Monday, March 31, 2025

 *నిధికి దారి*

*గోకులనాధుడనే సన్యాసి బొద్దాం గ్రామం మీదుగా వెళుతూ*
*రచ్చబండ దగ్గర ఆగాడు. గ్రామస్థులను చూసి, 'అంతులేని నిధినిక్షేపాలను గమనించక దిగాలుగా ఉన్నారేం..?' అన్నాడు.*
*ఆ మాటలు విని గ్రామపెద్ద త్రిగుణయ్య 'వూరు పనికి రానిదిగా మారింది. అన్నీ బీడు భూములే. వర్షాలు పడి ఏళ్లయింది. ఇక నిధి నిక్షేపాలు ఎక్కడివి స్వామీ?' అన్నాడు.*
*'నా దివ్యదృష్టికి అంతా కనిపిస్తోంది. మీలో ఒకరి కళ్లకు అంజనం*
*రాస్తే నిధులెక్కడున్నాయో తెలుస్తుంది' అన్నాడు సన్యాసి.*
*గ్రామస్థులంతా త్రిగుణయ్యకి అంజనం రాయమని కోరారు.*
*సన్యాసి తన జోలె లోంచి ఓ చిన్న భరిణె తీసి అందులోని*
*కాటుకని త్రిగుణయ్యకి రాశాడు. త్రిగుణయ్య వెంటనే 'ఆహా!*
*అద్భుతం. నిధికి దారి స్పష్టంగా కనిపిస్తోంది. తవ్వడమే*
*తరువాయి' అన్నాడు. ఆ మాటలకు గ్రామస్థులంతా సంబరపడి*
*పోయి పలుగు, పార, గునపాలు, తట్టలు పుచ్చుకుని తరలి*
*వచ్చారు. మర్నాడే పని ప్రారంభమైంది.*
*త్రిగుణయ్య చెప్పిన చోట తవ్వుకుంటూ గ్రామస్థులు చెమటోడ్చి పని చేశారు. నిధికి దారి బీడు భూముల మీదుగా వూరికి దాపుల నున్న కొండల మధ్య*
*నుంచి సాగింది. ఓ చోట చివ్వున జలం వూరి పనికి అడ్డం వచ్చింది.*
*కొందరి గ్రామస్థుల చేత దాన్ని దారి మళ్లించాడు*
*త్రిగుణయ్య. ఇలా కొన్నాళ్లయినా నిధినిక్షేపాలు*
*కనిపించలేదు. గ్రామస్థులంతా ఓ రోజు త్రిగుణయ్యను*
*చుట్టుముట్టి, 'అసలు నిధికి సరైన దారి ఇదేనా?' అంటూ*
*మండిపడ్డారు. త్రిగుణయ్య అయోమయంగా మొహం పెట్టి*
*'పదండి. సంగతేంటో ఆ సన్యాసినే అడుగుదాం' అంటూ వూరందరితో*
*అడవి లో సన్యాసి దగ్గరకు వెళ్లి నిలదీశాడు.*
*ఆ సన్యాసి కాసేపు కళ్లు మూసుకుని 'నేను చెప్పింది అబద్దం కాదు. పదండి*
*చూపిస్తా' అంటూ ముందుకు నడిచాడు. గ్రామస్థులంతా అనుసరించారు.*
*'అదిగో చూడండి. మీ తవ్వకాల వల్ల గుక్కెడు నీళ్లు దొరకని గ్రామానికి జలసంపద లభించింది. బీడు భూములన్నీ సారవంతమయ్యాయి.*
*రాజధాని నగరానికి కొండల మధ్య నుంచి*
*దగ్గరి దారి ఏర్పడింది. అన్నింటినీ మించి సోమరులంతా*
*పనిమంతులయ్యారు. ఇవన్నీ నిధినిక్షేపాలు కావా?' అన్నాడు.*
*అంతా విన్న వూరి పెద్ద త్రిగుణయ్య 'అయ్యా! మీరు చెప్పినవన్నీ నిజమే. ఇన్నాళ్లూ బద్దకస్తులమై గ్రామాన్ని పాడు పెట్టుకున్నాం' అన్నాడు.*
*గ్రామస్థులంతా సిగ్గుపడి తలలు దించుకున్నారు. ఆపై అందరూ పొలాలు సాగు చేసుకుని చక్కగా బతకసాగారు. గ్రామస్థుల సోమరితనాన్ని వదిలించడానికి సన్యాసి సాయంతో అంజనం నాటకమాడినట్టు త్రిగుణయ్య ఎవరికీ చెప్పలేదు.*

No comments:

Post a Comment