6️⃣9️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*మూడవ అధ్యాయము*
*కర్మయోగము.*
*21. యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జన:l*
*స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతేల్ll*
శ్రేష్ఠులు అయిన వారు ఆచరించిన దానిని ఇతరులు కూడా అనుసరిస్తారు. అతడు ఆచరించిన ప్రమాణాలనే ఇతరులు కూడా పాటిస్తారు.
యథా రాజా తథా ప్రజా అనే మాటకు ఇది అన్వయం. పెద్దవాళ్లు ఏది ఆచరిస్తారో, వారిని చూచి చిన్నవాళ్లు అదే ఆచరిస్తారు. కాబట్టి చిన్నవాళ్లను మంచి దారిలో పెట్టడానికి పెద్దలు వారికి నిర్దేశించిన కర్మలను చేయక తప్పదు. మామూలు ప్రాపంచిక విషయములలో కానీ, ఆధ్యాత్మిక విషయములలో గానీ, పెద్దలు పిన్నలకు మార్గదర్శకంగా ఉండాలి. పెద్దలే తప్పు చేస్తే పిల్లలు ఆ మార్గాన్ని అనుసరిస్తారు. కాబట్టి పెద్దలు కర్మలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న పిల్లలు ఎప్పుడూ పెద్దలను రోల్ మాడల్గా ఊహించుకుంటారు. పెద్దలు శాస్త్ర విరుద్ధముగా ప్రవర్తించకూడదు.
అర్జునుడు విషయానికే వద్దాము. అర్జునుడు శౌర్యవంతుడు, ధీరుడు, పరాక్రమవంతుడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు. ఇంద్రుని అర్ధసింహాసనము మీద కూర్చున్నాడు. అటువంటి వాడు ఈ ప్రకారంగా దౌర్బల్యస్థితిలో యుద్ధం చేయనంటే ఇతరులు కూడా దానినే అనుసరిస్తారు. అందరూ విల్లు అమ్ములు కిందపడేసి ఇంటికి పోతారు. అలా కాకుండా అర్జునుడు క్షత్రియ ధర్మమును ఆచరిస్తూ, తన బల పరాక్రమములు ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తే, యువకులు కూడా ఆయననే అనుసరిస్తారు. కాబట్టి పెద్దవారు దేనిని ప్రమాణంగా తీసుకుంటారో పిల్లలు దానినే ప్రమాణంగా తీసుకుంటారు. పెద్దవారు వేదమునే ప్రమాణంగా పాటిస్తే, పిల్లలు కూడా వారిని అనుసరిస్తారు. ఆ కారణం చేతనే వేద విద్య, సనాతన ధర్మములు పరంపరానుగతంగా, ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తూ ఈ నాటికి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి.
కాబట్టి జీవన్ముక్తులు, జ్ఞానులు, ఆత్మసాక్షాత్కారం పొందిన వారు కూడా, వారికి ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా, లోక కల్యాణం కొరకు కర్మలు చేస్తుంటారు. వారిని అనుసరించడం మన విధి. జగద్గురువు శంకరాచార్యుల వారు జీవన్ముక్తుడు. కాని ఆయన దేశం అంతా కాలి నడకన తిరిగారు, ధర్మప్రచారం చేసారు. మానవులకు ఉపయోగించే ఎన్నో గ్రంధాలు రాసారు. ఎందుకు, తన కోసం కాదు. లోక కళ్యాణం కోసం. అవి నేడు మనకు మార్గదర్శకాలు అవుతున్నాయి. కేవలము వేదములు శాస్త్రములు చదివినంతనే ప్రయోజనము లేదు. వాటిలో ఉన్న ధర్మములను పెద్దలు తాము ఆచరించి చూపించి, భావి తరాలకు మార్గదర్శకం కావాలి.
ఇందులో ప్రమాణము అని వాడారు. ప్రేమ అంటే ఉన్నది ఉన్నట్టు చూసే బుద్ధి. దానికి వికృతి భ్రమ. అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకునే బుద్ధి. మనం అంతా ఎల్లప్పుడూ భ్రమలో ఉంటాము. తాడును చూసి పాము అనుకుంటూ ఉంటాము. ప్రాపంచిక సుఖములు సత్యములు శాశ్వతములు అనే భ్రమలో వాటి వెంట పరుగెడుతుంటాము. కాబట్టి ఉన్నది ఉన్నట్టు తెలియజేసే దానిని ప్రమాణము అని అంటారు.
అన్ని ధర్మములకు ప్రమాణము వేదము. వేదములు ఒకరు రాయలేదు. మహా ఋషులు తమ సమకాలీన జీవితంలో వివిధములైన విషయములను, ఆచారాలను, వ్యవహారాలను, కర్మలను దర్శించి, అందులో మానవాళికి ఉపయుక్తమైన వాటిని, మానవులు ఆచరించవలసిన వాటిని, తమ బుద్ధిని జ్ఞానమును జోడించి, మనకు తెలియజేసారు. వేదములను ఋషులు దర్శించారు కానీ సృష్టించలేదు. అందుకే వారు వేద ద్రష్టలు, స్రష్టలు కాదు. సకల ధర్మములను వేదములు మనకు తెలియజేస్తాయి. కాబట్టి వేదములు అంటే శృతులు మనకు మొదటి ప్రమాణము.
వేదములు మానవాళికి సులభంగా అర్థం అయ్యేవి కావు. పైగా వేదములలో ధర్మములు అక్కడక్కడా పొందుపరచబడి ఉన్నాయి. వేదములు అన్నీ పూర్తిగా చదవడానికి మానవులకు జీవిత కాలం సరిపోదు. ఆ కారణం చేత మరి కొంతమంది ఋషులు ఆ వేదములను సంపూర్ణంగా అధ్యయనం చేసి, వాటిలో ఉన్న సారమును, ధర్మములను అన్నిటినీ ఒక చోట చేర్చి మనకు అందించారు. వాటినే స్మృతులు అంటారు. స్మృతులు మనకు రెండవ ప్రమాణము. మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి మొదలగునవి. వీటిలో మానవులు దైనందిన జీవితంలో ఆచరించవలసిన ధర్మములను, విధులను, కర్మలను వివరంగా పొందుపరిచారు. శృతి అంటే వేదములు, తండ్రి చెప్పినట్టు అంటే శాసించినట్టు చెబితే, స్మృతి తల్లి చెప్పినట్టు వివరంగా, చిన్న చిన్న కథల రూపంలో లాలించి, బుజ్జగించి, అర్థం అయ్యేటట్టు చెబుతుంది.
శృతులు కానీ, స్మృతులు కానీ అందుబాటులో లేని వారికి, అవి చదివినా అర్థం కాని వారికి, మూడవ ప్రమాణం శిష్టాచారం. అంటే శ్రేష్ఠులు అయిన వారు ఏమేమి ఆచరిస్తారో వాటిని మనం ఆచరించాలి. జ్ఞానులు, బుద్ధిమంతులు అయిన పెద్దలు ఏమి చేసారో వాటిని ప్రమాణంగా స్వీకరించాలి. మానవులకు ఎక్కడెక్కడ దేని గురించి అయినా సందేహాలు వస్తే, వారి ఇష్టం వచ్చినట్టు చేయకుండా జ్ఞానులు అయిన పురోహితులు చెప్పినట్టు చేయడం మంచిది.
పాండవులు ఒక అర్థరాత్రి పూట ఒక గంధర్వునితో తగాదా పెట్టుకున్నారు. అప్పుడు ఆ గంధర్వుడు వారికి ఒక సలహా ఇచ్చాడు. "అయ్యా! మీరు అన్నీ తెలిసిన వారే కావచ్చు కానీ మీరు ఒక పురోహితుని మీ ముందు ఉంచుకోండి. ఆయన మీకు తగినసమయంలో ధర్మబోధ చేస్తాడు. పురోహితుడు లేకుండా మీరు ఎక్కడకు వెళ్లవద్దు." అని చెప్పాడు. అప్పటి నుండి వారు ధౌమ్యుడిని తమ పురోహితునిగా పెట్టుకున్నారు.
(సశేషం)
*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P175
No comments:
Post a Comment