Monday, March 31, 2025

 కథ పేరు: సృష్టి తిరగబడితే
రచన: కోడూరి తిరుమల మాధవి.

సాయంత్రం ఆరున్నర అవుతోంది మా బుజ్జి గాడి "హోమ్ వర్క్" టైమ్  స్కూల్ నుండి వచ్చాక కాసేపు ఆడుకుని ఆరున్నర కి హోమ్ వర్క్ చేయడం వాడికి అలవాటు.

ఎప్పటిలా స్కూల్ బ్యాగ్ తీసుకుని వచ్చి నా ముందు కూర్చున్నాడు" అమ్మా ఈ రోజు నాకు ఒక లెసన్ చెప్తావా!" అన్నాడు, "ఏం లెసన్? ఏదీ చూపించు అన్నాను" వాడు మోరల్ సైన్స్ బుక్ తీసి అందులో రామాయణం లోని ఒక పాఠం చూపించాడు,"సరే విను అని కథ చెప్పడం మొదలు పెట్టాను".

అయోధ్య అనే రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజు కి ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి, అని
చెప్పగానే మా వాడు మధ్యలో ఆపుతూ " అమ్మా అదేంటి నాన్నకు నువ్వు ఒక్క దానివే భార్యవు కదా! మరి ఆ రాజుకు ముగ్గురు భార్యలు అంటా వేంటి? అని అడగగానే పక్కనే పేపర్ చదువుతూ వున్న మా శ్రీ వారు ఫక్కున నవ్వుతూ  "అదీ అలా అడగరా నానీ" "నేను కూడా ఇంకో పెళ్ళి చేసుకుంటాను అంటే మీ అమ్మే వప్పుకోవడం లేదు" అనేసరికి "చాల్లె నోరు ముయ్యండి ఏంటా మాటలు పసి పిల్లాడి దగ్గర "అని కసురుకుని  అప్పటికి వాడికేదో సర్ది చెప్పి పంపించేశాను.

వాడు వెళ్ళాక మా వారు నాతో "నేను ఆన్న దాంట్లో తప్పేముందోయ్ నువ్వు రోజూ పూజించే దేవుళ్ళకు కూడా ఒక్కక్కరికి ఇద్దరేసి భార్యలు వున్నారు కదా! అనే సరికి నేను ఆలోచనలో పడ్డాను. 

ఆలోచిస్తే మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది, దేవుళ్ళను చూసినా మన పురాణాలను చూసినా బహు భార్యా తత్త్వమే కనిపిస్తుంది.

ఇంక చరిత్ర చూస్తే రాజులందరికీ ఎక్కువ మంది భార్యలే వున్నారు. కొందరికి ఇద్దరు, ముగ్గురు భార్యలు ఉంటే, ఇంకా కొంత మందికి ఏకంగా పది మంది పన్నెండు మంది ఇరవై మంది భార్యలు కూడా ఉన్నారు.

ఇదెక్కడి న్యాయం చెప్పండి, భర్త భార్యను తనకు మాత్రమే సొంతం అని ఎలా అనుకుంటాడో! భార్య కూడా అంతేకదా ఎంత రాజైనా తన భర్తకు తాను పదవ భార్య గానో పన్నెండవ భార్య గానో ఉండటానికి ఏ స్త్రీ ఇష్టపడుతుంది? 

ఎంటో ఆది నుండి ఈ సమాజం లో స్త్రీ కి ఒక న్యాయం, పురుషుడి ఒక న్యాయం నడుస్తోంది. మగాడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా సమాజం ఒప్పుకుంటుంది,  పైగా అది మగతనం అంటుంది. అదే పని ఆడమనిషి చేస్తే పతిత, కులట, వ్యభిచారి, బరితెగించింది అంటూ బిరుదులు ఇస్తుంది.

స్త్రీ మాత్రం భర్తను తప్ప పరాయి మగవాన్ని కన్నెత్తి చూడడం కూడా మహా పాపం ,అది పతివ్రతా లక్షణం కాదని అలాంటి స్త్రీ కి పుట్టగతులు ఉండవని అటువంటి స్త్రీ వల్ల ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు నరకానికి పోతాయని బోధిస్తుంది.

దేవుళ్ళ లో కానీ, పురాణాలలో కానీ, చరిత్ర లో కానీ ఎక్కడా స్త్రీ కి ఇద్దరు ముగ్గురు భర్తలు ఉన్నట్టు కనపడరు.ఒక్క మహా భారతంలో ద్రౌపతి కి తప్ప అది కూడా ఆమె  కోరుకున్న వరం వల్ల అలా జరిగింది అంటారు.

అలా చూసుకున్నా పంచపాండవులకు ద్రౌపతి వున్నా మళ్ళీ వారందరికీ విడి విడిగా వేరే భార్యలు వున్నారు.

పురాణాలలో కూడా పతివ్రతల గురించి చెప్పారే గానీ ఒక్క సతి వ్రతుడి గురించి అయినా చెప్పారా?  ఎందు కంటే లేరు కాబట్టి.

ఇప్పుడు కూడా సమాజం లో భార్య పక్కనే వున్నా  పక్క చూపులు చూసే మొగుళ్ళు ఎంత మందో వున్నారు, ఇద్దరు పెళ్ళాలు వున్న వాళ్ళు వున్నారు. భార్యకు తెలియకుండా చిన్నిల్లు మెయింటెయిన్ చేసేవాళ్ళు వున్నారు, అప్పుడప్పుడూ చిరుతిండ్లు 
తినేవారు వున్నారు.

 కానీ ఆడవాళ్ళు మాత్రం గడప దాటకుండా పతియే ప్రత్యక్ష దైవం అని పవిత్రం గా వుండాలి అని కోరుకుంటారు.

సినిమాలు కూడా ఆయనకు ఇద్దరు, ఏమండీ ఆవిడ వచ్చింది, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు ఇవన్నీ సూపర్ డూపర్ హిట్లు , ఈ సినిమాలకు కోట్లలో కలెక్షన్లు,
అదే ఆవిడ కిద్దరు, ఎవమ్మోయ్ ఆయనొచ్చాడు, ఇంట్లో మొగుడు బాత్రూమ్ లో ప్రియుడు, ఇద్దరు మొగుళ్ళ ముద్దుల పెళ్ళాం అని సినిమాలు తీస్తే ఎవరైనా చూస్తారా? పైగా  దుమ్మెత్తి పోస్తారు.

అప్పుడు మాత్రం మన వాళ్ళకు  దేశ సంస్కృతి గుర్తుకు వస్తుంది, మన దేశం, మన దేశ సంస్కృతి ఏమై పోతోంది అంటూ మైకులు విరిగి పోయేలాగ ప్రసంగాలు ఇస్తారు.
నాకు తెలియక అడుగుతాను దేశ సంస్కృతి ఒక్క ఆడవాళ్ళ చేతుల్లోనే ఉందా? మగవాళ్ళ చేతుల్లో లేదా? మగవాళ్ళు చేస్తే లేని తప్పు ఆడవాళ్ళు చేస్తే వచ్చిందా?

ఆడవాళ్ళు మాత్రం ఇలాగే వుండాలి అదే సభ్యత అదే సంస్కృతి అని చెప్పే సమాజం మగవాడు కూడా ఇలాగే వుండాలి అని ఎందుకు చెప్పదు?

ఇదేం న్యాయం? అంటూ ఆవేశం తో ఆవేదనతో మాట్లాడి కాస్త ఆయాసం కూడా రావడం తో ఆగాను,

మా వారు మౌనంగా లేచి వెళ్ళి మంచి నీళ్ళ గ్లాసు తెచ్చి నాకు అందిస్తూ " కాస్త శాంతించు  సుజాతా నీ ఆవేదన నాకు అర్ధం అయింది, కాక పోతే మనది తర తరాలుగా యుగ యుగాలుగా పురుషాధిక్య సమాజం, ఇది కాదనలేని నిజం.

నువ్వన్నట్లు దేవుళ్ళు కానీ పురాణాలలో కానీ అన్ని చోట్లా బహుభార్యా తత్వం కనపడుతుంది. దీనికి కారణం ఏమిటో నేను పూర్తిగా చెప్పలేక పోయినా.
తరువాత రాచరిక వ్యవస్థలో రాజులు వారి వంశాలను వృద్ధి చేసుకోవడానికి ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి ఎక్కువ మందిని పెళ్ళి చేసుకునే వారట.

ఏది ఏమైనా అనాది నుండి పురుషుడు స్త్రీ ని ఒక భోగ వస్తువు గా, విలాస వస్తువుగా, పిల్లలను కనే యంత్రం  గానే చూసాడు అన్నది  నిజం.

మొదటి నుండీ మీ ఆడవారికి సమాజం లో అన్యాయమే జరిగింది. కన్యా సుల్కం , సతీ సహగమనం, వరకట్నం, ఇలా ఎన్నో సామాజిక దురాచారాలను ఎదుర్కొన్నారు.

ఇప్పుడు కాలం మారింది, పరిస్థితులు మారుతున్నాయి, స్త్రీ లు కూడా విద్యావంతులు అవుతున్నారు, మంచి , చెడు తెలుసుకుంటున్నారు,అన్యాయాన్ని ఎదిరిస్తున్నారు. కాబట్టి తప్పకుండా సమాజం లో మార్పు వస్తుంది.

ఏమో అసలే ఆడపిలల సంఖ్య తగ్గిపోతూ ఉంది.మగపిల్లలకు పెళ్ళిళ్ళు కావడమే కష్టంగా వుంది, 1000 అబ్బాయిలకు 943 అమ్మాయిలు మాత్రమే ఉన్నారంట, ఇది ఇలాగే కొనసాగితే 
సృష్టి తిరగబడి నువ్వు అన్నట్టు బహు భార్యా వ్యవస్థ పోయి బహు భర్తా వ్యవస్థ వస్తుందేమో చూడు" అన్నారు.

అది విన్న నేను "వద్దండీ బాబూ అది అసలే వద్దు అన్నాను కంగారుగా"
"ఏం ఎందుకని" అని అడిగారు.
"ఎందుకండీ బాబూ ఇంకో దరిద్రాన్ని మా నెట్టిన పెడతారు,ఇప్పటి దాకా భరించినవి చాలదా? ఒక మొగుడి తోనే వేగలేక, చాకిరీ చేయలేక చస్తున్నాం.
ఇంకా మా మొహాలకు ఇద్దరు ముగ్గురు మొగుళ్ళు కూడానా...! 
అప్పుడు అంత మంది మొగుళ్ళకూ చాకిరీ చేయలేక చావాలి, అంత మందికీ పిల్లల్ని కనాలి, అంత మంది మొగుళ్ళతోనూ వేగాలి, అంత బంపర్ ఆఫర్ మా ఆడవాళ్ళ కు వద్దు లెండి అన్నాను.

దానికి మా వారు పగలబడి నవ్వి "నిజమే నోయ్ ఈ కోణం లో నేను ఆలోచించలేదు  సుమీ, భలే చెప్పావు అన్నారు.

          ****శుభం****

No comments:

Post a Comment