్ని కాపాడుతున్న చూపించలేని ప్రేమను అర్ధం చేసుకోవటం కూడా అంతే అవసరం...ప్రేమ కొన్నిసార్లు మాటల్లో తెలిస్తే, చాలాసార్లు చేసే పనుల్లో, చూపించే శ్రద్ధలో, నిర్వర్తించే బాధ్యతలలో తెలుస్తుంది...
సినీనటుడు రంగనాధ్ గారి మంచిమాట ఒకటి .......
" ప్రేమ కన్నా బాధ్యత ఎంతో గొప్పది " ..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment