Thursday, October 16, 2025

 *భగవంతుని లీల*
                   ➖➖➖
           
శ్రీ రామకృష్ణ పరమహంస అనారోగ్యంతో కాశీపూర్ లో చికిత్సపొందుతున్న
సమయం.
మొదటి అంతస్థు గదిలో భార్య శారదామయి తగు సేవలు అందిస్తూ ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు.
ఆయన స్వయంగా లేచి నిలబడలేని స్ధితిలో ప్రక్కమీదే పడక్కుని వుండేవారు. 

ఒకరోజు రామకృష్ణ పరమహంస దిగ్గున లేచి వేగంగా మేడమెట్లు దిగి వెళ్ళడం శారదాదేవి చూశారు. 
కాని కొద్ది క్షణాలలోనే రామకృష్ణులు వెళ్ళినంత వేగంగా తిరిగి  వచ్చి ఏమీ
జరగనట్టు  పడుకొని కనిపించారు.  శారదాదేవికి రామకృష్ణుల వారి చర్యలు
ఆశ్చర్యం కలిగించింది. శారదాదేవి  ఆయననే కారణం అడిగారు. అందుకు
రామకృష్ణ పరమహంస శారదాదేవి వద్ద ఏమీ చెప్పక “నేనా దిగివెళ్ళానా? 
అది నీ మనోభ్రమ” అని శారదా దేవి ప్రశ్నకి బదులు యివ్వకుండా దాట వేశారు.(ఈ విధంగా రామకృష్ణులవారు దాట వేయడానికి కారణమేమిటని మన మనసులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది.  ఇటువంటి సంఘటనలకు రామకృష్ణులు ప్రాముఖ్యత యివ్వకపోవడమే. అని అనిపిస్తుంది.
శారదాదేవి శ్రీ రామకృష్ణుల వారు వేగంగా వెళ్ళి తిరిగిరావడం తమకళ్ళతో స్వయంగా చూశారు.  అందువలన మళ్లీ వారిని బలవంతపెట్టి కారణంచెప్పమని అడిగారు.
చివరకు శ్రీ రామకృష్ణ పరమహంస  
“ఇక్కడవున్న తోటలో ఒక మూల ఖర్జూరపుచెట్టు వుంది. ఆ చెట్టు ఖర్జూర పళ్ళ కోసం నిరంజన్, అతని స్నేహితులు ఆ చెట్టు వైపుకి వెళ్ళారు. 
కానీ వారికి తెలియదు,ఆ చెట్టు మీద ఒక పెద్ద త్రాచు పాము వుంది. వారికి ఆపాము వల్ల ఏ ఆపద రాకూడదని  నేను వేగంగా వెళ్ళి ఆ పాముని అక్కడ నుండి తరిమి వేసి వచ్చాను.” అని అన్నారు.

నిరంజన్, ఇతర భక్తులకు ఖర్జూరం చెట్టు పై పాము వున్నదని ఇటువంటి
ఆపద నుండి శ్రీ రామకృష్ణులు వారిని కాపాడారన్న విషయమే తెలియదు. తర్వాత ఎప్పడో మాత శారదాదేవి మాటలవలన ఈ లోకానికి తెలిసింది.   

ఒక చంటి బిడ్డ క్రింద పడుకుని హాయిగా నిద్రిస్తూవుంది. ఆ బిడ్డ
వైపు ఒక కండచీమ వెడుతున్నది. 
ఆ చీమ వెళ్ళడం చూసిన బిడ్డ తల్లి 
కండచీమని బిడ్డ వద్దకు వెళ్ళనీకుండా తీసి బయట పారవేస్తుంది. ఆ సమయంలో నిద్రిస్తున్న బిడ్డకు తనకు వచ్చిన ఆపద గురించి, ఆది తొలగిన 
విషయం గురించి తెలియదు. తల్లి పనికట్టుకొని చెప్పదు.

ఈ విధంగానే  దైవం ఎల్లవేళలా తన భక్తులను కాపాడుతుంది. 

ఒక చెట్టు మీద ఒక మగ పావురం, ఆడ పావురం సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నాయి. అప్పుడు వేటకాడు ఆ వైపుకి వచ్చి చెట్టు మీద పావురాలని చూశాడు.

