*మార్గదర్శకులు మహర్షులు - 4*
🔱
రచన: మహామహోపాధ్యాయ శివానందమూర్తి
*అష్టావక్రమహర్షి -2*
సృష్టిలో ఉండేటటువంటి సత్యములలో వంది ఒకటి చెపితే, దాని పైసత్యాన్ని ఇంకొకటి చెప్పాలి తను. అదీ అక్కడ పందెం. ఒకటి అనే సంఖ్య ఏమేమి చెపుతుంది సృష్టిలో, ఆ పరమసత్యం చెప్పాలి. ఒకటికి చెప్పిన తరువాత, ఆ తరువాత సంఖ్య రెండు. ఈ సంఖ్య సృష్టిలో ఉండే ఏ పరమసత్యములను చెపుతుందో, అది తను చెప్పాలి. దాని తరువాత 3వ సంఖ్య మళ్లీ అతడు తీసుకుంటాడు. సృష్టిలో ఉండే పరమసత్యాలేమిటి - మూడు సంఖ్య వేటిని గురించి చెపుతుంది? ఈ విషయాన్ని అతడు చెప్పాలి. తరువాత నాలుగేది తను చెప్పాలి. ఈ ప్రకారంగా ఎక్కడయితే ఆ పైసంఖ్య గురించి అవతలి వాడు చెప్పలేక ఆగిపోతాడో, అక్కడ అతడు ఓడిపోయినట్లు.
"ప్రజ్వలించేది అగ్ని ఒకటే. సూర్యుడు ఒకడే! శివుడు ఒక్కడే సర్వవ్యాపి" అని ఒకటి సంఖ్యకు సంబంధించిన మూడు సత్యాలు వంది చెప్పాడు. అప్పుడు అష్టావక్రుడు రెండు సంఖ్యకి సంబంధించిన రెండు సత్యాలు చెప్పాడు.
“ఇంద్రాగ్నులిద్దరు. నారద పర్వతులిద్దరు, దేవతలైన అశ్వినేయులిద్దరు. సంసార మూలం అయిన భార్యాభర్తలు ఇద్దరు" అని చెప్పి రెండు సంఖ్య నిరూపించాడు. అవి శాశ్వతములైన సత్యాలు అయి ఉండాలి. ఈ ప్రకారంగా 12వ సంఖ్య వరకూ చెప్పుకుంటూ వెళ్ళారు. 12వ సంఖ్య అష్టావక్రుడు చెప్పాడు. 13వ సంఖ్య వంది చెప్పలేకపోయాడు.
"జితోస్మి!" ("ఓడిపోయాను నేను") అన్నాడు వరుణకుమారుడైన వంది.
నీకేం కావాలని అష్టావక్రుడిని జనక మహారాజు అడిగాడు. అష్టావక్రుడు "నా తండ్రిని విడిపించుకోవటానికి వచ్చాను. ఆయన శిక్షలో ఉన్నాడు. ఇంతకుముందు మీరు నిర్ణయించిన ప్రకారంగా ఈ వందిని ఆ చెరువులో కూర్చోబెట్టి నా తండ్రిని బయటకు పంపించండి!" అన్నాడు.
దానికి జవాబుగా వంది, "కేవలం అది ఒక వంక మాత్రమే! ఇలా చాలామంది బ్రాహ్మణులను తీసుకొచ్చి వాళ్ళను వాదనలో గెలిచి, వాళ్ళ మహత్యాన్ని తెలుసుకున్నవాడిని. వాళ్ళకు నిజంగా శిక్ష వెయ్యలేదు. నా తండ్రి అయిన వరుణ దేవుడు ఒక మహాయాగం సంకల్పించి చేస్తున్నాడు. దానికి ఋత్విక్కులు దొరకటం లేదు. అందుకని ఇలాగ వీళ్ళను ఆకర్షించి ఓడించి అక్కడికి పంపించి, అక్కడ ఆ యజ్ఞం సక్రమంగా జరిగేటట్లు చూస్తున్నాను. అయ్యా! నీ తండ్రి వరుణ దేవుడి యజ్ఞంలో ఉన్నాడు చూడు!" అని చెప్పి ఆయనను పిలిపించి సన్మానం చేశాడు. అందుకు ఫలంగా వందితో, “నిన్ను క్షమిస్తున్నాను!” అన్నాడు అష్టావక్రుడు.
