అందరిలో గుడి ఉంది!
'అడుగడుగున గుడి ఉంది. అందరిలో గుడి ఉంది' అన్నాడో కవి. అడుగడుగున ఉన్నా, లేకున్నా అందరిలో మాత్రం తప్పక ఉంటుంది. 'అహం బ్రహ్మాస్మి' అన్నారం దుకే. పంచభూతాత్మకమైన ఈ యావత్ సృష్టిలో పరమాత్మ కొలువై ఉన్నాడు. సమస్త ప్రాణకోటిలోనూ సర్వేశ్వరుడున్నాడు. అది గ్రహించే శక్తి ఉన్నవాడికి దైవం కనబడ తాడు. గులాబీని తోటలోనే చూడగలం. మబ్బును నింగిలోనే కాంచగలం. పంచమ స్వరాన్ని కోయిల నుంచే వినగలం. ప్రాణవాయువును గాలి నుంచే పొందగలం. అలాగే దైవాన్ని అంతర నేత్రాల ద్వారానే దర్శించగలం. అందుకు ఆత్మజ్ఞానం అవ సరం. 'నాలో నేను' 'నీలో నీవు' చూడగలగాలి. దీన్నే 'లోచూపు' అంటారు.
అరిషడ్వర్గాలను దూరంగా ఉంచగల వారికి, సత్సాంగత్యమూ సాధన కలవారికి.. లోచూపు సాధ్యం. ఏకాగ్రమైన భావనతో మనసును కేంద్రీకరించినప్పుడు జ్ఞాననేత్రాలు తెరుచుకుం టాయి. అసలైన అన్వేషణ మొదలవుతుంది. అప్పుడు ధ్యాన ప్రక్రియ సహకరిస్తుంది. జ్ఞాన-అజ్ఞాన విచక్షణ ఉదయిస్తుంది. ఫలితంగా కోరికలు తగ్గుతుంటాయి. నిరాశా నిస్పృహలు, దుఃఖం దూరమైపోతుంటాయి. జ్ఞానసోపా నాలు అధిరోహించే ఆత్మవిశ్వాసం పెరుగు తుంది. మోక్షసౌధానికి చేర్చే మెట్లు చాలా ఉంటాయి. ఎన్నెన్నో పరీక్షలుంటాయి. పరీక్షల్లో సాఫల్యం పొందినవారిలో అన్న మయ్య, కబీరు, మీరా, తులసీ, రామదాసు, త్యాగరాజు- ఇలా చాలామంది ఉన్నారు. s
భౌతికజీవన ప్రస్థానం చేస్తూనే భగవం తుణ్ని దర్శించిన వారున్నారు. తల్లిదండ్రులు, గురువు, అతిథి, ప్రవచనకర్తల్లో మనం దైవదర్శనం చేసుకుంటున్నాం. చెట్టు, పుట్ట, గట్టు, నది- ఇలా అన్నింటినీ పూజించే సంప్రదాయం మనది. అన్నింటిలోనూ దైవం ఉన్నాడన్న ప్రగాఢ విశ్వాసమే లోకకల్యాణ భావనకు నాంది పలుకుతుంది. దేవుణ్ని అంతటా చూడగలిగే విజ్ఞత పొందగలిగితే, మనం చేసే ప్రతి పనీ ఓ ప్రార్థన అవుతుంది. పనిలో నిజాయతీ, ప్రార్థనలో ఏకాగ్రత, అభ్యర్థనలో ఆర్తి, సేవలో ప్రేమ, పూజలో శ్రద్ధ, అర్చనలో సమర్పణ భావం ఉండాలి. మౌనమే మాధవుడితో చేసే నిజమైన సంభాషణ అవుతుంది. మౌనమే ధ్యానం చేసే పావన స్నానం. జీవితానికి దొరికే అసలైన సమాధానం.
'నేను' అన్నమాటకు అర్థం, పరమార్థం తెలుసుకోకుండా 'నాది' అనుకోవడంతోనే మనో వ్యాధి పెరుగుతుంది. జీవితమంటే- ఇతరుల నుంచి ఆశించడమో, తీసుకోవడమో కాదు... ఇవ్వడం. అందులో కష్టసుఖాలూ జయాపజయాలూ ఉంటాయి. విజయాలను మనకన్నా చిన్నవారితో పంచుకోవాలి. పరాజయాలను మనకన్నా పెద్దవారితో చెప్పుకోవాలి. ఒకరికి స్ఫూర్తిగానూ నిలువగలుగుతాం. వేరొకరి నుంచి ప్రేరణనూ పొందగలుగుతాం. ఎంతో పెద్దది జీవితం. దాన్ని మనలోకి ఇముడ్చుకోవాలి. ఎంతో చిన్నది జీవితం. అందులో మనం ఇమిడిపోవాలి. మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో, అలాగే ఇతరుల్నీ ప్రేమించాలి. ఆ ప్రేమలోనే పరమాత్ముడు కనిపిస్తాడు. అందరిలోనూ గుడి ఉంది. ఆ గుడిలోకి చేర్చే నుడిని.. పట్టుకోవడంలోనే జన్మకి సార్థకత్వం ఉంది.
చిమ్మపూడి శ్రీరామమూర్తి
No comments:
Post a Comment