Sunday, March 30, 2025

 ఓ యువకుడు ఆనందం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. గురువును కలిస్తే తెలుసుకోవచ్చని మిత్రులు సలహా ఇచ్చారు. ఏ గురువును కలిస్తే బాగుంటుందా అని వెదకసాగాడు.

అదే సమయంలో ఆ పట్టణానికి ఓ కొత్త గురువు రావడంతో సంతోషించాడు. అతణ్ని కలిసి ఆనందం అనేది ఎలా ఉంటుందో తెలియజేయమని కోరాడు. 'నీ కాలి చెప్పుల కొలత ఎంత?' అని ప్రశ్నించాడు గురువు. 'ఎనిమిది అంగుళాల'ని సమాధానమిచ్చాడు యువకుడు. 'ప్రస్తుతం నువ్వు వేసుకున్న ఎనిమిది అంగుళాల కొలత ఉన్న చెప్పులను పక్కన పెట్టు. ఏడు అంగుళాల చెప్పులు కొనుక్కో. వాటిని వేసుకుని ఊరంతా తిరిగి సాయంత్రం నా దగ్గరికి రా!' అని చెప్పి పంపాడు గురువు. ఆ యువకుడు ఏడు అంగుళాల చెప్పులు కొనుక్కుని కాళ్లకు తొడుక్కున్నాడు. నడుస్తున్న కొద్దీ ఇబ్బంది మొదలయ్యింది. అప్పుడప్పుడూ సరిగా నడవలేకపోయాడు. అయినా చెప్పులు విడిచిపెట్టకుండా తిరిగాడు. కాళ్ల నొప్పులు మొదలయ్యాయి. 'ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, చెప్పులను ఎప్పుడు విడిచిపెడదామా' అనిపించింది.

ఎలాగోలా ఆ రోజు సాయంత్రం వరకు గడిపాడు. క్షణం ఆలస్యం చేయకుండా గురువు దగ్గరికి వెళ్లి ఏడుపు ముఖంతో ఆయన ఎదుట నిలబడ్డాడు. గురువు చిన్నగా నవ్వి ఏడు అంగుళాల చెప్పులను తీసి పక్కన పెట్టమన్నాడు. అలాగే చేశాడు యువకుడు. 'ఇప్పుడు ఎలా ఉంద'ని అడిగాడు గురువు. 'ఆనందంగా ఉంద'ని బదులిచ్చాడు యువకుడు. 'నెత్తి మీద ఉన్న కొండంత బరువును పక్కన తీసి పెట్టినట్లుగా ఉంది. సరైన కొలతలు ఉన్న చెప్పులు తొడుక్కోకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాన'ని బాధపడ్డాడు. అప్పుడు గురువు.. 'మనం జీవితంలో కూడా ఇదే పొరపాటు చేస్తాం. సరైన చెప్పులు వేసుకోం. తప్పుడు కొలత జోళ్లు ఉపయోగిస్తున్నాం' అన్నాడు. ఆశ్చర్యంగా చూశాడు యువకుడు. 'మనకు ఉండాల్సిన మానవీయ విలువలను పక్కన పెడతాం. ధనం పట్ల ఆకర్షణ, వస్తువులపై వ్యామోహం, ఎదుటి వారి మన్ననల పట్ల మోజు, మనం గొప్ప అనే భావం మనసులో పెట్టుకుని జీవనం సాగిస్తుంటాం. కానీ, విలువలు వదలకుండా ఉన్నప్పుడే బ్రహ్మానందం లభిస్తుంది' అని ఆనంద రహస్యాన్ని  వివరించాడు గురువు.

No comments:

Post a Comment