Monday, March 31, 2025

****గోపెమ్మ చేతిలో గోరుముద్దా రాధమ్మ చేతిలో వెన్నముద్దా ముద్దు కావాలా ముద్ద కావాలా ఆ విందా ఈ విందా నా ముద్దు గోవిందా!

 గోపెమ్మ చేతిలో గోరుముద్దా
రాధమ్మ చేతిలో వెన్నముద్దా
ముద్దు కావాలా ముద్ద కావాలా
ఆ విందా ఈ విందా నా ముద్దు గోవిందా!

 *Changalava* Kameswari 

"శుభోదయం మిత్రులందరికీ!

ఉదయన్నే కాఫీలు సేవించే  సమయాన ‌హేమిటిది ! అని కంగారు పడకండి.
మీ ఇల్లాలే మీ రాధమ్మయినా,
గోపెమ్మయినా! వాళ్లు పెట్టే గోరుముద్దలు, వెన్నముద్దలు, ముద్దూమురిపాలన్నీ  మీకూ, మీ పిల్లలకే కదా !
ఇంక గోపెమ్మ, రాధమ్మలు పెట్ఠేవన్నీ, ఆ ముద్దు గోవిందుడికే! మనకి కాదు.

కానీ, అమ్మ పెట్టే పాలబువ్వయినా, ఆవకాయన్నమయినా, పిల్లలకి అమృతమే! ఇప్పటికి కూడా  అమ్మ కలిపితే, మనమందరమూ రెడీయే కదా!  తినడానికి.

అమ్మ ప్రేమలోని కమ్మదనం, తనబిడ్డ రోజు రోజుకి, ఇంకా వొళ్లు చేసి (నాకు కాదు లెండి) ఆరోగ్యంగా పెరగాలని, ఎలా కలిపితే ఇష్టంగా తింటాడో! అనే ఆకాంక్షతో, వాత్సల్యంగా, ఆలోచించే అమ్మ మనసులోంచి, చేతి వేళ్ల గుండా కలిపిన అన్నంలోకి వచ్చేస్తుంది.
ఆ కమ్మనిముద్ద పిల్లలకి అమృతమయమవుతుంది.
ఇవన్నీ మీ అందరికీ  తెలియనివి కావు. కానీ, ఇప్పటి అమ్మలు కాబోయే అమ్మలకోసం, ఈ టాపిక్ ఇచ్చిన వారికోసమే రాస్తున్నాను 

బిడ్డలకి అన్నం పెట్టే తల్లి అలాంటి అమృత హృదయంతోనే పెట్టాలి. రకరకాల టెక్నిక్ లు ఉపయోగించాలి.
ఈ రోజుల్లో కొందరు పిల్లలకి అన్నం తినిపించాలంటే చాలా కష్టం. పూట ఫూటకూ ఒక యజ్ఞమే ! 
ఏ హొటల్ కెళ్లినా వాళ్లు తినరు, తల్లితండ్రులను తిననివ్వరు.
కాస్త జ్ణానం వచ్చిన పిల్లలు పర్వాలేదు. వాళ్లక్కావలసిన టిఫిన్స్ అయినా తింటారు.

"అదెందువల్లా! అంటే మొదట్లోనే వాళ్లకి తల్లులు అలవాటు చేసిన విధానాన్ని బట్టి ఉంటుంది. అన్నం కలిపే విధానం కూడా కారణం. అన్నం బిరుసుగా వండటం, మెత్తగా గుజ్జులా కలపకపోవడం, ఒక కారణం.వాళ్లు తింటారో, తినరో, తెలియకుండానే, ఒకే ఐటమ్ కంచం నిండా కలిపేయడం మరో కారణం.

వాళ్లు పప్పుఅన్నం ఇష్టపడినా, నాలుగయిదు ముద్దలు తినేసరికే, ఆ ఐటమ్ మొహం మొత్తేస్తుంది. తినకుండా మారాం మొదలెట్టేస్తారు.
మెత్తగా గుజ్జులా కలిపిన కొంచెం అన్నంలో నెయ్యి బాగా వేసి, చారు వేసి కలిపి, జారుగా ఉండేలా చేసి పెడితే, వాళ్లకి తెలీకుండానే చక్కగా తింటారు.
అది కూడా నాలుగు ముద్దలే పెట్టి, చివరగా మెత్తని అన్నంలో కమ్మని పెరుగు కాని, చిక్కని మజ్జిగ కాని, వేసి జారుగా, నోటికందిస్తే చక్కగా తింటారు.

చాలా తక్కువ క్వాంటిటీతో మొదలుపెట్టి వాళ్లు తినగలిగిన పది ముద్దలు రెండు మూడు రకాలుగా పెట్టడం, అలవాటు చేయాలి.ముద్ద, ముద్దకూ, నీళ్లు తాగుతామని వాళ్లడిగినా, ఏదో ఇచ్చామన్నట్లు, కొద్దిగా పట్టినట్లు చేయాలి.

అలా రోజూ సమయానుసారంగా, వాళ్లకు కబుర్లు చెప్తూ, కాస్త ఎంటర్‌టైన్‌ చేస్తూ అలవాటు చేయాలి. టీవీలు మొబైల్స్ అలవాటు చేయకుండా ఉంటే మంచిది.  కొద్దిగా ఎదిగాక, టిఫిన్ కి ముందు రెండు గంటలు భోజనానికి ముందు రెండుగంటలు వాళ్లకి అవీ ఇవీ పెట్టకూడదు.

కొందరిని చూసాను. సాయంత్రం ఏడుగంటలకి పాలు కలిపిచ్చి, ఎనిమిదింటికి అన్నం పెట్టడానికి రెడీ అయిపోతారు. అన్నం పెట్టడం ఒక పనిలా కాక పద్దతిగా పెట్టాలి నాల్గున్నరకి ఏవయినా తినుబండారాలు పెట్టి, పాలు కలిపిచ్చినా పర్వాలేదు. ఘనాహారం పెట్టే ముందు ద్రవాహారం ఇవ్బకూడదు. ఇదికూడా చాలామంది మమ్మీలకి తెలీదు.

ఉదయం స్కూల్ కి వెళ్లే ముందు, పాలు, టిఫిన్ ముందు పెట్టి, తినమని, త్రాగమంటే, ఏదో ఒకటే చేస్తారు. మిగతాది వేస్టే! అలాకన్నా ముందు లేవగానే మొహాలు కడగ్గానే, కాసిని పాలు రెండు బిస్కెట్స్ ఇచ్చి, స్నానం చేసి మొత్తం తయారయ్యాక, చేసిన టిఫినేదయినా కొద్దిగా పెడితే సరిపోతుంది.
హాడావిడిగా తినీ, తినకుండా, వెళ్లారే అన్నబాధ ఉండదు.

ఇప్పుడు స్కూలికి శెలవులు ఇస్తారు కదా! చక్కగా మీచేత్తో కలిపి ఇవ్వండి. 
తినే ముందు ప్రార్ధన చేయించండి. 
తిన్నాక దిష్టి తీయడం,
"ఇరుగు దిష్టి పొరుగుదిష్టి 
ఇంటి దిష్టి కంటి దిష్టి
తూ తూ అని వాళ్ల చేత అనిపిస్తూ, కంచం తిప్పి వాళ్ల చేయ్యి మూతి కడగండి.

జీర్ణం మంత్రం చదవడం కూడా వాళ్లకి ఎంటర్ టైన్ మెంట్ లాంటిదే!
"జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం !
మా పాపాయి/ బాబు,
 తిన్న అన్నం జీర్ణం! కుందిలా కూర్చుని ,పందిలా పాకి,
ఏనుగంత సత్తువిచ్చి, 
గుర్రమంత పరుగిచ్చి, 
హనుమంత రాయ్! సంజీవరాయ్ !అని హనుమంతరాయ్ పక్కన వాళ్ల పేరు కూడా కలపండి. "హేపీ" అయిపోతారు. 

ఇలా వాళ్లని మూడుపూటలా మనమేది వండితే, అది తినేలా చేయగలిగితే, వాళ్లకి ఆరోగ్యంతో పాటు  ఆహారపులవాట్లు కూడా  బాగా అలవాటు  అవుతాయి. 

మాలాగా అమ్మమ్మలు, బామ్మలు ఇంటిలో ఉంటే పర్వాలేదు. లేకుంటే కొంచెం కష్టపడాలి.  అమ్మ ఉద్యోగస్తురాలయితే కూడా కష్టమే!
ఆయాలు పిల్లలు ఈజీగా తింటారని ఒక గిన్నెలో పాలల్లో, చాకోస్, కార్న్ ఫ్లేక్స్ వేసి ఒక స్పూన్ వేసి, పిల్లలకి తినిపించేస్తారు. మనంత శ్రధ్దగా పెట్టరు. సెలవురోజుల్లో తల్లో, తండ్రో, ఆ బాద్యత తీసుకుని, వాళ్లకి చేత్తో తినిపించడం, తినమనడం అలవాటు చేస్తుండాలి.
స్పూన్ ఫీడింగ్ అలవాటు చేయకుండా ఉంటేనే మంచిది.

మేమంతా ఇళ్లల్లో గృహిణులుగా ఉండే వాళ్లం కాబట్టి, మాపిల్లలకి, మనవరాళ్లకు, సేమ్ అదే పద్దతి అలవాటు చేస్తున్నాము. కాని పాపం ! ఇప్పటి అమ్మాయిలు ఇవన్నీ చేయాలంటే  కష్టమే! కాని చిరుతిళ్లు ఎక్కువ అలవాటు చేయకుండా,
 కలిపేసి ఇస్తే, తినడం అలవాటు చేయండి. 

అందరూ కలసి, ఒకేసారి తినడానికి కూర్చుని వాళ్ల కంచం, గ్లాస్, వాళ్లది అన్నట్లుగా చెప్తే, అదేదో స్పెషల్ గా భావించి, మీతో కలసి తినడానికి ఇష్టపడతారు.మన ప్రయత్నం మనం చేయాలి. అయిదారేళ్ల  వయసులో అన్నీ తినడం అలవాటు చేస్తే మంచిది.

అదేంటో మా చిన్నప్పుడు, 'నాకదొద్దు ఇదొద్దు అనడమే తెలీదు, వెన్న వేస్తానంటే ఆవకాయన్నం మాగాయన్నం కూడా తినేవాళ్లం

మా పిల్లల దగ్గరికొస్తే, మా రవి ఏది పెట్టినా తినేవాడు. మా వసంత  అక్కడున్న ఐటమ్స్ అన్ని చెక్ చేసి, నాకేదో మెహర్బానీ అన్నట్లు,  ఏదో ఒకటి అది కూడా, మితంగా తినేది. 

కొందరయితే పుష్టిగా ఉన్న నన్ను, మా రవిని మావారిని, చూసి మీకు అబ్బాయంటే ఇష్టమేమో ! అబ్బాయికన్నీ పెట్టేసి ఆడపిల్లకి పెట్టడం లేదా? అని లేనిపోని నిందలేసేవారు.

"బాబోయ్ నాకాడపిల్లలంటేనే ఇష్టం!  అది ఏడు మల్లెలెత్తు ! మేము సన్నంగా అవము, ఇది లావవదు ! అనేదాన్ని.

పెళ్లయ్యాక అది కూడా, బొండుమల్లిలా తయారవడమే కాదు. అదే ఒండుకు తినాల్సి వచ్చేసరికి, అమ్మ వంట గుర్తొచ్చి రెసిపీలు అడిగి తెలుసుకుని, బ్రహ్మాండంగా వండేస్తోంది.

అయినా కొందరు తింటుంటే మనకి లేని ఆకలి పుట్టుకొస్తుంది. 
మరికొందరు ముఖ్యంగా అమ్మాయిలు వీళ్ల స్టైల్ మండా ! ఫేషన్స్ మీద ఉన్న శ్రధ్ద ఒంటిమీద ఉండదు. కడుపునిండా తింటారో, తినరో, కానీ, పెదాలకు వేసుకున్న లిప్ స్టిక్, పెంచిన గోళ్లకు వేసిన నెయిల్ పెయింట్ పోతుందేమో! అన్నంత సుతారంగా, వేళ్లతో కోడి కెక్కిరిస్తున్నట్లు కెలుకుతూ, ఒక్కొక మెతుకు నముల్తూ టిష్యూతో అద్దుకుంటూ, తింటుంటారు

అసలు అన్బీ తిని అరాయించుకోవాలంటే దంతసిరి వుండాలి. ఆరోగ్యం ఉండాలి. అకా ఒంటి ఊపిరితో ఉండి సంసారాలు బాద్యతలు ఎలా నిర్వహిస్తారో! పిల్లలని ఎలా కంటారో! పెంచుతారో ! దేముడుకి తెలియాలి! కన్నోళ్లకి కట్టుకున్నోళ్లకే తెలియాలి.

సరయిన ఆహారపు అలవాట్లు లేకుంటే, పిజాలు, బర్గర్,లు  బిరియానీలు, కేకులు, పానీపూరీలు ఇవే వాళ్ల ఆహారాలవుతాయి.

అందుకే మనమే వాళ్లని, నయానో భయానో నచ్చచెప్పి, అన్నీ తినేలా అలవాటు చేయాలి. వాళ్లు సరిగ్గా తింటేనే కదా నేర్చుకుంటారు. వాళ్ల పిల్లలకి చేసి పెట్టుకుంటారు. లేకుంటే కర్రీ పాయింట్లు, పిజా హట్స్, దిక్కు అంతే కదా! ఇవండీ ఇవాళ్టి ఆహారపు అలవాట్ల కాఫీ కబుర్లు!

No comments:

Post a Comment