ఎనిమిది ఏళ్ళ పిల్లవాడు వందిని క్షమించి విడిచిపెట్టాడు. ఆ ప్రకారంగా అష్టావక్రుడు లోకవిఖ్యాతుడయ్యాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
అష్టావక్రుడు ఇంకా తపస్సుచేసుకున్నాడు. తండ్రి శిక్షణలో వేద వేదాంగాలను, సృష్టిలో చాలా విషయాలను తెలుసుకున్నాడు. వివాహ కాలం ఆసన్నమయింది. 16, 17 సంవత్సరములు వచ్చాయి. ఎనిమిది వంకరలతో ఉన్నవాడిని ఎవరు పెళ్ళి చేసుకుంటారు! "నన్ను ఎవరు పెళ్ళి చేసుకుంటారు? నాకు పెళ్ళి ఎందుకు?" అని అనుకొని, ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళమీద హాయిగా ఒక చాపవేసుకుని కూర్చొన్నాడు అష్టావక్రుడు. సిద్ధుడికి అసాధ్యమయినది ఏముంది! ఆ చెరువు మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తున్నాడు.
ఆయన యొక్క జ్ఞానాన్ని, ఉత్కృష్ట తపోబలాన్ని తెలిసినటువంటి ఇంద్రుడు ఆయనకు సేవచేయటానికి అప్సరసలను పంపించాడు. రంభాది అప్సరసలు వచ్చి ఆయన చుట్టూ నాట్యాలు చేసి ఆయనను రంజింపచేసారు. "బాగుంది. మీరందరూ ఆడారు, పాడారు. చాలా బావుంది ఇక వెళ్ళండి" అన్నాడు. ఆయనకేమీ మనసు చలించలేదు. వాళ్ళు ఆయనతో, "మీరు చాలా మహాత్ములని ఇంద్రుడు చెప్పాడు. మాకో వరం ఇవ్వగలరా?" అని అడిగారు. సరే అడగమన్నాడు ఆయన. "మమ్మల్ని శ్రీమహావిష్ణువే పెళ్ళి చేసుకోవాలి" అని అడిగారు. విష్ణువు ఈయన చేతిలో ఉంటాడా! ఏదసాధ్యమో అది అడగటం!
"వీళ్ళు నన్ను పరీక్షిద్దామని చూస్తున్నారు, ఒక్క విష్ణువును తప్ప ఇంక వేరే ఎవరినీ అడగటానికి వీలులేని వరం అడిగారు" అని తనలో అనుకుని వాళ్ళతో, "మీరడిగిన వరం ఇస్తున్నాను. మీ కోరిక నెరవేరుతుంది. భవిష్యత్తులో ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణపరమాత్మగా అవతరిస్తాడు. ఆ కాలంలో మీరందరూ ఆయనకు భార్యలుగా ఉంటారు. ఆ జన్మలో మీ కోరిక సిద్ధిస్తుంది" అని వరమిచ్చాడు అష్టావక్రుడు.
