6️⃣8️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*మూడవ అధ్యాయము*
*కర్మయోగము.*
*19. తస్మాదసక్తస్సతతం కార్యం కర్మ సమాచరl*
*అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుష:ll*
ఆ కారణం చేత ఓ అర్జునా! నీవు కూడా ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి లేకుండా నీ కర్తవ్య కర్మ అయిన యుద్ధము చెయ్యి. ఆసక్తి లేకుండా యుద్ధం చేస్తే ఆ యుద్ధం వలన వచ్చే బంధనములు నిన్ను అంటవు. నీకు మోక్షం కూడా వస్తుంది.
కర్మ దాని లక్షణాలు, ఎవరు కర్మలు చేయాలి, ఎవరు కర్మలు చేయకుండా ఉండవచ్చు అనే విషయాలను చెప్పిన తరువాత కృష్ణుడితో ఇలా అన్నాడు. అర్జునా! నీ విద్యుక్త ధర్మము నీ క్షత్రియ ధర్మము నీవు నెరవేర్చు. ఏ కోరికా లేకుండా యుద్ధం చెయ్యి. ఎవరికో ఏదో జరుగుతుందని బాధపడకుండా యుద్ధం చెయ్యి. నిష్కామంగా యుద్ధం చెయ్యి. ఏ సంగమం లేకుండా యుద్ధం చెయ్యి. ఎదురుగా ఉన్న వాళ్లు నీ బంధు మిత్రులు అన్న భావన లేకుండా యుద్ధం చెయ్యి. నేను యుద్ధం చేస్తే ఏమవుతుందో! అలా జరుగుతుందో! ఇలా జరుగుతుందో! నావల్లే అంతా జరుగుతోంది... అనే ఆలోచనలు లేకుండా యుద్ధం చెయ్యి. నీ ఒక్కడి వల్ల ఏమీ కాదని తెలుసుకొని యుద్ధం చెయ్యి. మనస్సును నిర్మలంగా ఉంచుకొని యుద్ధం చెయ్యి. అప్పుడు నీకు ఎటువంటి పాపము అంటదు. కర్మ చేయకుండా ఉండటానికి నీవు ఇంకా ఆత్మజ్ఞానివి కాలేదు. జీవన్ముక్తుడువి కాలేదు. ఇంకా కర్మలు చేసే దశలోనే ఉన్నావు. నీకు ఆత్మజ్ఞానం ఇంకా అలవడలేదు. ఇప్పుడే సన్యాసం తీసుకుంటాను అంటే కుదరదు. నేనేం నిన్ను చేయకూడని పని చేయమనడం లేదు. నీ కర్తవ్యం నిర్వర్తించమంటున్నాను. నీవు క్షత్రియుడివి కాబట్టి నీ ధర్మం నిర్వర్తించమంటున్నాను. కాకపోతే నిష్కామంగా, ఆసక్తి లేకుండా, ఫలాపేక్ష లేకుండా, ధర్మం కొరకు యుద్ధం చేయమంటున్నాను. అలా చేస్తే నీకు ఎటువంటి బంధనములు అంటవు. అప్పుడు నీ అంతరంగము శుద్ధి అవుతుంది. తరువాత జ్ఞానం వస్తుంది. తరువాత మోక్షం లభిస్తుంది. కాబట్టియుద్ధం చెయ్యి.
ఎటువంటి సంగము అంటే అటాచ్మెంట్ లేకుండా, ఆసక్తి లేకుండా ఫలాపేక్ష లేకుండా, నిష్కామంగా కర్మలు చేస్తే దాని వలన సుఖదుఃఖములు, బంధములు రావు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిర్మలంగా ఉంటుంది. అటువంటప్పుడు పరమాత్మను ధ్యానించడానికి ఆత్మదర్శనం కలగడానికి అవకాశం ఉంటుంది. ఇదే కర్మలు చేయడంలో రహస్యము. కాబట్టి కర్మలు చేస్తూ కూడా ఆత్మసాక్షాత్కారము పొందవచ్చు. మనసును ఆత్మలో లీనం చేయవచ్చు. పరమ శాంతిని పొందవచ్చు. కేవలం వేదములు శాస్త్రములు చదివి జ్ఞానం సంపాదించడమే కాదు. కర్మలు ఆచరిస్తూ కూడా ఆత్మజ్ఞానం పొందవచ్చు. చివరకు మోక్షం కూడా పొందవచ్చు. ఇదే గీతాబోధ.
*20. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయ:l*
*లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసిll*
పూర్వము జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను చేయడం వలన సిద్ధిపొందారు. కావున నీవు కూడా స్వార్థం వదిలిపెట్టి లోకహితము కొరకు కర్మలు చేయడానికి మాత్రమే నీకు అర్హత ఉన్నది.
ఇప్పుడు కృష్ణుడు ఒక ఉదాహరణ చెబుతున్నాడు. జనకుడు, అశ్వపతి మొదలగు మహారాజులు ఎటువంటి ఆసక్తి లేకుండా నిష్కామంగా కర్మలు ఆచరించి సిద్ధి పొందారు. అని అన్నాడు. ఇక్కడ జనకుడు మొదలగు వారిగురించి చెప్పడంలో అర్థం వారు ఋషులు కారు, మునులు కారు, సన్యాసులు కారు, సర్వసంగ పరిత్యాగులు కారు. వారు కూడా అర్జునుడి మాదిరి క్షత్రియులు, రాజ్యపాలన చేసారు. అటువంటి వారు కూడా ఆసక్తి లేకుండా, నిష్కామంగా, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, కర్మలు చేసి సిద్ధిని పొందారు. వారి మాదిరే అర్జునుడిని కూడా తన విద్యుక్త కర్మ అయిన యుద్ధము చేయమని కృష్ణుడు బోధించాడు.
