*✍️నేటి కథ✍🏽*
*తాబేలు- ఎలుగుబంటి*
ఒక అడవిలో ఒక ఎలుగుబంటి వుండేది. దానికి తనకు చాలా బలం వుందని చాలా
పొగరు. అడవిలోని జంతువులతో అనవసరంగా గొడవలు పెట్టుకొనేది. వాటిని ఏడిపించేది.
హింసించేది. దానితో అవన్నీ ఈ ఎలుగుబంటి పీడ ఎప్పుడు విరుగడ అవుతుందా అని
ఎదురుచూడసాగాయి. ఆ అడవిలో సింహాలు, పులులు, ఏనుగుల వంటి పెద్ద పెద్ద
జంతువులు ఏవీ లేకపోవడంతో ఎలుగుబంటికి ఎదురే లేకుండా పోయింది.
ఎలుగుబంటి ఒక రోజు అడవిలోని జంతువులను అన్నింటినీ పిలిచింది.
“
ఈ అడవిలో నన్ను ఓడించే మొనగాళ్ళు ఎవరయినా వున్నారా. ఉంటే నాతో
పోటీకి రండి. లేకపోతే రేపటినుంచి నేనే ఈ అడవికి రాజును. మీరంతా నేను చెప్పినట్టు
వినాలి" అని సవాలు చేసింది. జంతువులు భయంతో ఏవీ ముందుకు రాలేదు.
ఆ అడవిలో ఒక తాబేలు ఉంది. అది చాలా తెలివైంది. ఎలాగైనా ఆ పొగరుబోతు
ఆట కట్టించి అడవిని కాపాడాలి అనుకొంది.
వెంటనే అది ఎలుగుబంటి ముందుకు వచ్చి “ఒక తాడు నా కాలికి కట్టుకొని ఈ
చెరువులోకి దుంకుతా. నీకు నిజంగా అంత బలం వుంటే నన్ను బయటికి లాగగలవా.
నీటిలో నన్ను ఎదిరించే మొనగాళ్ళు ఎవరూ లేరు” అనింది. ఆ మాటలకు ఎలుగుబంటి
పడీ పడీ నవ్వుతూ “ఏందీ... నిన్ను నేను బైటికి లాగలేనా. గట్టిగా ఒక్క లాగు లాగానంటే
ఎగిరి చేరువులోంచి బైటకొచ్చి పడతావు. నేను పోటీకి సిద్ధం” అంది .
తాబేలు సరే అయితే నేను నీళ్లలో బాగా అడుగుకు పోతాను. చేతనైతే లాగు చూద్దాం
అంటూ ఒక కాలికి తాడు కట్టుకొని బుడుంగున నీళ్ళలోకి మునిగింది. తాబేలు వేగంగా
కిందకు పోయింది. . ఒక పెద్ద బండరాయికి తాడును కట్టేసి పక్కనే మౌనంగా నిలబడింది.
ఎలుగుబంటికి ఇదంతా తెలీదు కదా... దాంతో లాగడం మొదలు పెట్టింది. ఎంత లాగినా
తాడు కొంచెం కూడా కదల లేదు. లాగీ లాగీ దానికి చేతులు నొప్పి పెట్టాయి. ఆఖరికి '
ఇంక నా చేత కాదు' అంటూ తల దించుకొంది.
వెంటనే ఆ తాబేలు మరలా తాడును తన కాలికి కట్టుకొంది. ఏమీ తెలీని నంగనాచి
లెక్క పైకివచ్చి “ఓస్... నీ బలమింతేనా... ఏదో పెద్ద వీరునివి అనుకున్నానే ఇన్ని రోజులు”
అంది. అది చూసి చుట్టూవున్న జంతువులు అన్నీ పడీపడీ నవ్వసాగాయి. ఎలుగుబంటి
సిగ్గుతో వాటికి మొహం చూపించలేక అడవి వదిలి వెళ్ళిపోయింది. అడవిలోని జంతువులు
అన్నీ సంబరంగా చిందులు వేశాయి.
*పునఃకథనం : డా॥ ఎం. హరికిషన్ - 9441032212*
No comments:
Post a Comment