249 వ భాగం
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18
శ్లోకము 37
నిన్నటి తరువాయి భాగం
ఆత్మ తత్వాన్ని సాధించాలనే కోరిక ఉన్నంత సేపు అది కోరికగానే మిగిలిపోతుంది .నిద్రపోవాలని కోరిక బలంగా ఉన్నంతసేపు నిద్ర పట్టడం లేదని ఎంత హాస్యాస్పదం? ఆ కోరిక అంతరించినప్పుడు నిద్రలో ఉండటం జరుగుతుంది. అందుకే శాస్త్ర అధ్యయనం చేస్తూ మననము చేసే వారంతా ధ్యానాది సాధనల ప్రయోజనాన్ని పరిమితిని గుర్తించి సరైన సమయంలో వాటిని విడిచిపెట్టగలగాలి.
అందుకే వేదాంత సాధన ప్రారంభ దశలో శాస్త్రఅధ్యయనాన్ని శ్రవణ మననాలను మముక్షత్వాన్ని యమ నియమాలు సర్వసాధనాలను ప్రోత్సహించి మనసును ఏకాగ్రం చేయమని గురువులు బోధిస్తారు. ఇలా ఏకాగ్రతతో బలియమైన మనసు ఏదో బలాన్ని ఉపయోగించి ఈ చివరి కోరికను కూడా విస్మరించాలనే సత్యాన్ని మహర్షి ఇక్కడ గట్టిగా చెబుతున్నారు. నాచే చూపబడే మనశ్శరీరాలు నేను కాదని తెలుసుకోవడంతో ప్రారంభమైన ముముక్షత్వము నేనెవరో తెలుసుకోవాలని బలంగా ఉంటుంది. ఈ కోరిక బలంగా ఉన్నంత కాలం మనసుదో తాదాత్మ్యముంటూనే ఉంటుంది. శాస్త్ర హృదయాన్ని బుద్ధితో అర్థం చేసుకొని నేను ఆత్మను అని తెలుసుకొని ఆత్మను సాధించాలనే ఇన్నాళ్ల తపన అర్థరహితము హాస్యాస్పదము అని స్పష్టంగా గుర్తించిన బుద్ధి మౌనము దాల్చాలి దాలుస్తుంది. అదే ఆత్మానుభవము అందామన్నా అనుభవించే నేను వేరనే అపోహ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదే ఆత్మ స్వరూపము నా సహజ స్వరూపము అని గుర్తించడమే సాధన ఫలం నా లక్ష్యం అదే మానవ జీవితం పరమార్థం. అందుకే నేను ఆత్మను సాధించాలి దర్శించాలి అనే కోరికను అర్థరహితంగా గుర్తించి ఆత్మనే నేను అనే దృష్టిని స్థిరంగా ఎంచుకోవాలి.
ప్రాపంచికమైన చిన్న చిన్న కోరికలను విడిచిపెట్టగలగటం అంత గొప్ప విషయం ఏమీ కాదు. అంతకంటే పెద్ద కోరిక అనదగిన ఆత్మసాక్షాత్కారము ముందు అవన్నీ అల్పంగా తోచడంతో వాటంతట అవే అంతరించిపోతాయి .నిజమైన ఈ చివరి కోరికను త్యజించడమే .అదే నిజమైన సన్యాసి అతడే సచ్చిదానంద రూపము, పరబ్రహ్మము ,ఆత్మ .ఈ విషయాన్ని యోగ వాసిష్టం ఇలా ఘోషిస్తుంది.
నా స్వస్వరూపంగా ఈ అనంత చైతన్యాన్ని గుర్తిస్తూ ఆనందంగా జీవిస్తున్నాను.
క్లుప్తంగా చెప్పాలంటే ఆత్మానుభవము విజ్ఞానం వలన మాత్రమే సాధ్యము, ఆ రాచ బాటలో ఇక్కడ ఆగి చూస్తే ధ్యాన రూపమైన మనో నియమము అర్థరహితము అని చెప్పక తప్పదు. ఇది ఎంత ఉత్కృష్టమైన కోరిక అయినప్పటికీ ఈ స్థితికి చేరాక అహంకారాన్ని జీవింపజేసే కోరికగా బంధంగా గుర్తింపబడి విడవబడాలి. ధ్యానిని ధ్యేయాన్ని విడదీసే దృష్టిగా పరినమించి మముక్షత్వము చివరి దశలో ప్రతిభందకమై బాధిస్తుంది. అందుకే ఈ స్థితికి చేరిన సాధకులు ఆత్మ తత్వాన్ని బుద్ధితో అర్థం చేసుకొని ఆత్మగా మిగిలిపోవాలి. ఆత్మను దర్శించాలని సాధించాలని కోరిక ఉంటే శ్రవణ మననాల అవసరము ఇంకా ఉన్నట్లే. చాత హృదయం అర్థం అయితే ఈ చివరి కోరిక అదృష్టమై ఆత్మతత్వం అద్వితీయంగా భాసిస్తుంది.🙏🙏🙏
No comments:
Post a Comment