Thursday, October 16, 2025

 250 వ భాగం 
🕉️ అష్టావక్ర గీత🕉️ 
అధ్యాయము 18 
శ్లోకము 38

నిరాధార గ్రహవ్యగ్రా మూఢా సంసారపోషకాః|
ఏతస్యానార్థమూలస్య మూలచ్ఛేదః బుధైః||

ముక్తిని సాధించాలనే తపనతో మూడులు సంసారాన్ని పోషిస్తూ చిరంజీవిని చేస్తున్నారు. తెలివైన వారు ఈ సంసార వృక్షమూలాని ఛేదించి హాయిగా జీవిస్తారు.

ఉన్న సత్యం ఏదో సరిగ్గా తెలియని అజ్ఞానం వలన వివిధ ప్రత్యేక రూప సంబంధితమైన ఈ మహావిశ్వం ఉన్నట్టుగా గుర్తింపబడుతుంది. తెలివైన వారు ఈ సంసార వృక్షం యొక్క మూలము అనదైన అజ్ఞానాన్ని నశింపజేసి హాయిగా జీవిస్తారు. సత్యాన్ని సరిగా గుర్తింపని ఈ అజ్ఞానం ,ఈ అగ్రహణ అన్యధాగ్రహణాలు సత్యాన్ని సరిగా గుర్తించటం అనబడే జ్ఞానముతోనే నశిస్తాయి. అనంత సత్యాన్ని పరిమిత ప్రపంచంగా గుర్తించే మనో బుద్ధులతోనే సత్యాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవాలనే తపనతో అనేక సాధనలను చేసేవారిని జ్ఞానులతో పోలుస్తూ వర్ణిస్తున్నారు మునీంద్రుడు ఇక్కడ.
తెలివిహీనులైన ఈ సాధకులు తమ కాలాన్ని శక్తిని మనసును నియమించటానికి నిగ్రహించటానికి వెచ్చిస్తారు. అసలు మనసే భ్రమకు జన్మస్థానంగా తాను వేరుగా ప్రపంచం వేరుగా భావిస్తూ భ్రమిస్తూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈ మూల కారణాన్ని గుర్తించి చేదించకుండా నియమించి నిగ్రహించాలి అనుకోవడం పరిణతి చెందిన సాధకులకు కాలాన్ని వృధా చేయడమే అవుతుంది. 

ఈ సూచన సాధన ప్రథమ దశలో ఉన్న వారికోసం కాదు. సాధనాభలముతో మనోబుద్దులను వశము చేసుకున్న సంయమీంద్రుడు జనక రాజర్షి. అతని ఇష్టంతో, ఆజ్ఞతో సేవకులవలే సేవిస్తాయి అతని  మనో బుద్దులు. అవసరమైతే వాటిని నిర్మూలించగల మహా ధీరుడు అయిన శిష్యుని ఉద్దేశించి గీత మొత్తం అంతా ఉపదేశించబడింది. 

నిరాధారా..... మనసు దానిలోని సర్వ భావాలు కూడా శుద్ధ చైతన్య ఆధారంగా గుర్తింపబడి అనుభవింపబడుతున్నాయి. అట్టి మనసును నియమించాలి అనుకోవడం స్వప్నములోని స్వాప్నికుడిని ప్రవర్తనను సరిదిద్దాలి అనుకోవటం వంటిదే. తాడు లో ఉన్న పాముని చంపాలనుకొని కర్రతో బాధటం వంటిదే.

జాగ్రదస్థ లోనికి రాగానే స్వాప్నికుని ప్రవర్తన అంతరిస్తుంది .తాడును గుర్తిస్తే చంపటానికి పామే ఉండదు. ఆత్మ తత్వాన్ని గుర్తించగానే స్వాధీనం చేసుకోవాల్సిన మనసు కానీ మార్చుకోవాల్సిన ప్రపంచం కానీ ఉండనే ఉండవు.

అనర్ధ మూలస్య... అన్ని అనర్ధాలకు కారణం  ఆత్మ విషయమైన అజ్ఞానమే. ధ్యానించాలని ప్రయత్నించడము ధ్యాని అజ్ఞానంలో ఉండడాన్ని సూచిస్తుంది. తనకంటే భిన్నంగా జగత్తును జగదీశ్వరుని చూస్తున్నప్పుడే ధ్యానించాలని కోరికకు ఆస్కారం ఉంటుంది. అందుకే అట్టివారిని పరిహసిస్తూ మార్గాన్ని నిర్దేశిస్తున్నారు వస్తావా కొరకు. శాస్త్ర హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని తెలివి హీనులు ధ్యానము మీద విలువను పెంచుకొని మనసును పోషిస్తూ సంసార చక్ర భ్రమణానికి ఇంకా దోహదం చేస్తూనే ఉంటారు.

ధ్యానము మొదలుపెట్టడానికి మనసును శాంత పరిచి ఏకాగ్రం చేయటానికి నియమాలు ప్రయత్నాలు అవసరమే. అనేక భావాలతో అశాంతిమయమైన మనసును ధ్యానముతో 
ఏకోన్ముఖం చేసిన తర్వాత ధ్యానాన్ని వదిలి జ్ఞానాన్ని అందుకోవాలి. అజ్ఞానపు ఉనికిని సాధ్యం చేసే రేఖామాత్రమైన అహంకారాన్ని తాను ధ్యానిస్తున్నానని భావాన్ని విస్మరించాలి. అప్పుడు మాత్రమే జ్ఞానములోనికి అడుగుపెట్టడం సాధ్యమవుతుంది. ఇదే మహర్షి సూచించే మహా లక్ష్యము జీవన గమ్యము. అసత్తు నుండి సత్తులోనికి చీకటి నుండి వెలుగులోనికి అనితత్వము నుండి నిత్యత్వములోనికి లఘించాలి. ప్రస్తుతము సాధకుడు అజ్ఞానపు చివరి మెట్టు మీద నిలబడి అనంత సత్యములో అడుగుపెట్టడానికి సందేహిస్తున్నాడు. ఇక్కడ  అష్టావక్ర మహర్షి ఇస్తున్న సూచనను అందుకోగలగటం జనకరాజర్షితో సరితూగ గల తప సంపన్నులకు ప్రజ్ఞాధీశారధులకు మాత్రమే సాధ్యమవుతుంది.🙏🙏🙏

No comments:

Post a Comment