Monday, March 31, 2025

 *విశిష్ట చారిత్రక తెలుగు మహిళలు - 29*

*తొలి తరం మహిళా సంపాదకురాలు - పులుగుర్త లక్ష్మీనరసమాంబ*
----------------------------

*ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్*' అన్నారు. మహిళలకు విద్యావకాశాలు లేని రోజుల్లో ఒక వనిత ఒక పత్రికకు సారధ్యం వహించడం సాధారణమైన విషయమేమీ కాదు. 

ఆ రోజుల్లో స్త్రీలలో విద్యావంతులు అతి స్వల్పం. వారిలో రచనా వ్యాసంగం పై అభిరుచి ఆసక్తి, సామర్థ్యం ఉన్నవారు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో 1904 జనవరిలో *సావిత్రి*' అనే పేరుతో మహిళల కోసం ఒక మహిళ పత్రిక ప్రారంభించారంటే ఆశ్చర్యం కలుగుతుంది.

పులుగుర్త లక్ష్మీ నరసమాంబ కవయిత్రి. చింతలపూడి నీలాచలం గారి కుమార్తె. పులుగుర్త వెంకట రత్నం గారి సతీమణి. ఆమె పితామహ మాతామహులు కవి పండితులు. పండితుడు, విమర్శకాగ్రేసుడు నడకుదుటి వీరరాజు ఆమెకు మేనమామ. కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు ఈమె గురువు. 

ఆయన వీరేశలింగం గారి సంఘ సంస్కరణ భావాలను వ్యతిరేకించేవారు. ఈమెపై ఆ ప్రభావం కొంత మేరకు ఉన్నా స్త్రీ విద్య పట్ల అభిమానం ప్రదర్శిస్తూ గ్రంథ రచన సాగిస్తూ *సావిత్రి* పత్రికలో స్త్రీల రచనల్ని ప్రోత్సహించేవారు.

లక్ష్మీ నరసమ్మ తెలుగు దేశంలో మొదటి మహిళా సంఘంగా గుర్తించబడు '
*విద్యార్థినీ సమాజాన్ని*' కాకినాడలో స్థాపించారు. తన 15వ ఏట *మహిళా కళా బోధిని*' గ్రంథం రచించారు. 

ఈమె రచించిన వ్యాసాలు సావిత్రి పత్రికలోనే గాక *హిందూ సుందరి*, *జనని* మొదలైన పత్రికల్లోనూ ప్రచురింపబడేవి. హిందీ, బెంగాలీ భాషల్లో ప్రవేశం ఉన్న నరసమాంబగారు ఆ భాషల్లోని పుస్తకాలను కూడా అనువదించారు. *లోకబాంధవి, కామ మంజరి మొదలైన గద్య గ్రంథాలు, యోగీశ్వరి, అన్నపూర్ణ, వామన పురాణం, మహిళా కళా బోధిని, స్త్రీ నీతి గీతమాల, సతీధర్మములు, అమూల్య మొదలైన పద్య కావ్యాలు, మంగళహారతులు* రచించారు.

*సావిత్రి* పత్రికకు ముందే *హిందూ సుందరి* అనే మహిళా పత్రిక 1902లో మాడభూషి చూడామణి, కళ్లేపల్లి వేంకట రమణమ్మలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కొంత కాలం తర్వాత సారధ్యం మారి బాలాంత్రపు శేషమ్మ గారు సంపాదకత్వం వహించారు.

లక్ష్మీ నరసమాంబ గారు ప్రారంభించిన *సావిత్రి*' పత్రిక తొలి సంచిక (1904 జనవరి) హైద్రాబాద్లోని స్టేట్ ఆర్కైవ్స్ ఉంది. రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో లభ్యమౌతున్న 1910 నవంబరు సంచిక పై నాలుగవ సంపుటం, ఐదవ సంచిక అని ముద్రించబడింది. మధ్యలో కొంత కాలం పత్రిక వెలువడలేదని భావించాల్సి ఉంటుంది. 'ప్రతి మాసమున కొకసారి స్త్రీల కొరకు ప్రకటించబడుతున్న పత్రిక' అని పత్రికలో వ్రాసేవారు. పత్రికా భాష శుద్ధ గ్రాంథికం. పత్రికను ప్రోత్సహించవలసిందని పత్రికాధిపతులు లక్ష్మీ నరసమాంబ ఇలా విజ్ఞప్తి చేసారు. "సోదరసోదరీమణులారా! వ్యయప్రయాసల కోర్చి స్త్రీల విద్యాభివృద్ధి కొరకే పత్రికను ప్రకటించుచున్నాము. తపాలాఖర్చు, కాగితపు ఖర్చు. అచ్చు ఖర్చులకు సంవత్సరాంతమునకు పంపెడు పత్రికలకు రూ.1-0-0 అగుచున్నది. తక్కిన గుమస్తాఖర్చు, ఉత్తర ప్రత్యుత్తరములకగు పోస్టు ఖర్చు మున్నగునవి మేము భరించుచున్నాము. ఈ పనియందు మేమభిలషించిన స్త్రీ విద్యాభివృద్ధియే మాలాభము. కాబట్టి విద్యాభిమానులెల్లరు మా ఉద్యమమునకు దోడ్పడి మేమందించ బోవుచున్న వి.పి.పి స్వీకరింప బ్రార్దించుచున్నాము.

*సతీ ధర్మాలు, నీతి కథావల్లరి* లాంటి నీతి బోధకమైన రచనలు. *ధైర్యస్థైర్యాలు*, *సావిత్రి, లోక బాంధవి* లాంటి నాటికలు ఇందులో వచ్చాయి. *అబలా సచ్చరిత్ర మాల* ఈ పత్రికలోనే వచ్చింది. వేద కాలం నుంచి స్త్రీల స్థితి గతుల వర్ణన ఇందులో ఉంది. స్త్రీల రచనల్ని ప్రోత్సహించడం ఈ పత్రిక లక్ష్యాల్లో ఒకటి. 1910 జూన్ నెలలో గుంటూరులో జరిగిన ప్రథమ ఆంధ్ర మహిళా సదా ఉపన్యాసాలను కూర్చి ఒక పుస్తకంగా వెలువరించినట్లు సావిత్రి పత్రికలొ
ప్రకటించారు. 

ఈ పత్రిక సనాతన దృక్పధం కలిగి వితంతు వివాహాలను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. కౌసల్య, కుంతి, ఉత్తర, అహల్యాబాయి, మొదలైన వారి విమల చరిత్రము లాచరించే వారిగా చేయడం తమ ఉద్దేశంగా సంపాదకురాలు ప్రకటించారు. 

వితంతు కాంతలకు వైరాగ్యాన్ని బోధించడం, వారిని స్వతంత్ర జీవనం చేయగలవారిగా తీర్చిదిద్దడం పత్రిక ఉద్దేశాల్లో ఉన్నాయి. లక్ష్మీ నరసమాంబ గారు ఈ పత్రికను కాకినాడ నుంచి నడిపేవారు. 1923 వరకు ఈ పత్రిక వెలువడినట్లు తెలుస్తోంది.

*ఓం నమో శ్రీవేంకటేశాయ!!*
(సమాప్తం)

No comments:

Post a Comment