*భూమి సూక్తం*
జనకుడు రాజర్షి. ఆయనకు అసిత ముని భూమి సూక్తం వినిపించాడు. త్రేతాయుగం పోయి ద్వాపర యుగం వచ్చింది. పరాశర మహర్షి మైత్రేయుడికి కలియుగంలో జరగబోయే రాజకీయ పరిణామాల గురించి, సామాజిక పరిస్థితుల గురించి చెప్పాడు. విష్ణుపురాణంలో ఈ ప్రస్తావన ఉంది. ద్వాపర యుగాంతంలో పరీక్షితుడు కలి ప్రభావాన్ని కనిపెట్టాడు. ధర్మదేవుడు అప్పటికే మూడు కాళ్లు పోగొట్టుకుని వృషభ రూపంలో ఒంటికాలిపైన నిలబడ్డాడు. భూమాత గోమాత రూపంలో పక్కన ఉంది. కలి పురుషుడు వేటగాడి రూపంలో ధర్ముడి ఒంటి కాలును ఊడగొట్టడానికి ప్రయత్నించాడు. గోమాత కన్నీరు కారుస్తోంది. అది గమనించిన కురు రాజు పరీక్షితుడు కలి పురుషుణ్ని దండించి ధర్మదేవుణ్ని రక్షించాడు.
కలియుగంలో ప్రజలు ధనాశాపరులుగా మారుతున్నారు. డబ్బే ప్రధానంగా అనుబంధాలను పక్కన పెట్టి విలాసవంతమైన జీవన శైలికి దాసోహం అంటున్నారు. భూ, జల, గగన ప్రయాణాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రాణ నష్టం, ధన నష్టం విపరీతంగా జరుగుతున్నాయి. జనాభా లెక్కకు మిక్కిలి పెరగడం వల్ల రకరకాల సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయి. పవిత్రమైన వివాహ బంధానికి ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. విడాకులు, వివాహేతర సంబంధాలు పెచ్చు పెరిగి కుటుంబ వ్యవస్థ కుంటుపడుతోంది. శక్తిస్వరూపిణులుగా, దేవతామూర్తులుగా పూజలు అందుకునే స్త్రీలను ఆటబొమ్మలుగా, అంగడి సరకులుగా చూసే అసుర సంతతి పెరిగిపోతోంది. సమాజం నైతికంగా పతనమై నవతరం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇదంతా కలి ప్రభావమేనని సరిపెట్టుకుని ఊరుకోవడానికి లేదు!
ఇదివరకు రాజును బట్టి ప్రజలు నడచుకునేవారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం పేర ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్నా పదవీ వ్యామోహం తప్ప జనం బాగును పట్టించుకుంటున్నవాళ్లు లేరు. రాజ్య విస్తరణ కాంక్షతో ఎన్నో యుద్ధాలు చేసి పరదేశాలను ఆక్రమించి, ఈ భూమిని శాశ్వతంగా ఏలుకోవాలని కోరుకున్న రాజులెందరో కాలగర్భంలో కలిసి పోయారు. అలాగే నియతి తప్పిన ప్రజా ప్రభుత్వాలూ పడిపోక తప్పదు. చరిత్రలో దుర్మార్గులైన ఏలికలు ఎందరో జన జీవితాలను అతలాకుతలం చేశారు. రక్తపాతాన్ని, అశాంతిని, కరవుల్ని సృష్టించారు. భూ దేవత వారి అధికార దాహాన్ని చూసి నవ్వుకుంది. కలి ప్రభావం పన్నెండు వందల దివ్య సంవత్సరాలు ఉంటుందని చివరి దశలో మనిషి ఆయువు ఇరవై సంవత్సరాలకు పడిపోతుందని భూ దేవత ప్రకటించింది.
మాంధాత, సగరుడు, రఘు మహారాజు, యయాతి, నహుషుడు మొదలైన రాజులు తెరమరుగయ్యారు. రాజయోగులు రాజ్యమేలిన రోజులు పోయాయి. రాజ్యాలు, వైభవాలు, భోగభాగ్యాలు శాశ్వతం కాదు. వస్తు వ్యామోహాలు మనసుకు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు. ఈ నిజాన్ని తెలుసుకున్నవారు ధన్యజీవులు. భూమి సూక్తులు విన్నవారు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో జీవన్ముక్తులు అవుతారు.
~ఉప్పు రాఘవేంద్రరావు
No comments:
Post a Comment