అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-176.
176d3;1610e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣7️⃣6️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
*భగవద్గీత*
➖➖➖✍️```
(సరళమైన తెలుగులో)```
*6. ఆత్మ సంయమ యోగము.*
(ఆరవ అధ్యాయము)
_________________________
*38. వ శ్లోకము:*
*కచ్చిన్నోభయవిభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి ।*
*అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ॥ 38 ॥*
*39. వ శ్లోకము:*
*ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః ।*
*త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే ॥ 39 ॥*
“ఓ కృష్ణా! పై చెప్పిన విధంగా మనసు స్వాధీనంలో లేక, మోక్ష మార్గమును పూర్తిగా సాధించ లేక,
ఈ లోకములోనూ, పరలోకములోనూ ఎందుకూ పనికిరాకుండా ఉభయ భ్రష్టత్వము పొందితే, అటువంటి మూఢుడు చెల్లాచెదరైన మేఘములవలె నశించి పోతాడు కదా!”
“ఓ కృష్ణా! నా సందేహములను పూర్తిగా తీర్చడానికి నీవే సమర్థుడవు, ఆ అర్హత నీకే ఉంది. నీవు తప్ప నాకు కలిగిన సందేహములను వేరే ఎవరూ తీర్చలేరు.”
```
అర్జునుడు తన ప్రశ్నల పరంపరను కొనసాగిస్తున్నాడు. “కృష్ణా! అదీ కాకుండా ఎవరైనా ధ్యానయోగం అవలంభించి, అందులో స్థిరత్వం లేకుండా, ఇటు ఈ లోకాలలో సుఖాలు అనుభవించకుండా, అటు మోక్ష మార్గమును సాధించకుండా, ఉభయ భ్రష్టత్వము చెందితే వాడి గతి ఏమిటి? వాడు ఏ ఫలితము లేకుండా నశించి పోతాడా లేక తాను చేసిన కొద్ది సాధనకు ఫలితం పొందుతాడా! కృష్ణా నా సందేహములను తీర్చడానికి నీవే తగిన వాడవు, కాబట్టి నా సందేహములను తీర్చి ముందుకు కదులు!” అని నిష్కర్షగా చెప్పాడు అర్జునుడు.
దీనిని కొంచెం వివరంగా చెప్పుకోవాలంటే ఒకడికి యోగంలోనూ, ధ్యానంలోనూ, గురువులు చేసిన ఉపదేశములలోనూ భక్తి శ్రద్ధ ఉన్నాయి. సాధన మొదలు పెట్టాడు. చేస్తున్నాడు. ఎంత చేసినా అతనికి ఏకాగ్రత కుదరడం లేదు. మనసు నిలకడగా నిలవడం లేదు. ఇది అతనికే కాదు చాలా మందికి జరుగుతుంది. చాలా మంది ధ్యానయోగము కర్మయోగము అవలంబిస్తారు. కాని పూర్తిగా సిద్ధి పొందలేరు. ఈలోగా మరణం సంభవిస్తుంది. అప్పుడు వాడి గతి ఏమిటి? ఇదే అర్జునుని ప్రశ్న.
అర్జునుడు మరొక ప్రశ్నకూడా అడిగాడు. కొంత మంది ధ్యానయోగమును, కర్మమార్గమును అవలంబిస్తారు. కాని మధ్యలోనే జారి పోతారు. మరలా ప్రాపంచిక విషయములలో ప్రవేశిస్తారు. ఛ! ఇదేమిటి నేను ఇలా అయ్యాను అనుకుంటూ మరలా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తారు. కాని నిలకడ లేని కారణంగా అప్రయత్నంగా సాంసారిక జీవితంలోకి దూకుతారు. అటువంటి వారికి ఇటు ధ్యాన యోగము కుదరదు. అనవసరంగా ఈ యోగం అవలంబించినందు వలన ప్రాపంచిక సుఖములు అనుభవించకుండా జీవితం వృథా చేసుకుంటున్నానే! అని బాధపడుతుంటాడు.
ఇటు ప్రాపంచిక సుఖాలు అనుభవించకుండా, విషయ వాంఛలను తీర్చుకోకుండా, అటు ధ్యానయోగంలో సిద్ధిని పొందకుండా, దేనికీ కొరగాకుండా ఉభయ భ్రష్టత్వం పొందుతారు. రెంటికి చెడ్డ రేవడ లాగా తయారవుతారు. వారి గతి ఏమిటి? వారికి ఏ లోకాలు అభిస్తాయి? ఇది అర్జునుని రెండవ ప్రశ్న.
మూడవ శ్లోకంలో నా సందేహాలు తీర్చడానికి నీవే సమర్థుడవు. నీవు తప్ప ఈ సందేహము మరెవ్వరూ తీర్చలేరు అని అన్నాడు. సాధారణంగా వచ్చే సందేహాలను సాధారణ మానవులు తీర్చగలరు. సాటి మానవులు, గురువులు, జననం నుండి మరణం వరకు కలిగే పరిణామాల గురించి వచ్చే సందేహాలను మాత్రమే తీర్చగలరు. ఇప్పుడు అర్జునుడు కృష్ణుని మరణానంతరం కలిగే పరిణామాలను గురించి కూడా అడుగుతున్నాడు. ఈ సందేహాలు సాధారణ మానవులు తీర్చలేరు. కేవలం మూడు కాలముల గురించిన జ్ఞానము కల పరమాత్మ అంశతో అవతరించిన కృష్ణుడే తీర్చగలడు. అందుకే అర్జునుడు తనకు వచ్చిన సందేహాలను పూర్తిగా తీర్చమని కోరాడు.
శిష్యుడికి గురువు మీద ఇటువంటి విశ్వాసం ఉండాలి. అంతే కానీ ఈ టీచరుకు ఏం తెలియదు. ఆయనకే రాదు మనకేం చెబుతాడు అని మొదలుపెడితే అసలుకే మునిగిపోతాడు. ఈ కాలం విద్యార్థులు చాలా మంది ఇదే భావనలో ఉన్నారు. కాబట్టి ప్రతి విద్యార్థి అర్జునుడి మాదిరి గురువు మీద సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే ప్రతి గురువు కృష్ణుడి మాదిరి విద్యార్థుల యొక్క సందేహములను తీర్చడానికి ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు గురుశిష్యుల సంబంధం సజావుగా కొనసాగుతుంది.
(ఎంత చెప్పినా ఈ వెధవకు తలకెక్కదు అని గురువు, అసలు ఈయనకు వస్తే కదా మనకు చెప్పడానికి అని విద్యార్థి భావిస్తే, ఆ విద్య ఎన్నటికీ పూర్తికాదు. గురువుగారికి నెలా నెలా జీతం వస్తుంది కానీ శిష్యుడికి సంవత్సరం చదివినా ఒక్క ముక్క రాదు).✍️```
```(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!
No comments:
Post a Comment