Thursday, October 16, 2025

 


*సద్గురు శ్రీ నాన్నగారు.. భూపతిరాజు వెంకట లక్ష్మీ నరసింహరాజు గారు*

రమణ మహర్షి బోధనలతో ఆధ్యాత్మిక రంగంవైపు ఆకర్షితులై ఎన్నో సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పునీతులయ్యారు సద్గురు శ్రీ నాన్నగారు. ఆయన అసలు పేరు భూపతిరాజు వేంకట లక్ష్మీ నర్సింహరాజు. స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా జిన్నూరు.

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలోని కొమ్మర గ్రామంలో 1934 సెప్టెంబరు 23వ తేదీన మాతామహులైన మంతెన అచ్యుతరామరాజు గారింట ఆయన జన్మించారు. భూపతిరాజు సూర్యనారాయణరాజు, రాజయమ్మల గారాల బిడ్డడైన ఆయన జిన్నూరులో ప్రాథమిక విద్యను, పాలకొల్లులో హైస్కూలు విద్యను పూర్తిచేశారు. పాలకొల్లు హైస్కూలులో వక్తృత్వ సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు.

యుక్తవయసులోనే ఆయనపై ఆధ్యాత్మిక ప్రభావం పడింది. 1954లో అమ్మమ్మ గారైన మంతెన సీతమ్మతో కలిసి ఉత్తర దేశ యాత్రలు చేసి వచ్చారు. హృషికేశ్ లో స్వామి శివానంద ఆశీస్సులు పొందారు. 1957లో జిన్నూరులో భగవాన్ శ్రీ రమణ మహర్షి జయంతి ఉత్సవాన్ని ప్రారంభించారు. రమణ మహర్షి సాహిత్యం పట్ల ఆకర్షితులైన ఆయన 1959లో అరుణాచల క్షేత్రాన్ని శ్రీ రమణాశ్రమాన్ని దర్శించివచ్చారు. 1962 నుంచి పూర్తిగా సామాజిక సేవకు అంకిత మయ్యారు. కొంతకాలం జిన్నూరు పంచాయతీ బోర్డు సభ్యులుగా, సహకార బ్యాంకు కార్యదర్శిగా సేవలందించారు. భారత - చైనా యుద్ధ కాలంలో రక్షణ నిధిని వసూలు చేసి ప్రభుత్వానికి అందించారు. ఐదేళ్ళపాటు జిన్నూరులో వయోజన విద్యా కేంద్రాన్ని నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతో ఐదేళ్ళపాటు జిన్నూరు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని దిగ్విజయంగా నడిపారు.

1980లో జిన్నూరులో శ్రీ రమణ సత్సంగాన్ని ప్రారంభించిన శ్రీ నాన్నగారు 1982 నుంచి రాష్ట్రమంతటా పర్యటిస్తూ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేడివారు. 1984లో జిన్నూరు లో శ్రీ పెన్మెత్స సుబ్బరాజు (తండ్రి జగన్నాధరాజు) గారి స్వంత భూమిలోనే శ్రీ రమణ క్షేత్రాన్ని నిర్మించారు. వీరు కూడా రమణ భగవత్పాదుల పరమ భక్తులు.  ఈ క్షేత్రాన్ని శ్రీ నాన్నగారికి అందజేయగా, వారు అందులోనే కొనసాగి కొన్ని పుస్తకాలు కూడా రచించారు. భక్తుల సహకారంతో తిరువణ్ణామలైలో మూడు ఆశ్రమాలు నెలకొల్పారు. అవి. ఆంధ్రా ఆశ్రమం, శ్రీ నాన్న ఆశ్రమం, శివసన్నిధి. 1990లో రమణ భాస్కర పక్షపత్రికను శ్రీ నాన్నగారు నెలకొల్పారు. శ్రీ నాన్నగారి స్నేహితులు, భక్తులు అయిన విశాఖ పట్టణం వాసి శ్రీ పెన్మెత్స సత్యనారాయణరాజు *శ్రీ నాన్న చారిటబుల్ ట్రస్ట్'ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు ద్వారా వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్నారు. శ్రీ నాన్నగారు అనేక సంస్థలకు ఆర్థిక సహాయం అందించారు. ఇంగ్లండ్ లోని శ్రీ రమణ మహర్షి ఫౌండేషన్ వారి ఆహ్వానంపై రెండుసార్లు ఇంగ్లండును దర్శించారు. "ట్రావెల్స్ త్రూ సేక్రెడ్ ఇండియా" పుస్తకంలో శ్రీ నాన్నగారి సందేశాన్ని కూడా ఆ పుస్తక రచయిత పొందుపరిచారు.

ఆధ్యాత్మిక రంగానికి అంకితమై ప్రజాసేవలో నిలిచిన శ్రీ నాన్నగారు 87వ ఏట  డిసెంబర్ 29, 2017న తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు, ఈ తేదీని కొంతమంది భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఆయనను ఒక ఆధ్యాత్మిక మార్గదర్శిగా గుర్తుంచుకుంటారు.
ఆయన ప్రభావంతో కుమారుడైన శ్రీ భూపతిరాజు సూర్యనారాయణ రాజు గారు మరియు అనుంగు భక్తులు శ్రీ నాన్న గారి ప్రవచనాలు చెప్పుకుంటూ, ఈ క్షేత్రమును ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రముగా విలసిల్లజేస్తున్నారు. సూర్యనారాయణరాజు గారు ఇక్కడ అరుణాచలక్షేత్ర నమూనాను ప్రతిష్టించడం ద్వారా జిన్నూరు రమణ క్షేత్రానికి మరింత వన్నె తెచ్చి శ్రీనాన్నగారి భక్తులందరికీ ఆదర్శనీయులైనారు.

No comments:

Post a Comment