Thursday, October 16, 2025

 *ఆనంద నిధి*
సృష్టిలో ప్రతి ప్రాణి ఎల్లప్పుడూ ఎలాంటి చీకూచింతా లేకుండా ఉండాలని కోరుకుంటుంది. వివేకవంతుడైన మనిషి చరమ, పరమ లక్ష్యమూ ఆనందమే. జీవించినంత కాలం సంతోషంగా జీవించాలని, దుఃఖం లేశమాత్రమైనా ఉండకూడదనుకుంటాడు. కానీ జీవితంలో ఆనంద క్షణాల కన్నా వ్యథాభరిత అనుభవాలే ఎక్కువగా చవిచూస్తున్నాడు. ఎందుకిలా జరుగుతోందనే ప్రశ్నకు సమాధానం కావాలంటే అసలు ఆనందం ఎక్కడుంది? ఎలా వస్తుంది? అన్నది తెలుసుకోవాలి. 

అవగాహనా రాహిత్యం మూలంగానో ఆనందం స్వరూపస్వభావాలు తెలియకపోవడం వల్లో మనిషి రాజీపడుతున్నాడు. ఆనంద ఛాయారూపాలతో సరిపెట్టుకుంటున్నాడు. లేని ఆనందాన్ని వస్తువులకు ఆపాదించుకుని వాటి వెంట పడటం వల్ల ఇంద్రియాలకు తాత్కాలికమైన సంతోషం కలుగుతుంది. నిజంగా వస్తువులే ఆనందాన్ని ఇవ్వగలిగితే అవి అందరికీ ఒకే విధంగా సంతోషాన్ని పంచిపెట్టాలి. కానీ అలా జరగడం లేదు కదా. లడ్డూ ఆరోగ్యవంతుడికి ఆనందాన్నిస్తే మధుమేహ రోగికి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఏసీ కొందరికి హాయినిస్తే, మరికొందరికి చికాకు కలిగిస్తుంది. కనిపించే వస్తువులన్నీ నశించిపోయేవే! నశించే వస్తువు ద్వారా కలిగే ఆనందం కూడా ఆ వస్తువుతో పాటే నశిస్తుంది. వెరసి సుఖం వెంట దుఃఖం, సంతోషం వెంట సంతాపం... బయటా లోపలా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. అందమైన గులాబి, శ్రావ్యమైన సంగీతం, పసందైన విందుభోజనం, సుగంధ  భరిత పరిమళద్రవ్యం అన్నీ తాత్కాలిక సుఖాలే. అవి వాడిపోగానే, ఆగిపోగానే, అరిగిపోగానే, ఆవిరైపోగానే మరో దాని వెంటపడటం మనిషి నైజం. తాను కోరుకుంటున్న సుఖం, సంతోషం తనలోంచే వెలికి వస్తాయన్న సత్యం తెలిసే వరకూ ఆ ఆరాటం కొనసాగుతుంది. ఆనందం అనేది నీళ్లట్యాంకులో నీటిలా కాకుండా బావిలో ఊటలా మనలో నుంచే  ఊరాలి. 
కాపరి గొర్రెపిల్లను, తల్లి చంటిబిడ్డను చంకలో ఉంచుకుని ఊరంతా గాలించినట్లు మనిషి ఆనందం తనలోనే ఉందని తెలుసుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. తెరమీద చిత్రాలు కదిలినట్లు ఆనందం అంతరంగంలో అదృశ్యంగా ఉండి తన తరంగాలను ఆయా వ్యక్తుల ఆలోచనలకు తగినట్లుగా ప్రసరింపజేస్తుంది. శాశ్వతమైన ఆనందం కావాలనుకుంటే దృష్టిని బాహ్య ప్రపంచం నుంచి మళ్లించి మనలోనే ఉన్న మరో అద్భుతమైన ప్రపంచంవైపు ప్రసరింప చేయాలి. జాగ్రదావస్థలో, స్వప్నావస్థలో కలగని ఒక గొప్ప అనుభూతి గాఢనిద్రలో కలగడానికి కారణం హృదయాంతరాళంలో అంతర్లీనమై ఉన్న ఆనందం. పరిసరాలను మరచి, వస్తు ప్రమేయమే లేని, దుఃఖం లేశమైనా తెలియకుండా తెల్లవారే దాకా హాయిగా నిద్ర పుచ్చేది ఆ ఆనందమే! దాని స్థావరం మనిషి హృదయం. అందరి హృదయాలలోనూ తాను ప్రతిష్ఠితుడై ఉన్నానని స్వయంగా పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఆ పరమాత్మకు మరోపేరు సచ్చిదానందం. సత్యం, జ్ఞానం, ఆనందం ఆయన స్వరూపస్వభావాలు. అలాంటి పరమాత్మకు మన హృదయం నిలయమైతే అది ఆనందనిలయం కాకుండా ఎలా ఉండగలదు? ఆ బ్రహ్మానంద సాగరంలో ఓలలాడగల మనిషి జీవితమే ధన్యం.
~కృష్ణ నెయిగాపుల

No comments:

Post a Comment