జనకుడు, అశ్వపతి, ఇక్ష్వాకువు, ప్రహ్లాదుడు, అంబరీషుడు మొదలగు చక్రవర్తులు ఈ కోవలోకి వస్తారు. వారికి ఈ ప్రపంచంలో చేయవలసినది అంటూ ఏదీ లేదు. కాని లోకం కొరకు తమ కర్తవ్య కర్మలు నిర్వర్తించారు. కర్త్రుత్వ భావం లేకుండా, నిష్కామంగా కర్మలు చేసారు. అలా చేసి వారు ముక్తిని పొందారు. వారందరూ కర్తవ్య కర్మలు చేసి ముక్తిని పొందిన వారే! కాబట్టి ఓ అర్జునా! వారి మాదిరి నీవు కూడా సంగముక్తుడివి, జీవన్ముక్తుడివి అని నీవు అనుకుంటే కూడా, లోకం కోసమన్నా, నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించు. జనకుని మాదిరి నీ కర్తవ్య కర్మలను చెయ్యి. ఏ విధమైన సంగం లేకుండా యుద్ధం చెయ్యి. పోనీ, జనకుడు, అశ్వపతి జ్ఞానులు, జీవన్ముక్తులు కారు అని అనుకొందాము, నీ మాదిరి మామూలు మానవులు అనుకొందాము. అలాంటప్పుడు కూడా వారు నిష్కామంగా కర్మలు చేసి జ్ఞానమును సంపాదించి, చివరకు ముక్తిని పొందారు కాబట్టి, అదే పని నీవూ చెయ్యి ఇందులో తప్పేముంది. ఎలా చూచినా నీవు నీ కర్తన్య కర్య చేయక తప్పదు కదా!
నీవు జీవన్ముక్తుడివి, నీకు అన్నీ తెలుసు నీకు కర్మచేయనవసరం లేదు అని నీవు అనుకున్నాకూడా, నీ కోసం కాకపోయినా జనం కోసం అయినా, వారిని మంచి దారిలో పెట్టడానికైనా నీవు కర్మలు చేయాలి కదా. అర్జునుడే యుద్ధం చేయలేదు మేం మాత్రం ఎందుకు యుద్ధం చేయాలి అని నీ సైనికులు అనుకుంటే మిగిలిన వీరుల గతేం కావాలి. కాబట్టి ఇతరులకు మార్గదర్శకంగా ఉండటానికైనా నీవు యుద్ధం చేయక తప్పదు.
ఇదీ కృష్ణుడి ఆర్యుమెంటు. జనకుడు, అశ్వపతి, ఇక్ష్వాకువు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, భగీరథుడు మొదలగు చక్రవర్తులందరూ జీవన్ముక్తులే కానీ కర్మలు చేసారు. ఎవరి కోసం? ఇతరుల కోసం, ఇతరులను మంచి మార్గంలో పెట్టడం, ఇతరులకు మార్గదర్శకంగా ఉండటం కోసం చేసారు. ఈ నిష్కామయోగం ఏమీ కొత్తది కాదు. అంతకు ముందు చాలామంది చక్రవర్తులు దీనిని ఆచరిరంచి ముక్తిని పొందారు. ఒక పక్క రాజ్యం చేస్తూ, రాజ్యం కొరకు యుద్ధాలు చేస్తూ కూడా మోక్షం పొందడం సాధ్యమా అని అర్జునుడు అడగక ముందే కృష్ణుడు జనకుడు మొదలగు రాజుల గురించి చెప్పి వారు కూడా కర్తవ్య కర్మలను ఆచరిస్తూనే ముక్తిని పొందారు అని చెప్పాడు. చేయవలసిన కర్మ చేయదగ్గ కర్మ నిష్కామంగా, ప్రజలకొరకు, నిర్మలమైన మనసుతో చేస్తే దాని వలన జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే మోక్షానికి దారి ఏర్పడుతుంది. పైన చెప్పిన మహారాజులు చక్రవర్తులు నిష్కామ కర్మలు చేసి జ్ఞానమును సంపాదించి ముక్తిని పొందారు.
అంతే కాదు. పెద్ద వాళ్లను చూచి ఇతరులు నేర్చుకుంటారు. మేము జీవన్ముక్తులము మేము ఏమీ కర్మ చేయ నవసరం లేదు అని కూర్చోకుండా వారి వారి కర్తవ్య కర్మలు చేస్తే వారిని చూచి ఇతరులు ధర్మమార్గమును ఆచరిస్తారు. అప్పుడు లోకకల్యాణం జరుగుతుంది. ఒక్కడు బాగుపడినా బాగుపడినట్టే. కాబట్టి అర్జునా! నీవు ఇతర సైనికులకు ఆదర్శంగా నిలిచి యుద్ధం చేయి అని భగవానుడు చెప్పాడు.
(సశేషం)
*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P172
No comments:
Post a Comment