Thursday, October 16, 2025

 *#సార్ధకమైన ప్రార్థన*

పరమాత్మని ఏదైనా కోరుకోవాలి అంటే, దేన్ని కోరుకున్న తర్వాత ఇక కోరుకో వలసినది ఏదీ ఉండదో, అది కావాలని కోరుకోవాలి. 'నీవు మాకు ఇచ్చేది ఎప్పుడూ మా అవసరం కన్నా ఎక్కువే' అని పరమాత్మతో మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండాలి. మనం మనకు లభించిన దానికెప్పుడూ ధన్యవాదాలు చెప్పము కానీ, లభించని వాటి విషయం లో ఆయనకి చాడీలు చెప్తాము.

సార్ధకమైన ప్రార్ధన ఏది అంటే..."ఏది పొందడం వలన ఇక పోగొట్టుకోవడం అనేది ఏదీ ఉండదో, ఏది పొందడం వలన ఇక ఎడబాటు అనేది ఉండదో, నన్ను ఆ స్థితికి తీసుకుని వెళ్ళు." అని పరమాత్మని ప్రార్ధించడమే.

పరమాత్మ సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే, రూపము నుండి చూపులు పక్కకి తిప్పాలి. ఆకారం కన్నా పైకి లేవాలి. శరీరానికి ఆవల వంగడానికి ప్రయత్నం చేయాలి. నిరాకారం వైపు సాధన సాగించాలి. శరీరం దగ్గరే ఆగిపోకూడదు..*
_________________________________________

#కృష్ణా! అందరినీ సమంగా చూడాలని అదే యోగమనీ నీవు చెప్పావు కదా! దానికి స్థిరమైన మనస్సు ఉండాలి కదా! కాని నా మనసు చంచలంగా ఉండటం చేత, అటువంటి స్థితిని నేను పొందలేకపోతున్నాను. ఎందుకంటే ఈ మనస్సు అనేది చాలా చంచలమైనది, బలమైనది, ధృఢమైనది. ఈ మనసును నిగ్రహించడం అంటే గాలిని ఒక చోట బంధించడమే అవుతుంది. ఈ పని చాలా కష్టం కదా!” అని అన్నాడు అర్జునుడు.”

ఇక్కడి దాకా చెప్పి పరమాత్మ అర్జునుడి ముఖం వంక చూచాడు. అర్జునుడి ముఖంలో ఏదో సందేహం. ఏదో అడగాలనుకుంటున్నాడు. కృష్ణుడు కాస్త ఆపి ఊపిరి పీల్చుకున్నాడు. అర్జునుడికి సందు దొరికింది. వెంటనే తన మనసులోని సందేహాన్ని బయట పెట్టాడు.

"కృష్ణా! ఇప్పటి దాకా ఎన్నో చెప్పావు. అందరినీ సమంగా చూడాలన్నావు. మనసును నిగ్రహించాలన్నావు. నేను విన్నాను. దీని సారమంతా చూస్తే ప్రతివాడూ మనస్సును అదుపులో పెట్టుకోవాలి అని అర్థం అవుతూ ఉంది. కాని అదిసాధ్యం కాదు కదా! ఎందుకంటే, మనస్సు ఎల్లప్పుడూ చంచలంగా ఉంటుంది కదా! మరి మనోనిగ్రహము ఎలా కలుగుతుంది. అంతెందుకు. నా మనస్సు కూడా నిరంతరం చలిస్తూనే ఉంది. దాని వలన నేను నీవు చెప్పిన ఈ సమానత్వము, అందరినీ సమంగా చూడటం, అందరిలో నిన్ను చూడటం, నీలో అందరినీ చూడటం అనే యోగమును సరిగా తెలుసుకోలేకపోతున్నాను. అదికాదు కృష్ణా! నీకు తెలియనిది ఏముంది. ఈ మనసు మహా చంచలమైనదయ్యా! చాలాప్రమాదమైనది. చాలా బలమైనది. ధృఢమైనది. ఈ మనస్సును నిగ్రహించడం, చాలా కష్టం. గాలిని పట్టుకొని బంధించడం ఎంత కష్టమో మనసును ఒక చోట బంధించడం కూడా అంతే కష్టం." అని మరలా మొదటికి వచ్చాడు అర్జునుడు.

ఇదీ ఒకందుకు మంచిదే. ఏదో అర్ధం అయినట్టు ముఖం పెట్టి, ఏదీ అర్థం కాకుండా ఉండేకంటే, “బాబూ నీవు చెప్పింది నాకు ఏమీ అర్ధం కావడం లేదు ఎందుకంటే నా మనస్సు కూడా చంచల స్వభావంతో ఊరికే చలిస్తూ ఉంది. కాబట్టి ఈ మనస్సును ఎలా అదుపుచేయాలో కాస్త వివరంగా చెప్పు” అని అడిగాడు అర్జునుడు.ఆదిత్యయోగీ.

ఇప్పటి దాకా నోరు విప్పని అర్జునుడు, మనసును నిగ్రహించమని మాటి మాటికీ కృష్ణుడు చెబుతుంటే ఉండబట్టలేక ఆపాడు. అందుకే మొట్ట మొదటగా ఈ మాట అన్నాడు. “కృష్ణా! ఇతరుల సంగతి దేముడెరుగు. నా మనస్సే చాలా చంచలంగా ఉంది. అది నా మాట వినడం లేదు. ఇంక ధ్యానయోగము, సమత్వము నాకు ఎలా కలుగుతుంది?” అని అన్నాడు. అంటే అర్జునుడికే ఏకాగ్రమైన మనస్సు లేదు. నిశ్చయాత్మక బుద్ధి లేదు. అందరి ఎడల సమదృష్టి లేదు. అందుకే నిర్మొహమాటంగా అంటున్నాడు.

"కృష్ణా ఈ మనస్సు చాలా చంచలమైనదయ్యా. పైగా చాలా ప్రమాదమైనది. ఎంతో క్షోభకలుగజేస్తుంది. అంతే కాదు ఎంతో బలమైనది, దృడమైనది. దీనిని నిగ్రహించడం ఎవరి వల్లాకాదు. గాలిని అన్నా ఒకచోట బంధించవచ్చేమోగానీ, ఈ మనసును బంధించడం ఎవరి వల్లా కాదు. ఇది చాలా కష్టం. కాబట్టి ఈ పని నా వల్ల కాదు." అని చేతులెత్తేసాడు.

ఈ ప్రశ్నలను అర్జునుడు మనందరి బదులు తనే అడిగాడు. మానవుల పరిస్థితి కూడా అంతే. పట్టుబట్టి ధ్యానంలో కూర్చుంటే మనసు అలా అలా షికారుకు వెళుతుంది. దానిని తెచ్చి ఒకచోట నిలబెడితే మరలా ఇటు పోతుంది. మనసును కట్టడి చేయడం తోనే పుణ్యకాలం గడిచిపోతుంది. ఇంక ధ్యానం చేసేదెప్పుడు, అందుకే మనసును నిగ్రహించడం అంటే సుదుష్కరం అంటే చాలా దుష్కరము అంటే చాలా కష్టమైన పని, ఎవరి వల్లకాదు.

అసలు ఈ మనసు ఇలా ఎందుకు చంచలంగా ఉంటుంది అని విచారిస్తే, మనసులో ఈ జన్మ వాసనలే కాకుండా, క్రితం జన్మల వాసనలు, సంస్కారములు కూడా నిక్షిప్తం అయి ఉంటాయి. వాటి ప్రభావం ఈ జన్మలో మనసు మీద పడుతుంది. వాటికి అనుగుణంగా మనసు నిరంతరం దేనినో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలజడిగా, చంచలంగా ఉంటుంది. అటువంటి మనసును నిగ్రహించడం ఓ పట్టానసాధ్యం కాదు. ధ్యానంలో కూర్చున్నపుడు ఈ మనసు విపరీతంగా చలిస్తూ ఉంటుంది. ఇంద్రియములు కదలకుండా ఉన్నా మనస్సు మాత్రం అటు ఇటు పరుగెడుతూ ఉంటుంది. ఇది వరకు ఎప్పుడూ రాని ఆలోచనలు, ఎందుకూ కొరగాని ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి. ధ్యానంలో కూర్చున్నపుడు మన మనసు అటు ఇటు పరుగెత్తడమే కాదు ఇంకా కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి.

