Sunday, March 30, 2025

 *అత్తగారు - కొత్తకోడలు - పునాది*

*" హూ.. నాకూ ఇంట్లో హెల్ప్ దొరికితే నేనూ నీలా ప్రమోషన్ తెచ్చేసుకునేదాన్ని, నాకు బరువులు ఇవ్వడమే తప్ప, నా బరువులు పంచుకునేవాళ్ళు ఒక్కళ్ళూ లేరు మా ఇంట్లో " అని అత్తగారు వినేలాగా కీర్తనతో మాట్లాడుతోంది లయ..*

*అత్తగారు రజని అప్పుడే మనవరాలు మనవడికి కధ వినిపిస్తూ నోట్లో ముద్దలు పెడుతూ అన్నం తినిపించేసింది.. ఇద్దరికీ చెయ్యి తిప్పి దిష్టి తీసేసి సింక్ లో చెయ్యి కడుక్కుంటోంది రజని...*

*" మీ పాతకాలం దిష్టి తీయడాలు అవీ ఈ కాలం ఫాస్ట్ పిల్లలకు చిరాకుగా అనిపిస్తాయి, ఎందుకు నేను వద్దూ అన్నా రోజూ చేస్తారలా " అని రజనీని సాధిస్తోంది లయ...*

*లయ భర్త రాకేష్, రెండేళ్ళ కాంట్రాక్ట్ మీద విదేశంలో పని చేస్తున్నాడు...*

*అత్తగారి తోడుతో ఇద్దరు పిల్లలను చూసుకుంటోంది లయ...*

*చూసుకుంటున్నాను అని లయ అనుకోవటమే కానీ ఇంటి పనంతా, మనవడు మనవరాలి పనంతా, రజనీనే చూస్తోంది, చేస్తోంది....*

*పదేళ్ళ కిందట రజనీ భర్త ముకుంద బతికున్నప్పుడు లయ కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు రజనీ నోరు పెద్దది, లయని చాలా సాధించేది...*

*తరువాత పిల్లలు సిటీలో సెటిల్ అయ్యి వచ్చేసాక లయ ఇంటిపనంతానూ, తమ పెద్దలిద్దరినీ చూసుకున్న తీరూనూ, గుర్తు తెచ్చుకుని, లయ లేని లోటు తెలిసి, బాగా అర్ధం అయ్యాక, రజని మనస్తత్వం లో కాస్త కాస్త మార్పు వచ్చింది. లయతో స్నేహంతో ఉండాలని నిర్ణయించుకుంది..*

*కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది...*

*లయకి మనసుకి మొరటుతనం వచ్చేసింది. అత్తగారు కొత్తకోడలిగా వచ్చిన తనని కూతురుగా కాదు కదా కనీసం మనసున్న ఓ మనిషిగా కూడా చూడలేదన్న బాధ లయ మనసుని స్పందన లేకుండా, అత్తగారంటే గౌరవం జాలి లేకుండా చేసేసింది...*

*ఫలితంగా ఇప్పుడు లయ నోరు ఎక్కువగానే వాడుతుంది. రజని కష్టంగా అనిపిస్తున్నా కూడా ,*
*నా అన్న కుటుంబం ఇహ వీరే కదా అని పంటిబిగువన కోడలి నిరాదరణను భరిస్తోంది...*

*ఆ రోజు చిన్ని మనవడి బర్త్ డే .. పార్టీ హడావుడి అలసట అన్నీ కలిసి అదే రాత్రికల్లా రజనికి జ్వరం వచ్చింది.. వెనకాలే కీళ్ళనొప్పులూ బయటపడ్డాయి... లయకి మర్రోజున ఆఫీసుకి శెలవు పెట్టక తప్పలేదు. ఫోన్ లో బాస్ తిట్లు సాధింపులు కూడా లయకి తలనొప్పి తెప్పించాయి...*

*పిచ్చికోపంలో లయ రజనీని అంటోంది " ఒకటే దొరికాయి కదా అని అయిస్ క్రీమ్ మీద అయిస్ క్రీమ్ తినేసి జ్వరం తెచ్చేసుకుని పడకేసారు, మీకే ఇంటిపని మీరు చెయ్యకపోతే చచ్చినట్టు నేను చేసుకుంటానులే అనే ధీమా.. మరి నా ఆఫీస్ పని ఎవరు చేస్తారు, నేను చేయాల్సిన పని పూర్తి కాదు అని అక్కడ నా బాస్ తిట్లు.. మీ అబ్బాయేమో, ఎక్కడో హాయిగా బతికేస్తున్నాడు, కానీ నాకేమో ముసలిదానివి నీ సంరక్షణ చిన్నపిల్లలిద్దరి బాధ్యతల బరువు మోయాల్సొస్తోంది, ఛీ ఛీ గాడిద బతుకయిపోయింది నాది " అని తల కొట్టుకుంటూ ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తోంది కాసేపయినా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయక తప్పేలా లేదని...*

*కోడలి మాటలకి కోపం కాకుండా జాలే వేసింది రజనికి .. లేచి కోడలికి అయినంత సాయం చేయాలని ప్రయత్నంలో పైకి లేచి రెండడుగులు వేసిందో లేదో ఉన్నట్టుండి కళ్ళు గిర్రున తిరిగి వెనక్కి విరుచుకు పడిపోయింది రజని... సోఫా మీద తల పడినా పక్కనున్న టీపాయ్ కి వళ్ళు తగిలి శబ్దం వచ్చింది...*

*టక్కున లయ అత్తగారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది...రజనీకి బీపీ పెరిగి పడిపోయింది.. అత్తా అత్తా అని పిలుస్తూ మొహం మీద నీళ్ళు జల్లినా రజనీ స్ప్రృహలోకి రాలేదు.. వెంటనే పిల్లలు పక్కింటావిడ సాయంతో రజనీని  కారులో కూర్చోబెట్టి హాస్పిటల్ కి తీసుకెళ్ళింది లయ...*

*బీపీ చాలా హై గా ఉందని హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకుని చికిత్స మొదలుపెట్టారు. పిల్లలిద్దరూ దిగాలుగా లయని కరచుకుపోయారు అమ్మా నానమ్మకి ఏమయ్యిందీ అని అడుగుతూ*

*ఏమీ కాలేదమ్మా జ్వరం వచ్చింది తగ్గిపోతుందిలే అని పిల్లలకి సర్దిచెప్పి మనసులోనే దేవుణ్ణి ప్రార్ధించుకుంది మా అత్తమ్మకి ఏమీ జరగకూడదు భగవంతుడా ఆవిడ మళ్ళీ హుషారుగా ఇంటికి తిరిగిరావాలి అని*

*స్వతహాగా లయ మంచి మనసు కల మనిషే.. పెళ్ళయ్యి పుట్టింటి నుంచీ అత్తింటికి వెళ్ళగానే అది ఒక స్వాగతించే ఇల్లులా కాకుండా నియమనిబంధలతో నడిచే హాస్టల్ లాగా రజనీ లయకి అత్తింటిని పరిచయం చేయటం వలన మెట్టినింటి మనుష్యులతో సరిగ్గా కలవలేకపోయింది లయ.. అటు పుట్టింటి మమకారాలు అప్పుడప్పుడూ మాత్రమే  దొరుకుతూ , అత్తింట ప్రేమ కంటే సాధింపులు ఎదురవటంతో మనసు విరిగి యంత్రంలా మారసాగింది లయ...*

*24 గంటలు మూసిన కన్ను తెరవలేదు రజని. బ్రెయిన్ హేమరేజ్ అయితే జరిగిన సూచనలు లేవుకానీ స్ప్రృహలోకి రాకపోవటం ఎందుకో అని డాక్టర్లు వారిని మించి లయ కంగారుపడ్డారు... అత్తగారు ఇంట్లో అన్నీ చేసేవి ఒకటొకటిగా గుర్తు రావటం తాను ఏ విధంగా ఆవిడలో లేని తప్పులు ఎత్తిచూపి మాటలతో సాధింపులతో ఆవిడని గాయపరచటం అన్నీ ఒకటొకటిగా గుర్తు వచ్చి లయ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ భర్తకి ఫోన్ లో తన అంతర్మధనం చెప్పుకుని సారీ సారీ అని చెప్పుకునేది.*

*భర్త రాకేష్ " లయా, అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం నీ మీద అమ్మకి కాస్త కూడా కోపం లేదు తెలుసా " అని చెప్పేవాడు..అయినా సరే లయ ఎప్పుడు రజని కళ్ళు తెరచి తనను చూసి ప్రేమగా పలకరిస్తారా తానూ ప్రేమగా ఆవిడ నుదురు తల తాకి ఆవిడ తనకెంత ముఖ్యురాలో చెప్పాలని తహతహలాడిపోతోంది...*

*బీపీ పెరుగుతూ తగ్గుతూ ఉంది రజనికి, అప్పుడప్పుడూ కళ్ళు తెరిచి మళ్ళీ మత్తులోకి జారిపోతోంది.. లయకి నెమ్మది నెమ్మదిగా కంగారు పెరుగుతోంది.. పిల్లలు కూడా అమ్మా నానమ్మ రోజూ ఈ టైమ్ కి ఇది చేసేది మాకు అది చేసేది మాకు ఎప్పుడు నిద్ర లేస్తుంది నానమ్మ అని ఒకటే కలవరిస్తున్నారు.. లయకి అత్తగారు పిల్లలను ఎంత బాగా చూసుకున్నారో ఇంకా స్పష్టంగా తెలిసొచ్చింది.. తనకే తెలియకుండా లయ కళ్ళల్లోంచీ నీళ్ళు కారిపోతున్నాయి అత్తగారి పలకరింపు కోసం ఎదురుచూపుతో...మూడోరోజున పూర్తి స్ప్రృహలోకి వచ్చింది రజని.. లయని పిల్లలనీ చూడాలని ఆత్రంగా అడిగింది.. లయ పిల్లలు గబగబా ఆవిడ దగ్గరకు వెళ్ళారు..*

*అత్తమ్మా ఎలా ఉందిప్పుడు మీకు అని ఆప్యాయంగాఅడుగుతూ లయ రజని నుదురుని తలని ప్రేమగా నిమురుతోంది.. పిల్లలు నానమ్మ చేతికి ముద్దులు పెట్టి నానమ్మా అని నవ్వుతూ పిలుస్తూ కేరింతలు కొడుతున్నారు...*

*వారం తరువాత పూర్తి స్వస్ధత తో ఇల్లు చేరింది రజని. లయ తన ఆఫీస్ కి నాలుగు రోజులు శెలవు పెట్టేసింది అత్తగారిని దగ్గరుండి చూసుకోవాలని.. లయకి వచ్చిన కోపం తగ్గి, రజని కి వచ్చిన పరిణితి కలసి అత్తాకోడలు ఇద్దరూ  స్నేహంగా ఉండగలగటం అలవాటుగా చేసుకుని బావుంటున్నారు ఇప్పుడు.*

*ఏ బంధానికి అయినా " పునాది " ( ఫౌండేషన్ ) సరిగ్గా పడితే బంధాలు చెదురుమదురు కాకుండా పదికాలాలపాటు పదిలంగా ఉండగలవు...*

No comments:

Post a Comment