Thursday, October 16, 2025

 *మహామంత్రి మాదన్న - 10* 
(చరిత్ర ఆధారిత నవల)
👳🏽

రచన : ఎస్.ఎమ్. ప్రాణ్ రావు


ఆ రోజు రాచనగరు కోలాహలంతో ఆనందంతో తుళ్లిపడుతోంది. కేరింతలు కొడుతోంది. హెూలీ హిందువుల పండుగ అయినా దానిని జనానాలో జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. రకరకాల బంగారు నగలు, ముత్యాల పేరులు, వెండి వస్తువులు, అత్యంత నాజూకైన దుస్తులు, ఇతర అలంకార వస్తువులు జనానాలోకి  తీసుకువచ్చిన బేరగత్తెలు ఎంతో లాభసాటి బేరం చేసుకుంటారు.

అంత:పురంలో మెరుపుతీగెల లాంటి మగువలు హెూళీ సంబరాలలో మునిగి తేలుతూ తోటలో వసంతోత్సవం జరుపు కుంటున్నారు. తనను రంగులలో ముంచి తనకి చిక్కకుండా కనుమరుగైన నేస్తురాలి కోసం వెతుకుతోంది ఒక నవ యువతి. కళ్లలో రంగు పడటంతో ముందున్నవన్నీ మసక మసకగా కనిపిస్తున్నాయి. ఎదురుగా గుబురుగా పెరిగిన పొదరిల్లుని పోల్చుకుని తన స్నేహితురాలు ఆ పొదరింట్లో దాగి వుండొచ్చు అన్న అనుమానంతో అటు వచ్చింది.

వెనుక నుంచి ఎవరో చటుక్కున కళ్లు మూయడంతో ఉలిక్కిపడింది. 'రజియా ఇక్కడ దాక్కున్నావా. నిన్నే వెతుకుతున్నా ను' అంటూ అటు తిరిగింది.

వెంటనే కెవ్వున అరిచింది. తన ముందు వున్నది తను అనుకున్న రజియా కాదు. ఒంటి మీద నూలుపోగు లేకుండా నుంచున్న పదిహేడేళ్ల అందమైన నాజూకైన యువకుడు. భంగు మత్తు నిండిన కళ్లతో. 

'నన్ను వదులు. వదలకపోతే అరిచి గీ పెడతాను. తోట, కోట ఒకటి చేస్తాను' అంది సిగ్గు, కోపం నిండిన గొంతుతో.

'నన్ను వదిలెయ్. నీకు దండం పెడతాను' అంది ఆ యువతి.

ఆ యువకుడు నవ్వాడు. 'ఈ అబుల్ హసన్ని ఏడాది నుంచి చూస్తున్నావు కద. పట్టిన పిట్టని ఎప్పుడైనా వదిలాడా చెప్పు. మారాం చెయ్యకు. ఒక వేళ నువ్వు అరిచినా ఎవరూ రారు. వచ్చినా నా అవతారం చూసి భయపడి పారిపోతారు.  అంటూ ఒక చేతిని ఆ యువతి నడుం చుట్టూ బిగించి, తను 'అందరికి పూర్తిగా కనిపించేటట్లు ఆ యువతి పక్కన నుంచున్నాడు.

ఆమె అరుపులు విని అటు వస్తున్న యువతులు అబుల్ హసన్ని అలా చూసి గోలగోలగా అరుస్తూ వెనక్కి తిరిగి పారిపోయారు. ఆ యువతికి మరో మార్గాంతరం కనిపించలేదు. అయినా తప్పించుకోవడానికి పెనుగులాడింది. ఎంత పెనుగులాడినా అతని నుంచి తప్పించుకోలేకపోయింది. 
📖

దాద్ మహల్. దాద్ మహల్ గోలుకొండ సామ్రాజ్యానికి న్యాయస్థానం, న్యాయవేదిక. న్యాయం కోసం వచ్చిన ఆర్తుల విన్నపాలు దాద్ మహల్లోనే పరిష్కరించబడుతాయి. ఆ రోజు న్యాయ విచారణకి కూర్చున్న సమావేశంలో కాజీలు, హిందూ పండితులు ఎవరూలేరు. సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా, రాజమాత హయత్ బక్షీ బేగం మాత్రమే వున్నారు. వారు తమ ఆసనాలపై కూచుని అపరాధి కోసం ఎదురు చూస్తున్నారు.