వెళ్ళిపోతూ, ఆయన వక్రరూపం చూచి ఆక్షేపణగా నవ్వారు చాపల్యం ఉన్న ఆ అప్సరసలు. తనను చూచి నవ్వేటప్పటికి ఆయనకు కోపం వచ్చింది. "నాదగ్గరే వరం తీసుకుని నన్నే చూచి ఆక్షేపించి ఈవిధంగా నవ్వుతున్నారా! దీనికి ప్రతిఫలంగా ఒక శిక్ష కూడా అనుభవించండి! శ్రీకృష్ణ పరమాత్మ భార్యలుగా మీరు పుట్టిన కాలంలో మీరుండగానే ఆయన అవతారం చాలించి వెళ్ళిపోతాడు. ఆయన భార్యలుగా ఉండే మీరు వైదవ్యమే కాకుండా, సామాన్యమైన నిషాదులు - దొంగలచేతులలో అవమానం కూడా పొందుతారు! ఇదే మీకు శిక్ష!" అని శపించాడు వాళ్ళను.
ఆ కారణంచేతనే కృష్ణపరమాత్మ అవతారం చాలించిన తరువాత, అర్జునుడు కృష్ణుడి యొక్క భార్యలను, అంతఃపురకాంతలందరినీ తీసుకొని వెడుతుంటే, దోపిడీ దొంగలువచ్చి వీళ్ళ నగలను, ధనాన్ని దోచుకున్నారు. వెంబడి ఉన్న అర్జునుడు కూడా ఏమీ చేయలేక పోతాడు. దొంగల్ని జయించలేకపోతాడు. అస్త్రశస్త్రాలేవీ జ్ఞాపకంరాలేదు. దానికి కారణం అష్టావక్రుడి శాపమే!
('వీళ్ళు అష్టమహిషులా? వేరేవాళ్ళా?' - అని సందేహం కలుగవచ్చు. ఆయనకు అష్టమహిషులేకాక అనేకమంది భార్యలు ఉన్నారు. అయితే ఈ శాపగ్రస్తులైన అప్సరసలు అష్టమహిషులలోని కొందరు కావచ్చు. ఆయన అవతారసమాప్తి తరువాత, అష్టమహిషులలో ఒకరు ప్రాయోపవేశం చేసారు. ఒకరు యోగంతో శరీరాన్ని వదిలిపెట్టారు. కొందరు ఈ శాపవశాన అవమానం పాలయ్యారు).
📖
అష్టావక్రుడు తండ్రి దగ్గరకెళ్ళి, "తండ్రీ! నాకు ఆజన్మాంతమూ ఉండే బ్రహ్మచర్య దీక్ష ప్రసాదించు! అష్టావక్రుడినయిన నాకు వివాహం ఎలా అవుతుంది?" అని అడిగాడు.
అప్పుడు ఏకపాదుడు, “నాయనా! నీ అష్టావక్రత్వానికి నేనే కారణం. ఏదో క్రోధంలో ఎనిమిది వంకర్లతో పుట్టమని నిన్ను శపించాను. నువ్వు తల్లిగర్భంలో ఉండి నన్ను, నా బోధనా పద్ధతిని ఆక్షేపించటం చేత కోపం వచ్చి ఆ పని చేసాను. నీవంటి మహాత్ముడు నా కడుపున పుట్టటం నాకే గర్వకారణం. నా తపోబలంతో నీ అష్టవంకరలు తీరుస్తాను. నువ్వు యోగ్యుడివై, అందమైన శరీరంతో మంచి ఉత్తమురాలైన స్త్రీని వివాహం చేసుకుని సుఖపడవచ్చు" అని వరమిచ్చి ఒక నదిని చూపించాడు ఆయన. అతడి తలమీద చెయ్యిపెట్టి ఆశీర్వదించి, ఆ నదిలో స్నానంచేసి రమ్మని, తన తపస్సు ను ఆ నీళ్ళలో ధారపోసాడు - తండ్రి. ఆ నీళ్ళల్లో స్నానంచేసి బైటకి వచ్చేటప్పటికి అష్టావక్రుడి శరీరం అష్ట వంకరలుపోయి, సుందరంగా మారింది. ఆ తరువాత ఆయన వివాహం చేసుకున్నాడు. అయితే ఆయన వివాహం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment