వంటిల్లే నా గతా ఏమిటీ ?
ప్రభాకర్ పెదపూడి
సుందరయ్యగారు తెల్లారకుండానే నిద్రలేచి, సందు చివర మాణిక్యం దగ్గర పాల ప్యాకెట్ తీసుకొచ్చి బ్రూ కాఫీ కలిపి, తాను తాగి, మరో గ్లాసు అప్పుడే వాకిట్లో ముగ్గు వేసి వస్తున్న రత్నానికి అందించారు. "ఏవండోయ్! సుందరంగారూ మీకు వయసు వచ్చి ఆకారంలో మార్పు వచ్చింది కానీ, మీరు కలిపే బ్రూ కాఫీలో రుచి ఏమాత్రం తగ్గలేదండి, అద్భుతం" అంటూ ఇద్దరి గ్లాసులూ తీసుకుని వంట గదివైపు నడిచారు రత్నంగారు.
భార్య మెచ్చుకోలు మాటలకు సుందరయ్యగారు ఉప్పొంగిపోయారు. ఇదిగో రత్నం, ఈ రోజుకి నువ్వు అన్నం ఒకటి వార్చు, మిగిలినవి నేను వండుతాను. నీరసంగా ఉంది అంటున్నావు" సుందరంగారు స్నానానికి బయలుదేరుతూ అన్నారు. "అయ్యో మీకెందుకండీ అనవసరమైన శ్రమ, మీరలా ఉండండి పావుగంటలో తోటకూర పప్పు, ములక్కాడల రసం చేసి పడేస్తాను అన్నారు రత్నంగారు. ఇదిగో రత్నం నాకు కోపం తెప్పించకు. నువ్వు అలా పీటమీద కూర్చుని కబుర్లు చెబుతూ ఉండు, నిమిషాల్లో పని పూర్తి చేస్తాను" కోపం నటిస్తూ అన్నారు సుందరయ్యగారు.
చెప్పిన విధంగా నిమిషాల్లో కాకుండా గంటలో వంట పూర్తి చేసి గర్వంగా బయటకు వచ్చారు సుందరయ్యగారు. "వంట ఏమి వెలగబెట్టారేమిటీ! గర్వంగా నడుచుకుంటూ వస్తున్నారు" అడిగారు రత్నంగారు. "దొండకాయలు కాయల పళంగా ఉల్లికారంపెట్టి వండాను, కందిపప్పు పచ్చడికి వెల్లుల్లి తగిలించాను, చారు స్థానంలో మెంతి మజ్జిగ చేర్చాను. అరటాకులు వేస్తూ అన్నారు సుందరంగారు. "ఆ ఆ మరచిపోయాను పెరుగులోకి పెరట్లో కాసినవి, ఇంట్లో పండినవి రెండు చెక్రకేళీ పళ్ళు తెంపుకొచ్చాను, కడుపునిండా తినవే కనకవల్లీ "నవ్వుతూ అన్నారు సుందరంగారు.
భర్త వండి వడ్డించి మురిపెంతో తినిపిస్తుంటే రత్నంగారి కళ్ళల్లో నీళ్లు వద్దన్నా వచ్చాయి. "ఈ జన్మకు మీరు నాకు చాలు " పెరుగు చేతితో భర్త కాళ్లకు నమస్కారం పెడుతూ అన్నారు రత్నంగారు. "కొంపతీసి వంటిల్లే నాకు గతా ఏమిటీ" అన్నారు నవ్వుతూ సుందరయ్యగారు.
No comments:
Post a Comment