బలిష్ఠంగా ఉన్న ఇద్దరు నీగ్రో బానిస యువతులు పెడరెక్కలు విరిచికట్టిన అబుల్ హసన్ ని ఈడ్చుకుంటూ తెచ్చి సుల్తాన్ ముందు నిలబెట్టి వినయంగా సలాం చేశారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
హయత్ బక్షీ బేగం, అబుల్ హసన్ వైపు చూసింది. హసన్ తల దించుకున్నాడు. 'మీరు వెళ్లి మందిరం బయట వేచి వుండండి' ఆ యువతులని ఆదేశించింది.

వారు వినయంగా వంగి సలాం చేసి వెళ్లిపోయారు.

'హసన్ తల ఎత్తు' అన్నాడు సుల్తాన్.

హసన్ తల ఎత్తలేదు.

'హసన్ నీ వంటి మీద కేవలం చిన్న లాగు మటుకే వుంది. పైన అంగారఖా లేదు. అందుకే కాబోలు సిగ్గు ముంచుకొచ్చింది' హేళన మిళితమైన గొంతుతో అంది రాజమాత.

హసన్ జవాబు చెప్పలేదు. మౌనంగా ఉండిపోయాడు.

'మౌనం అర్ధాంగీకారం.. వంటి మీద అంగీ లేనందుకు నువ్వు సిగ్గు పడుతున్నావన్న మాట. అందుకు కాదు నువ్వు సిగ్గు పడవలసింది' అంది రాజమాత కటువుగా.

హసన్ తల ఎత్తి ఆవిడ మొహంలోకి సూటిగా చూశాడు. 'మరెందుకు’ అడిగాడు చూపులు పక్కకి తిప్పుకుంటూ.

'ఎందుకో తెలీదా'

'తెలీదు'

'ఇవ్వాళ నీ ప్రవర్తనకి నువ్వు సిగ్గుపడాలి' అంది రాజమాత.

'కులీన కుటుంబాలలో నా వయసు వుండే మగపిల్లలలాగే నేనూ ప్రవర్తించాను. అందులో...'

"సిగ్గుపడాల్సింది ఏమీ లేదంటావు. రాచనగరు తోటలోకి ప్రవేశించి మరే యువకుడైనా నీలా ప్రవర్తించి వుంటే ఏం జరిగేదో తెలుసా' ఆగ్రహంగా అడిగాడు సుల్తాన్.

అబుల్ హసన్ మాట్లాడలేదు.

'గోళ్లు పెరికేసి, కాళ్లు చేతులు నరికేసి నడి వీధిలో పడేసేవాళ్లం. కనీసం కొట్టుకుని చావడానికి కూడా వీలు లేకుండా నరక యాతన పడి చచ్చేవాడివి. అది గాకపోతే కడుపులోని పేగులన్నీ బయటికి లాగి రక్తాలు ఓడుతున్న నిన్ను నడి వీధిలో వదిలేసేవాళ్లం. కుక్కలు నక్కలు పీక్కు తింటుంటే, కాకులు గద్దలు పొడుచుకు తినేవి' అన్నాడు సుల్తాన్.

ఆ మాటలతో అబుల్ హసన్, సుల్తాన్ కళ్లలోకి సూటిగా చూశాడు. అతని కళ్లలోకి ఎర్రజీర దూసుకువచ్చింది. మొహం అవమానంతో ఎరుపెక్కింది.

'అలా ఎందుకు చెయ్యలేదో తెలుసా' అడిగింది రాజమాత కొద్దిపాటి సౌమ్యత నిండిన గొంతుతో.

'తెలీదు' అన్నట్టు అడ్డంగా తల ఊపాడు అబుల్ హసన్.

“నేనే స్వయంగా చెబుతాను విను. హైద్రాబాదు నగర నిర్మాత, గోలుకొండ సామ్రాజ్య చక్రవర్తి అయిన నా తండ్రి సుల్తాన్ కులీ కుతుబ్ షాకి, మీ తాతయ్య ఫతీ ఖాన్ సోదరుడు. నాకు చిన్నాన్న. మా చిన్నాన్న కొడుకు సైఫ్ ఖాన్ నాకు తమ్ముడు అవుతాడు. నువ్వు నా తమ్ముడి మనుమడివి. నీలో వున్నది స్వచ్ఛమైన కుతుబ్షాహీల రక్తం'.

