🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀
తన కోపమే తన శతృవు.
తన శాంతమే తనకు రక్ష.
ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందామా.
కోపం...శాంతం
_______________
ఓ రాజు తనకు యుద్ధంలో విజయం సంపాదించిపెట్టిన తన సామంతులకు విందు ఇస్తూ,
తన అందమైన కుమార్తె చేత వడ్డింపజేస్తున్నాడు.
ఇంతలో ప్రచండమైన గాలి వీచి, దీపాలు ఆరిపోయాయి.
తరువాత రాకుమార్తె ఏడుస్తూ తండ్రిని చేరి,
ఒక సామంతుడెవడో తన చేయి పట్టుకొని లాగాడని,
తాను విడిపించుకొని వస్తూ అతని తలపాగాను లాక్కొచ్చానని,
దాని సాయంతో ఆతని ని శిక్షించమని చెప్పింది.
రాజు, ఆమెను ఊరుకోబెట్టి, దీపాలు వెలిగించాక, తన సామంతులతో
సంతోషకరమైన ఈ విందు సమయంలో అధికారాన్ని సూచించే తలపాగాలు ధరించవద్దని
అందర్నీ తీసేయమన్నాడు. అందఱూ తీసేసి, మరింత ఉత్సాహంతో విందారగించారు.
ఆ తరువాత తన చర్యను రాకుమార్తెకు వివరిస్తూ, రాజు,
ఆ సంతోషసమయంలో అతనిని శిక్షిస్తే, అది విషాదంగా మారుతుందని,
తమ సాటివాడు శిక్షకు గురయితే, అది మిగతావారికి క్షోభకరంగా మారుతుందని,
అందువల్ల ఓపికవహించానని, మనకు విజయం సాధించిపెట్టాడు కాబట్టి
నీవు కూడా అతనిని క్షమించలేవా? అన్నాడు.
రాకుమార్తె, అంగీకరించిందో లేదో మనకు తెలియదు.
ఒకనాడు రాజు వేటకు వెళ్లగా, పగబట్టిన శత్రువులు అదును చూసి, చుట్టుముట్టారు.
రాజు యుద్ధం చేస్తున్నాడు కానీ అలసిపోయాడు. అదే సమయంలో మెరుపులా దూకిన
ఒకడు, రాజుకు అండగా నిలబడి, శత్రువులందర్నీ ఊచకోత కోశాడు.
ప్రాణాలకు తెగించి, తన ప్రాణాలను కాపాడిన అతడికి రాజు కృతజ్ఞతలు తెలియజేయగా,
నా ప్రాణాలను కాపాడిన మీకే నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అని అతడన్నాడు.
ఆశ్చర్యపొతున్న రాజుతో అతడు విషయం తెలుపుతూ,
విందురోజున వీచిన గాలికి, అలంకరణార్థం ఏర్పాటుచేసిన స్తంభం ఒకటి
రాకుమార్తెమీద పడబోతుండగా తాను, విధిలేక
ఆమె చేయి పట్టుకొని, ఇవతలకు లాగానని,
అయితే మీరు పెద్దమనసుతో తనను క్షమించి, ప్రాణాలను తీయక వదలిపెట్టినందువల్లే
ఇప్పుడు మీ ప్రాణాలను కాపాడగలిగానని చెప్పాడు.
ఈసారి రాకుమార్తె అతణ్ణి క్షమించడం కాదు. అతడికే క్షమాపణలు చెప్పి ఉంటుంది.
ఈ కథ క్షమాగుణం యొక్క గొప్పతనాన్ని తెలుపుతోంది.
పైవన్నీ ప్రక్కన పెట్టండి. కోపం మనకు ఎలా శత్రువవుతుందంటే,
కోపం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి.
అనేక కెమికల్ టాక్సిన్స్ పుడతాయి. ఇవి మనకు చెరుపు కలుగజేస్తాయి.
రక్తప్రసరణవేగం హెచ్చుతుంది.
అంటే బిపికి రహదారి కోపం.
తలనొప్పులు వస్తాయి.
ముఖ కవళికలు మారతాయి. దాంతో ముఖం అందవిహీనంగా మారుతుంది.
నుదుటిన ముడుతలు ఏర్పడతాయి.
వాల్మీకి, రామాయణంలో రాముని వర్ణిస్తూ,
రాముని నుదుటి మీద ఎన్నడూ ముడుతలు ఏర్పడలేదని అంటాడు.
అంటే రాముడెప్పుడూ ప్రసన్నమైన మోముతోనే ఉండేవాడని అర్థం.
ఈ ప్రసన్నతే అంటే శాంతగుణమే ఆరోగ్యదాయిని.
చుట్టం అవసరంలో ఆదుకొన్నట్లు
మన దయాస్వభావం మనను అవసరంలో తప్పక ఆదుకొంటుంది.
తద్ద్వారా ఏర్పడిన సంతోషం ఇక్కడే స్వర్గాన్ని సృష్టిస్తుంది.
✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀
No comments:
Post a Comment