మొదటిది... 
ధ్యానంలో కూర్చోగానే అంటే కళ్లు మూసుకోగానే నిద్రముంచుకొస్తుంది. నిద్ర తమోగుణ లక్షణము. అలా కళ్లు మూసుకోగానే నిద్రవచ్చిందంటే మనలో తమోగుణము ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. (దీనికి విరుగుడు మితాహారము, సాత్వికాహారము తీసుకోవడం. వేళకు నిద్రపోవడం) ఎప్పుడైతే శరీరం నిద్రలోకి జారుకుంటుందో, మనస్సు రజోగుణము సంతరించుకుంటుంది. తన ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పరుగెడుతుంది. దిక్కుమాలిన ఆలోచనలు అన్నీ చేస్తుంటుంది. అక్కరలేని విషయాలను గుర్తుకు తెచ్చుకుంటుంది.

అలా ఆలోచించి ఆలోచించి కొంత సేపటికి స్తబ్దుగా మారి పోతుంది. మైండ్ బ్లాంక్ అయి పోతుంది. ఏ ఆలోచనా ఉండదు. దీనినే చాలా మంది ధ్యాన సమాధి అని పొరబడుతుంటారు. కాని ఇది మనసు ఎక్కువగా ఆలోచించి పొందిన స్తబ్ధత తప్ప వేరు కాదు. (దీనికి విరుగుడు కోరికలను అదుపులో ఉంచడం, చూచిందల్లా కావాలని కోరుకోకూడదు. అది మనకు అవసరమా లేదా అని బుద్ధితో ఆలోచించాలి.) ఆ స్తబ్ధత లోనుండి ఒక విధమైన ప్రశాంతత కలుగుతుంది. మనస్సుకు హాయిగా ఉంటుంది. గాఢనిద్రలో మనం అనుభవించే హాయి ఇటువంటిదే. అబ్బా ఎంతో హాయిగా నిద్రపోయాను అని అంటూ ఉంటారు కదా. అలాంటి హాయి, ఇటువంటి హాయి మెలుకువ రాగానే పోతుంది. అలాగే ధ్యానంలో నుండి లేవగానే పోతుంది. (దీనికి విరుగుడు అటువంటి ఆనందాన్ని తాత్కాలిక ఆనందం అని తెలుసుకోవాలి కానీ అదే ఆత్మానందం అని భ్రమపడకూడదు.)

కాసేపు ఉండి తరువాత పోయేది ఆత్మానందం, శాశ్వతానందం కాదు. కాని మనసును నిగ్రహించి ఆత్మలో ఉంచితే కలిగే ఆనందం శాశ్వతమైనది. దానికి అంతము లేదు. పైన చెప్పబడిన ఆనందం, కేవలం శరీరం నిద్రలోకి జారుకోవడం, మనస్సు విచ్చలవిడిగా సంచరించడం తరువాత స్తబ్దత వహించడం వల్ల వచ్చిన ఫలితాలే. అవి ధ్యానంలో నుండి లేవగానే పోతాయి.

ఇక్కడ అర్జునుడికి వచ్చిన సమస్య ఏమిటంటే, కృష్ణుడు చెప్పింది అంతా వింటున్నాడు. కానీ ఏవీ మనసుకు పట్టడం లేదు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నాడు. అర్జునుడిలో రజోగుణం ఎక్కువగా ఉంది కాబట్టి మనసులో స్థిరంగా నిలవడం లేదు. నిరంతరం అటు ఇటు పరుగెడుతూ ఉంది. ఏవేవో ఆలోచనలతో సతమతమౌతూ ఉంది. అందుకే, మనసును నిగ్రహించడం ముఖ్యం కాని అది చాలా కష్టం. దానిని ఎలా నిగ్రహించడం అనేది అర్జునుడి ప్రశ్న ఎందుకంటే మనసు చాలా చంచలమైనది. విపరీతమైన క్షోభకు గురి అవుతూ ఉంటుంది. ఇది చాలా బలమైనది. ధృఢమైనది. ఓ పట్టాన దేనికీ లొంగనిది. మనసును నిగ్రహించడం చాలా కష్టం. గాలిని ఒక చోట బంధించడం, నిలిపి ఉంచడం ఎంత కష్టమో, మనసును నిలకడగా ఒక చోట నిలిపి ఉంచడం అంతకన్నా కష్టము.ధ్యాన సాధన అవసరం.....*
.

No comments:

Post a Comment