కథానిక : 'చంద్ర శిల'
రచన: ద్విభాష్యం రాజేశ్వరరావు
'మూన్ రాక్ ఎగ్జిబిట్ !'
'చంద్రశిల ప్రదర్శన !'
తెల్లని గుడ్డ మీద పచ్చని అక్షరాలు మెరిసిపోతున్నాయి. ఆవరణ నిండా తోరణాలు! హాలు నిండా తోరణాలు! రంగురంగుల కాగితాల తోరణాలు!!
విశాలమైన ఆవరణ. వింత కాంతిని విరజిమ్ముతున్న లోపలి హాలు. ఆవరణ నిండా కార్లు! ఎండలో తళ తళ మెరుస్తున్నాయి! మిలమిల్లాడుతున్నాయి!!
గేటు నుండి వరండా వరకు పెద్ద క్యూ!
వరండా దాటి హాలు లోనికి వెళ్లడానికి మరింత పెద్ద క్యూ. సుమారు ఫర్లాంగ్ పొడవున పాములా మెలికలు తిరిగిన క్యూ! టెర్లిన్ చొక్కాలు, రేయాన్ ప్యాంట్లు, రంగురంగుల చీరలు, గాజుల గలగలలు, ఖరీదైన సెంటు వాసనలు... ఎండ భరించలేని సుందరాంగుల నిట్టూర్పులు.... క్యూ కదులుతోంది... మెల్లగా, హుందాగా, నిండుగా.
ముందు జనంతో పాటు నేనూ కదులుతున్నాను.
చంద్రశిలను దర్శించాలనే కుతూహలం చంపుకోలేక, ఆఫీసుకు సెలవు పెట్టి మరీ వచ్చాను. పొడుగాటి క్యూ ను చూస్తే నిరుత్సాహం, విసుగు కలిగిన మాట వాస్తవం. కానీ చంద్రశిలను చూడాలనే ఆసక్తి వాటిని జయించింది .
"అసలు ఈ చంద్రశిల ఎలా ఉంటుందంటారు ?"
నా ముందు నిలబడిన బట్టతలాయన, ముందున్న గిరజాల పెద్దమనిషిని అడుగుతున్నాడు.
గిరజాల పెద్దమనిషి వేదాంతిలా నవ్వేడు. పేరిస్ నుండి వచ్చిన పెద్దమనిషి, ఆది మానవుడి వైపు చూసినట్టు బట్టతల ఆయన వైపు చూశాడు!
తర్వాత ముఖం మీద పడుతున్న గిరజాల జుట్టు వెనక్కి నెట్టుకుంటూ అన్నాడు "మన రోడ్డు పక్కన ఉండే కంకర రాయిలా ఉందట! నిన్న మా అల్లుడు చూశాడు... మా అల్లుడు జియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు లెండి..."
"అంతేనా? ఇంకా మెరిసిపోతూ ఉంటుందనుకున్నాను!" అంటూ తన ఆస్తి అంతా పోయినట్టు మొహం పెట్టి నిరుత్సాహ పడి పోయాడు బట్టతలాయన.
'చంద్రశిలను పట్టుకొచ్చి, ఈ బట్ట తల మధ్యలో పెడితే ఎటువైపు దొర్లుతుందా?' అని ఆలోచిస్తున్నా నేను .
"దానిమీద చిన్న చిన్న రంద్రాలు కూడా ఉన్నాయట! ఆ శిల నిండా కార్బన్ ఎక్కువగా ఉంటుందని మా అల్లుడు చెప్పాడు...." గిరజాలాయన ఇంకా ఏదో చెప్పకుపోతున్నాడు. వాళ్ళ అల్లుడే చంద్రశిలకు అధారిటీ అయినట్లు అభివర్ణిస్తున్నాడు .
క్యూ ముందుకు కదులుతోంది.
కాంప్లిమెంటరీలతో వచ్చినవాళ్లు క్యూ ని దాటుకొని, విడిది ఇంట్లోకి వెళుతున్న మగ పెళ్లి వారికి మల్లె హుందాగా, దర్జాగా లోపలికి దూరిపోతున్నారు.