ఆ మాటలు నమ్మలేనట్టుగా చూశాడు అబుల్ హసన్.

'అంత:పుర కుట్రలకి నువ్వు బలి కాకూడ దనే ఈ విషయం బైటికి పొక్కనివ్వలేదు. అయితే నువ్వు కూడా నా మనుమరాళ్లతో పాటే రాచనగరులోనే పెరిగావు. ఏ లోపం లేకుండా పెరిగావు. నవనవలాడుతున్న నీ యవ్వనం, మిసమిస కాంతులీనుతున్న నీ అందం చూసి ముచ్చటపడ్డాను. కానీ ఇవ్వాళ నీ ప్రవర్తన చూశాక నువ్వంటే అసహ్యం వేస్తోంది' రాజమాత మాట్లాడటం ఆపింది.

అబుల్ హసన్ తల వంచుకున్నాడు.

'నీ వయసులో వున్న కుర్రాళ్లు అలాగే వుంటారన్నావు. రాచకుటుంబాల్లో అలా వుండే అవకాశమూ వుంది. నేను కాదనను. కానీ నీలా సిగ్గు విడిచి ఆరుబైట అలా నిలబడి ఎవడూ రొమ్ములు విరుచుకోడు' అంది రాజమాత కోపం సుడులు తిరుగుతున్న గొంతుతో.

'మా సాహెబ్, వీడికి గుండు గొరిగించి గాడిద మీద ఊరేగిద్దాం' అంటూ పక్కన ఉన్న గంట కొట్టబోయాడు సుల్తాన్.

కొడుకును వారించింది రాజమాత.

హసన్ ఇద్దరి మొహాల్లోకి మార్చి మార్చి చూస్తూ నుంచున్నాడు.

'ఎంతయినా వీడు నా మనుమడు. నా చిన్న మనుమరాలికి ఈడు జోడు అనుకున్నాను. నీకు మొగపిల్లలు లేరు కాబట్టి స్వచ్ఛమైన కులీల రక్తం నింపుకున్న
వీడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. అందుకే వీడికి నువ్వు విధించాలనుకున్న శిక్షలేవీ వద్దు. ఇప్పటికే వీడు అవమానంతో కుమిలిపోతున్నాడు. వీణ్ణి రాచకుటుంబం నుంచి వెలివేద్దాం. ఆ శిక్ష చాలు వీడికి' అంది రాజమాత అంతిమ తీర్పు వెలువరిస్తూ.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
'వెళ్లిపో. నీ దరిద్రం మొహం మళ్లీ నాకు చూపించకు' అంటూ సుల్తాన్ గంట కొట్టాడు.

నీగ్రో బానిస యువతులు వచ్చారు.

'వీడిని కోట బయటికి గెంటెయ్యండి. మళ్లీ కనిపిస్తే కాళ్లు చేతులు నరికెయ్యండి' అని ఆదేశించాడు సుల్తాన్.

వాళ్లు అబుల్ హసన్ దగ్గరికి వచ్చారు. చేతులకి కట్టిన తాళ్లు విప్పి చెరో రెక్కా పట్టుకోబోయారు.

'నన్ను పట్టుకునే అవసరం లేదు. నేను నడవగలను' అన్నాడు అబుల్ హసన్. వారి నడుమ నడుస్తున్న అబుల్ హసన్ చెవులలో రాజమాత మాటలు 'నా చిన్న మనుమరాలికి ఈడు జోడు' అనేవి గింగిరు మంటున్నాయి. కళ్ల ముందు సుల్తాన్ చిన్న కూతురు కదలకుండా నిలిచింది. మల్లె మొగ్గలా, గులాబీరేకులా బంగారు రంగులో కాంతులు చిమ్ముతున్న ఆ బాలిక కళ్లలోంచి దూసుకుపోయి గుండెలో దిగబడింది. దానిని ప్రేమ పులకింతలకు గురి చేసింది.
📖

హైద్రాబాదు నగరంలో జనసందోహంతో కూడిన ఒక వీధి. ఆ వీధిలో నడుస్తున్నాడు అబుల్ హసన్. చుట్టూ చూసిన అతనికి మేనాలలో పోతున్నవాళ్లు, పల్లకీలలో ఊరేగుతున్నవాళ్లు, గుర్రాల మీద దౌడు తీస్తున్నవాళ్లు కనిపించారు.

