శిక్ష - శిక్షణ
“పోలీస్ కమీషనర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాము. ధీరజ్ కుమార్ మీ అబ్బాయేనా?"
“అవునండి. మా బాబుకి ఏమైంది?“ కంగారుగా అడిగాడు సూర్యకుమార్.
“మీరు ఒకసారి మాఆఫీస్ కి రావాల్సిఉంటుంది. కొకైన్ ట్రాన్స్ఫర్ కేసులో మీబాబుని పట్టుకోవడం జరిగింది. కమిషనర్ గారు మీతో మాట్లాడతారట” అని చెప్పి ఫోన్ పెట్టేశారు అటువైపువ్యక్తి.
సూర్య కుమార్ ఊరిలో మంచిపేరుఉన్న ఆడిటర్. ఎన్నో కంపెనీలకి సంబంధించిన ఆర్థికలావాదేవీలు, మరియు ప్రముఖవ్యక్తుల ఫైనాన్సియల్ ప్లానింగ్ అన్నిటిని తానే చూస్తూఉంటాడు. అంతేకాదు అప్పుడప్పుడు బ్యాంకుల స్టేట్యూటరీ ఆడిట్ కి కూడా వెళ్తూఉంటాడు తనటీంతో.
సూర్యకుమార్ కి ఒక్కగానొక్క కొడుకు ధీరజ్. ధీరజ్ చిన్నప్పటినుంచి, ఆటల్లోను,చదువులోను..అన్నిట్లోనూ ఫస్ట్ గా ఉండేవాడు. సిటీలోనే మంచిపేరున్న పాఠశాలలో చదివాడు. ఆపాఠశాలలో ఆరవతరగతి నుంచే ఐఐటి ఎలా సాధించాలి అనే దానిమీదే మొత్తం ఫోకస్. వారి కోసం ప్రత్యేకంగా తయారుచేయబడిన తరగతిగది. ఆ గదిగోడల మీద గత ఐదుసంవత్సరాలుగా ఆ కాలేజీ నుండీ ర్యాంకులు సాధించిన పూర్వవిద్యార్థుల ఫోటోలు. ఎటుచూసినా ఆ కాలేజీవాళ్ళు సాధించిన విజయాల గణాంకాలు ప్రదర్శింపబడి ఉంటాయి. ఉదయం ఆరింటి నుంచి.. రాత్రి పదిగంటలదాకా క్లాసులు, ఆ తర్వాత స్టడీ అవర్స్ ఉంటాయి.
ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు శిక్షణ తీసుకుంటున్నవారిలో ప్రత్యేకించి ఓ ముప్పైమందికి ప్రత్యేకశిక్షణగా ఒక 'సూపర్ థర్టీ' బ్యాచ్ తయారవుతుంది. ఆ సూపర్ థర్టీ బ్యాచ్ లో ధీరజ్ కూడా ఒకడు.
రాత్రి పదిగంటల తర్వాత ఇంటికివచ్చిన కొడుకు, పట్టుమని పదినిమిషాలు కూడా మాట్లాడకుండానే నిద్రలోకి జారుకుంటాడు. ఏదో ఒకరోజు ఒక పదినిమిషాలు దొరికినా... ఆ పదినిమిషాలు కూడా సూర్యకుమార్ వాడి చదివు గురించిన ప్రస్తావనే తీసుకొస్తాడు. ఇంకే ఇతర విషయాలు వాళ్లు మాట్లాడుకోవడం మానేశారు. నానమ్మ, తాతయ్యల ఊరికికూడా సంవత్సరానికి ఒకసారి, అది కూడా ఒక్కరోజు మాత్రమే గడుపుతాడు.
అలాంటిది తన కొడుకుగురించి ఇలాంటి ఫోన్ కాల్ రావడం, అసలు పోలీసులు ఏమైనా పొరపాటుపడ్డారా అని పదేపదే ప్రశ్నించుకున్నాడు. కానీ కమిషనరేట్ నుంచి వచ్చిన ఫోన్ తో, వాళ్ళుఇచ్చిన డీటెయిల్స్ తో అది తన కొడుకే అని నిర్ధారణ అయింది.
కారు డ్రైవర్ అప్పటికి కార్ తీసుకొనివచ్చాడు. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా బయలుదేరాడు సూర్య కుమార్.
****
న్యూస్ రిపోర్టర్స్, కెమెరా ఛానల్ వాళ్ళు... మీడియా అందరితో ప్రెస్మీట్ జరుగుతోంది. కమిషనర్ గారు, ఇంకా అతని పక్కన ఈ ఆపరేషన్లో పాల్గొన్నసిబ్బంది, వాళ్ళ వెనక ముసుగులు తొడుక్కున్న ఐదుగురు యువకులు.. తనకొడుకు ఎవరో పోల్చుకోలేకపోయాడు సూర్యకుమార్.
కమిషనర్ గారు మాట్లాడుతున్నారు "వీళ్ళందరూ కూడా టాప్ ర్యాంకర్స్! ఇండియాలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ సాధించిన విద్యార్థులు. అందరూ ఇరవై సంవత్సరాల లోపు విద్యార్థులే. అయితే ఈరోజు ఉదయం కొకైన్, బ్రౌన్ షుగర్ తరలిస్తూ పట్టుబడ్డారు. వాటి విలువ దాదాపు ఐదులక్షలు రూపాయల దాకా ఉండొచ్చు. వీళ్ళందరూ కార్లో వీటిని మరో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కి అందించడం కోసం తీసుకెళ్తున్నట్టు అంగీకరించారు. వీరికి ఎక్కడ నుంచి వచ్చాయి. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? అనే విషయాలు ఇంకా ఇన్వెస్టిగేట్ చెయ్యాల్సిఉంది…" అంటూ చెప్పకు పోతున్నాడు.
సూర్యకుమార్ కి కాళ్ళకింద భూమి కంపించిపోతున్నట్టు అనిపించింది. గుండె చాలావేగంగా కొట్టుకుంటోంది. శరీరం అంతా చెమటతో తడిసిపోయింది. చలనంలేక స్థాణువులా అయిపోయాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ “సార్! మీరు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయండి ఇక్కడ ఉండకూడదు” అంటూ వెయిటింగ్ హాల్ వైపు తీసుకొని వెళ్ళాడు.
వెయిటింగ్ హాల్లో అప్పటికే ఇద్దరు పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లా ఉంది. ఆవిడ గుండెలవిసేలా ఏడుస్తోంది. తన పవిటకొంగు నోట్లో కుక్కుకొని వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని... " ఇంట్లో ఉండి మన చిల్లరకొట్టు చూసుకున్నా..వాడి బతుకు బాగుండేది. ఆ కాలేజీలోచేరి ఇలా చెడిపోయాడు ఏంటండీ” అంటూ తనభర్తతో వాపోతోంది.
ఆ ఎయిర్ కండిషన్డ్ రూంలోకూడా సూర్య కుమార్ కి చెమటలు పడుతూనే ఉన్నాయి. ఆ గదిలో.. తన మదిలో చెలరేగుతున్న ఉద్వేగాన్ని ఆపుకోలేక, వరండాని ఆనుకొని ఉన్న ఖాళీప్రదేశంలోని చెట్ల కిందఉన్న బల్లపైన కూర్చుండిపోయాడు.
పదేపదే అతని మనసులో ఒకటే ఆవేదన. ‘నా కొడుకు తప్పు చేశాడు…లేదు! నేను ఒక నాన్నగా తప్పు చేశాను’. 'నిజమే!నాదే తప్పు' పదేపదే ఇదే మాటను ఎన్నిసార్లు అనుకున్నాడో తెలియదు. ఒక పిల్లవాడి సత్ప్రవర్తన ముందు ఇంటి నుండే మొదలవుతుంది. తర్వాత స్నేహితుల నుండి, చదివే పుస్తకాల నుండి అది ఒక వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంటుంది. మొదటి దశలో బలమైన విచక్షణాపునాదులు ఏర్పడితే, తర్వాత స్నేహితుల్ని ఎంచుకోవడంలో, చదివే పుస్తకాల ఎంపిక లో అదే ప్రభావం చూపుతుంది. విలువలతో బాల్యాన్ని గడిపినవాడు, చెడు ప్రభావం చూపే పరిస్థితుల్లో కూడా, స్వీయ క్రమశిక్షణని కోల్పోడు. అందుకే, ముందుగా నన్ను నేనే దోషిగా నిలబెట్టుకోవాలి.. అనుకుంటున్నాడు సూర్య కుమార్.
సూర్య కుమార్ ఒక్కసారిగా తన బాల్యంలోకి తన గతంలోకి వెళ్లిపోయాడు.
**** *****
చిన్నప్పుడు అన్నయ్యతో ఆడుకోవటానికి వెళ్లి మామిడి తోటలో దొంగతనం చేసినప్పుడు, తోటకి కాపలాకాసే రామయ్య, ఇంటికివచ్చి తనమీద, అన్నయ్యమీద నేరం మోపినప్పుడు. అమ్మ సున్నితంగా మందలించింది. నాన్న మాత్రం ఆరుబయట దోషిలా అరగంటసేపు నిలబెట్టి, ‘ఇంకెప్పుడు తప్పు చేయన’ని వాగ్దానం చేశాకే లోపలికి రానిచ్చాడు. గాంధీగారి 'సత్యశోధన’ చదవమనేవాడు. అదే అప్పుడు ఇంట్లో భగవద్గీత.
ఏదైనా ఊరికి వెళ్ళిన ప్రతిసారి నాన్న, ఎప్పుడు పిల్లల కోసం కొత్తకొత్త కథలపుస్తకాలు కొని తెచ్చేవాడు. అక్క కంటే, అన్నయ్యకంటే ముందు తనే చదవాలని, నాన్న రాక కోసం వాకిట్లోనే కాపలా కాయడం గుర్తువచ్చింది. అప్పటికి వారి పల్లెకి విద్యుత్ సౌకర్యంలేదు. లాంతరు గాజుకి పట్టినమసిని శుభ్రం చేసుకుని సిద్ధం చేసుకుని చదవడం ఇంకా గురుతే! ఎన్నో నీతికథల పుస్తకాలు, బేతాళ కథలు, పొడుపు విడుపు కథల పుస్తకాలు, తను చదివి, పొరుగుపిల్లలు రవి, శీనుకి మరింత కల్పించి చెప్పడం... స్కూల్ కి సెలవు ఇస్తే చాలు, తాతయ్యతో నానమ్మతో పొలం కి వెళ్లడం , అక్కడ పొలం గట్ల దగ్గర ఈత కొట్టడం. నానమ్మ వద్ద విన్న నాన్నగారి చిన్నప్పటి ముచ్చట్లు గుర్తు వచ్చాయి.
ఒక రోజు తనస్కూల్లో మాస్టర్ గారిని బాధపెట్టడం... అబద్ధం చెప్పిన విషయం మాస్టర్ గారు అమ్మతో చెప్పడం.. అమ్మ ‘నేను మాట్లాడుతానండి అబ్బాయితో’ అని తన తరపున క్షమాపణ కోరడం ఇంకా గుర్తుంది తనకి. అదేరోజు అమ్మ తనను,అక్కయ్యను మిద్దెమీదకు తీసుకుని వెళ్లి వేసవికాలం రాత్రి .. ఆ వెన్నెలలో.. చాపపరిచి, పిల్లలిద్దరి చేతులను ఆమె చేతుల్లోకి తీసుకొని.. తమకి ఇష్టమైన కథల పుస్తకంలో, ఒక మంచి కథ చెప్పడం మొదలెట్టింది. కథ పాతదే అయినా అమ్మ చెప్తుంటే ఏదో తెలియని తాథాత్మత తనకూ, అక్కయ్యకూ.
మందలో నుంచి తప్పిపోయిన ఆవు, అడవిలో పులి బారిన పడి, ఇంటికి వచ్చి తన లేగ దూడకి చెప్పిన బుద్ధులు.. సుద్దులు .. అమ్మ తమకు చెప్తూఉంటే, అమ్మ కళ్ళల్లో నుండి నీళ్లు... ఆ వేసవి వెన్నెలలో.. పిల్లలు గమనించకపోలేదు. అమ్మని గట్టిగా పట్టుకుని ఏడ్చేయడం…. ఆ తర్వాత ఎన్నడూ కూడా ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా 'క్రమశిక్షణ’ని 'నిబద్దత 'ని తను తప్పినట్టుగా జ్ఞాపకం లేదు…. ఏదీ అలాంటి నిబద్దత ఈ కాలం పిల్లల్లో!.. నీతికథల స్థానంలో.. హింసాత్మాక ఘటనలు కలిగిన వీడియోగేమ్స్ రావడంతోనే…మానవజాతి పరిణామం ప్రమాదకరం అయిపోయి దానవజాతిగా రూపాంతరం చెందడం మొదలయింది.
**** ***
"సార్ మీరు ఇక్కడ కూర్చున్నారా?" మిమ్మల్ని లోపల కమీషనర్ గారు పిలుస్తున్నారు, " అంటూ హెడ్ కానిస్టేబుల్ వచ్చిపిలవడంతో...జ్ఞాపకాలలోకంలోంచి బయటకు వచ్చి, కమిషనర్ కార్యాలయం లోపలికి వెళ్లాడు సూర్య కుమార్.
"మీరేనా సూర్యకుమార్ గారంటే?.., మీకు ఊర్లో మంచి పేరుందని విన్నాను. ఎంత బిజీఅయినా..మీ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా పట్టనంత బిజీగా ఉన్నారా మీరు? డబ్బు సంపాదించడం ఒక్కటే మీ మార్గం అయితే రేప్పొద్దున మీ పిల్లవాడి భవిష్యత్తు ఎలాఉంటుందో మీరు ఊహించ గలరా??". అంటూ సూర్యకుమార్ని మాట్లాడనీకుండా తనధోరణిలో, ఉద్వేగంగా చెప్తున్నాడు కమిషనర్.
“సర్- ఎక్కడో తప్పుజరిగింది. మా బాబు అలాంటివాడు కాదండి” చాలా వినయంగా ఏదోచెప్పబోయాడు సూర్య కుమార్.
వెంటనే కమిషనర్ అందుకొని, “ఇక్కడ ఉన్న ప్రతి పేరెంటూ మీలాగే తనబాబు అలాంటివాడు కాదని అనుకుంటున్నాడండి. అయితే మీ అబ్బాయిఅయితే ఆల్రెడీ డ్రింక్చేసి మత్తులోఉన్నాడు. చెక్పోస్ట్ దగ్గర మేము కారు ఆపినప్పుడు, ఒకరకంగా అపస్మారక స్థితిలో ఉన్నాడు” అంటూ చాలా సీరియస్ గా చెప్పాడు.
"సారీ సార్..,ఐయాం రియల్లీసారీ! ఈ కేసులో నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి సార్''
అంటూ చేతులు జోడించి నమస్కరిస్తూ అన్నాడు సూర్య కుమార్.
పక్కనే ఉన్న కానిస్టేబుల్ ని బయటికి వెళ్ళమని సైగ చేశాడు కమిషనర్. ఏదో డీల్ మాట్లాడ్డానికి అని, అర్థమయిన కానిస్టేబుల్ తలఊపుతూ బయటకెళ్ళిపోయాడు.
సూర్యకుమార్ కి ఉన్నటువంటి పరపతి,హోదా, డబ్బును ఉపయోగించి తనకొడుకుని ఇందులో నుంచి ఎలా బయటికి తీసుకురావచ్చు అనేది చాలా వివరంగా చెప్పాడు కమిషనర్.
మీడియా వాళ్ళు ఇంకా ఈ న్యూస్ ని వీళ్ళ పేర్లతో బయటపెట్టలేదు. అందుకే సూర్యకుమార్ కి ఇంకా ఏ ఫోనూ రాలేదు. లేదంటే తన బంధుమిత్రుల దగ్గర నుంచి ఇంట్లో ధీరజ్ వాళ్ళఅమ్మ దగ్గరనుంచి ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చిఉండేవి.
ఒకసారి తనకొడుకును చూడటానికి పర్మిషన్ అడిగి తీసుకున్నాడు.
“ధీరజ్..” అంటూ చిన్నగాపిలిచాడు.
నాన్నవైపు చూడలేక సిగ్గుతో తలవంచుకొని ముఖం పక్కకు తిప్పుకున్నాడు ధీరజ్.
కొద్దిసేపు ఊరడిస్తున్నట్టుగా మాట్లాడి, కమిషనర్ గారు చెప్పిన విషయాన్ని ఆలోచించుకుంటూ ఇంటికి బయలుదేరాడు. దారిలో వస్తున్నంతసేపు.. అసలు జరిగిన విషయాన్ని విశ్లేషించుకున్నాడు.
తనకొడుకు ఇంజనీరింగ్ కాలేజీలో చేరి కేవలం ఆరు నెలలు మాత్రమే. ఆరునెలల్లోనే ఈ మహమ్మారికి బానిస ఎలా అయిపోయాడు.
ధీరజ్ తో పాటు ఉన్న ఇంకో నలుగురు పిల్లల పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళని ఓదారుస్తున్నారు. ఒక పిల్లవాడి తండ్రి చాలా పేదవాడు. కౌలుకి వ్యవసాయం చేసుకునే రైతుకూలీ. ఈ నలుగురి పిల్లలకి ఒక నాయకుడు ఉన్నాడు. వాడు ఊరిలో పెద్ద పేరుమోసిన బిజినెస్ మేన్ కొడుకు. అతని వీళ్లందరి కంటే వయసులో కూడా పెద్దవాడు. ఇంజనీరింగ్ సీట్ కూడా డొనేషన్ పెట్టి కొనుక్కున్నాడు. వాడు గత మూడునెలలుగా వీళ్ళ నలుగురిని తనతో తిప్పుకున్నాడు. అయితే కాలేజీలో అంతమంది ఉండగా వీళ్ళ నలుగురే ఇతని చుట్టూ ఎందుకు తిరిగారు? ఈ నలుగురిలోనూ ఏదో ఒక బలహీనత అతని వైపు లాక్కుంది. ముఖ్యంగా తన కొడుక్కి ఏది తప్పు ఏది ఒప్పు అనే తారతమ్యం తెలియకపోవడం. తన అమ్మ నాన్న దగ్గరుండి చెప్పినట్టు తను వాడికి చెప్పలేకపోవడం. కనీసం నానమ్మ తాతయ్య బంధాలు అనుబంధాలు తెలియకుండా పెంచడం. అందుకే చాలా సులువుగా మోసపోయాడు. అమాయకంగా వ్యామోహానికి లోనయ్యాడు. తను తన బాల్యాన్ని ఎంత ఆనందంగా, బాధ్యతతో గడిపాడో, అలాంటి ఆనందాన్ని, బాధ్యతని వాడికి ఇవ్వలేకపోవడం, తను చేసిన తప్పు. ఆడే ఆటలు కేవలం కాలక్షేపం కోసం కాదు. నడతనూ, నడవడికనూ నిర్దేశించేవిగా ఉండాలి. కేవలం కేరీర్, సంపాదన అంటూ కృతిమ బాధ్యతలు తెచ్చిపెట్టుకొని, ప్రకృతిసిద్దమైన “పేరెంటింగ్” అనే అసలు బాధ్యతను విస్మరించిన ఏ తండ్రికైనా, ఈ పరిస్థితి తప్పదు అనుకుంటూ ఉండగానే ఇంటి ముందు కారు ఆపాడు డ్రైవర్.
ఈ విషయాన్ని తొలుత..చిన్నగా ధీరేజ్ వాళ్ళమ్మ పద్మతో ఎలా చెప్పాలో ఆలోచించుకున్నాడు. కానీ కమిషనర్ గారు చెప్పిన డీల్ ని మాత్రం చెప్పదలుచుకోలేదు.
తెలిసో తెలియకో తన కొడుకు తప్పుచేశాడు. దీనికి తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అంతేకానీ, ఇన్నాళ్లటి తన సంస్కారాన్ని నిబద్ధతని చంపుకొని కమిషనర్ గారు చెప్పిన మాటకి 'సరే' అనలేకపోయాడు సూర్య కుమార్. తనైతే తన పరపతినీ, హోదాని ఉపయోగించి తన కొడుకుని బయటకు తీసుకురాగలడు. పేరుకూడా బయటికి రానీకుండా మేనేజ్ చేసుకోగలడు. కానీ తన కొడుకుతోపాటుగా ఉన్న మిగతా ముగ్గురి పరిస్థితిఏంటి? తన కొడుకులాగే రోజూ ఈ మత్తులోపడి నలిగిపోతున్న మిగతా ఎందరో పిల్లల పరిస్థితిఏమిటి? రోజుకి ఎన్ని చోట్ల ఇలాంటి పిల్లల బంగారుభవిష్యత్తు ఒక మహమ్మారికి బానిసగా మారి బలైపోతుంది.?
అనుకోకుండానే అతని కళ్ళ వెంబటి అశ్రుధారలు పొంగి పోతున్నాయి. ఆ జలప్రవాహంలో ఒక్కసారిగా తన అమ్మ గుర్తుకు వచ్చింది సూర్యకుమార్ కి. తన తల్లి జ్ఞాపకంగా దాచుకున్న కథలపుస్తకం భద్రంగా పెట్టుకున్న కప్బోర్డ్ లో నుంచి తీసి గుండెలకు హత్తుకున్నాడు.తన అమ్మని దగ్గరికి తీసుకున్నట్టే అనిపించింది. తల్లిఆవు లేగదూడకి చెప్పిన నీతిసూత్రాలను మళ్ళీ వల్లెవేసుకున్నాడు. రేపే ఊరికి వెళ్లి అమ్మని నాన్నని తెచ్చుకోవాలని అనుకున్నాడు. ఇన్నాళ్లు వాళ్ళు దూరంగా ఉండడం వల్ల తన కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని జీవితపు బాలన్స్ షీట్లో భారీ లోటుగా బేరీజువేసుకున్నాడు ఆడిటర్ సూర్యకుమార్.
*****
తెలిసిన లాయర్ ద్వారా వాడి చదువుకు ఎలాంటి విఘాతం కలగకుండా, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ.. వాడి శిక్షాకాలాన్ని పూర్తి చేసుకోవచో కనుక్కున్నాడు సూర్య కుమార్.
అయితే ధీరజ్ అమ్మ పద్మ మాత్రమే దీనికి ఒప్పుకోలేదు. తన కొడుకుని ఏదో ఒకరకంగా ఏ శిక్షాలేకుండా బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే సూర్యకుమార్ మాత్రం తన పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం ఇది కాదు అని గట్టిగా నమ్మాడు. అంతేకాదు ప్రతిరోజు తన కొడుకుని కలిసి ఎన్నో మంచి విలువలతో కూడిన పుస్తకాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించిన పుస్తకాలు వాడికి అందివ్వడం మొదలుపెట్టాడు.
స్వంతఊళ్లో ఉన్న తన అమ్మని నాన్నని ఇంటికి తీసుకుని వచ్చాడు. అక్కని అన్నయ్యని కూడా ఈ విషయంగా సలహా అడిగి తీసుకున్నాడు. రోజు తన వాళ్ళందరిని ధీరజ్ దగ్గరికి ఒక్కొక్కరిగా తీసుకొని వెళ్లి,వాళ్ల యొక్క ప్రేమ ఆప్యాయతలను రుచి చూపించాడు. తనకంటూ ఎంతమంది బంధువులు ఉన్నారో, తనకి కష్టం వస్తే ఎంతమంది అండగా నిలబడతారో ప్రాక్టికల్ గా తెలిసేలా చేశాడు.
వీళ్లందరి ప్రేమ అనురాగాల మధ్య కొంత పెనాల్టీ కట్టడం వలన, ధీరజ్ ఇక ఎటువంటి మత్తుమందులు తీసుకోడు అని కౌన్సిలింగ్ సెంటర్ల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాక , ధీరజ్ శిక్షాకాలం తగ్గించి ఇంటికి పంపించేశారు. ధీరజ్ తో పాటు అరెస్ట్ అయిన ఆ మిగతా ముగ్గురిని కూడా ఏదో ఒకరకంగా బయటకు తీసుకురావాలని ప్రయత్నాల్లోనే ఉన్నాడు సూర్యకుమార్.
ఇప్పుడు తనకున్న పేరుని పరపతిని ఉపయోగించుకొని పాఠశాలల స్టేట్ బోర్డుకి... డ్రగ్స్ దీని యొక్క పర్యవసనాలకు సంబంధించి కూడా పాఠ్య పుస్తకాల్లో ఒక పాఠం ఉండేలాగా తయారు చేయాలని.. అభ్యర్థన పత్రాలు ఇచ్చి వచ్చాడు.
పాఠశాల దశనుంచి ఐఐటికి, నీట్ పరీక్షల కోసం ఎంత సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా అంతే సీరియస్గా ఈ డ్రగ్స్ యొక్క వ్యాప్తి, వాటి గురించి తీసుకోవాల్సిన రక్షణ గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు కచ్చితంగా బోధించాలని ఒక పాఠ్యాంశంగా ఉండాలని సూచించాడు.
ఇంజనీరింగ్ హాస్టల్స్ అన్నిట్లోనూ వార్డెన్లు ప్రత్యేకంగా.. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఒక హ్యాబిటేషన్స్ సెంటర్ ని, కౌన్సిలింగ్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేయాలని.. ఒక ఉద్యమ కార్యచరణ మొదలుపెట్టాడు.
తన సొంతఖర్చుతో వారానికి ఒకసారి ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో డ్రగ్స్ యొక్క దుష్ఫలితాలను వివరించేలాగా ఒక సైక్రియాటిస్ట్ ని, మరియు కౌన్సిలర్ ని ఏర్పాటు చేసే వరకూ పోరాడాడు.
సూర్య కుమార్ యొక్క ఉద్యమ కార్యాచరణ బాగా నచ్చిన జిల్లా కలెక్టర్.. జిల్లాలోకి ఏ రకంగా డ్రగ్స్ ప్రవేశించకుండా ప్రత్యేక కట్టుదిట్టమైన ఏర్పాట్లు తయారు చేశారు. స్టూడెంట్స్ యూనియన్లు కూడా దీని గురించి ర్యాలీలు నిర్వహించడంతో రాష్ట్రవ్యాప్తంగా సూర్యకుమార్ చేపట్టిన యాంటీ డ్రగ్ కమిటీకి మంచి పేరు వచ్చింది.
ధీరేజ్ తల్లి పద్మ, సూర్యకుమారుని మనస్పూర్తిగా మెచ్చుకుంది. తన కొడుకుని బయటికి తీసుకు రాలేదని ఆవేదనతో ఆమె ఆరోజు ఒక తల్లిగా స్పందించింది తన కొడుక్కి కొద్దిగా శిక్ష పడినా కానీ ఎంతో మంది పిల్లలను, తనభర్త ఈ కబంధహస్తాల నుంచి కాపాడుతున్న వైనం చూసి ఆమెకి ముచ్చటేసింది. తన తోటి స్త్రీలతో కూడా ఆమె ఈ యాంటీ డ్రగ్స్ కమిటీలో జాయిన్ చేయించింది.
ఇప్పుడు సూర్యకుమార్ కల నిజంగా ఫలించింది. ఇంటి నుండి ఎప్పుడైతే మంచి వాతావరణంతో ఒక తల్లి తన కొడుకుని పెంచుతుందో అప్పుడు ఈ రాష్ట్రము దేశము కూడా బాగవుతుందని తన అభిప్రాయము వందశాతం ఋజువైంది. తనను సృష్టించిన తనతల్లికి, ఒక తరాన్ని సృష్టించడమే కాకుండా, వారి నడతను నిర్దేశించి, జాతి గమనాన్ని, పురోగతినీ నిర్ణయించే అమ్మలందరికీ కూడా మనసులోనే ధన్యవాదాలు తెలుపుకున్నాడు సూర్య కుమార్.
***
No comments:
Post a Comment