Monday, March 31, 2025

 *చుక్కలన్ని చూస్తున్నాయీ.. కాంతారావు*
(వర్ధంతి సందర్భంగా...)

తెలుగు సినీరంగంలో నందమూరి, అక్కినేనిల హవా నడుస్తున్న రోజుల్లో, సినిమాలు పరిమితంగా నిర్మిస్తున్న కాలంలో మరో హీరోకి అవసరం ఉందన్న ఆలోచన సినీ పరిశ్రమ చేయని వేళ ఆ టాప్ హీరోల తర్వాత హీరోగా గుర్తింపు పొందిన అందాల నటుడు, జానపద హీరో, నాటి యువతుల కలల రాకుమారుడు *కాంతారావు*.

తాడేపల్లి లక్ష్మీ కాంతారావు అంటే  వెంటనే స్ఫురణకు రాక పోవచ్చు. కానీ 'కత్తి కాంతారావు' అంటే తెలుగు నాట తెలియని వారుండరు. వెండితెరపై జానపద కథానాయకుడిగా టి ఎల్ కాంతారావు వేసిన ముద్ర అలాంటిది. కత్తి పట్టిన జానపద వీరుడు అంటే ఇప్పటికీ మొదటగా గుర్తుకు వచ్చేది కాంతారావే. విఠలాచార్య, కాంతారావుల కలయిక అపూర్వం. ప్రేక్షకులకు గుర్తుండి పోయిన హీరో. ఆయన పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో సైతం మంచి పాత్రల ద్వారా అరుదైన అభినయాన్ని ప్రదర్శించారు. నారదుడిగా, కృష్ణుడిగా, అర్జునుడిగా కూడా నటించారు. ఎన్టీఆర్‌ రాముడిగా నటించిన 'లవకుశ' సినిమాలో లక్ష్మణుడిగా నటించిన కాంతారావు రాష్ట్రపతి అవార్డును కూడా అందుకున్నారు. ఆయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2000లో 'రఘుపతి వెంకయ్య అవార్డు' ప్రదానం చేసి సత్కరించింది. ఆయన స్వీయ చరిత్ర శీర్షిక 'అనగనగా ఒక రాకుమారుడు'.

తెలంగాణలోని నల్గొండ జిల్లా కోదాడ ప్రాంతంలో  గుడిబండ గ్రామంలో 16.11.1923న ఒక కరిణీకపు కుటుంబంలో పుట్టి, వంశపారంపర్య పట్వారీ వృత్తిమీద కన్నా ముఖానికి రంగువేసుకుని నటించటం మీద మక్కువ పెంచుకున్నాడు కాంతారావు. ఏడాది వయసులోనే తండ్రిని కోల్పోయారు. చదువుకునే రోజుల్లోనే నాటకాల పట్ల ఆకర్షితులయ్యారు. ఆపై వెండితెరపైకి వచ్చి నటుడిగా, నిర్మాతగా కూడా మరపురాని సినిమాలను అందించారు. తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు 'నిర్దోషి' చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. హెచ్‌.ఎం. రెడ్డి తీసిన 'నిర్దోషి' (1951), 'ప్రతిజ్ఞ' (1953) మొదలుకుని 450కి పైగా సినిమాల్లో నటించారు. విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జానపద చిత్రాల్లో కథానాయకుడిగా ధీరోదాత్తంగా నటించి పేరు సంపాదించారు. నిర్మాతగా 'సప్తస్వరాలు, గండరగండడు, ప్రేమజీవులు, గుండెలు తీసిన మొనగాడు' సినిమాలు తీశారు.

రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్భాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు మాటల్లో _తెలుగు చలనచిత్ర సీమకు రామారావు నాగేశ్వరరావులు రెండు కళ్ళైతే, వాటి మధ్య తిలకం వంటివారు కాంతారావు_. ఒక దశాబ్దంపాటు హీరోగా, రెండవ హీరోగా ఎన్నెన్నో పాత్రలు పోషించారు. నారదుడి పాత్రకు కాంతారావును తప్పించి మరెవరినీ ఊహించు కోలేనంతగా మెప్పించాడు. పౌరాణిక పాత్రలైన రాముడు, కృష్ణుడు పాత్రల్లోనూ ఎన్టీఆర్ తరువాత కాంతారావు గుర్తింపు పొందారు. జానపద హీరోగా కాంతారావుకి తిరుగులేదు.

కాంతారావు కుమారుడు రాజా 'సుడిగుండాలు' చిత్రంలో నటించాడు. ఆ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. యువ నటులు రావడం, జానపద చిత్రాలు తగ్గిన క్రమంలో, స్వయంగా 'సప్తస్వరాలు (1969), గండర గండడు (1969), ప్రేమ జీవులు (1971), గుండెలు తీసిన మొనగాడు (1974), స్వాతి చినుకులు (1989)' తదితర చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. సినీ ప్రొడక్షన్ లో ఏమాత్రం అనుభవం లేని కాంతారావు స్వయంగా సినిమాలు తీసిన సమయాన 1969 నాటికి తెలంగాణ రాష్ట్ర సాధన తొలిదశ ఉద్యమం సాగుతోంది. సినిమాలు ఆడే పరిస్థితి లేదు.. భారీ నష్టం!

ఈలోగా తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలింది. ఒక చిన్న పెట్టెతో హైదరాబాద్ చేరారు. చిరుపాత్రలు, టి.వి. సీరియళ్ళు చేశారు. 

ప్రేక్షకుల మనసులో చెరగిపోని ముద్ర వేసిన కాంతారావు, తన 85వ ఏట, 22.03.2009న క్యాన్సర్ వ్యాధి మూలంగా మరణించారు.

No comments:

Post a Comment