వరండాలోకి వెళ్ళగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది .చల్లని నీడలో సముద్రపు గాలి తగిలి హాయిగా ఉంది.
వరండాలో ఒక వారగా నిలబడి ఇద్దరు పోలీసులు బీడీలు కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రజల క్రమశిక్షణ మీద వాళ్లకు దారుణమైన నమ్మకం ఉంది కాబోలు, అసలు క్యూ దగ్గరకు రాకుండా దూరంగా ఉండిపోయారు.
క్యూ ముందుకు కదిలింది. వరండా దాటి హాలు లోనికి అడుగుపెట్టాను.
హాలు లోని ట్యూబ్ లైట్ లు తెల్లని కాంతిని విరిజిమ్ముతున్నాయి. హాలు గోడలు పాలలో ముంచి తీసినట్లు తెల్లగా మెరుస్తున్నాయి. గోడకు రంగురంగుల అంతరిక్షనౌకల చిత్రాలు అమర్చబడ్డాయి. తెల్లని దీపాల కాంతి ముందు, గాజు పలక మీద వ్యోమగాముల చిత్రాలు మెరిసిపోతున్నాయి. మైక్ లో అందమైన ఆడకంఠం ఆంగ్లంలో అంతరిక్ష యాత్రా విశేషాలను అభివర్ణిస్తోంది. యాత్రకైన ఖర్చు వివరాలు చెబుతోంది.
నా ముందున్న బట్టతలాయన నా వైపుకు తిరిగి," అమ్మో! అన్ని కోట్ల డాలర్లే?! అంత డబ్బు ఉంటే ఇండియాలో కొన్ని లక్షల బిల్డింగ్స్ కట్టేయొచ్చు!... ఏమంటారు?" అన్నాడు.
"అవును! కొన్ని కోట్ల కిళ్ళి బడ్డీలు కూడా పెట్టుకోవచ్చు!" అందామనుకున్నాను. కానీ ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను. బట్టతలాయనకు నా చిరునవ్వు రుచించలేదు కాబోలు, ముఖం చిట్లించుకుని ముందుకు తిరిగి పోయాడు.
గోడ మీద ఉన్న 'ఈగల్' నమూనాను తిలకిస్తున్నాను. చంద్రుని ఉపరితలం మీద దిగటానికి అనువుగా అది ఎలా తయారు చేయబడిందో... దాని నిర్మాణంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో... అవన్నీ విడమర్చి చెబుతున్నాడు అక్కడ నిలబడ్డ గైడ్.
ఇంకాస్త ముందుకు వెళితే వ్యోమనౌకల అనుసంధానాన్ని చూపించే చిత్రం ఉంది.
దాన్ని దాటి వెళ్తే, ఎదురుగా ఉంది చంద్రశిల!
తెల్లని నైట్రోజన్ జార్లో భద్రపరిచారు దాన్ని! మూడు స్టీల్ లెగ్స్ మీద అతి పొందికగా ఉంది. బాదం కాయ కంటే కాస్త పెద్ద పరిమాణంలో, నలుపు రంగులో, చిన్నచిన్న రంధ్రాలతో చూడటానికి మాత్రం కాస్త పేలవంగానే ఉంది! అన్ని వైపులా కనబడేలా 'నైట్రోజన్ జార్' మెల్లిగా తిరుగుతోంది. కొద్ది క్షణాల పాటు దాని వంకే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను! అది కేవలం శిలే కావచ్చు! కానీ అది అలా తిరుగుతూ ఉంటే, దాని వెనుక వందలాది మంది మేధావుల ప్రజ్ఞ, శ్రమ కనిపించింది!! మానవుడు భూమి మీద పుట్టాక సాధించిన అతి మహత్తర కార్యాల్లో ఇదొకటి! సందేహం లేదు! విశ్వ మానవ కళ్యాణానికి చంద్రలోక యాత్ర ఏ విధంగా ఉపకరిస్తుందో యోచిస్తూ , హాలు దాటి బయటకు వచ్చాను.
నా ముందున్న బట్టతలాయనకు పూర్తిగా ఉత్సాహం చచ్చిపోయినట్లుంది."ఇలా ఉంటుందంటే నేను రాకపోదును... రిక్షాకు రెండు రూపాయలు దండుగ!" అంటూ విసుక్కుంటూ వెళ్లిపోయాడు.
ఆవరణ దాటి జనాన్ని తప్పించుకుంటూ రోడ్డు మీదకు వచ్చాను. వచ్చే పోయే వాహనాలతో, మనుషులతో చాలా సందడిగా ఉంది రోడ్డు. ఒక వారగా వెళ్లి జనసమ్మర్థం అట్టే లేని చోట నిలబడ్డాను. నా మిత్రుడు భాస్కరరావు '12 గంటలకు ఇక్కడకు వస్తాను!' అని చెప్పాడు !ఇద్దరం కలిసి ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్లాలని అనుకున్నాం!
"బాబు! రెండు రోజులు బట్టి గుక్కెడు గంజి కూడా లేదు!... ఐదు పైసలు ఉంటే ధర్మం చేయండి!"
పక్కకు తిరిగి చూశాను .
ఎవరో ముసిలిది! దాని వయస్సు ఏడు పదులకు పైబడి ఉంటుందని ముడతలు పడ్డ దాని ముఖమే చెప్తోంది. జుట్టు పీకి పారేసిన తాటి టెంక కి మల్లే అసహ్యంగా ఉంది. తెల్లని కళ్ళు రెండూ లోతుకుపోయి, చూడడానికి భయం కలిగిస్తున్నాయి! ఎండిపోయిన దాని గుండెలు చూస్తే, అసలు ఆమె పుట్టాక యవ్వనం చూడకుండా వృద్ధాప్యంలో అడుగుపెట్టినట్లుంది!!
దాని చేతుల్లోని ఖాళీ డబ్బా వడవడా వణుకుతోంది. రెండో చేతిలోని కర్ర మీదే ఆధారపడి నిలబడింది ఆమె.
"బాబు! ఐదు పైసలు ధర్మం చేయండి!.. మారాజులు!" ముసలిది గొణుగుతున్నట్లు మెల్లిగా అడుగుతోంది.
జేబులోంచి ఐదు పైసలు తీసి ముసలి దాని డబ్బాలో పడేసాను. "నూరేళ్లు బతుకు బాబు!.." అంటూ వణుకుతూ దీవించింది .
ఐదు పైసలకు నూరేళ్లు చొప్పున నా జేబులోని చిల్లరంతా దానం చేస్తే, ఎన్ని వందల ఏళ్ళ ఆయుష్షు నాకు కలిసి వస్తుందో లెక్కలు కడుతూ, నిలబడ్డాను.
" ...అయితే బాబూ... ఇదంతా ఏటి? ఇయేళ ఇక్కడ ఇంత మంది వచ్చారేటి ?".పక్కకు చూశాను. ఇంకా ముసలిది అక్కడే ఉంది !
తన ప్రశ్నకు సమాధానం కోసం నా వంక చూస్తోంది.
" అమెరికా వాళ్ళు చంద్రుని మీదకు వెళ్లి; అక్కడ నుంచి రాళ్లు, మట్టి పట్టుకొచ్చారు. అందులో ఒక రాతిని ఇక్కడ చూపిస్తున్నారు." అన్నాను.
"ఏటి?.. ఆకాశం మీద సెంద్రుడిలోంచే?!...."
"కాదు! భూమి మీద చంద్రుడిలోంచి!.." కసురు కున్నాను.
" ఏంటి బాబు... నేను ముసలి దాన్నని ఏళాకోళంచేస్తున్నావేటి? లేకపోతే, సెంద్రుడిలోకి వెళ్ళడమేటి?... రాళ్లు పట్రాడం ఏటి?.." "నిజమే మామ్మా... రాకెట్ మీద అక్కడికి వెళ్లారు. అది కూడా మన భూమి లాగే ఉంటుంది. అక్కడ తవ్వి రాళ్లు పట్టుకొచ్చారు. అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటే రేపటి నుంచి మనం కూడా రాకెట్ మీద జూమ్ అని వెళ్లి చక్కా రావచ్చు!"అన్నాను హుషారుగా.
"అయితే బాబు... అక్కడ కూడా మనలాటి మనసులు ఉన్నారా?"
"అబ్బే! లేరు!"
"మరక్కడేటున్నాదక్కడ?" ఆసక్తిగా అడిగింది ముసిల్ది.
రావాల్సిన మిత్రుడు ఇంకా రాలేదు. అందుకే ముసలిదానితో సంభాషణ పొడిగించాను.
" అక్కడ కూడా భూమి మీద లాగే కొండలు, గోతులు, రాళ్లు రప్పలు ఉన్నాయి. అక్కడ మనుషులు బతకడానికి వీలు ఉంటుందేమో చూస్తున్నారు. బంగారం లాంటి ఖరీదైన లోహాలు ఏమైనా ఉంటే భూమ్మీదకి తెస్తారు!"అన్నాను.
"అయితే వాటి వల్ల మనకు లాభం ఉంటదా?"
"ఎందుకు ఉండదు?... ప్రపంచం అంతా సిరి సంపదలతో తులతూగిపోతుంది." అన్నాను హుషారుగా.
ముసలిదానికి ఈ వాక్యం అర్థమైనట్టు లేదు!
నా వైపు ఆశగా చూస్తూ," ఏటి బాబూ...?" అంది.
" అవన్నీ భూమ్మీదకి తెస్తే కావలసినంత డబ్బు మామ్మా! ఇంక దరిద్రం అనేది ఉండనే ఉండదు!!" అన్నాను.
ముసలి దాని ముఖంలో కాస్త ఆశ కనపడింది .నల్లని కనుపాపల వెనుక రవంత వెలుగు!!
నాకు మరి కాస్త దగ్గరగా వచ్చి కర్ర ఆసరా చేసుకుంటూ అడిగింది "నేను ఓ మాట అడుగుతాను... కోప్పడకు బాబు!.. మరి మాలాటోళ్లు అందరకీ కూడు గుడ్డ దొరుకుద్దా?"
ముసిల్ది బోసినోరు తెరుచుకొని, గుడ్లు పెద్దవి చేసి కుతూహలంగా నా వైపు చూస్తోంది, సమాధానం కోసం.
ముసలిదాని ప్రశ్న కాసేపు నన్ను తికమక పెట్టింది!
'నిజమే!! ప్రపంచం సౌభాగ్యవంతం కావచ్చు! కానీ, ఆ సౌభాగ్యంలో ఈ ముసలి దానికి వాటా ఉందో? లేదో?!'
ముసలి దాన్ని చూస్తే జాలి వేసింది. అది పట్టు పరుపులు, ఎయిర్ కూలర్లు, విహారయాత్రలు, పంచభక్ష్య పరమాన్నాలు అడగటం లేదు.దానికి కావాల్సింది ప్రకృతి తాకిడి నుండి రక్షించుకోవడానికి, మానాన్ని సంరక్షించుకోవడానికి చాలినంత బట్ట !ప్రాణం నిలబెట్టుకోవడానికి గుక్కడిగంజి! పట్టెడు అన్నం!! అవి లభిస్తే ప్రపంచం ఎలా పోయినా ముసలిదానికి సంబంధం లేదు. దానికి అవి దొరుకుతాయని కచ్చితంగా ఎలా చెప్పగలను?!
'ఒక వైపు ప్రగతి పరిగెడుతోంది. శాస్త్రం వృధ్ధి అవుతోంది. నిత్యజీవితంలో మనిషి ఎన్నో సుఖాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనసులోని ఊహలకు మల్లె అతి వేగంగా ఎగిరి, ఎక్కడికి కావలిస్తే అక్కడకు చేరుకోగలుగుతున్నాడు.
ఇంకొక వైపు మానవత నశిస్తోంది. పగా, దౌర్జన్యం పెరిగి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నశించి, తను నిర్మించుకున్న ఆయుధాలతో తనవారినే బలి పెడుతున్నాడు. కొంతమంది తిండికి బట్టకు ముఖం వాచి, దినం గడపడమే కష్టంగా బతుకుతున్నారు. ఈ రెండింటికి సమన్వయం ఎక్కడ?
ఏ శాస్త్రం.. ఏ ప్రగతి.. ఏ కళ.. దీనిని సమన్వయ పరచగలదు?! ప్రతి మనిషికి నిత్య జీవితానికి అవసరమైన వన్నీ లభించే పరిస్థితి ఎలా వస్తుంది?'
ఆలోచిస్తున్నాను .ఎక్కడా తలా తోక అందటం లేదు!
నేను సమాధానం చెప్పలేదని కాబోలు, ముసల్ది కర్ర టక టక లాడించుకుంటూ రోడ్డు అవతల వైపుకు మెల్లిగా కదిలిపోతోంది. కదిలిపోతున్న ముసలిదాని ముఖంలో ఎంతో ధైన్యం ఉంది. తెల్లగా పాలిపోయిన దాని గాజు కాయల్లాంటి కళ్ళలో ఎంతో విషాదం ఉంది. నీరసంగా నడుస్తున్న దాని అడుగుల్లో ఎంతో నైరాశ్యం ఉంది. కొంతసేపు కదిలిపోతున్న ఆమె వైపే తదేకంగా చూస్తూ నిలబడిపోయాను .
అంతలో రాకాసి అరుపులాంటి హారను!
కీచుమంటూ కారు ఆగిన చప్పుడు, ఆ చప్పుడులో కలిసిపోయి, లీలగా వినిపించిన మూలుగు, నా చెవులకు సోకాయి!
కళ్ళు తిరిగినట్లు అయింది !!
దెయ్యంలాంటి కారు చక్రాల ముందు ముసల్ది బోర్లా పడి ఉంది! చేతివేళ్లు రోడ్డు మీద మట్టిని కౌగిలించుకుంటున్నాయి. దాని తల పగిలి కారిన రక్తం పీచులాంటి జుట్టును తడిపి, పక్కలకు పరుచుకుంటోంది. తలపక్కనే ఉన్న నల్లని కంకర రాయి, రక్తంలో తడిసిన చంద్రశిలలా మెరుస్తోంది. ఆ దృశ్యం చూస్తూ ఉంటే కడుపులో దేవినట్లు అయింది. క్షణం సేపు కళ్ళు బైర్లు కమ్మాయి! మనుషులందరూ కారు చుట్టూ గుమి కూడారు. కారు లోని మనిషి ఇంగ్లీషులో ఏదో సర్ది చెబుతున్నాడు. లోపల వరండాలోని పోలీసులు ఇద్దరు కారు వద్దకు వచ్చారు. నాకు మనసంతా దిగులుగా అయిపోయింది!
'ఆ ముసలిది చచ్చిపోయింది! అవును చచ్చిపోయినట్లు చలనంలేని ఆమె శరీరమే చెప్తోంది!!
ముసిలిది నిశ్చయంగా చచ్చిపోయింది. కొద్ది క్షణాల క్రితం అది నన్ను అడిగిన ప్రశ్న ఇంకా చెవుల్లోనే సుడులు తిరుగుతోంది!
' మరి మాలాటోల్లకి అందరికీ కూడూ, గుడ్డా దొరుకుద్దా?'అని.
ఇప్పుడు దానికి కూడు అక్కర్లేదు! ఎవరైనా దయచేసి ఇస్తే శవం మీద కప్పటానికి రెండు గజాల గుడ్డ కావాలి! అంతే!! భయంకరమైన దృశ్యాన్ని చూస్తూ ఇక అక్కడ నిలబడలేక ముందుకు నడిచాను.
చంద్రశిల ప్రదర్శన ఆవరణలో క్యూ ఇంకా ముందుకు కదులుతూనే ఉంది.....
(1970 జ్యోతి మాసపత్రిక దీపావళి ప్రత్యేక సంచిక నుండి)
No comments:
Post a Comment