Thursday, October 16, 2025

 *మార్గదర్శకులు మహర్షులు -5*
🪷

రచన: మహామహోపాధ్యాయ శివానందమూర్తి


*అష్టావక్రమహర్షి - 3*


అయితే అష్టావక్రుడి వివాహం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది.

ఆయన వదాన్యుడు అనే ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, ఆయన కుమార్తె అయిన సుప్రభ అనే కన్యను తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు. వదాన్యుడు అంతకు పూర్వమే అష్టావక్రుడి కీర్తి బాగా విని ఉన్నాడు. ఆయన చరిత్ర లోకమంతా తెలుసు. అయినాసరే ఆయన మహత్తు గొప్పదని లోకానికి చాటిచెప్పాలి కాబట్టి -అందులోనూ తన అల్లుడి గొప్పదనం అందరికీ తెలియాలి అనుకుని - అతనికి ఒక పరీక్ష పెట్టాడు. ఆయన అష్టావక్రుడితో, "నీకు నా కుమార్తెను తప్పకుండా ఇస్తాను. నీకంటే యోగ్యుడెవరున్నారు! నువ్వు ఉత్తరదిశగా వెళ్ళి కుబేరుడి నగరం దాకా వెళ్ళి ఆ నగరం చూడాలి. అది దాటి ఇంకా ఉత్తరంగా హిమవత్పర్వత సానువులన్నీ దాటి ఇంకా పైకి వెళ్ళి కైలాసం చేరుకుని పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకొని రావాలి. ఆ తరువాత అక్కడ ఉన్న కదంబ వనం చేరుకుని అక్కడ ఉన్న రత్నఖచిత సింహాసనం పైన కూర్చుని ఉండే ఒక జగదేకసుందరిని దర్శించి తిరిగి రావాలి. అప్పుడు వెంటనే పెళ్ళి చేస్తాను" అన్నాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
అష్టావక్రుడు అందుకు ఒప్పుకున్నాడు. ఆయనకు ప్రయాణానికి సన్నాహాలంటూ ఏమున్నాయి! అలాగే దండం, కమండలం పట్టుకొని వెళ్ళిపోయాడు. అష్టావక్రుడు వస్తున్నాడని తెలియగానే, కుబేరుడి ఆజ్ఞపై అతడి సేవకులు వచ్చి ఆయనకు ఆహ్వానం పలికారు, సర్వోపచారాలు చేసారు. కుబేరుడు చాలా ధనవంతుడు. సేవకులను, సేవికలను ఇచ్చాడు. వీటికి ఆయన ఏమీ చలించలేదు. అలాగే నిష్ఠగా ఉన్నాడు. అలాగ ఒక సంవత్సరకాలం గడిపాడు. మనసు ఏమీ చలించలేదు. కైలాసానికి వెళ్ళి దూరం నుంచీ పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకొన్నాడు. అక్కడి నుంచీ ఇంకా ఉత్తరానికి ఆకాశ మార్గాన వెళ్ళాడు. అక్కడ కదంబవనం ఉంది. ఆ మధ్యలో ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆమె పరాశక్తి యొక్క అంశలో ఉంది. ఆమె ఈతడిని బాగా పరీక్షించింది. సమస్త రాజోపచారములు అన్నీ చేసి తనను వరించమని కోరింది. అతడిని గట్టిగా నిర్బంధించింది. 

"అది అధర్మం -నేను అలా చేయను. నాకలాంటి కోరికలేదు. మా దేశంలో నేనొక కన్యకని వరించాను. అక్కడికెళ్ళి ఆమెని పెళ్ళిచేసుకోవటం కోసమని నిన్ను చూచి వెళుతున్నాను. నాకు కాబోయే మామ గారు పెట్టిన పరీక్ష ఇది. కాబట్టి ఇక్కడ మీతో నాకేమీ సంబంధం లేదు. నాకు మీరేమిచ్చినా, ఏమి ఇవ్వకపోయినా నాకేమీ పర్వాలేదు. నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతాను" అన్నాడు.

ఆయన నియమనిష్ఠలకు మెచ్చుకుని ఆమె అతడికి వరాలను ఇచ్చింది. "నీ బోధలు అమోఘమయిన జ్ఞానాన్ని ఇవ్వగలిగిన శక్తివంతములయి ఉంటాయి. నీ బోధలు చదివినవారికి జ్ఞానోదయం అవుతుంది. జగత్ప్రసిద్ధమయిన కీర్తిని సంపాదించి నువ్వు జగత్పూజ్యుడవు అవుతావు. బ్రహ్మతుల్యుడిగా నిన్ను పూజిస్తారు. నువ్వు బ్రహ్మజ్ఞానిగా ఖ్యాతి పొందుతావు!" అని చెప్పి ఆవిడ ఆయనను పంపించింది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఆయన తిరిగివచ్చి పెళ్ళిచేసుకున్నాడు. ఏకపాదుడు తన కొడుకు యొక్క కీర్తి విని సంతోషించాడు. సుప్రభ, అష్టావక్రుల వివాహం బాగా జరిగింది. కుబేరాదులు అందరూ వచ్చి ఆశీర్వదించారు. దేవతలు కూడా వారి వివాహానికి వచ్చి ఆశీర్వదించారట.

ఆ తరువాత ఆయన చిరకాలం అనేక మందికి బోధచేసారు. 'అష్టావక్రసంహిత' అనే గ్రంథం అష్టావక్రుడి బోధలతో నిండి ఉంది. అనేక వైదిక గ్రంథముల బోధకునిగా కర్తగా ఆయనను చెబుతారు. అవన్నీ నశించిపోయాయి, నేడు దొరకటంలేదు. ఆయన గీత, సంహిత మాత్రమే ఉన్నాయి.
📖

అష్టావక్రుడికి సుందరమయిన రూపం రాక ముందు వంకరటింకరగా కుంటుకుంటూ, వంగుతూ లేస్తూ నడుస్తూ ఉండేవాడు. ఒళ్ళంతా ఎనిమిది వంకరలుగా ఉంది కదా పాపం! ఆయన ఒకసారి నడుస్తూ వెళ్ళుతూ ఉంటే, అర్భకుడైనటువంటి భగీరథుడు కూడా అష్టావక్రుడి లాగానే నడుస్తున్నాడు. అష్టావక్రుడు, భగీరథుడు తన రాజుకొడుకు కాబట్టి అహంకారంతో నన్ను వెక్కిరిస్తున్నాడు అనుకొని, భగీరథుడిని శపించటానికి కోపంతో శాపోదకం చేతిలోకి తీసుకున్నాడు. అంతలోనే ఆయనకు సందేహం వచ్చింది, "వీడు నిజంగానే అర్భకుడా లేక నన్ను వెక్కిరిస్తున్నాడా?" అని. 

ఈ విషయం ఆయనకు అనుమానంగా ఉండటంచేత, "ఒకవేళ నాలాగ అర్భకమైన శరీరంతోనే ఉండిఉంటే, మంచి దృఢమైన శరీరాన్ని పొందుతాడు. ఇతడి శరీరం ఆరోగ్యంగా దివ్యతేజస్సుతో వెలుగును గాక!" అని ఆ శాపోదకం భగీరథుడిమీద చల్లాడు. సహజంగానే అతడు అర్భకమైన శరీరాన్ని కలిగి ఉండటం చేత, అష్టావక్రుడి దయచేత ఉత్తమమయిన శరీరాన్ని ధరించాడు భగీరథుడు.
📖

కొంతకాలానికి అష్టావక్రుడికి వృద్ధాప్యం వచ్చేసింది. ఆయన భార్య అయిన సుప్రభాదేవికి ఆయన ఉత్తమగతులు కల్పించి ఆమెను ముందరే పంపించాడు. ఆమె వెళ్ళిపోయింది.

ద్వాపరయుగం వచ్చింది. ద్వారకలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కృష్ణుని వెతుకుతూ ద్వారక చేరుకున్నాడు అష్టావక్రుడు. ఆయన కృష్ణుని చూచాడు. వెంటనే ధ్యాన యోగంలో నమస్కరించాడు. శ్రీకృష్ణుడు ఆయనను చూచి  లేచి, గౌరవించి ఆహ్వానించాడు. అష్టావక్రుడికి కృష్ణుడు అర్ఘ్యపాద్యాలు ఇవ్వబోతున్నాడు. ఇంతలో ఆయన శ్రీకృష్ణుడి పాదాల పై తల ఉంచి శరీరాన్ని వదిలేసాడు. శ్రీకృష్ణుడు ఆయనకు స్వయంగా అంత్యక్రియలు జరిపించాడు. ఉదకాలను తనే స్వయంగా ఇచ్చి ఆ జీవుణ్ణి ఎంతో గౌరవించాడు.

అప్పుడు ఆయన పత్నులు, మంత్రులు అందరూ కూడా అష్టావక్రుడిని గురించి అడిగారు, "ఎవరీ అష్టావక్రుడు? నీ సన్నిధి లో శరీరాన్ని వదిలిపెట్టి పోయినాడు! ఆయనకు అంత పరమభక్తి తాత్పర్యాలతో ఉత్తరక్రియలు నీవే నిర్వహించావు! ఇతడి వృత్తాంతమేమిటి?" అని.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment