*Sunita Williams: సునీత వచ్చేసింది*
*కేప్ కెనావెరాల్: మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నవేళ.. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు.*
6 min read
By International News Desk
Updated : 19 Mar 2025 07:19 IST
*సురక్షితంగా భూమికి చేరిన భారత సంతతి వ్యోమగామి
ఆమెతోపాటు తిరిగొచ్చిన విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములు
ఫ్లోరిడా తీరంలో సాఫీగా దిగిన క్రూ డ్రాగన్ ...*
*క్రూ డ్రాగన్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చిన అనంతరం సునీతా విలియమ్స్ అభివాదం*
కేప్ కెనావెరాల్: మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నవేళ.. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు.
స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’.. వారిని సురక్షితంగా పుడమికి తీసుకొచ్చింది. సునీత, విల్మోర్‌లతోపాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఎస్‌ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో పుడమికి చేరుకున్నారు. అంతకుముందు- ఐఎస్‌ఎస్ నుంచి భూమికి వీరి ప్రయాణం నిర్దేశిత పరామితులకు అనుగుణంగా సాఫీగా సాగింది. కేవలం 8 రోజుల యాత్ర కోసం నిరుడు జూన్ 5న ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీత, విల్మోర్.. చివరకు ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చిన సంగతి గమనార్హం.

సముద్రంలో దిగిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక వద్దకు చేరుకున్న స్పీడ్ బోట్
*సహచరులకు వీడ్కోలు పలికి..*
*పుడమికి తిరిగి బయలుదేరే ముందు ఐఎస్‌ఎస్‌లోని వ్యోమగాములకు సునీత, విల్మోర్, నిక్ హేగ్, గోర్బునోవ్ వీడ్కోలు పలికారు. అంతా కలిసి ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు.
* అనంతరం సునీత బృందం తమ వస్తువులను ప్యాక్ చేసుకుని.. అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమై ఉన్న క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.15 గంటలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక తలుపు (హ్యాచ్) మూసివేత ప్రక్రియ జరిగింది.
ఉదయం 10.15 గంటలకు క్రూ డ్రాగన్.. ఐఎస్‌ఎస్‌తో విడిపోవడం (అన్‌డాకింగ్) మొదలైంది. 10.35 గంటలకు పూర్తిగా విడిపోయింది. భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని మొదలుపెట్టింది.
ఇందుకోసం పలుమార్లు రాకెట్ ప్రజ్వలన విన్యాసాలు చేపట్టింది. ఆ వెంటనే- భూమిపై ల్యాండింగ్ ప్రదేశం దిశగా కోసం క్రూ డ్రాగన్ ముందుభాగంలోని నాలుగు డ్రాకో ఇంజిన్ల ప్రజ్వలన మొదలైంది. ఏడున్నర నిమిషాలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశం (రీ ఎంట్రీ) కోసం కోన్ భాగాన్ని వ్యోమనౌక మూసివేసింది.
* రీ ఎంట్రీ సమయంలో తలెత్తే తీవ్రస్థాయి వేడి నుంచి వ్యోమగాములను సురక్షితంగా ఉంచే వ్యవస్థను ఆన్ అయింది. రీ ఎంట్రీ సమయంలో భూ వాతావరణంలోకి వ్యోమనౌక చాలా వేగంగా ప్రవేశించింది.
ఆ రాపిడి కారణంగా ఏకంగా 1650 డిగ్రీల సెంటిగ్రేడ్‌ల వేడి ఉత్పన్నమై.. వ్యోమనౌక చుట్టూ ప్లాస్మా పేరుకుపోయింది. దాంతో కొంతసేపు వ్యోమనౌకతో కమ్యూనికేషన్ తెగిపోయి (రేడియో సైలెన్స్) ఉత్కంఠ ఏర్పడింది.
వ్యోమనౌక చుట్టూ ఉష్ణ కవచం సమర్థంగా పనిచేసి.. ఆ వేడిని తట్టుకుంది. రీ ఎంట్రీ తర్వాత రేడియో సైలెన్స్‌ను ఛేదిస్తూ కమాండర్ నిక్ హేగ్ మాట్లాడటంతో... కమాండ్ సెంటర్‌లో అందరిలో ఆనందం వెల్లివిరిసింది.
సాగర జలాలకు 18 వేల అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని రెండు డ్రోగ్‌చూట్లు విచ్చుకున్నాయి. ఆ సమయంలో వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్లు. డ్రోగ్‌చూట్లు సమర్థంగా పనిచేయడంతో క్రూడ్రాగన్ వేగం గణనీయంగా తగ్గిపోయింది. వ్యోమనౌక వేగం గంటకు 190 కిలోమీటర్లకు చేరుకోగానే.. సాగర జలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో రెండు ప్రధాన పారాచూట్లు విచ్చుకున్నాయి. డ్రోగ్‌చూట్లు, పారాచూట్లు క్రూ డ్రాగన్ వేగానికి సమర్థంగా కళ్లెం వేయడంతో కమాండ్ సెంటర్‌లో చప్పట్లు మార్మోగాయి.
ఆపై ఫ్లోరిడాలోని తలహాసీ తీరంలో సముద్ర జలాల్లో వ్యోమనౌక నెమ్మదిగా దిగింది. నిమిషాల వ్యవధిలోనే స్పీడ్‌బోట్లలో అక్కడికి రికవరీ సిబ్బంది దూసుకొచ్చారు. పరిస్థితులన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని నిర్ధారించుకున్నాక.. వ్యోమనౌకను మేగన్ నౌకపైకి చేర్చారు.
ఆపై- లోపల ఉన్న నలుగురు వ్యోమగాములను స్పేస్‌ఎక్స్ సిబ్బంది జాగ్రత్తగా ఒక్కొక్కరినీ బయటకు తీసుకొచ్చారు. తొలుత కమాండర్ నిక్ హేగ్, ఆ తర్వాత వరుసగా అలెగ్జాండర్, సునీతా విలియమ్స్, విల్మోర్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చారు. క్రూ డ్రాగన్ నుంచి బయటకు రాగానే సునీత.. ఆనందంతో చేతులు ఊపుతూ అభివాదం చేశారు.
No comments:
Post a Comment