వాళ్లను చూసిన అబుల్ హసన్ మొహం లో రంగులు మారాయి. నిన్నటిదాకా స్నేహితులను వెంటేసుకుని జల్సాగా తిరిగాడు తను. విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు. గోలుకొండ దివాణం తన అవసరాల కోసం ఇచ్చిన నెలబత్తెం వెయ్యి హెున్నులను స్నేహితులందరితో కలిసి పంచుకున్నాడు. ఈనాడు తన వెంట ఎవరూ లేరు. చక్కని జీను తొడిగిన గుర్రం లేదు. చేతి నిండా హెున్నులు లేవు. వంటి మీద ఒక పొట్టి లాగు తప్ప మరేమీ లేదు. చివరికి కాళ్లకి చెప్పులు కూడా కరువయ్యాయి.

ఆ నీగ్రో యువతులు తనను లాక్కుపోతూ తన బుగ్గలు కందిపోయేటట్టు గిల్లారు. మమ్మల్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతూ తన శరీరాన్ని ఎక్కడబడితే అక్కడ నొక్కారు. తన మొహం పై చేతులు గోళ్లు పెట్టి కుళ్ళపొడిచారు. పగలబడి నవ్వుతూ, తననో బొమ్మని చేసి ఆడుకుని బయటికి గెంటేశారు. ఆ తమాషా చూస్తూ నుంచున్న నేస్తాలు అదేమిటి అని అసలు అడగలేదు. అయ్యో అనలేదు. అడ్డు రాలేదు. ఆదరించలేదు. తను ఎవరో తెలియనట్టు కొందరు తలలు పక్కకి తిప్పుకున్నారు. మరికొందరు నవ్వుతూ పక్కనే వున్న ఈత కొలనులోకి దూకారు.

అబుల్ హసన్ ఇక ఆలోచించలేక పోయాడు. చాలాసేపటి నుంచి ఒక గమ్యం అంటూ లేకుండా పిచ్చివాడిలా రోడ్డు మీద తిరుగుతున్న అతను నీరసించిపోయాడు. ఆకలితో పేగులు నకనకలాడాయి. ఇంక నడవలేకపోయాడు. ఎటు పోతున్నాడో, ఎక్కడున్నాడో కూడా అవగాహనకి రాలేదు. అడుగు తీసి అడుగు వెయ్యలేక పోయాడు. ఉన్నవాడు ఉన్నట్లు ఒకచోట కుప్పకూలిపోయాడు.

కళ్లు తెరిచిన అబుల్ హసన్ కి తన మొహం లోకే పరీక్షగా చూస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు.

'మీరెవరు' అడిగాడు హసన్.

ఆ సాధువు చిరునవ్వు నవ్వుతూ, పొడువైన గడ్డాన్ని మునివేళ్లతో దువ్వుకున్నాడు. 'ఏమన్నావు' అడిగాడు.

'మీరెవరు' రెట్టించాడు అబుల్ హసన్.

ఆయన మళ్లీ నవ్వాడు.

'జవాబు చెప్పకుండా నవ్వుతారే' అసహనంగా అడిగాడు హసన్.

'దైవం పట్ల ప్రేమ పెంచుకోవడానికి, ఆయనకి చేరువగా చేరడానికి గల మార్గాన్ని కనుక్కోవడానికి నిరంతర అన్వేషణ సాగిస్తున్న బాటసారిని. దేవుడిని నేను చూస్తూ ప్రార్ధిస్తున్నానన్న భావన గానీ, లేక దేవుడే నా వైపు చూస్తున్నాడన్న ఉదాత్త భావన గానీ నాకు కలగనంతవరకు నేనెవరో నాకు తెలీదు' అన్నాడు ఆ సాధువు.

అబుల్ హసన్ కి ఏమీ అర్ధంకాలేదు. 'నిజంగా మీరెవరో మీకు తెలియదా. ఇంత చిన్న విషయం మీకు...'

మధ్యలోనే అందుకున్నాడు సాధువు. 'చిన్నదో పెద్దదో. నాకు తెలిస్తే కదా, నీకు చెప్పడానికి. అయినా చెప్పే ప్రయత్నం చేస్తాను, విను'. అన్నాడు.
👳🏽
*సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment