Monday, March 31, 2025

 ఈ కథ కొంచం నిజం కొంచం కల్పితం. 

పరంధామయ్యగారి ప్రవచనాలు.

గోడమీద గడియారం వైపు చూసాడు పరంధామయ్య. టైము పది కావస్తోంది. ఇంకా పూజగదిలో గంట మోగలేదు. అంటే భార్యామణి అష్టోత్రం ఇంకా అవ్వలేదు, కాబట్టి ఇవాళ రెండో రౌండ్ కాఫీ లేటుగా వస్తుంది అన్నమాట. చిన్నగా ఒక నిట్టూర్పు విడిచి పొద్దున్న సోగం చదివిన పేపర్ తీసి ముందు రూము సోఫాలో కూర్చున్నాడు.

ఇంతలో ఆముదం తాగినట్లు మొహం పెట్టుకుని వాళ్ళ రూములోంచీ కొడుకు వచ్చాడు. ఎదురు సోఫాలో చికాగుగా కూలబడుతున్న వాడిని చూసి, " ఏమిటిరా ! ఏమయింది. నువ్వూ కోడలు పిల్ల ఏమైనా అనుకున్నారా". పెళ్లయి పట్టుమని మూడు నెలలు కూడా అవలేదు అప్పుడే ఏమైందా అని అనుమానంగా అడిగాడు.

"చూడు నాన్నా, నీ కోడలు, 'స్నానంకి వెళ్తున్నా' అంటేనే నాకు భయం వేస్తుంది. అరగంట అయ్యింది లోపలికి వెళ్లి, ఇంకా రాలేదు. పదకొండింటికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయలు దేరుదాం అన్నాను. తాను ఎప్పుడు వచ్చేను, ఎప్పుడు వెళ్లేను మేము".

"ఓస్సి, అంత దానికేనా నీ తుమతుమలు. ఇంకా ఎమైందా అని భయపడ్డాను". అంటూ చిన్నగా నవ్వాడు పరంధామయ్య. "నువ్వు ఎప్పుడూ కోడలికే సపోర్ట్ నాన్న". "కాదురా రోజూ ఆఫీసుకి హడావిడిగా చేసి వెళ్తుంది. కాస్త సెలవు రోజే కదా అమ్మాయికి తీరిగ్గా చేసే అవకాశం వచ్చేది పాపం".

"ఎంత సెలవైతే మరీ గంటలుగంటలా నాన్న!.." విసుగ్గా అన్నాడు కొడుకు. "ఆడవాళ్లకీ స్నానానికి అవినాభావ సంబంధం వుంటుందిరా. మొన్న వినాయక చవితి రోజు నీ చేతనే, కథ అంతా చదివించాను కదా, అయినా నీకు అర్థం అవ్వలేదూ దాని తాత్పర్యము".

"అసలు ఆడవాళ్ళ స్నానానికి వినాయక చవితి కథకీ ఏమిటి సంబంధం నాన్న. నువ్వు మరీ ప్రతి దానికి పురాణం మొదలెడతావు". అది కాదురా మన పురాణాలు మన జీవన విధానం కోసమే రాశారు. సరే వినాయకోత్పత్తి చదివావుగా. అసలు ఈ స్నానంతోనే కథ అంతా సాగుతుంది కదా. అందులో శివుడు రాకకోసం ఎదురు చూస్తున్న పార్వతీ దేవి ఏమి చేసింది. స్నానానికి వెళ్దాము అని ప్రయత్నం మొదలు పెడుతుంది.అవి ఇవి సర్దుకుని పోనీ వెంటనే వెళ్లిందా, లేదు ఏదో ఆలోచిస్తూ ఆ సున్నిపిండితో ఇంత బుజ్జి పిల్లాడిని చేసింది. అంటే అర్ధం ఏమిటి, ఆడవాళ్లు తీరిక ఉన్నప్పుడు, ఏదైనా ఫంక్షన్ కి తయారు అవుతూ, స్నానానికి  వెళ్తాం అనగానే మనలాగా వెంటనే టవల్ పట్టుకుని వెళ్ళిపోరు. ఏదో సర్దుకుని, కావాల్సిన సరంజామా ఏర్పరుచుకుని, మధ్యలో ఏవో ఆలోచించుకుంటూ కాలక్షేపం చేసి అప్పుడు వెళ్తారు.

అమ్మవారు బుడతడిని తయారు చేసిందా, చేసి తన శక్తిని ధారపోసి జీవం పోసింది, పోసి ఏమి చెప్పింది. నువ్వు వెళ్లి కాపలా కాయి ఎవ్వరినీ లోపలికి రానివ్వకు అంది. అంటే ఏమిటి అర్థం. నేను తయారయి వచ్చేదాకా ఆ తలుపు నుంచి లోపలికి ఎవ్వరూ రావద్దు అని. అది జీవిత సత్యం. ఆడవాళ్ళు తయారు అయ్యేదాకా మనము డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి నచ్చదు, సయించరు. 

సరే అని మన బుజ్జి వినాయకుడు వెళ్లి తల్లి మాట పాటిస్తాడు. శివుడు వచ్చాక, ఇద్దరూ ఎవరు నువ్వు అంటే ఎవరు నువ్వూ అని యుద్ధం మొదలెడతారు. ముందు చిన్న పాటి యుద్ధానికే భూమి కంపించినట్టయింది. ముక్కోటి దేవతలు ఏమైందా అని పరిగెత్తుకు వస్తారు. బయట ఇంత కోలాహలం జరుగుతున్నా అమ్మవారు ఎక్కడ ఉన్నారు. బాత్రూంలో ఇంకా స్నానంలోనే....

మన పక్కింటి ప్రకాశంలాగా, తన పని అయినా కాకపోయినా వేలు పెట్టే ఇంద్రుడు వచ్చి, నేనూ యుద్ధం చేస్తా అంటూ దేవతల బలగాన్ని తెస్తాడు. ఘోర యుద్ధం జరుగుతుంది. అయినా అమ్మవారు ఏరి. పాపం స్నానం అవలేదు...

ఇంక శివుడికి సహనం పోయి, కన్నెర్ర చేస్తాడు. రుద్ర తాండవం చేస్తే భూమి, ఆకాశం దద్దరిల్లాయి, లోకం అల్ల కల్లోలం అయింది. ఇంత జరుగుతున్నా, పార్వతీ అమ్మవారు....  "ఇంకా రెడీ అవ్వడంలోనే వుంది" అందుకున్నాడు సుపుత్రుడు.

"దీని బట్టి అర్థమైందా, మనం బయట ఎంత తతంగం చేసినా వాళ్ళు తీయాలని అనుకున్నప్పుడే తలుపు తీస్తారు అని. అమ్మవారు స్నానం త్వరగా ముగించి వుంటే రెండు యుద్దాలు జరిగేవే కాదు కదా! ". 

వింటున్న కొడుకు ఆలోచనలో పడ్డాడు. తండ్రి చెప్పిన దానిలో పాయింట్ వుంది అనుకున్నాడు. "అయితే నాన్న, నేను తను బయటకి వచ్చినా ఏమి అనకూడదు అంటావా". "ఒరేయ్ ఇంత జరుగుతున్నా రాని పార్వతీ దేవి, కొడుకు తల నరకంగానే, పాత సినిమాలలో క్లైమాక్స్ కి వచ్చే పోలీసులలాగా వచ్చి, పడి వున్న కొడుకుని చూసి రోదించి, శివుడిదే తప్పు అనగానే... అప్పటిదాక దేవతలు భయపడేట్టు రుద్ర తాండవం చేసిన ఆయన, అసలు నాకు కొడుకులే లేరు అని వాదించిన ఆయన, పార్వతీ దేవి కోపం చూసి, మన బిడ్డ అనగానే మారు మాట్లాడక, వెళ్లి ముందు ఏది కనిపిస్తే అది అని, బావున్నా బాలేకపోయినా, సూట్ అవుతుందా లేదా అని చూడకుండా ఒక ఏనుగు తల తెచ్చి ఆ బుడ్డోడికి పెట్టి ప్రాణం పోసి, భార్యని శాంతింపచేస్తే కానీ ఆయన కాళ్ళు చేతులు ఆడలేదు. కాబట్టి భర్తగా మన ఏకైక కర్తవ్యం భార్యని ఆనందంగా చూడటం. ఇది మనం ఆ ఆదిదంపతుల నుండీ, ఆ కథనుండీ నేర్చుకోవాల్సిన నీతి.

No comments:

Post a Comment