*మహామంత్రి మాదన్న - 9*
(చరిత్ర ఆధారిత నవల)
👳🏽
రచన : ఎస్.ఎమ్. ప్రాణ్ రావు
ఏం చెయ్యాలి. సుల్తాన్ రమ్మంటున్నాడు. తను వెళ్లద్దనుకుంటున్నాడు. ఈ సమస్య ను ఎలా పరిష్కరించాలి. మీర్జా సయ్యద్ బలంగా తన కణతలు నొక్కుకున్నాడు. ఒక ఆలోచన తట్టింది. కళ్లు మెరిసాయి.
సుల్తాన్ మాట మన్నించి తను హైద్రాబాదు వెడతాడు. మీర్ జుమ్లా పదవిని అందుకుంటాడు. అక్కడ తన ప్రవర్తనతో అమీరులకి, కులీనులకు ముచ్చెమటలు పట్టిస్తాడు. తనని దర్బారులో వుంచవద్దని వాళ్లు సుల్తాన్ కి మొరపెట్టుకుంటారు. అప్పుడు సుల్తాన్ అనుమతితో ఆ హెూదా లోనే కర్నాటకకి తరఫ్ దార్ గా వస్తాడు. అలా అయితే అవ్వ బువ్వ రెండూ తనకే వుంటాయి.
కర్నాటక కి తరఫ్ దార్ గా వచ్చేస్తే తను స్వేచ్చగా వుండవచ్చు. నిజంగా తను స్వేచ్ఛగా వుండగలుగుతాడా. దక్కన్ సుబేదార్ ఔరంగజేబు తనకి రాయబారం మీద రాయబారం పంపుతున్నాడు. మొగలుల కొలువులోకి సాదరంగా పిలుస్తున్నాడు. షాజహాన్ చక్రవర్తి తనకు సప్త హజారీ మన్సబీ ఇస్తాడని ప్రలోభ పెడుతున్నాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
సుల్తాన్ అబ్దుల్లా, తను షియా తెగకు చెందినవారు. షాజహాన్ చక్రవర్తిది సున్నీ పాయ. షియాలంటే కంటగింపు. చక్రవర్తి కొలువులో కుదిరితే తను మొగలుల కొమ్ము కాయాలి. తన తోటి షియా మీదే కత్తి దుయ్యాలి.
ఆలోచనలతో మీర్జా సయ్యద్ బుర్ర వేడెక్కింది. అంతటి చల్లటి వాతావరణం లోను ఉద్రిక్తతకు లోనవడం వల్ల చెమటలు పట్టాయి. చెమట తుడుచుకుని ఆకాశం వైపు చూశాడు. తళతళలాడుతున్న చంద్రుడు తనకి వెన్నెల విందు వడ్డించాడ నిపించింది. ఎవరయినా సరే జీవితంలో వెన్నెల వెలుగులకే స్వాగతం పలకాలి. చిమ్మన చీకటికి కాదు. గోలుకొండ రాజ్యం సరియైన సరంగు లేని నావ. అది మునిగి తీరుతుంది. దానిని మొగలులు అస్సలు మననియ్యరు. గోలుకొండ పతనమయ్యాక కొలువు కోసం తను మొగలులను దేవురించాలి. వాళ్లు దయ తలచి ఏది విదిలిస్తే దానిని దాసోహం అని అందుకోవాలి. ఇప్పుడైతే వాళ్లే తనను రారమ్మని ఆహ్వానిస్తున్నారు.
ప్రస్తుతం తను మొగలుల పక్షం వహిస్తే, తర్వాత తను కర్నాటకలో స్వతంత్ర రాజ్యం ఏర్పరుచుకుని స్థిరపడవచ్చు. ఖిల్జీలు, తుగ్లక్లు, బహుమనీలు, కుతుబ్షా హీలు, మొగలులు అందరూ అఫాకీలే. బయట నుంచి వచ్చినవాళ్లే. హిందుస్తాన్ లో రాజ్యాలు స్థాపించి ఏలికలయ్యారు. తనలాంటి వీరుడి ముందు వున్నది అదొక్కటే మార్గం. తను సాధించగలడా? తనలాగ బానిసగా వచ్చిన మాలిక్ అంబర్, బానిసగా మూడుసార్లు అమ్ముడు బోయిన మాలిక్ అంబర్ మహావీరుడిగా మన్నన పొందాడు. ఒంటిచేత్తో మొగలుల్ని ఎదిరించి చెమటలు పట్టించాడు. తనూ చెప్పుకోతగ్గ వీరుడే. అదీగాక తన చెంత మణుగుల కొద్దీ వజ్రాలున్నాయి. కొండ లాంటి కాంతి గల వజ్రం కొల్లూరు గనుల్లో దొరికింది. రెండు లక్షల పైన విలువ చేసే ఆ వజ్రం తొమ్మిది వందల రత్తీల బరువు తూగుతుంది. దానిని షాజహాను చక్రవర్తికి కానుకగా ఇస్తేచాలు తన కోరికతీరుతుంది. ఈ ఆలోచన రావడంతో మీర్జా సయ్యద్ మనసు కుదుటపడింది. వరండాలోంచి మందిరంలోకి వచ్చాడు. తన కోసం కాచుకుని వున్న మగువులతో మరుకేళిలో మునిగిపోయాడు.
