Monday, March 31, 2025

 క్రమ సంఖ్య 40
ది 25/03/2025

*దేవుడుండే చోటు*

 రచన...   అనిసెట్టి శ్రీధర్

ధనుర్మాసం మొదటి రోజు. ఊరి జనమంతా పెద్దాయన అని ఆప్యాయంగా, గౌరవంగా పిలుచుకునే సూరిబాబుగారు కొబ్బరికాయ కొట్టి, దేవుడి పల్లకీ ఒక పక్క కాసి రెండు అడుగులు వేసాక మరొకరు అంది పుచ్చుకున్నారు. ఊరేగింపు మొదలైంది. చాలా ఊళ్ళలో లాగా తోపుడు బండి మీదో, రిక్షా మీదో దేవుడిని ఊరేగిస్తూ పక్కన పూజారి నడవడం కాదు పల్లకీ అంటే. రెండు కళ్ళూ చాలవు ఆ అలంకరణ, ఆ వైభోగం చూడాలంటే!

కాటను సుధాకరు కూడా కొద్దిసేపు పల్లకీ మోసాడు. అతను ఆ రోజు ఉదయమే ఊళ్ళో దిగాడు. పోయేవరకు వాళ్ళ నాన్న పత్తి వ్యాపారం చేసేవాడు. చిన్నపుడు బళ్ళో పంతులుగారు మీ నాన్న ఏం పని చేస్తార్రా అనడిగితే సుధాకరు కాటన్ బిజినెస్ అని చెప్పాడు. ఓహో పత్తి వ్యాపారమా అన్నాడాయన. ఊళ్ళో సుధాకరు పేరు మరో ఇద్దరికి ఉండడంతో అప్పటినుండి నేస్తులు అతడిని కాటను సుధాకరు అనే పిలుస్తారు.

“ఏం సుధాకరూ ఎప్పుడొచ్చా?”అని చాలామంది పలకరించారు.

ఊళ్ళో అన్ని వీధులూ తిరిగి కానుకలు పుచ్చుకుంటూ, ఆశీర్వాదమిస్తూ దేవుడి పల్లకీ ఆనవాయితీ ప్రకారం వాడ మొదట్లోకి వచ్చి ఆగిపోయింది. వాడ జనమంతా వచ్చి దణ్ణాలు పెట్టుకుని ప్రసాదం పుచ్చుకొని వెళిపోయారు. వాళ్ళలో రాజు కూడా ఉన్నాడు. 

“ఉద్యోగం హైదరాబాదులోనేనా” రాజు ప్రసాదం పుచ్చుకునేటపుడు పూజారి గారు అడిగారు. అవునన్నట్లు తలూపాడు. 

“జీతం ఎంతేంటి?”

“యాభై వేలు.”

“అబ్బో, పెద్ద ఉద్యోగమే!”

                               ******

వయసును బట్టో, ఆస్తిని బట్టో సూరిబాబుగారు ఊరికి పెద్దాయన అవలేదు. సర్పంచ్‌గా మూడోసారి చెయ్యనంటే చెయ్యనని భీష్మించుకుని కూర్చున్నాడు. పదవి స్త్రీలకి కేటాయిస్తే భార్యనో, కోడళ్ళనో నిలబెట్టలేదు. దళితులకి కేటాయిస్తే నచ్చినవాడిని కూర్చోబెట్టి పెత్తనం చలాయించలేదు. 

ఆయనకి పిల్లలు లేరు. తమ్ముడు, మరదలు చిన్న వయసులోనే కాలం చేస్తే వాళ్ళ పిల్లలిద్దరూ ఆయన చేతుల మీదే పెరిగారు. వాళ్ళు పెద్దయ్యేసరికి వాళ్ళ పొలాలు రెండింతలు చేసి అప్పజెప్పేసాడు. 

ఎవరేనా కుర్రాడు అగుపడి “మీరు నా చదువుకి సాయం చేసారు. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది పెద్దాయనా” అంటే 

“ఏమో నాయనా… సంతోషం” అంటాడంతే.

ఆయన చేసిన సహాయం మర్చిపోతాడు. జ్ఞాపకం ఉండదు. అది భగవంతుడు ఆయనకిచ్చిన వరం. ఊరి జనం, వాడ జనం అని తేడా లేదు. ఎవరికేం కష్టమొచ్చినా, సలహా కావల్సి వచ్చినా ఆయన దగ్గరికే వెళ్తారు.

వాడలో ఉండే వీరాస్వామిది ఒక సమస్య.

“వాళ్ళ అన్న కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేయాలని ఆశ పడేది. ఇల్లరికం ఉంటడనుకుని ఉన్న డబ్బంతా కర్సు పెట్టించి ఇంటి పక్కనే ఒక వాటా ఏయించింది. వాడేమో వేరే పిల్లని ఇస్టపడి పెళ్ళి చేసేసుకున్నడు. ఇప్పుడు పిల్లకి మంచి సవ్వందం వచ్చింది. లచ్చ గావాలంటున్నరు. యాడికి బోయి తెచ్చేది. ఉన్న ఎకరా అమ్మితే ఏం దినాల?” 

“వాళ్ళతో మాట్లడతా ఉండు. సంబంధం పోనీబాక. దేవుడే ఏదో దారి చూపిస్తాడులే” అని సూరిబాబుగారి భరోసా పలుకులు కొండంత ఊరటనిచ్చాయి.

భార్యా భర్తల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఏవైనా పెద్దాయన పంచాయితీలో ఇట్టే సమసిపోయేవి. ఆయన మాటే వేదవాక్కు. ఆయన పంచాయితీ అంటే సుప్రీం కోర్టేరోయ్ అనుకునేవాళ్ళు.

                                 ******

తల్లిదండ్రులు పోయాక గత ఐదేళ్ళలో సుధాకరు ఆ ఊరికి ఇది మూడోసారి రావడం. వచ్చినపుడే ఇంటి తాళం తీయడం, శుభ్రం చేయించడం. ఊళ్ళో చాలా మార్పులు గమనించాడు. పది, పన్నెండు ఇళ్ళు తాళాలు వేసున్నాయి. అతని నేస్తుల్లో చాలామంది ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళకి తరలిపోయారు. వ్యవసాయం మీద ఆధారపడినవాళ్ళు మాత్రం మిగిలారు. 

మూణ్నెల్ల క్రితం వచ్చినప్పుడు ఇల్లు అమ్మేయాలని నిశ్చయించుకున్నట్టు, ఎవరేనా కొంటారా అని వాకబు చేసి వెళ్ళాడు. 

“పల్లెటూళ్ళో ఎవరు కొంటారురా. మన శంకరంగాడు అమెరికా వెళ్ళాడా. మీ వాళ్ళలానే వాళ్ళ మావగారు కూడా హైదరాబాదులో ఉంటారు. అక్కడ ఒక అపార్ట్‌మెంట్ కొని పడేసాడు. వాడు కుటుంబంతో మన దేశం వచ్చినప్పుడల్లా వాళ్ళ అమ్మా, నాన్న ఇక్కడ ఇల్లు తాళం పెట్టి హైదరాబాదు పోతారు. వాడు అమెరికా తిరిగెళ్ళే ముందు అందరూ కార్లో ఇక్కడకు వచ్చి ఒక రోజు ఉండి ముసలోళ్ళని ఇక్కడ వదిలేసి వాళ్ళు వెళిపోతారు. ఇలా ఐదారు కుటుంబాలు ఉన్నాయి. నీలా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఒక ఐదారుగురు ఉన్నారు. ఊరి చివర హైవేల మీదా, పనికిరాని వెంచర్స్‌లో స్థలాలు కొని, కొన్ని నెలలు గడిచాక వేసిన రోడ్లలో పిచ్చి మొక్కలు మొలిచి మన ప్లాటు ఎక్కడుందో వెతుక్కునే వాళ్ళు ఉంటారు కానీ పల్లెటూర్లో ఇళ్ళు కొనేవాళ్ళు ఉండర్రా” అన్నాడో నేస్తుడు.

“సుధాకరూ, మీ ఇంటెనక రాఘవరావుకి దమ్ముంది కానీ వాస్తు ప్రకారం కలిసి రాదు. ఇంక మీ ఇంటికి అటున్న వెంకట్రామయ్యకి అవసరం లేదు. ఇటు ఉన్న సాంబడికి స్తోమత లేదు.”

ఊళ్ళో ఎవరూ ఆసక్తి చూపడం లేదు. తన తండ్రితో బాగా స్నేహితంగా ఉండేవాళ్ళకి, తెలిసిన వాళ్ళందరికీ చెప్పాడు. తను ఉండేది బహు దూరంలో. మాటిమాటికీ వచ్చి వెళ్ళలేడు. పదిరోజులైంది సెలవు పెట్టి. హైదరాబాదులో అత్తవారింట ఉన్నారు భార్య, పిల్లాడు. సెలవు అయిపోవస్తోంది. పది రోజులుగా ఒక విషయమై మథన పడుతున్నాడు. 

తప్పేలా లేదు. దేవుడు గుడికి చేరాక, సుధాకరు ఒక బాంబు పేల్చాడు. మహాశక్తివంతమైన బాంబు. అతనేం ఉగ్రవాది కాడు. ఢిల్లీలో పదేళ్ళుగా సలక్షణమైన ఉద్యోగం చేస్తున్నాడు. అతను పేల్చింది మందుగుండు కాదు. కాకపోతే విషయం అలాంటిది.

ఆ విషయం క్షణాల్లో ఊరంతా పాకిపోయింది.

రాజకీయ నాయకులు, న్యూస్ చానళ్ళూ రంగంలోకి దిగి ఉంటే రచ్చ రచ్చ అయిపోయేది. బ్రేకింగ్ న్యూసులూ, రెచ్చగొట్టే చర్చా కార్యక్రమాలూ మాంచి ఊపున జరుగుతుండేవి.

వాడలో పెద్దవాళ్ళు రాజుని మందలించారు. వాళ్ళలో వీరాస్వామి కూడా ఉన్నాడు. పెద్దాయనకి తెలిస్తే బాగోదు, మనమంటే ఎంత అభిమానం ఆయనకి అన్నాడు. 

“ఎక్కడి వాళ్ళం అక్కడ ఉండాలి” అన్నాడు ఒకాయన. 

“మనం ఎక్కడి వాళ్ళం” అడిగాడు రాజు. ఎవరూ బదులివ్వలేకపోయారు.

సూరిబాబు గారికి ఈ వార్త చేరింది. కానీ, ఆయన వినీ విననట్టు ఊరుకున్నాడు. కొద్ది రోజుల్లో వేరే గ్రహం భూమిని ఢీకొట్టి ప్రళయం సంభవిస్తున్నట్టు పల్లె జనాల మనస్సులు కకావికలమైపోతుంటే ఆయన నిమ్మళంగా కూర్చున్నాడు.

ఇంతకీ ఆ వార్త ఏంటంటే, ఊర్లో ఉన్నసుధాకరు ఇంటిని రాజు కొనడానికి సిద్ధంగా ఉన్నాడట. అదీ వార్తంటే. ఎన్నడూ విననిది, కననిది, కలలో కూడా ఊహించనిది. బుద్ధికే అందనిది.

వాడలో మేనమావ స్థలంలో వేసుకున్న పాకే రాజు వాళ్ళ ఇల్లు. ఆయన పోయాడు. పాక ఖాళీ చేస్తే మేం ఇల్లు కట్టుకుంటాం అంటున్నారు ఆయన పిల్లలు రాజుతో. సుధాకరు ఇల్లు కొని తల్లిదండ్రుల్ని అక్కడ పెట్టాలని ఆలోచన.

“రేయ్ పదిమందీ తలా ఒక లక్ష వేసుకునైనా సరే సుధాకరు ఇల్లు కొనేద్దామురా” అన్నాడు అంకినీడు అనే రైతు. అతడి దగ్గర ధనం అంతగా లేదు కానీ ‘కుల మూలమిదం జగత్’ అనే భావన బలంగా ఉంది. అందుకే పట్నంలో తమ కులం వాళ్ళు పెట్టిన కళాశాలలో పిల్లాడ్ని చేర్చి తమ కులం పిల్లలతోనే స్నేహం చేయ్యమని ఆర్డరేసాడు.

చాలామంది తల్లిదండ్రుల్లాగే క్రమశిక్షణ కన్న కులశిక్షణకి ప్రాధాన్యమిచ్చే వ్యక్తి. పెద్ద పిల్ల వేరే కులం వాడిని ప్రేమించి తండ్రినెదిరించే ధైర్యం చేయ్యలేక ఆత్మహత్య చేసుకుంటే, కడుపు నొప్పి భరించలేక ఉరేసుకుందని చెప్పేవాడు.

ఊరి జనం చికాకుపడుతున్నారు. అకాల వర్షాలు పడి కళ్ళాల్లో మిర్చి తడిసి పనికిరాకుండా పోయినప్పుడు, సకాలంలో పడక పత్తి చేలు ఎండిపోయినప్పుడు కూడా ఇంత చింతించలేదు. పెద్దాయన అండ చూసుకునే సుధాకరు, రాజు రెచ్చిపోతున్నారని ఆయన తమ్ముడి కొడుకులిద్దరినీ సతాయిస్తున్నారు.

వాడలో కుర్రాళ్ళు మాంచి ఉత్సాహంగా ఉన్నారు. పనుల దగ్గరా, కుర్రాళ్ళకైతే ఆటల దగ్గరా, సినిమాల గురించో, రాజకీయల గురించో చిన్న చిన్న గొడవలు, సర్దుబాట్లు జరిగిపోయేవి. కానీ ఈ గొడవ కొత్తగా ఉంది. కలలో కూడా ఎప్పుడూ ఊహించని సమస్య. ఫలితం ఎలా ఉంటుందో అనే ఉత్సుకత. 20-20 క్రికెట్ కూడా వాళ్ళకి ఇంత కిక్ ఇవ్వలేదు. మీరిద్దరూ తగ్గకండొరే అన్నారు.

ఊళ్ళో కుర్రాళ్ళు “ఏరా గాంధీగారిలా పేరు తెచ్చుకోవాలనా? సామాజిక విప్లవకారుడు కాటను సుధాకరు వర్ధిల్లాలి” అని సుధాకరును ఎగతాళి చేసారు గుంపుగా ఉన్నప్పుడు. విడిగా మాత్రం ఇద్దరు, ముగ్గురు సుధాకరుకు మద్దతుగా మాట్లాడారు. సందట్లో సడేమియా లాగా పందేలరాయుళ్ళు రంగంలోకి దిగారు. రాజుకి ఆ ఇల్లు అమ్మనివ్వరని రూపాయికి పది రూపాయలు కట్టారు.

పెద్దాయన దగ్గరికి ఆయన తమ్ముడు కొడుకులిద్దరినీ రాయబారానికి పంపారు.

“బ్యాంకు మేనేజర్ రుణం ఇస్తానంటున్నాడా.. రిజిస్ట్రారుకి ఏ అభ్యంతరం లేదన్నమాట రాజు పేరున ఇల్లు రిజిస్ట్రీ చేయ్యడానికి” అనేసి ఊరుకున్నాడు.

జనానికేం అర్థం కాలేదు. యార్డులో వ్యాపారులు ధరలు పడేసినప్పుడు, ప్రభుత్వం చేతులు కట్టుకుని చోద్యం చూస్తున్నపుడు కూడా ఇంత బాధ పడలేదు. పందాలు రూపాయికి పది నుండి ఐదుకి తగ్గినయి.

“సుధాకరూ… వాడలో జనానికీ, మనకీ ఎలాంటి గొడవలూ లేవు. కొన్ని ఊళ్ళల్లో లాగా టీ కొట్టు కాడ రెండు గళాసుల పద్ధతి లేదు. వాళ్ళు మన వీధుల్లో తిరుగుతున్నారు. మనం ఎదురుపడితే వాళ్లేం పక్కకు తప్పుకోనక్కర్లా. ఇప్పుడు నువ్వు కొత్త గొడవలు పెట్టమాకు” అన్నారు.

“మరి ఈ విషయంలో పట్టింపు ఎందుకు మీకు. నా పెళ్ళి కాకమునుపు ఢిల్లీలో రాజు కులం కుర్రాడితోనే ఒక ప్లాట్‌లో ఉన్నాను. ఇదీ అలాంటిదే కదా.”

“ఏంది సుధాకరూ, నీ మాటే నీదంటావు! మనూళ్ళో అట్టాంటివి మునుపు లేవు, ఇకముందు కుదరవు” తెగేసి చెప్పారు.

“మరి నేనేం చెయ్యాలి. మీరెవరూ కొనరు, రాజుని కొననివ్వరు.”

“అవున్రా, వాడి బాధ వాడిది. తోబుట్టువులూ, బంధువులూ ఎవరూ లేరు. నారాయణరావుకి వీళ్ళమ్మ ఒక్కతే కూతురు. ఇల్లరికం తెచ్చుకున్నాడు. ఇప్పుడెవరూ లేరు. ఉన్న ఇల్లు పాడుబెట్టడం తప్ప వేరే ఆస్తీ లేకపాయె, అవసరమూ పడింది” అన్నారొకరు సానుభూతిగా. 

రియల్ ఎస్టేట్ బాలాజి ముందుకొచ్చాడు.

“అబ్బాయ్ సుధాకరూ, మీ నాన్న పత్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి మీ పొలం నేనే అమ్మి పెట్టా. ఇప్పుడు నాకు తప్పేలా లేదు. ఐతే పన్నెండు లక్షలకి ఖాయం చేసుకో. ఆరు ఇప్పుడు ఇస్తా, మిగతాది ఆరు నెలల్లో ఇస్తా” అన్నాడు.

“ఇది బాగానే ఉంది, ఖాయం చేసుకో” అన్నారు జనం. 

“బాబాయ్… ఢిల్లీలో ప్లాటు కొనడానికి రుణం మంజూరు అయి ఉంది. నా వాటా ముప్పై లక్షలు కట్టాలి. రాజు పదిహేనుకి కొంటానికి సిద్ధంగా ఉన్నాడు. వెంటనే డబ్బు ముడుతుంది. నాకూ వెంటనే అవసరం ఉంది. మీకు అభ్యంతరం ఎందుకు?”

తగువు తెగేలా లేదు.                    

                             ******

సుధాకరు ఢిల్లీ వెళ్ళి ఇరవై రోజులకి మళ్ళీ వచ్చాడు. ఆఖరుసారి ఊరు చూపిద్దామని భార్యని, మూడేళ్ళ పిల్లాడిని కూడా తీసుకువచ్చాడు. రాజు కూడా వచ్చి ఉన్నాడు.

సుధాకరు ఇంటి కాగితాలన్నీ పట్నంలో లాయరు గారికి రాజు చూపించాడని, ఇద్దరూ అగ్రిమెంటు రాసేసుకున్నారని, బ్యాంకు మేనేజరు రుణం మంజూరు చేసేసాడని, ఇక రిజిస్ట్రేషనే తరువాయి అనీ పుకార్లు షికార్లు చేసినయి. గ్రహ శకలాలు కొన్ని అమెరికాలోనూ, కొన్ని ఆఫ్రికాలోనూ పడి ఆ ఖండాలు సగం తుడిచిపెట్టుకుపోయినట్టు ఊళ్ళో శాస్త్రవేత్తలు గగ్గోలు పుట్టించారు. మన దేశంలో మొదట మన ఊరి మీదే, అదిగో అదిగదిగో ఆకాశంలో కనిపిస్తూ ఉందే, రాత్రిపూట మెరుస్తా కనబడడంలా, ఒరేయి గుడ్డెదవా నీకు కనిపించదులే, ఆ ముక్కే పడతాదంట అని హడావుడి చేసారు.

పెద్దాయన ఇంటి దగ్గర తుది పంచాయితీ మొదలైంది. సుధాకరు, రాజు ఆయన తమ్ముడి కొడుకులతో సహా రెండు వందల మంది దాకా పోగయ్యారు. విశాలమైన చావిడీ అంతా కిక్కిరిసిపోయింది ఇంతకుముందెన్నడూ లేదు. ఏ పంచాయితీకైనా ముప్పై, నలభై మంది హాజరయ్యేవాళ్ళు. ఇసకేస్తే రాలనంత జనం. ఏవో పనులకని సూరిబాబు గారు చావిడీలో ఒక మూల అంతెత్తున ఇసక పోయించారు. సుధాకరు కొడుకూ, వాడలో ఉండే పిల్లాడొకడు ఆ ఇసకలో ఆటలాడుతున్నారు. పక్కపక్కనే ఇళ్ళు కట్టుకుంటున్నారు.

“రాజు ఆ ఇల్లు కొనడం మాకు ఇష్టం లేదు పెద్దాయనా” అన్నారు. బెదిరిపోకుండా మాట్లాడాలని ముందే గట్టిగా నిర్ణయించుకున్నారు.

“అవున్రా మీలో ఎవడ్రా ఎం.ఎల్.ఎ దగ్గరికి వెళ్ళి ఇలాంటివి జరగనిస్తే మీకు మా ఊళ్ళో ఓట్లు పడవని చెప్పింది. రాజుకి రుణం మంజూరు చేయొద్దని బ్యాంకు మేనేజర్ మీద ఒత్తిడి తెస్తన్నారంట. ఎస్.ఐ. సుధాకరునీ, రాజునీ పిలిచి మీ ఇద్దరి మీదా ఏదో ఒక కేసు బనాయించి లోపలికి తోస్తే మీ ఉద్యోగాలు ఊడతయి అని బెదిరించాడంట. అంత మొనగాడయ్యాడేంట్రా వాడు. రాజుతో ఒక కేసు పెట్టిస్తే ఎస్.ఐ. దిమ్మ తిరగాలి” అన్నాడు పెద్దాయన రౌద్రంగా.

ఆయన్ని అంత కోపంగా ఎవరూ ఎప్పుడూ చూడలేదు. 

“పెదనాన్నా, మీరు చట్టం గురించి మాట్లాడుతున్నారా? అయితే మా నిర్ణయం వినండి. రాజు ఆ ఇల్లు కంటే నేను, తమ్ముడు ఊరి విడిచి వెళ్ళిపోతాము. మేము ఊరు విడిచి వెళ్ళిపోకూడదని ఏ చట్టంలోను లేదు కదా. అహ… తెలియక అడుగుతున్నానులే” అన్నాడు పెద్దోడు. 

జనం అవాక్కయ్యారు. ఇప్పుడు ఏం పిడుగు పడుతుందో అని గజగజా వణికారు. వాళ్ళ మూర్ఖత్వానికి సుధాకరు విస్తుపోయాడు ఈ ధారావాహిక ఏ మలుపు తిరుగుతుందోనని ఆడాళ్ళు పమిటలు నోటికి అడ్డంగా పెట్టుకుని చూస్తున్నారు. రాజు ముందుకొచ్చాడు. 

“మీరెవరూ మా కోసం ఊరొదిలి వెళ్ళక్కర్లేదు. నేనే మా అమ్మా నాన్నని పట్నం తీసుకెళ్దామనుకున్నా. మట్టి పిసుక్కుని బతికేవాళ్ళం కదా. ఈ మట్టిలోనే సావాలని వాళ్ళకు మమకారం, ఊరొదిలి రామంటున్నారు. మీరేమో ఊళ్ళో మట్టి వేరు, వాడలో మట్టి వేరు అంటున్నారు. అలానే కానివ్వండి. సుధాకరూ…. నేను మీ ఇల్లు కొనబోవడం లేదు. మీ మధ్య ఉంటే మాకు కొత్తగా ఒరిగేదేం లేదు. మీ సువాసనేం మాకు అబ్బదు” అనేసి వెళ్ళిపోయాడు.

జనాల ముఖాలు జేవురించాయి. ఉపన్యాసాలతో జనం మారరు. ఓ దెబ్బ పడాలనుకున్నాడు – ఏదో నిశ్చయానికి వచ్చినట్టు తల తాటించాడు పెద్దాయన.

‘వద్దు పెద్దాయనా ఊళ్ళో వాల్లు చంపేత్తారు’ అని నెత్తీ, నోరూ బాదుకున్నా వినకుండా, వీరాస్వామి కూతురు పెళ్ళికి కావల్సిన డబ్బు సాయం చేసి, అతడి ఇంట్లో రెండో వాటాలోకి పెద్దాయన మకాం మార్చేస్తా అన్నాడు. ఊరంతా గగ్గోలు పుట్టింది.

పెద్దాయన ఒక్క మాటే చెప్పాడు.

“నేను చట్టం గురించి మాట్లాడటం లేదు. ధర్మం గురించి మాట్లాడుతున్నాను. రాజు అమ్మానాన్న మన మధ్య ఉండడం మీకు ఇష్టం లేదు. నేను ఇక్కడ వాడలో ఉండదల్చుకుంటే తప్పేంటి?”

                              ******

ఏడాది గడిచిపోయింది. ధనుర్మాసం మొదటి రోజు. ఇప్పుడు దేవుడి పల్లకీ వాడలో వీధి వీధీ తిరుగుతోంది.

💐💐💐💐💐💐💐

No comments:

Post a Comment