Thursday, October 16, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-175.
166d3;1510e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣7️⃣5️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
                  *భగవద్గీత*
                  ➖➖➖✍️```
      (సరళమైన తెలుగులో)```

*6. ఆత్మ సంయమ యోగము.*
(ఆరవ అధ్యాయము)
_________________________
*36. వ శ్లోకము:*

*అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః ।*
*వశ్యాత్మనా తు యతతా శక్యోఽవాప్తుముపాయతః ॥36॥*

“అర్జునా! ఎవని మనసైతే నిగ్రహింపబడదో, వాడికి యోగము (మనసును ఆత్మలో ఉంచడం) సాధ్యం కాదు. ఇది నా అభిప్రాయము. ఎవరైతే తన మనస్సును తన అధీనంలో ఉంచుకుంటాడో వారికే అది ఉపాయం చేత సాధ్యము అవుతుంది.”
```
ఎవని మనసైతే నిరంతరము ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతూ ఉంటుందో, తన ఇష్టం వచ్చినట్టు విహరిస్తూ ఉంటుందో, అనవసర విషయాలలో తలదూరుస్తూ ఉంటుందో అటువంటి వారి మనసు ఎన్నటికీ నిగ్రహింపబడదు. మనసును నిగ్రహించలేని వాడు తన మనసును ఆత్మలో నిలుపలేడు. కాబట్టి వాడికి ఎన్నటికీ ఆత్మసాక్షాత్కారము ఆత్మజ్ఞానము కలుగదు. కేవలము మనసును నిగ్రహించిన వాడికే అది సాధ్యము అని తేల్చేశాడు పరమాత్మ.

కాని, ఎవని మనసు అతని వశంలో ఉంటుందీ అంటే నిరంతర అభ్యాసము, ప్రాపంచిక విషయములలో వైరాగ్యము అనే ఉపాయముల చేత యోగి తన మనసును నిగ్రహించి ఆత్మలోనిలపగలడు. శాశ్వతమైన ఆత్మానందాన్ని పొందగలడు. కాబట్టి ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందాలంటే, అభ్యాస వైరాగ్యములతో మొదట మనసును స్వాధీనం చేసుకోవాలి. మనసు తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ధ్యానం కుదరదు. అది కుదరాలంటే నిరంతర అభ్యాసము అవసరము. ఇది ఒక్క రోజుతోనో, నెలతోనో, సంవత్సరముతోనో అయ్యేపని కాదు. నిరంతర అభ్యాసము కావాలి. కాబట్టి నిరంతర ప్రయత్నం చేసే వారికే కానీ సోమరులకు ఇది సాధ్యంకాదు అనిస్పష్టంగా తెలుస్తూ ఉంది.

ఏ ప్రయత్నమూ చేయని సోమరి, ఏ పనీ సక్రమంగా చేయలేడు. ఇది మనవల్ల కాదులే అని చేతులు ముడుచుకొని కూర్చోవడమే అతనికి చేతనైన పని. ఈ ప్రయత్నం కూడా ఉపాయంతో చేయాలి. అందుకే ఉపాయతః అని చెప్పాడు. ఉపాయం లేని వాడిని ఊరు వెళ్లగొట్టమని సామెత. కాబట్టి ఏ పని చేయడానికైనా ఉపాయము, కౌశలము, నేర్పు, ముఖ్యము, మనసును నిగ్రహించడానికి కూడా ఈ నేర్పు ముఖ్యము అని పరమాత్మ తెలియచేస్తున్నాడు. వైరాగ్యంతో, అభ్యాసంతో, నేర్పుతో చేస్తే మనో నిగ్రహము, ఆత్మ సాక్షాత్కారము ఈ జన్మలోనే సాధించవచ్చు అని పరమాత్మ చెబుతున్నాడు.```


 *అర్జున ఉవాచ:* 

*”37. వ శ్లోకము:*

*అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః ।*
*అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి ॥37 ॥*

“కృష్ణా! ఒకడు బాగా శ్రద్ధతో యోగం చేస్తున్నాడు. కాని అతడి మనస్సు అతడి స్వాధీనంలో లేదు. అటువంటి వాడు ఏదో కారణం చేత మనస్సు చలించి తాను చేస్తున్న యోగమును మధ్యలో ఆపేసి, ఆ యోగసిద్ధిని పొందలేకపోతే, అతడి పరిస్థితి ఏమిటి? అతడికి ఎటువంటి గతులు కలుగుతాయి?”
```
అర్జునుడు వేసిన ప్రశ్నకు కృష్ణుడు సమాధానం చెబుతూ ఉంటే, అంతలోనే మరలా అర్జునుడికి కొన్ని సందేహాలు కలిగాయి. వెంటనే కృష్ణుడి వాక్ ప్రవాహాన్ని ఆపాడు. కృష్ణా! ఆగవయ్యా కాస్త ఆగు. నీవు చెప్పింది బాగానే ఉంది. వైరాగ్యము, అభ్యాసము, నేర్పు, ఉపాయములో మనసును స్వాధీనం చేసుకోవచ్చు అన్నావు. బాగానే ఉంది. చాలా మందికి నీవు చెప్పినట్టు చేయాలనే కోరికా, శ్రద్ధ ఉంటాయి అని అనుకుందాము. ఆ కోరికతో, శ్రద్ధతో, కొంత కాలం యోగం అభ్యాసం చేస్తాడు. కాని ఏదో కారణం వలన మనసును ఎక్కువ కాలం నిగ్రహించలేక ఆ యోగం నుండి పతనం అయి పోతాడు. ఆ జన్మలో వాడికి యోగ సిద్ధి లభించదు. మరి వీడి సంగతి ఎలాగ. మనసును నిగ్రహించకుండానే మరణించిన వాడి గతి ఏమిటి వాడు ఏ లోకాలకు వెళతాడు. వివరంగా చెప్పు అని అడిగాడు.

కాబట్టి మనకు యోగం చేయాలనే శ్రద్ధ, భక్తి, కోరిక ఉంటే చాలదు. ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం కూడా ఉండాలి. దానికే ఈ సాధన అంతా. కాకపోతే, అర్జునుడి సందేహం ఏమిటంటే, ఈ మనోనిగ్రహం ఎంత కాలం ఉంటుంది. కొంత కాలం మనో నిగ్రహం పాటించి, ఏదో కారణం చేత విచలితుడు అయితే అంటే కారిపోతే వాడి గతి ఏమిటి? అలా కాకుండా యోగం చేస్తూ మధ్యలో ఏ కారణం చేతనైనా మరణిస్తే వాడి గతి ఏమిటి? అప్పటి దాకా వాడు చేసిన సాధన అంతా వృథా అవుతుందా! అలా ఏ జన్మలో చేసిన సాధన ఆ జన్మకే పరిమితం అవుతుంటే ఇంక సాధన చేయడం ఎందుకు. పరిపూర్ణత్వము సిద్ధించడానికి ఒక జన్మకాలం చాలదు కదా! అని ప్రశ్న పరంపరను కురిపించాడు అర్జునుడు (ఎంతటి గొప్ప వారికి కూడా మనసు చలించడం సహజం. విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేసి కూడా మేనక వ్యామోహంలో పడ్డాడు. భరతుడు రాజ్యాన్ని, సంపదలను, భార్యపిల్లలను వదిలిపెట్టి అరణ్యంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ కూడా చిన్న జింకపిల్లను రక్షించి దాని వ్యామోహంలో వడ్డాడు. అతని తపస్సు ఆగిపోయింది. మరుజన్మలో జింకగా పుట్టాడు.)✍️```
```(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
.    *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
           🌷🙏🌷

No comments:

Post a Comment