📖
సయ్యద్ నిజాముద్దీన్ కూడా ఆనాటి ఆఫాకీల మాదిరే తన అదృష్టాన్ని వెతుక్కుంటూ అరేబియా నుంచి భారత దేశానికి వచ్చాడు. అతడు హేయాజ్ కులీన కుటుంబానికి చెందినవాడు. మక్కాకి చెందిన ఒక గొప్ప కులీన షేక్ కి బంధువు. చతురుడు, వీరుడు, మేధావి. అంతేకాదు, అరేబియా సాహిత్యం బాగా తెలిసినవాడు. అన్నిటికి మించి చాలా సమర్థుడు. సుల్తాన్ అబ్దుల్లా కొలువులో ప్రవేశించిన అతను తన ప్రజ్ఞాపాటవాలతో, పాండిత్య ప్రతిభతో ఆ సభలో బాగా రాణించాడు. సుల్తాన్ మెప్పు కూడా పొందాడు.
రాజమాత హయత్ బక్షీ బేగం కూడా సయ్యద్ నిజాముద్దీన్ లోని సమర్ధతను పసిగట్టింది. నిక్కచ్చిగా వుండే అతని వ్యవహారశైలి ఆమెను ఆకట్టుకుంది. అలాంటి శక్తియుక్తులున్నవాడు రాచ కుటుంబంలో వుంటే బావుంటుందని భావించింది. సుఖలాలసుడు, బద్దకస్తుడు అయిన తన కొడుకికి వయసు ఉడిగి పోతున్న తను మరెంతో కాలం అండగా వుండలేనని ఆలోచన చేసింది. అందుకే సయ్యద్ కి తన పెద్ద మనుమరాలు ఫాతిమా ఖానంని ఇచ్చి వివాహం చేస్తే పాలనా వ్యవహారాలు కూడా గాడిన పడతాయి అని తలపోసింది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
సుల్తాన్ అబ్దుల్లా భార్యలు సరమా బేగం, జానీ సాహెబా, మహాబానో, బేగం సుల్తానా ఇతర అంతఃపుర స్త్రీలు ఆ సంబంధానికి సానుకూలంగా స్పందించడంతో వివాహం నిశ్చయమైంది. అప్పటికే సయ్యద్ నిజాముద్దీన్ కి భార్య, ఇద్దరు కొడుకులు వున్నారు. వాళ్లని అరేబియాలోనే ఉంచి భారతదేశానికి వచ్చాడు.
అదృష్టాన్ని వెతుక్కుంటూ వచ్చిన తనకి ఇంత అదృష్టం పడుతుందని, ఏకంగా కోట లోనే పాగా వేస్తానని సయ్యద్ ఏనాడూ అనుకోలేదు. గోలుకొండలాంటి సంపన్న రాజ్యానికి సుల్తాన్ అయిన అబ్దుల్లాకి అల్లుడవటం నమ్మశక్యం కాని కల అనుకున్నాడు. ఆ కలని తన ఊహలకి అనుకూలంగా సాకారం చేసుకోవడానికి, వివాహం కాగానే భార్య సహకారంతో పథక రచన మొదలుపెట్టాడు.
తను వచ్చినప్పటి నుంచి దర్బారు వ్యవహారాలు నిశితంగా పరిశీలిస్తూనే వున్నాడు. పేరుకి మాత్రమే సుల్తాన్ రాజు, పరిపాలన అంతా మంత్రుల చేతుల్లోనే
వుందని గ్రహించాడు. మంత్రులందరినీ హయత్ బక్షీ బేగం నియంత్రిస్తోందని, ఆమె ఆజ్ఞ తిరుగులేనిదని కూడా అతడు గ్రహించాడు. హయత్ బక్షీ బేగంకి వయసు మళ్లుతోంది. గతంలో లాగ చురుకుగా కదలలేకపోతుందని గమనించాడు. అధికారాన్ని తను చాప కింద నీరులా చేతుల్లోకి తెచ్చుకోవాలి. సుల్తానికి ఇంకా ఇద్దరు కూతుళ్లు వున్నారు. వాళ్లని చేసుకున్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సింహాసనానికి చేరువ కాకుండా చూసుకోవాలి. అందుకని తను ఇప్పుడే బలపడాలి. అధికార యంత్రాంగం తన ఆధీనంలోకి వచ్చేటట్టు పావులు కదపాలి అనుకున్నాడు.
పరిపాలన పద్ధతులు, రాచదర్భారు ఎత్తులు, జిత్తులు, కుట్రలు కూలంకషంగా తెలిసిన హయత్ బక్షీ బేగం నిజాముద్దీన్ కుప్పిగంతులు ఇట్టే పసిగట్టింది. అతను, అతని భార్య ఫాతిమా ఖానం కదుపుతున్న పావులు ముందుకు కదలకుండా పై ఎత్తులు వేసింది.
అందుకు కారణం కుతుబ్షాహీల సింహాసనానికి కులీల రక్తం ప్రవహిస్తున్న వారే హక్కుదారులు కావాలని ఆమె విశ్వసించడమే. తన తండ్రీ అలాగే భావించడం ఆమె మర్చిపోలేదు. ఆ అర్హత వున్నవాడు రాచనగరులోనే పెరుగుతు వున్నాడు. తన చిన్న మనుమరాలికి ఈడుజోడు. ఈ ఆలోచన స్థిరపడగానే నిజాముద్దీన్ దూకుడికి హయత్ బక్షీ బేగం ముకుతాడు బిగించింది. దాంతో అతడు మరి ముందుకు కదలలేకపోయాడు. హయత్ బక్షీ బేగం చనిపోయేదాకా అధికారం తనకి అందని ద్రాక్షేనని తీర్మానించుకుని ఆ రోజు కోసం ఎదురుచూస్తూ పొంచి వున్నాడు.
👳🏽
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment