Saturday, June 21, 2025

 (293) (09.06.2025)

నాడు బిడ్డను కని వదిలేసింది కుంతి
నేడు కడుపున  పుట్టిన బిడ్డనే కాదనుకుంది ఈ ఇంతి
పెళ్లి కాకుండా కన్నందుకు తాను బాధ పడితే
నేడు పేదరికంతో నా బిడ్డను నే దూరం పెడితే //

అమ్మ అన్న పిలుపు కోసం ఎందరిదో ఆరాటం
బిడ్డ పెంపకం కోసం నా  బ్రతుకంతా పోరాటం
18 ఏళ్ల వయసులో మనసు పెళ్లి వైపు మళ్ళితే
ఆపై మెడలో మూడు ముళ్ళు పడితే //

పెళ్లికి ముందు నేను ఏవేవో ఉహించుకుంటే
పేదరికం ప్రతి విషయంలో అడ్డు పడుతుంటే
కడుపున పుట్టిన బిడ్డను పెంచలేక
అలా అని బిడ్దను దూరం చేసుకోలేక //

ప్రతి నిమిషం ఎంతగానో కుమిలి పోయినాను
చదువులేదని కొలువు కూడా చేయలేక పోయినాను
చిన్న చిన్న కోర్కెలు కూడా తీర్చలేక పోయాను
ఎన్నో సరదాలను బిడ్డకు  దూరం చేసినాను //

అందుకే నేడు ఈ నిర్ణయము
పాపకు ఇవ్వాలనుకున్నా అందమైన జీవితము
త్వరలో తాను దత్తత వెళుతుంది
తాను అయినా ఇక ముందు సుఖపడుతుంది //

అపుడపుడు చూచుకునే వెసులు బాటు కల్పించారు
నేనే తల్లిననే విషయం  మటుకు తనకు చెప్పవద్దని మాట తీసుకున్నారు
నేటికి ఆ  మాట మీదే ఉన్నాను
ఏనాడు నోరు తెరవకున్నాను //

నేడు ఆమె ఇద్దరు బిడ్డలకు తల్లి అవ్వగా
ఉన్న వారింట తాను కాలు పెట్టగా
నే పొందలేని ఆనందం తాను పొందింది
నాడు నెరవేరని కల నేడు బిడ్డ రూపంలో నెరవేరింది //

నాడు కుంతి కోరిక కలలాగే మిగిలిపోయింది
నేడు ఈ ఇంతి కోరిక  నెరవేరింది
జీవితంలో పేదరికం కూడా ఓ అనుభవమే
కడుపున పుట్టిన  బిడ్డ రూపంలో ఆనందం కూడా సంభవమే //

మధిర వెంకట రమణ, హైదరాబాద్

No comments:

Post a Comment