#అయ్యో_బంగారం!!
'ఎందుకు సర్, నన్ను అలా ట్రీట్ చేస్తాడు? నేనేం తప్పు చేశాను? నేను కూడా తనతో ఈక్వల్ గా జాబ్ చేస్తున్నాను. తనకంటే ఎక్కువ గానే సంపాదిస్తాను. నేను అందంగానే ఉంటాను. ప్రేమించేటపుడు అందంగానే కనిపించాను. పెళ్ళికి ముందు కనిపించని నా కులం ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది? నా తల్లిదండ్రుల గురించి పెళ్ళికి ముందు మంచిగానే కనిపించింది, ఇప్పుడెందుకు నీ పేరెంట్స్ అలా, ఇలా అంటున్నాడు? మా కిడ్ ని చూసుకోడానికి మా అమ్మ కావలి. కానీ మా అమ్మ మా ఇంట్లో ఉంటే నా మీద ఆమె ప్రభావం ఉంటుంది అంటున్నాడు.'
'ఓకే...'
'మొన్నటికి మొన్న, నాకు హెల్త్ బాగోలేదు. అయినా లీవ్ దొరకక ఆఫీస్ కి వెళ్ళాను. వచ్చాక పిల్లోడికి కావలసినవన్నీ చూసాను. మా అమ్మ వంట తనకు నచ్చదని నేనే వంట చేశాను. ఫ్రెండ్స్ తో గడిపి లేట్ గా ఇంటికి వచ్చాడు. తినేసి వచ్చాడట. ఆ సంగతి ముందే చెబితే నేను వంట చేసే దానిని కాదు కదా! త్వరగా పడుకుని మర్నాడు ఆఫీస్ కి వెళ్ళాలి. అయినా తన కోసం వంట చేశాను.'
'ఓకే...'
'ఆ రోజు రాత్రి రెండవుతుంది. నా హెల్త్ బాగోక పోవడం వల్ల కొంచెం దగ్గు వచ్చింది. ఎక్కువ కూడా కాదు. అంతే..! తన నిద్ర పాడుచేస్తున్నానని విపరీతంగా తిట్టాడు. దరిద్రపు గొట్టు దాన్నంట. నా మొహమే చూస్తేనే దరిద్రమట. ఇంకా బ్యాడ్ వర్డ్స్ కూడా తిట్టాడు. ఏంటి సర్ ఇది? దగ్గు రావడం కూడా తప్పేనా?'
'తప్పు దగ్గు రావడంది కాదు. తప్పు భార్య అవడం. ఎప్పుడయితే భార్య అయ్యావో అప్పుడే ప్రేమ చచ్చి పోతుంది. ఎప్పుడయితే భార్య అయ్యావో అప్పటి నుండే ఇంటరెస్ట్ తగ్గుతూ వస్తుంది. ఏ బంధం అయినా మొదట్లో తియ్యగా ఉంటుంది. క్రమంగా చేదుగా, వగరుగా, కారంగా మారుతుంది. ఏ ఇద్దరయినా కొంతకాలం కలసి ఉన్న తరువాత విభేదాలు రావడం సహజం. తరువాత కూడా వారిని ఒకరితో ఒకరిని కలిపి ఉంచేది స్నేహం తప్ప మరొకటి కాదు. చట్టం, సంస్కృతి, పిల్లలు వంటివి బలవంతంగా కలిపి ఉంచుతుంది. ఎక్కడయితే స్వేచ్ఛ లేకుండా బలవంతంగా కలిసి ఉండాల్సిన కండిషన్ ఉంటుందో అక్కడ రిజెక్షన్ స్టార్ట్ అవుతుంది.'
'వాళ్ళ ఆఫీస్ లో అమ్మాయిలతో చాలా బాగా ఉంటాడు సర్..'
'అవునమ్మా. వాళ్లంతా బయటి వాళ్ళు కదా.. ఒక వేళ మీ భర్తనే మిమ్మల్ని కాకుండా వేరే అమ్మాయిని చేసుకుని ఉండి, మీరు కనుక బయట పరిచయం అయ్యి ఉంటే. అప్పుడు మీరు ఇలా రాత్రి దగ్గు వచ్చింది అని చెబితే.. అయ్యో బంగారం!! అని ప్రేమ కురిపించే వాడు. మర్నాడు ఉదయానికల్లా దగ్గు మందు, పండ్లు అన్నీ పట్టుకుని నీ గుమ్మం ముందు ఉండేవాడు.'
No comments:
Post a Comment