“ఈ పావురాలు యీ నాడు నాకు ఆహారం.. వీటిని వేటాడి తీసుకుపోవాలని తలచాడు.
ఆ సమయంలో ఒక గ్రద్ద ఆకాశంలో  తిరుగుతూ వున్నది. దాని కన్ను కూడా చెట్టు మీద కబుర్లు చెప్పుకుంటున్న పావురాలమీదే పడింది.
ఈ పావురాలు ఎలాగూ కాసేపట్లో ఆకాశంలో ఎగరడానికి వస్తాయి అప్పుడు వాటిని ఎలాగైనా పట్టి తినాలని గ్రద్ద అనుకుంది. అలా అనుకుంటూనే గ్రద్ద ఆకాశంలో వలయాలు తిరుగుతూ సమయంకోసం కాచుకొని వున్నది.
పావురాలకి, ఇటు వేటగాడి గురించి కానీ, ఆకాశంలోని  గ్రద్ద తమని వేటాడడానికి సిధ్ధంగా వున్న విషయం కానీ ఏమాత్రం  తెలియదు. అవి తమలో తాము ఆనందంగా మాటాడుకుంటూ వుండి పోయాయి. 

వేటకాడు విల్లు తీసుకుని పావురాల మీదకు బాణం గురిపెట్టాడు.వేటగాడు బాణం ఎక్కు పెట్టగానే వెనకనుండి ఒక పాము వచ్చి వేటగాడి కాలు మీద కాటువేసింది.

వేటగాడు అయ్యో అని బాధతో అరుస్తుండగా, వేటగాడు వేసిన బాణం గురి తప్పి పైన తిరుగుతున్న గ్రద్దకి తగిలి అది క్రింద పడి ప్రాణాలు వదిలింది. పాము కరచిన వేటగాడు 
మరణించాడు.  

మనం చూసిన ఈ సంఘటనలో వేటగాడిని పాముకాటు వేయకుండా వుంటే వేటగాని కోరిక తీరేది. కానీ ఆకాశంలోని గ్రద్దకు నిరాశే మిగిలేది.
వేటగాని గురి తప్పినందువలన  బాణం గ్రద్దకి తగలకుండా వేరే దిశకి వెడితే గ్రద్ద కోరిక నెరవేరి వుండేది. 
కాని యీ సంభవం లో భగవంతుని లీల వేరేగా వుంది.
వేటగాని ఇఛ్ఛ గాని గ్రద్ద ఇఛ్ఛగాని నెరవేరలేదు. 
ఏక క్షణంలో పావురాలు యీ రెండు ఆపదలనుండి రక్షించబడినాయి.

ఈవిధంగా పావురాలకి వాటికి తెలియకుండానే ఆపద వచ్చి తొలగిపోవడం ఆనందంగా
కబుర్లు చెప్పుకుని ఆకాశం లోకి ఎగిరిపోవడం సంభవించింది. 

ఈ విధంగానే భక్తులు తమకు  తెలియకుండానే కలిగే ఆపదలనుండి  భగవంతుని దయవలన, లీల వలన కాపాడబడి హాయిగా జీవిస్తున్నారు.

భగవంతుడు సర్వకాల సర్వావస్థలలో తన భక్తులను రక్షిస్తూనేవుంటాడు. 

మానవులు ఎల్లప్పుడూ భగవంతుని రక్షణలోనే జీవిస్తున్నా కాని, దానిని
గురించిన చింత ఏమీ లేకుండా జీవిస్తారు. 

మనిషియొక్క ప్రతీ నిముషం  భగవంతుని దయతోనే గడుస్తున్నది అన్నది యధార్ధం.

మానిషి సుఖజీవనానికి అతని మేధస్సు, కాని తెలివి తేటలుగాని కారణం కానే కావు. ఇవన్నీ భగవంతుని లీలానుగ్రహములే.

ఆంగ్ల భాషలో “Man proposes  and God Disposes” అనే మాట వుంది. 
కాని నిజమేమిటంటే, 
God himself proposes and
Disposes too.
మానవుడు తలుచుకోవడం, అది నెరవేరడం అన్నీ కూడా భగవంతుని సంకల్పానుసారమే జరుగుతున్నాయి.🙏

No comments:

Post a Comment